రాజశేఖరుడు కవిసమయాన్ని ఈ విధంగా నిర్వచించారు:
“అశాస్త్రీయమలౌకికం చ పరంపరాయాతం యమర్థముపనిబధ్నంతి కవయః స కవిసమయః”
భావం: శాస్త్రాలకు విరుద్ధమైనదైనా, ప్రత్యక్షంగా లోకంలో కనిపించనిదైనా, కేవలం కవుల పరంపర (సంప్రదాయం) ద్వారా వస్తున్నదానిని, కవులు తమ కావ్యాలలో నిబంధిస్తే (వాడుకుంటే) దానిని కవిసమయం అంటారు.
తెలుగులో ప్రథమాంధ్రకవి నన్నయ నుంచి ఆధునిక భావకవి కృష్ణశాస్త్రి వరకు, ఒక పాత్ర ఔన్నత్యాన్ని వర్ణించటంలో ఒకే కవిసమయాన్ని తమదైన శైలిలో ఎంత వైవిధ్యంగా ప్రయోగించారో చూపించడం ఈ వ్యాసం ప్రధానోద్దేశ్యం.
నన్నయ ఆంధ్రమహాభారతం ప్రథమాశ్వాసం ఉదంకోపాఖ్యానంలో నాగరాజులను ప్రశంసిస్తాడు. అందులో నాలుగు పద్యాలు చాలా ప్రసిద్ధమైనవి. నన్నయ్య అక్షరరమ్యతను ప్రస్తావించేటప్పుడు ఈ పద్యాలను చెప్పకుండా ముందుకు అడుగు వేయలేం.
గురుదక్షిణ కోసం పౌష్యమహాదేవి కుండలాలను కొని తెస్తున్న ఉదంకుడి నుండి తక్షకుడు అనే నాగరాజు ఆ కుండలాలను అపహరిస్తాడు. వాటిని మరలా పొందే క్రమంలో ఉదంకుడు నాగశ్రేష్టుడైన అనంతుడి ప్రశంస తర్వాత సర్పరాజైన వాసుకిని ప్రశంసిస్తాడు.
వాసుకి సర్పరాజు మాత్రమే కాదు, పరమేశ్వరుడి కంఠహారం కూడా! పరమేశ్వరుడంతటి వాడికి కంఠహారంగా అవటమే వాసుకి వైభవౌన్నత్యానికి నిదర్శనం అంటూ
“…ఆనమత్సురా-
సురమకుటాగ్రరత్నరుచిశోభితపాదునకద్రినందనే-
శ్వరునకు భూషణంబయిన వాసుకి…”
అంటారు.
“నమస్కరిస్తున్న దేవ దానవుల కిరీటాల అగ్రభాగంలోని మణుల కాంతి చేత వెలుగొందుతున్న పాదాలు కలిగిన వాడు” అని ఈ సమాసానికి అర్థం. ఇందులో చమత్కారం ఏమిటంటే, శివుడికి దేవదానవులు ఇద్దరూ, కిరీటధారులై మరీ తలవంచి నమస్కారం చేస్తే అప్పుడు వాళ్ళ కిరీటాలలోని మణుల శివుడి పాదాల మీద ప్రతిఫలిస్తుంది. దేవదానవుల ఇద్దరి మన్ననలు పొందగలగటమనేది శివుడి ప్రత్యేకత. పరమేశ్వరుని పరంగా ఇది సత్యమైన వర్ణన.
కవిబ్రహ్మ తిక్కన రచితమైన విరాటపర్వం ద్వితీయాశ్వాసంలో ద్రౌపది భీముడి దగ్గర ధర్మరాజు ఔన్నత్యాన్ని వర్ణిస్తుంది. నన్నయ ప్రయోగించిన కవిసమయాన్నే అందుకుని తిక్కన దానికి మరింత మెరుగు పెట్టాడు.
“అతడు భూరిప్రతాపమహాప్రదీప-
దూరవిఘటితగర్వాంధకారవైరి-
వీరకోటీరమణిఘృణివేష్టితాంఘ్రి-
తలుడు కేవలమర్త్యుఁడె ధర్మసుతుఁడు?”
ధర్మరాజు దైవసమానుడు అనీ, కేవలం మానవమాత్రుడు కాడని ద్రౌపది ఈ పద్యంలో ప్రస్తావిస్తోంది. “వైరివీరకోటీరమణిఘృణివేష్టితాంఘ్రితలుడు” శత్రురాజుల కిరీటాలలోని మణుల కాంతి చేత వెలుగొందే పాదాలు కలిగిన వాడు.
ఆ వైరివీరులు సామాన్యులు కారు. ధర్మరాజు తన గొప్ప ప్రతాపమనే గొప్ప వెలుగుతో శత్రు రాజుల గర్వము అనే అంధకారాన్ని దూరంగా చెదరగొట్టేసినవాడు. ఆ గర్వం అణిగిపోయిన రాజులు వినయంగా ధర్మరాజు పాదాలకి నమస్కారం చేస్తారు. శత్రువులలో ఉన్న చెడు గుణాన్ని కూడా పోగొట్టగలిగేంత మహితాత్ముడు ధర్మరాజు అని ధ్వని.
మొల్ల రామాయణం బాలకాండలో దశరథుడిని ప్రశంసిస్తూ
ప్రకటరాజన్యమస్తకాభరణమకుట-
చారుమాణిక్యదీపితచరణుడు
“ప్రఖ్యాతి పొందిన రాజుల కిరీటాలలోని మణుల కాంతులతో ప్రకాశించే పాదాలు కలిగినవాడు” అని వర్ణించింది. సంప్రదాయికంగా వస్తున్న కవిసమయాన్ని వాడుకోవడమే తప్ప ఇందులో మొల్ల ప్రత్యేకంగా పొదిగిన అందమేమీ లేదు.
జ్ఞానపీఠ పురస్కారగ్రహీత విశ్వనాథ సత్యనారాయణగారు ఆంధ్రప్రశస్తిలో శాతవాహనుడు అనే ఖండికలో చేసిన వర్ణన ఇదే కవిసమయాన్ని మరింత అందంగా అందిస్తుంది:
దీపకర్ణి కులదేవత స్వప్నంలో ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం వేటకు వెళ్తాడు. అక్కడ ఒక సింహం ఒక బాలుడిని దీపకర్ణికి అప్పగిస్తూ, అతడు భావి తెలుగు సామ్రాజ్యానికి అధినేత అవుతాడు అని చెప్పే సందర్భంలో,
“… వీఁడు కోదండబా-
హా విధ్వస్త దిగంతరాహిత ధరాప్రాణేశ చూడామణి
గ్రీవా మంజులహార రత్నరుచిర శ్రీపాదకంజుండగున్”
అని అంటుంది.
నన్నయ వివరణలో సురాసురులు రెండు భిన్నజాతులవారు అయినా శివుడిని పూజిస్తారు.
తిక్కన వర్ణనలో శత్రురాజులు ధర్మరాజు భుజబలంవల్ల గర్వాంధకారాన్ని పోగొట్టుకున్నవారు. “శత్రురాజులు” అనటంవల్ల రాజుల సంఖ్య పరిమితమని తోచే అవకాశం ఉంది.
విశ్వనాథవారు “దిగంతరాహితధరాప్రాణేశ” అనడంవల్ల “దిక్కుల నడుమన అంతటా వ్యాపించిన శత్రురాజులందరూ” అనే అర్థం వస్తుంది. అంటే శాతవాహనుడే ఏకఛత్రాధిపతి. వందనాలు అందుకోదగిన ఏకైకచక్రవర్తి అని ధ్వని. ఆ శత్రురాజుల కిరీటాలలోని మణుల కాంతి మాత్రమే కాదు, వారు కంఠంలో ధరించిన హారాలలోని రత్నకాంతి కూడా శాతవాహనుడి పాదాల మీద ప్రసరిస్తుంది.
సాధారణంగా మకుటం మీద మేలి రత్నాలని అమరుస్తారు. అవి చాలా కాంతివంతంగా ఉంటాయి. కానీ శాతవాహనుడికి మ్రొక్కే రాజుల కంఠాభరణాలు కూడా అతి ఖరీదైనవి. అంతటి ఐశ్వర్యవంతులైన రాజులు శాతవాహనుడి పాదాల మీద అతివినయంతో వంగి నమస్కరిస్తారు.అంతగా వంగినపుడే వారి కంఠహారాల కాంతి కూడా శాతవాహనుడి పాదాల మీద ప్రసరిస్తుంది. ఇంతకీ ఆ రాజులు అంతటి వినయసంపన్నులు ఎందుకయ్యారంటే, శాతవాహనుడు తన భుజాన ఉన్న కోదండము చేత వారిని అణిచివేసాడు కనుక.
కోదండము అనే పదానికి విల్లు అనే సామాన్యార్థంతో పాటు “రాముడి విల్లు” అనే అర్థం కూడా ఉన్నది. ఇక్కడ “శాతవాహనవంశానికి మూలపురుషుడు శ్రీరామచంద్రుడి లాంటివాడు” అని ధ్వని ఉన్నది.
భావకవులలో అగ్రగణ్యుడైన దేవులపల్లి కృష్ణశాస్త్రి ‘కృష్ణపక్షం’లోని ‘క్రుంగిపోదు’ అనే ఖండికలో శివుడిని ఎట్లా ఊహించాలో తనకి తెలియక మనసు క్రుంగిపోతోంది అంటూ
రాజరాజేశ్వర కిరీటరాజఘటిత-
రత్నమాణిక్యకాంతి నీరాజనార్చి-
తాంఘ్రినీరేజయుగళుడవయ్య!
అని అంటారు.
ఇక్కడ “రాజరాజేశ్వర” అన్నప్పుడు కేవలం పృథివిపై రాజులు అన్న అర్థం మాత్రమే కాదు. దేవదానవరాజులు, చక్రవర్తులు అని అర్థం. ఇందులో ఉన్న స్వారస్యం ఏంటంటే మణుల కాంతి పాదాల మీద ప్రసరించటం కాదు ఆ కాంతి శివుడికి నీరాజనం (ఆరతి) అవుతుంది. కేవలం మొక్కటం కాదు పాదపూజ! నవవిధ భక్తులలో ఒకటైన పాదసేవనం.
నన్నయ చేసిన వర్ణనలో భావంతో పాటు పదాల పొందిక కూడా ఎంతో అందంగా ఉంది. ఆయన పద్యాలు వేదనాదాలలాగా ప్రతిధ్వనిస్తాయి అనే పండితులు అంటారు. నన్నయ అందించిన ఒరవడితో రాసిన కవులు నలుగురు కూడా ఆ పదాలు పొందిన నాదసౌందర్యాన్ని తమ పద్యాలలో పొదిగారు.
కాలానుక్రమాన వచ్చిన తెలుగు కవులు అందరూ కూడా పూర్వకవుల కవితాసౌందర్యాన్ని అనుసరిస్తూనే తమదైన చాతుర్యాన్ని ప్రదర్శిస్తూ పద్యరచన చేయటం తెలుగువారి అదృష్టం.