కన్నడ-తెలుగు భాషల అనుబంధం ఈనాటిది కాదు, వేలాది సంవత్సరాలుగా ప్రశస్తిగాంచింది. ఉభయభాషల నడుమ ఈ చెలిమి ఆదికవుల కాలం నుండీ కనిపిస్తున్నది. అంతెందుకు, కన్నడిగుల ఆదికవి తండ్రి తెలుగువాడు కాగా తల్లి కన్నడ ఆడబడుచు. అలాగే, తెలుగు ఆదికవి నన్నయకు చేదోడు వాదోడుగా నిల్చిన నన్ని నారాయణభట్టు కన్నడిగుడై ఉండి తన శేషజీవితాన్ని తెలుగునాట గడిపి ఉండవచ్చు. కన్నడ చంపూ కవులలో వాసికెక్కిన రుద్రభట్టు కావ్యాన్ని ‘ముద్దుపలుకుల’ ముక్కుతిమ్మన చూచి ఉంటాడని పరిశోధకులు భావిస్తారు. కన్నడిగుల ఆగ్రమాన్యుడైన మతప్రవక్త బసవన్న జీవితగాథ మొదట్లో వెలువడింది తెలుగులోనే కదా! నాచన సోమన కన్నడ ధరిత్రి యందు జన్మించి తెలుగులో కొమ్ములు తిరిగిన కవీశ్వరుడైన ఉదంతం శాసనాలు చదివిన వారందరికీ ఎరుకే! పురందరదాసు, అన్నమయ్యకు సాహిత్య-సంగీతపరంగా అనుంగు తమ్ముడే! భక్తి వారిరువురికీ కన్నతల్లి, ఆంధ్రభోజుడైన కృష్ణదేవరాయడు కన్నడరమారమణుడన్న వాస్తవం విస్మరించరాడు. ఇక కన్నడిగుల త్రిపదీ త్రివిక్రముడు, సర్వజ్ఞకవి, తెలుగువారి వన్నెకెక్కిన వేదాంతి వేమనకు భావంలోగానీ, భాషలోగానీ అసలైన సిసలైన చనువున్న నెచ్చలికాడు.
ఉభయభాషల కావ్యశాస్త్రాలనూ పుష్టిపరచి రక్తిగట్టించిన మహానుభావులు ఎందరెందరో! వారందరికీ మన వందనచందనాలు. ఇప్పటికీ పలుమంది పరిశోధకులు ఉభయభాషల లోతుల నెరిగి క్రొత్త క్రొత్త సంగతుల్ని ఆవిష్కరిస్తూ ఉన్నారు. మరెంతోమంది ఈ భాషల సాహిత్యాన్ని అనువదించి సాహితీ ప్రేమికులకు అందిస్తున్నారు. ఇలా కర్ణాటాంధ్రవాక్కుల మైత్రి చిరంతనం, సనాతనం.
ఈ కోవకు చెందినవారు ఇప్పుడూ ఉన్నారు. అట్టివారిలో నా విద్వన్మిత్రులు శ్రీ ఎం. ఆర్. చంద్రమౌళిగారు ఒక్కరు. సంగీత-సాహిత్యాలలో చక్కని చిక్కని పాండిత్యమున్న శ్రీయుతులు తత్త్వాన్ని కావ్యతత్త్వాన్ని చాల కాలం నుంచీ మథిస్తూ ఉన్నారు.
ఉభయ భాషలలోనూ మంచి పట్టు ఉన్న చంద్రమౌళిగారు నిశితంగా చదివిన అభిజాత కావ్యాలఫణితిలో అందమైన పద్యాలను అలవోకగా అల్లగలరు. జీవికా యాత్రకై వాణిజ్య వ్యవహారాలలో ఎంత ఉన్నతోద్యోగం చేసినా వారి మనస్సంతా సంగీత సాహిత్యాలే ఆవరించుకుని ఉన్నాయి, విశేషించి తెలుగు సాహిత్య-సంస్కృతులను తమ మనోధర్మంగా మలచుకొని చంద్రమౌళిగారు వాటిలోని ఆణిముత్యాలను భారతీభూషలుగా కూర్చడంలో నేర్పరి, ఐతే వీరిది మంద్రశ్రుతి సంగీతంవలె ఎక్కువ సవ్వడిలేని పని; చాలవరకూ స్వాంతఃసుఖాయ నడచుచున్న జీవని.
చంద్రమౌళిగారి మనోధర్మానికి తార్కాణంగా వారి ఒక్క రచనను పేరొనవచ్చు. అంతర్జాలంలో ‘ఘంటసాల గానశాల’ అనే జాలపుటి అందరికీ తెలిసిందే. అక్కడ వీరు ఘంటసాలవారి సంగీత సంయోజన పద్ధతిలోని సూక్ష్మాలను స్వారస్యాలనూ సుదీర్ఘమైన వ్యాసాల ద్వారా ధారావాహికగా ప్రచురించారు. నేనెరిగినంతలో ఘంటసాలవారి సంగీతాన్ని ఇంత లోతుగా, ఇంత శాస్త్రబద్ధంగా, ఇంత అందంగా నిరూపించినవారు యావదాంధ్రంలో మరొక్కరు లేరు. ఇలాంటి కూలంకషమైన విద్వద్విమర్శను మరొక్కభాషలో ఇంకొక్క గాయకుని గూర్చి వేరెవ్వరూ వ్రాయలేదంటే చంద్రమౌళిగారి వైదుష్యం ఎలాంటిదో మనకు తెలియకపోదు.
ఇలాంటి మహనీయులు పలు సంవత్సరాల ముందు నా విన్నపాన్ని అంగీకరించి స్వనామధన్యులైన డి. వి. గుండప్పగారి మహాకృతి ‘మంకు తిమ్మన కగ్గ’ అనే మనన కావ్యాన్ని అనువదించడానికి అంగీకరించడం నా భాగ్యం, ఇది నా భాగ్యం మాత్రమే కాదు; ఉభయభాషలకూ హర్షాస్పదం. కన్నడంలో ‘మంకుతిమ్మన కగ్గ’ వెలువబడి ఎనిమిది దశాబ్దాలే దొర్లినవి. అయినా ఇలాంటి మహాగ్రంథం కర్ణాటక రాష్ట్రానికి పక్కనే ఉన్న తెలుగునాట సాహితీప్రియులకి అందలేదంటే అది ఉభయభాషల బాంధవ్యానికే తీరని తలవంపు. నిజమే, ‘మంకుతిమ్మన కగ్గ’ పలుభాషలలో వెలువడింది. నేడు అంతర్జాతీయ భాష అయిన ఆంగ్లంలో కూడా దీనికి నాలుగైదు అనువాదాలు ఉన్నాయి. అరవంలో రెండు అనువాదాలు ఉన్నాయి. హిందీ, మలయాళ, సంస్కృతభాషలలో గాక తుళుభాషలో కూడ దీనికి క్రొత్త జీవితం అబ్బింది. అయినా అదేమో గానీ తెలుగునేలకు గుండప్పగారి సాహితీసురనది అవతరించలేదు. ఈ భగీరథకార్యాన్ని సాధించిన ఘనులు మన మత్తకూరు రాజణ్ణ చంద్రమౌళిగారు.
విశేషించి డి. వి. గుండప్పగారికి తెలుగంటే చాలా మక్కువ. వారు పుట్టి పెరిగింది తెలుగుభాష సాంద్రమైన సుగంధం కలిగిన కోలార మండలంలో. వారు తమ ఇంటిభాష అయిన అరవం కంటే కూడా తెలుగుభాషనే ఎక్కువగా ఎరిగినవారు; తరచుగా ప్రయోగించేవారు. వారు ‘కర్ణాటాంధ్రసవ్యసాచి’ అను బిరుదు కలిగిన కీర్తిశేషులు రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ గారితో చక్కని తెలుగులోనే సంభాషించేవారు. తెలుగువారు ఎవరైనా వారిని కలిసినపుడు తప్పకుండా తెలుగు భాషలోనే చనువుగా మాట్లాడడం గుండప్పగారి పరిపాటి. పోతన, వేమన, క్షేత్రయ్య, త్యాగయ్య మున్నగువారు వారికి సంధ్యావందన మంత్రాల వలె నిత్యానుసంధేయులు, అంతెందుకు, వినోదాలకు కూడ తెలుగుని విరివిగా వాడుకొనేవారు. వారి పలు చాటుపద్యాలు ఆశుఫణితిలో వెలువడింది తెలుగులోనే, ‘కవిత్రయ భారతము’, ‘మను చరిత్రము’, ‘నారసింహ శతకము’, ‘సుమతి శతకము’లాంటి ఎన్నో తెలుగు కృతులు వారి ఆబాల్యమిత్రులు. ‘ఎంత దయో దాసునిపై’ లాంటి కందాలకు ‘ఎంత దయో తాతునిపై దంతాలకు క్యారమల్మిఠాయలు’ లాంటి పేరెడీలు కూడ సెలవిచ్చారు. ఇలా గుండప్పగారి తెలుగువైదుష్యం ఆంధ్రులకెల్ల గర్వకారణమని చెప్పవచ్చు. ఇంతటి తెలుగుభాషాభిమానుల మేరుకృతి ఆంధ్రభాషామతల్లికి ఇంతవరకూ అంకితం కాకపోవడం బహు విచారకరం. ఈ లోటును తీర్చిన శ్రీ చంద్రమౌళిగారు ఎంతో అభినందనీయులు.
ఈ తెలుగుసేతను చంద్రమౌళిగారు ఒక పనిగా చూడక తపస్సుగా భావించి వ్రతనిష్ఠతో సల్పినారు. అందువల్లనే ఈ అనువాదం అందంగా, అనన్యంగా వెలువడింది. మూలకావ్యంలో ఉపయోగించిన ఛందస్సునే తెలుగులో కూడ స్వీకరించి పద్యాన్ని పద్యంగా మలచడం మామూలు పని కాదు. దీనికి పైగా ప్రాసని తప్పనిసరిగా పాటించడం మరొక్క సాధన, మూలకృతిలోని ఛందస్సునే స్వీకరించి ప్రాసబద్ధంగా కావ్యాన్ని తీర్చి దిద్దడమంటే ఎంత గొప్ప అనువాదకుడికైనా మిక్కిలి కష్టసాధ్యమైన సాహితీభారం. దీన్ని సంజీవనిహర్త హనుమంతునివలే అవలీలగా సాధించినారు మన చంద్రమౌళిగారు. ‘మంకుతిమ్మన కగ్గ’ యొక్క ఇతర అనువాదాలు ఈ గొప్పతనానికి నోచుకోలేదంటే ఇది చంద్రమౌళి గారి ఫణితికే గాక కన్నడ-తెలుగు భాషల సహజ సాన్నిహిత్యానికి కూడా నిదర్శనం. కేవలం అనువాదంతోనే పని పూర్తి చేయక ప్రతియొక్క పద్యానికి సులువైన వివరణ-తాత్పర్యాన్ని గద్యంలో సమకూర్చడం మరొక్క ముఖ్యాంశం. ఈ కైతకన్నెకు వన్నెకూర్చే విధంగా విస్తృతమైన పీఠికాతిలకాన్ని తీర్చితిద్దడం ఇంకనూ మేలైన సాహితీసేవ, మూలలేఖకులైన గుండప్పగారి జీవనం, సాహిత్యదర్శనం, కృతిని చదువరులు ఆకళించుకొనే విధానం, ఈ కావ్యం యొక్క తత్త్వభూమిక ఇలాంటి అత్యంత కష్టసాధ్యమైన ఎన్నో అమూల్యసంగతులు ఈ పీఠికలో చక్కగా అమర్చబడ్డాయి. అనువాదమే ఒక్క ఎత్తైతే ఈ పీఠిక మరొక్క ఎత్తంటే అతిశయోక్తి కాదు.
అనువాదకులు ద్రోహులనే నానుడి ఇటాలియన్ భాషలో సుప్రసిద్ధం. ఇది లోకవిఖ్యాతం కూడ. ఐతే ‘సర్వే నియమాః సాపవాదాః’ అన్నట్లు ఇలాంటి తీవ్రమైన అక్షేపానికి కూడ అపవాదాలున్నాయి. ప్రస్తుతం మన చేతిలో ఉన్న ‘మంకుతిమ్మని మిణుకు’ ఈ కోవకే చెందుతుందనేది. సుస్పష్టం.
నిజమే, చాలాసార్లు మూలానికి చెందిన సూక్ష్మాతిసూక్ష్మమైన భావాలు చిక్కినట్లే చిక్కి చేజారి పోవడం జరుగుతుంది. అయితే అలాంటివి ఈ గ్రంథంలో అత్యంత అరుదు. ఇలాంటి లోటు ఏదైనా కనిపిస్తే దానికి కారణం అనుసృజనలో లోపం కాదు, భాషాంతరకళకు ఉన్న పరిమితిగా గ్రహించాలి. నూటికి తొంభై శాతం పద్యాలు మూలకావ్యంలోని మందారమాధురీసౌరభాన్ని తెలుగు చిరుగాలికి అందంగా అందించినవే. ఇది మెండైన నిందు సాధన. మచ్చుతునకగా నాలుగైదు పద్యాలను చూడవచ్చు:
కన్నడ మూలం
పరద మేల్ కణ్ణాట్టు ధరెయ తుచ్ఛవెనుత్త
తొరెదాయసంగొళ్ళె దొరెవ ఫలవేను?
సురధనువి గేణియిడ హొరటు నిన్నంగళద
కిరిహూవ మరెయువెయ? — మంకుతిమ్మ (256)
తెలుగు సేత
పరముపై కన్నుంచి ధరను తుచ్చమటంచు
నిరసించి విసిగినను దొరకు ఫలమేమి?
సురధనువు పట్ట నిచ్చెన వేసి
ప్రాంగణపు చిరుపువ్వుకు పరాక? — మంకుతిమ్మ ॥ (256)
ఇక్కడ చంద్రమౌళిగారు ప్రాస నుంచి మొదలుపెట్టి మూలాన్ని ఎంత నిష్ఠతో అనుసరించి మనోజ్ఞమైన అనువాదాన్ని సాధించారనే సత్యం చదువరులకు తేటతెల్లమవుతుంది.
కన్నడ మూలం
పారిజాతవకండు నిరుసుయ్దు, పదగళిం
శౌరికథెయను హెణెదు తృప్తనహను కవి
ఊరినుద్యానకద తరిసి బెళసువ కార్య-
ధీరనల రాజ్యకను — మంకుతిమ్మ ॥ (473)
తెలుగు సేత
పారిజాతము జూసి మెచ్చి పదములతోను
శౌరికథ నల్లుచును తృప్తిపడును కవి
ఊరి వనమునకు దానిని తెచ్చి పండించు
ధీరుడౌ రాజ్యకుడు — మంకుతిమ్మ ॥ (473)
ఈ పద్యంలో కూడ ప్రాస మూలానుసారి, విపులమైన వ్యాఖ్యకు తప్ప తన లోతుని తెలుపని. మూలపద్యాన్ని ఇంత అల్లిక జిగిబిగితో అనువదించడం చాలా కష్టం. పద్యానువాద నైపుణ్యం ఇంత అద్భుతంగా ఉన్నా, మూలంలోని ‘కార్యధీర’ అను శబ్దం తెలుగులో ధీరుడని కుదించుకొని పోయింది. ఇలాంటి ఏ కొద్ది సంగతుల్లోనో ఎంతటి రచయితకైనా చిన్నపాటి అసంతృప్తి ఉండి తీరుతుంది. ఇది దూషణం కాదు; భూషణమే.
కన్నడ మూలం
నంబదిర్దను తందె, నంబిదను ప్రహ్లాద ।
నంబియుం నంబదిరువిబ్బంది నీను ॥
కంబదినో బింబదినో మోక్ష వవరింగాయ్తు ।
సింబళది నొణ నీను — మంకుతిమ్మ ॥ (485)
తెలుగు సేత
నమ్మకుండెను తండ్రి, సమ్మె ప్రహ్లాదుండు ।
నమ్మియూ సమ్మనిబ్బందివిర నీవు ॥
అమ్ముక్తి కంబమునొ బింబమునొ వారండ।
చిమ్మిడీగవు నీవు – మంకుతిమ్మ ॥ (485)
‘మంకుతిమ్మన కగ్గ’ మనన కావ్యమనే సరికొత్త కావ్యవర్గానికి చెందుతుందని గుండప్పగారే సెలవిచ్చారు. మనన కావ్యమంటే శుష్కోపదేశం కాదు కదా, నిరలంకృతమైన గంభీరోపదేశం కూడ కాబోదు. అందువలనే ఈ కృతిలో అలంకారంలేని పద్యం లేదంటే అతిశయోక్తి కాదు, ప్రస్తుత పద్యంలో కూడ అలంకారం ఉంది. అది నాల్గవ పాదంలో తన విశ్వరూపాన్ని చూపిస్తున్నది. సమగ్రమైన పద్యమే ఒక దృష్టాంతమైతే చివరి పాదంలోని దృష్టాంతకల్పమైన అనల్పభాస్వరవాక్యం మకరందంలోని అమృతం వంటిది. ఇలా ఎక్కువ పాలు పద్యాలలో తురీయపాద, తురీయాశ్రమ పరిపూర్ణత ధ్వని గుంభితంగా ఉంటుంది. ఇలాంటి చరణాలలో వాక్కు వామనునివలె, అర్ధం త్రివిక్రముని వలె కనిపిస్తాయి. వీటికి మూలం రసమహావిష్ణునొక్కడే. ఆయన నాభికమలంలోని చతుర్ముఖునివలె ధ్వని నలుదెసలా విజృంభిస్తుంది. ఔచితి అతని అర్ధాంగి, వాగ్వధూటికి సంవాదిని; ఆమె కరకమలమందుగల పరివాదినికి సమ్మోహిని. ఇలాంటి సూత్రప్రాయాలైన కావ్యచరణాలను అనువదించడం సులభసాధ్యం కాదు, కష్టపడి ఎలాగో సాధించినా అది అందంగా ఉండదు. కానీ చంద్రమౌళిగారి సాఫల్యప్రమాణం మిక్కిలి ఎక్కువ.
కన్నడ మూలం
యుక్తసామ్రాజ్యదలి భక్తి బడ పరదేశి
శక్తి చతురతెయుడుగి నీను సోతందు
ఉత్క్రమణదరెమనది దైవవను పిడిదేను?
భక్తి రక్తది పరిగె — మంకుతిమ్మ (501)
తెలుగు సేత
యుక్తిసామ్రాజ్యమున భక్తియే నిరుపేద
శక్తి చతురత యుడుగి నీవోడినపుడు
ఉత్క్రమణమున శంకతో వేడి ఫలమేమి
రక్తమున భక్తినీడు — మంకుతిమ్మ ॥ (501)
ఈ పద్యమూ మూలంలోని ప్రాసతో వెల్లివెరిసింది. అన్వయంలోగానీ, ఆకాంక్షలోగానీ మూలంలోని అందచందాల్నీ, అర్థాన్నీ, పరమార్థాన్నీ అద్వితీయంగా ఆకట్టుకుంది.
కన్నడ మూలం
కట్టడద పరియ నిట్టిగెయెంతు కండీతు?
గట్టి నిలలదు బీళె గోడెబిరియువుదు
సృష్టికోటెయలి నీనొందిటికె; సొట్టాగె
పెట్టు తిన్నువె జోకె — మంకుతిమ్మ॥ (532)
తెలుగు సేత
కట్టినింటిని చూచుటెట్లు లోనిట్టుకయు?
గట్టి నిలువక పడిన గోడ పగులునుగా
సృష్టికోటలొ నీవొకిట్టుకయు; చొట్టయిన
కొట్టుదురు భద్రముర — మంకుతిమ్మ (532)
ఇది కూడ మూలమను రాముని ఆయనంలో శ్రద్ధగా నడచు అనువాదసీత మహచ్చరితం, ఎక్కడా కూడ పొల్లుపోని వాగర్థాద్వైతం ఇలాంటి పద్యాలలో కళకళలాడుతుంది.
కన్నడ మూలం
బిట్టెనెల్లవనెంబ హృదయశోషణె బేడ
కట్టికొళ్ళువ శిరఃపీడెయుం బేడ
తొట్టు నిరహంకృతియ కవచను నీంపోరు
ముట్టదిళెయసి నిన్న — మంకుతిమ్మ ॥ (813)
తెలుగు సేత
అన్ని విడిచితిననుచు హృదయశోషణ వలదు
తిన్నగా కట్టికొను తలనొప్పి వలదు.
మున్ను నిర్మమ కవచమును దాల్చి పోరినన్
నిన్నంట దిలకత్తి — మంకుతిమ్మ ॥ (813)
ఈ పద్యంలో మూలానికి భిన్నమైన, మరింత మధురమైన ప్రాస ఆవిష్కరింపబడింది. మూలంలోని లేని యే భావమూ అనువాదంలో కనపడదు; మూలంలో ఉన్న యే భావమూ జారిపోలేదు. ఇలాంటి అసిధారావ్రతం చంద్రమౌళిగారి రచనలో తరచుగా కనిపిస్తుంది.
సామాన్యంగా ఆధునిక కాలంలో కవితానువాదమంటే ఛందస్సుతో సంబంధం లేని, అలంకారంతో అనుబంధం లేని, రసధ్వనులతో ఆనందం లేని గద్యమే సామ్రాజ్యమేలుతోంది. ఐతే ‘మంకుతిమ్మని మిణుకు’లో ఇట్టి వికృతులకు చోటు లేదు. జీవప్రకృతినీ కావ్యసంస్కృతినీ గంభీరబుద్ధిగల సహృదయులకు ప్రాభృతీకరించు విధానం నిజంగా ప్రమోదనిధానం, ఈ సారస్వతోపకారానికి చంద్రమౌళిగారికి మనమెంతో ఋణబడి ఉన్నాము.
ఇంత కాలానికైన గుండప్పగారి మహాకృతి తెలుగుతల్లి ఒడిలో ఇలా చేరడం వైయక్తికంగా నాకు ధన్యతను చేగూర్చింది. దీనికి అండగా వచ్చి చేయూతనిచ్చిన డా. అజక్కళగిరీశభట్ గారి సాహిత్యప్రీతికి నా నమోవాకాలు, ఈ అనువాదం కువెంపు భాషాభారతి ప్రాధికారం ద్వారా వెలుగు చూడనున్న సంగతి మరింత హర్షాస్పదం. మహాకవి కువెంపుగారు డెబ్భై యేళ్ల క్రిందే ‘మంకుతిమ్మనకగ్గ’ గూర్చి ఇలా సెలవిచ్చారు.
హస్తక్కెబరెనక్కె ఓడుత్త ఓడుత్త |
మస్తకక్కిట్టు గంభీరవాదె ॥
విస్తరద దర్శనద తుత్తతుదియలి నిన్న।
పుస్తకకె కై ముగిదె – మంకుతిమ్మ ॥
చేతికందగ నవ్వి చదువుచూ చదువుచూ।
ప్రీతిగహనతనంది తలకుంచితి ॥
అతతంబగు దర్శనోన్నతిని పొందుచూ।
జోతలిడితిని నీకు మంకుతిమ్మ ॥అర్థపూర్ణమైన ఈ మహాకవి వాక్కుతో సెలవు తీసుకొంటాను. తెలుగువారు ఈ మనన కావ్యాన్ని నిదిధ్యాసన చేసుకోగలరని విశ్వసిస్తున్నాను.
