‘దిద్దు’బాటు

గోవిందతోబాటు వెళ్తూ దారిలో కనిపించిన బొమ్మలకొట్టు వైపు చూస్తూ ఆగిపోయాడు పారినాయుడు.

“నడకండా సిన్నగుంటడినాగ బొమ్మలు సూత్తన్నావేట్రా?”

గోవింద ప్రశ్నిస్తున్నా జవాబు ఇవ్వకుండా మౌనంగా ఉండిపోయాడు పారినాయుడు.

“బేగి ఎల్లకపోతే మల్లయ్య ఎల్లిపోతాడు! గవర్నరిగిరీ ఒలకబోత్తన్నట్టు వారంకో పాలి వత్తాడు. రోజు కల్లమ్మే ఎల్లయ్య కాడికి పోదామంటే, నికార్సయిన కల్లు మల్లయ్య కాడే ఉంటాది. ఇవుడికే ఆలసిం అయిపోనాదని నేను బిరబిర నడత్తుంటే నువ్వు కదలకండా ఆగిపోనావు. బేగి పద.”

మల్లయ్య అమ్మే కల్లు కోసం వెళ్తూండగా దారిలోనే ఆగిపోయిన పారినాయుడుని కసిరి తొందరపెట్టేడు గోవింద.

స్నేహితుడితో కలిసి కల్లుకోసం వెళ్తున్నా, “అయ్యా, బడికి సీత బోల్డన్ని బొమ్మలు తెచ్చినాదయ్యా! అందులో కారు బొమ్మ సానా బాగున్నాది. ఒక్క పాలి ఆడుకొని ఇత్తానంటే ఇయ్యలే. ఒక్క కారు బొమ్మ కొనయ్యా…” బడినుండి వస్తూనే, ఇంటి ముందు నులకమంచం మీద కూర్చున్న తన పక్కకొచ్చి కూతురు గారంగా అడగడం జ్ఞాపకం వచ్చి, అడుగు ముందుకు పడనని మొరాయించింది పారినాయుడుకి.

“ఏటైనాదిరా ఇయ్యాల నీకు! అడుగడుక్కి ఆగిపోతానవేల?”

ఆశ్చర్యంగా పారినాయుడుని అడిగాడు గోవింద.

“మా యమ్మి కారు బొమ్మ కొనమని నిన్న అడిగినాదిరా! ఈ పైసలతో బొమ్మ కొంతే కల్లుకు పైసలుండవు,” చేతిలో డబ్బులు గోవిందకి చూపిస్తూ చెప్పాడు పారినాయుడు.

“ఇవుడు బొమ్మ కొనకపోతే ఏటైపోనాది! శివరాతిరికి మన ఊర్లో జాతరైనవుడు కొందువులే. అడిగినయ్యన్నీ ఇత్తే పిల్లలు సెప్పినమాట ఇనరు. నాలిక పీకేత్తంది బేగి పదరా.”

పారినాయుడు మాటలకు పుడుతున్న చిరాకును వదిలి అన్నాడు గోవింద. “బడినుంచి వచ్చి నేను బొమ్మ తెత్తానని ఆశగా సూత్తది బిడ్డ! నువ్వెళ్ళు నేను రాను,” అని బొమ్మలకొట్టు వైపు కదిలాడు పారినాయుడు.

“కల్లుకు పైసలే కావాలంటే నేనిత్తాను లేరా! ఆ పాటిదానికి యెనక్కి యెళ్లిపోడమేల?” ఒంటరిగా వెళ్లడానికి మనసు రాక స్నేహితుడికి పైసలు ఇవ్వబోయాడు గోవింద.

“నేదు గోయిందా! దానికి ఇట్టమైన బొమ్మ సూసినాక, మా యమ్మి మొగంలో సంబడం నా కళ్ళతో సూడాలి. నేను తాగెల్తే అది నా కాడకి రాదు. అందుకే ఇవుడు నేను రాను,” అని గోవిందకి చెప్పి, అతడు పిలుస్తున్నా వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు పారినాయుడు. వినిపించుకోకుండా వెళ్ళిపోతున్న స్నేహితుని మనసులోనే తిట్టుకుంటూ కల్లుపాక వైపు వెళ్ళిపోయాడు గోవింద.

“మావాఁ ఈ కారు బొమ్మెంత?” అక్కడ ఉన్న బొమ్మల్లో ఒక కారు బొమ్మ తీసుకొని షాపతన్ని అడిగాడు పారినాయుడు. పారినాయుడు చేతుల్లో బొమ్మ తీసుకుని దాని ధర చూసి చెప్పాడు షాపతను. “ఈ బొమ్మ కూసింత పిరుమే! నీ కాడ ఎంతున్నాదేటి?”

“ఐదు పదులున్నాయి మావ! ఇంకా సాలవంటే రేపు తెచ్చిత్తాను. ఇవుడీ బొమ్మ యీవా?” దీనంగా మొహం పెట్టి అడిగాడు పారినాయుడు.

“అమ్మి కోసం కల్లుపాకకెల్లకండా బొమ్మ కొంతనవు! బాగున్నాది కాన్రా పారినాయుడు, ఈ బుద్ది ఆ పేకాట గుడిసెకి యెళ్ళినప్పుడు కూడా ఉంటే మీ బతుకులు ఏనాడో బాగుపడేటివి. లచ్చిమికి రేపెలగన్న బెంగుండేది కాదు. ఇవుడు బొమ్మ కొనడానికి పైసలు ఉండేటివి. వారానికొకపాలి తాగే కల్లు మానీడం కాదు, పేకాడ్డం మానేత్తే బాగుపడతావు,” చనువు కొద్దీ బుద్ధి చెప్పడానికి ప్రయత్నించాడు షాపతను.

ఆ మాటలకు ఒక నిమిషం మనసు కెలికినట్టయినా, “ ఊకో మావాఁ, పేకాట గురించి నా పెళ్ళాంకీ నీకూ ఏటి తెలుసు! ఒక్క పాలి పైసలు వొచ్చినాయంటే కట్టాలన్నీ తీరిపోవూ,” అని అటు అతనికీ ఇటు తన మనసుకూ సర్ది చెప్పుకొన్నాడు.

“అది కాదురా పారినాయుడు! నా మాట ఇనరా…” అని షాపతను ఇంకా ఏదో చెప్పే ప్రయత్నం చేసేలోగా, “నాకేం సెప్పకు మావాఁ! ఏటి చేయాలో నాకు బాగా తెలుసు. ఇగో ఈ పైసలు ఉంచుకో మిగిలిన పైసలు రేపు ఇత్తాను,” అని మళ్లీ అతడు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా చేతిలో డబ్బులు అక్కడే పెట్టి మిగిలిన డబ్బులు రేపు ఇస్తానని చెప్పి బొమ్మ తీసుకుని వెళ్ళిపోయాడు పారినాయుడు.

*

“లచ్చిమీ… లచ్చిమీ!” భార్యని పిలుస్తూ లోపలికొచ్చాడు పారినాయుడు.

పొయ్యి మీద ఉడుకుతున్న అన్నాన్ని వార్చి, కుక్కర్లో పప్పెట్టి, తడి చేతులు చీరకొంగుకు తుడుచుకుంటూ, “ఏటి మావా? ఏటలా కేకలేత్తన్నావు,” అని ఎదురు వెళ్ళింది లచ్చిమి.

“పైసలు కావాలే!” భార్య చేతులు పట్టుకొని బెదురుగా అడిగాడు పారినాయుడు. “పైసలు ఏవైనా సెట్లుకి కాత్తన్నాయి అనుకుంతనవా? నువ్వు అడగ్గానే తెంపి ఇయ్యనానికి,” విసురుగా చేతులు వెనక్కి లాక్కుంది లచ్చిమి.

“అది కాదే లచ్చిమి!” అని పారినాయుడు ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తుంటే… “ఏటి కాదు? ఆ ఏటి కాదు? అయినా ఇవుడు నీకు పైసలేల? పేకాడ్డానికేనా?” కళ్ళు పెద్దవి చేసి, చీర కొంగు నడుము చుట్టూ తిప్పి బిగించి, మీదకెళ్తూ గట్టిగా గదమాయించి అడిగింది లచ్చిమి.

రెండు అడుగులు వెనక్కేసి బెదురుగా చూసాడు పారినాయుడు. “ఏటిసెప్తన్నో ఇనకండా గొడవ కొత్తావేటే, ముందు సెప్పింది ఇనొచ్చును కదేటి!”

మొగుడు కళ్ళల్లో దీనత్వం సూసి వెనక్కి తగ్గింది లచ్చిమి. “అయితే నాన్చకండా గబాల్న ఏటో సెప్పు!”

బెదురును దాచుకుంటూ అడుగు ముందుకు వేసి భార్యకి తన అవసరమేటో చెప్పాడు పారినాయుడు.
“వరి సేల్లో గుండ సల్లాలి. గుండ కొండానికి పైసల్లేవు. ఎంత పెయత్నం సేసినా అప్పు పుట్టనేదే. ఏటి సెయ్యాలో తెలీక, నువ్వైతే ఏటో ఒకటి సేత్తావనిపించి నిన్ను అడిగినా.”

“ఆటి కోసం ఎవుడో పైసలు పక్కకు తీసినాం కదా మావాఁ!” అడుగుతున్న లచ్చిమి భృకుటి అనుమానంతో ముడిపడింది.

“అవి అవి..!” ధైర్యంగా తలెత్తి భార్య కళ్ళల్లోకి సూడలేక సేతులు నలుపుకుంటూ నసిగాడు పారినాయుడు.
అతడి ప్రవర్తన జరిగిందేంటో లచ్చిమికి చెప్పకనే చెప్పింది.

కోపంతో ముఖం ఎర్రగా పండు మిరపకాయలా మారగా, దగ్గరగా వచ్చిన ఆమె ఊపిరి పాము బుసలా వినిపించి రెండడుగులు వెనక్కి వేసాడు పారినాయుడు. అప్పుడే లచ్చిమి కోపానికి ప్రతీకగా పొయ్యి మీద పెట్టిన కుక్కర్ విజిల్ వేస్తూ పారినాయుడిని ఉలిక్కి పడ్డాడు. అతని గుండెల్లో భయం మరింత పెరిగింది.

“నేను సెప్పేది ఇనే!” చేసిన గుడిసేటి పనిని సమర్ధించుకోవడానికి ప్రయత్నం మొదలెట్టాడు పారినాయుడు.

“ఇక నువ్వు సెప్పేది, నేను ఇనేది ఏటి నేదు! పతీ యేడాది నీకు ఇదొక అలవాటైపోనాది. గుండకి, మందులకి నేను పైసలు పక్కనెట్టడం, నువ్వాటినొట్టుకెళ్ళి పేకాడి ఖాళీ సెయ్యడం. మళ్ళా ఏటెరగని నంగనాసి తుంగబుర్రలాగ పైసలు లేవని నా ముందకొచ్చి యెర్రిముఖం యేసుకొని నిలబడ్డం. మడిసన్నాక కాసంత బుర్రా, బుద్ధీ ఉండాల. యారోద్దు చేసిన తప్పే సేత్తుంటే నేనేంటి సేసేది? నీ గుడిసేటి గుణం మారదు. నీ పనులు నేను సయించలేను. నీ తోటి బతకడం నా వల్ల కాదు. నేనివుడే అమ్మి నొట్టుకొని మాయమ్మ కాడికి యెళ్ళిపోతాను. నీ సావేదో నువ్వు సావు,” అని ఏడుస్తూ ముక్కు పైకి ఎగపీల్చుకొని పెట్టెలో ఉన్న బట్టలు సంచిలో సర్దడం మొదలుపెట్టింది లచ్చిమి.

యెన్నిసార్లు నెత్తి నోరు కొట్టుకొని చెప్పినా మాట వినకుండా పేకాడ్డానికి పోయినా అలిగి, రెండు చీవాట్లెట్టి, ఇంకేదో అవసరానికి దాచిన డబ్బుని తీసి ఇచ్చే పెళ్ళాం, మొదటిసారి ఇల్లు వదిలిపెట్టి యెళ్ళిపోతానని బయలుదేరుతుంటే, ‘మొత్తం పైసలు వొట్టుకెళ్లి పేకాడీసి, పెళ్ళానికి మరో దారి నేకుండా సేసానే,’ అని ఆలస్యంగా గ్రహించిన పారినాయుడు భార్యను ఎలా ఆపాలో తెలియక దీనంగా ముఖం పెట్టి లచ్చిమి వైపు చూస్తూ ఉండిపోయాడు.

“ఏటలగ నిలువు గుడ్లేసుకొని సూత్తన్నావు! బువ్వొండి, పొయ్యి మీద పప్పెట్టినాను. ఈ పూటకయి మేసి మల్ల పేకాటకు పో. రేపటినుండి నీకు అడ్డూ, అదుపు ఏటుండదు. గుండ కొని సల్లడానికి ఎలగా పైసలు లేవు. ఆ యగసాయం కూడా గాలికొదిలేసి ముప్పొద్దులా ఆ గుడిసెలో నీలాటి గుడిసేటోల్లతో కలిసి పేకాడుకో. నేను అమ్మినొట్టుకుని పోతన్నాను. మల్లా నాకోసం మాయమ్మ గోరింటికి రాకు. నీకో దండం,” అని ఆడుతున్న కూతుర్ని చంకనేసుకొని బయటకు అడుగులేసింది లచ్చిమి.

బెదరగొట్టడానికి అంటోందిలే అనుకున్న పెళ్ళాం నిజంగానే వెళ్ళిపోవడానికి ప్రయాణం కావడం చూసి “తప్పైపోనాది సమించే లచ్చిమి! ఇంకెవుడూ పేకాడను. నన్నొదిలేసి పోమాకే. నువ్వు, అమ్మి లేకండా నేనెలగ బతగ్గలనే,” తలుపుకి అడ్డంగా నిలబడి పెళ్ళాన్ని ఆపడానికి సూసినాడు పారినాయుడు.

“ఏటి, అడ్డం పడిపోతనవేటి? ఒకపాలి సెప్తే నీకు బుర్రకెక్కడంనేదేటి. నీ తోటి నేను బతకలేను. నీ మాట నే నమ్మను. పతీ యేడు నువ్వు సెప్పడం, నిన్ను నమ్మి నేను ఎర్రిదాన్నవడం అలవాటై పోనాది. ఇక నువ్వేటి సెప్పినా నేను ఇనను. పేకాట ఆడీ ఆడీ ఇవుడికే నా ఇల్లు గుల్ల సేసిసి నన్ను ఈదిలో నిలబెట్టినావు. ఇంకా నీ తోటే ఉంటే, భారతంలో ధరమరాజునాగా నన్నే తాకట్టు ఎట్టినా ఎట్టేత్తావు. నేనెళ్ళి పోతాను నీతోటి ఉండలేను,” అంటూ మళ్ళీ గడప దాటబోయింది లచ్చిమి.

“అంత మాటనకే లచ్చిమి! నువ్వంటే నాకు పేనమే. నువ్వు నేకుండా నేను ఉండలేనే. ఈ ఒక్క పాలి సెమించే! సత్తె పెమానకంగా సెప్తన్ను. మల్ల ఎపుడూ పేకాట గుడిసెకాసి సూడనంటే సూడను,” అంటూ పెళ్ళాన్ని బ్రతిమిలాడ్డం మొదలెట్టాడు పారినాయుడు.

“…మొగుడు ఏటైనా తప్పు సేసినవుడు ముందు మంచిగా సెప్పుకోవాల। ఇనకపోతే ఆడ్ని బెదిరించాల, భయపెట్టాల. అయినా ఇనకపోతే ఆడ్ని వొదిలేసి యెళ్ళిపోతున్నట్టు నాటకం ఆడాల. అంతవరకు అన్నిట్లో తోడుగా ఉన్న పెళ్ళాం యెళ్ళిపోతున్నాదంటే, ఏ మొగుడూ సూత్తా ఊరుకోడు. అడ్డొత్తాడు. అయినా యెళ్ళిపోతున్నట్టు నాటకమాడి అడ్ని భయపెట్టి, బెదరగొట్టి దారికి తెచ్చుకోవాల. అంతే తప్ప ఎవుడూ గడప దాటకూడదు. ఒక్క పాలి నువ్వు గడప దాటితే, నీ మొగుడు నీ సెయ్యి దాటిపోతాడు. అందుకే జాగరతగా ఉండు. నీ కాపురం నిలుపుకోవాలో, కూల్సుకోవాలో నీ సేతుల్లోనే ఉంటది,” అని కాపురానికి పంపిన మొదట్లో అమ్మమ్మ చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చి గడప దాటడానికి ముందుకేసిన అడుగు, భర్త మాట విన్నట్టుగా వెనక్కి తీసుకొని అతడికేసి చూసింది లచ్చిమి.

తన మాటకు విలువిచ్చి పెళ్ళాం ఆగిపోయింది అనుకున్న పారినాయుడు, “నిజమే లచ్చిమి సత్తెపెమానకంగా సెప్తన్నాను. మల్లీ పేకాటకు పోనే!” అన్నాడు బుర్రమీద చెయ్యేసుకుని బెంగగా చూస్తూ.

మొగుడి కళ్ళల్లో బేలతనం చూసి పరిగెత్తుకుంటూ వంటగదిలోకి వెళ్లి కొద్దిగా అడుగుపట్టిన వాసన వస్తున్న పప్పును పొయ్యి దించింది లచ్చిమి.

“నమ్మావు కదే, నన్ను నమ్మినావు కదా!” పెళ్ళాం వెనకే యెళ్లి ఆశగా చూసాడు పారినాయుడు.

“నా మీద నీకు పేమ ఉన్నా, నేకపోయినా, నీ కూతురు అంటే నీకు పిచ్చి పేమ కదేటి! దాని మీద పెమానకం సేసి సెప్పు మల్లా పేకాటకు యెళ్ళనని. అవుడు నిన్ను కూసింత నమ్ముతాను.” బెట్టుగా అంది లచ్చిమి.

లచ్చిమి మాట వినగానే పారినాయుడు గుండె గుభేలుమంది. నిలువు గుడ్లేసుకొని భార్యకేసి ‘తప్పదంటావా’ అన్నట్లు దీనంగా చూస్తూ నిలబడ్డాడు పారినాయుడు.

“ఏటలగ నిలువు గుడ్లేసుకుని ‌సూత్తన్నావు పెమానకం సెయ్యమంటే! పెమానకం సేత్తావా? అమ్మినొట్టుకుని నన్ను యెళ్ళిపోమంటావా?” అని లచ్చిమి గదిమేసరికి, గొడవ పడుతున్న తల్లిదండ్రుల వైపు బెదురుగా చూస్తున్న కూతుర్ని దగ్గరికి తీసుకొని, “బిడ్డ మీద పెమానకం సేత్తన్నాను. పేనం ఉన్నదాక మల్లా పేకాడను!” అన్నాడు దిగులుగా.

“ఏటి, నీ సొమ్ము సోకం లాక్కున్నట్టు మొగం అలాగెట్టినావేటి? సూసింది సేన… కూడు తిందువుగాని కూకో,” అని గదమాయించి పీటలు వాల్చింది లచ్చిమి.

“మరి గుండకి పైసలు!” నేరుగా అడిగే ధైర్యం లేక నసిగాడు పారినాయుడు. అతడి మాటలు పట్టించుకోకుండా పళ్లెంలో అన్నం పెట్టి ఆలోచనల్లోకి వెళ్లిపోయింది లచ్చిమి.

*

“ముసిలీ ఈ వయసులో నీకు సింగారాలేలే! ఆ పైసలేవో అయ్యకిత్తే అవసరం తీరుతాది కాదేటి.”

ఎంతమంది వద్దని చెప్తున్నా వినకుండా సొమ్ములు కావాలన్న అమ్మమ్మ మంకుతనం నచ్చక చిరాకుపడింది లచ్చిమి.

“వదిలియ్యమ్మే! కొడుకుని అయ్యుంటే అడగ్గానే మీ అమ్మమ్మ పైసలు ఇచ్చేది. అల్లుడినిగాదేటి, నా అవసరం మీ అమ్మమ్మకేల కనబడతాది,” నొచ్చుకుంటూ బయటికి యెళ్లిపోతున్న తండ్రి వైపు బాధగా చూసింది లచ్చిమి.

“ఆడి మాటలు యిని మోసపోకే! నా బిడ్డనిచ్చిన కానుండి పూటకొక పాలి మీ అయ్య నోటినుండి ఈ మాట వత్తూనే ఉండాది. ఏటి తెల్నట్టు కొత్తగా ఇంటన్నట్టు. మొఖం ఏల అలగెట్టినావు,” ఉడకేసిన శనగలు నములుతూ అడిగింది ముసిలి.

“మా అయ్య అట్టా దిగాలుగా ముఖమేలాడేసుకుని యెళ్ళిపోతుంటే నీకు తిండెలగ సయిత్తందే? అయినా కాటికి కాలుసాపుకున్న దానివి నీకేల సొమ్ములు… మా అయ్యకి పైసలు ఇత్తావా ఇయ్యవా?” గుర్రుగా చూస్తూ అడిగింది లచ్చిమి.

“పెళ్ళి కానన్నాలు మా అయ్యని సిన్న ముక్కుపుడకైనా బంగారంది కొనమన్నాను! ఆడేటీ కొనకండా మీ తాతని కట్టబెట్టి పోనాడు. తర్వాత మీ తాతను కొనమన్నాను. ఆడూ కొనకుండానే సచ్చినాడు. కూలీనాలి సేసి మిగిల్చిన పైసలతో మీ అమ్మకు ముక్కుపుడక సేయించినాను. నా బాద్దెత తీరిపోనాది అనుకోని కూలి సేసి సంపాయిచ్చిన పైసలు అవుడవుడూ పయినాన్సు కడితే పెరిగి పెరిగి ఇవుడు చేతిలోకి కొచ్చినాయి. సిన్నప్పుడినుండి ఆశపడి కొనుక్కోలేకపోయిన సొమ్ములు కొనుక్కున్నాను. మద్దెలో నీ గోలేటే?” చిరాగ్గా అంది ముసలి.

“అదే అంటన్నే… సిన్నవుడయితే ఏ సొమ్ములెట్టినా, యెంత సోకు సేసినా సక్కగుంటది కానీ సచ్చే కాలాన సోకులేల నీకు!” వెటకారంగా అంది లచ్చిమి.

“పెద్దదాన్ని అయిపోనాననుకుంతనవేటే, నా మీదకే నోరులేపతనవు! ఏటిసెయ్యాలో నాకు తెలుసు, నోరు మూసుకొని కూకో,” అని లచ్చిమి నెత్తిమీద మొట్టింది ముసలి.

“ఓలమ్మో ఈ ముసలి చంపేసినాదిరా దేవుడో! అమ్మా మీ యమ్మ సూడే, నన్ను మొట్టి సంపేత్తంది,” అంటూ కేక పెట్టింది లచ్చిమి.

“మాయమ్మ కాడ నీకేటి పనే! యెళ్ళి ఆ బట్టలుతుకు.” అని తల్లి కసిరేసరికి… “నీకు, మీ యమ్మకు నేనన్నా,మా అయ్యన్నా నెక్క నేకుండా పోతన్నాది! మా అయ్య వచ్చినాక నీ పని సెప్పి మేమేటో మీకు సూపిత్తాము,” అని తన వైపే కోపంగా చూస్తున్న తల్లిని చూసి, ఏడుపుమొహం వేసుకొని వెళ్ళిపోయింది లచ్చిమి.

*

“గంతకు తగ్గ బొంతనాగ మన తాహతకు తగినోడితో లచ్చిమికి పెళ్లి కుదిరినాది! అత్తారింటికి పంపినప్పుడు ఎక్కువ సొమ్ము లేకపోయినా పిసరంత కాసైనా పెట్టాలంటారు. మీ అల్లుడికి ఈ మాటే సెబితే, మనయి అత్తెసరు బతుకులు, బంగారం కాసులు కొనడానికి పైసలు ఏడనుండి తెమ్మంటావు అనేసినాడు. ఇలాగే బోడిగా తోలితే అమ్మికి అత్తారింట్లో ఇలువుంటాదా?” ముసిలి తల్లి దగ్గర కన్నీళ్లు పెట్టుకుంది లచ్చిమి తల్లి.

కూతురు కన్నీళ్లు పెట్టుకుంటున్నా పట్టించుకోకుండా వేపిన పల్లీలు నములుతూ గాలి కోసం అరుగు మీద కూర్చుంది ముసలి.

“మీయమ్మ కాడ ఏలేడుత్తావమ్మా! ఆ ముసలిదానికి దాని సిరి సింగారమే కానీ పక్కోడి బాధ ఏనాడు పట్టినాదని. ఎవులేటయిపోతున్నా ఆ నోటిని ఆడించడం మాత్రం ఆపదు,” తల్లి ఏడుపు నచ్చక చిరాకుపడింది లచ్చిమి.

ఉన్నంతలో ఒక చీర, రాగి నగలు కొని లచ్చిమిని పెళ్లికూతురుని చేసి, ముసిల్దాన్ని కనీసం రమ్మని కూడా పిలవకుండా మండపానికి బయలుదేరారు ఆమె తల్లి, తండ్రి.

అయినా పట్టించుకోకుండా వాళ్ళ వెనకే వెళ్లిన లచ్చిమి అమ్మమ్మ, లచ్చిమి దగ్గరికి వెళ్లి, “యేటే మనవరాలా, పెళ్లిపీటల మీద కూకుంటున్నా నీ ముఖంలో నవ్వే నేదు! నా మనవడు నచ్చలేదా ఏటి?” అంది నవ్వుతూ. లచ్చిమి మాత్రం అమ్మమ్మ వైపు తలెత్తి కూడా చూడలేదు.

ఇంతలో లచ్చిమి చెవులకు ఉన్న రాగి దిద్దులు తీసి, బంగారు దిద్దులు పెట్టింది ముసలి. ఆమె అలా చేస్తుందని ఊహించని లచ్చిమి ఆమె వైపు ఆశ్చర్యంగా చూసింది.

“ఆయేళ మీ అయ్య అలిగాడనీ, నువ్వు గోలెట్టావనీ ఉన్న పైసలన్నీ ఇత్తే ఈగో, ఇలగే పిసరెత్తు బంగారం లేకండా అత్తారింటికి యెళ్ళేదానివి. బతుకు చూసిందాన్ని ఎవుడు ఎటిసెయ్యాలో నాకు తెల్దా? పెళ్లయిన కానుండి మీ అయ్యకి ఎన్ని పైసలు ఇచ్చినా కిందేసుకున్నాడు కానీ నీ కోసమైనా ఏటీ కొనలేదు. నాలాటి బాధ నీకు వద్దు అనుకున్నానే.” అంటూ లచ్చిమి నుదుటి మీద ముద్దు పెట్టి మొగుడితో ఎలా ఉండాలో వివరంగా చెప్పింది ముసలి.

*

“లచ్చిమి, మరికొంచెం కూడెట్టే!” కంచంలో కూడు కూతురికి తినిపించి అడిగిన మొగుడు మనసులో బాధ గ్రహించి చెవి దిద్దులు తీసి అతడి చేతిలో పెట్టింది.

“ఎందరు వద్దన్నా మా అమ్మమ్మ కొనుక్కున్న దిద్దులివి! నా తర్వాత మన అమ్మికి ఇయ్యాలని నా ఆస. అందుకే నువ్వెన్ని మార్లడిగినా ఏనాడూ తీయలే. ఇవి కుదువెట్టి పైసలు తెచ్చి గుండ కొను. ఇంతకు మించి నా కాడేటి లేవు,” అంది ఖాళీ అయిన కంచంలో అన్నం పెట్టి తన వైపు అయోమయంగా చూస్తున్న భర్తతో చెప్పింది.

చేతిలో దిద్దుల్ని, లచ్చిమి ముఖాన్ని మార్చి మార్చి చూసిన పారినాయుడు, వాటిని తిరిగి ఆమె చేతిలోనే పెట్టి గబగబా అన్నం తిని, ముఖంలో దృఢనిశ్చయమేదో కనిపిస్తోండగా పెద్ద పెద్ద అంగలతో బయటికి వెళ్ళిపోయాడు.

లచ్చిమి కళ్ళు మెరిసాయి. ఆనందంగా.


పొన్నాడ గౌరి

రచయిత పొన్నాడ గౌరి గురించి:

చిన్నతనంనుండి తాతగారి దగ్గర కథలు వింటూ పెరిగిన నాకు సహజంగానే కథల పైన మక్కువ ఏర్పడింది‌. అయితే కరోనా సమయంలో దొరికిన ఖాళీ సమయం నన్ను రచనారంగం వైపు మళ్ళించింది. నవతెలంగాణ పత్రికలో , ఈ మాట, సంచిక, సారంగ, మన తెలుగు కథలు, సినివాలి, సహారివంటి వెబ్ పత్రికల్లో, ప్రతిలిపి ఆన్లైన్ యాప్ లో నవలలు ప్రచురితం. అచ్చ తెలుగు కథలు, మల్లెసాల – చేతివృత్తి కథలు, తపస్వి మనోహరం తీసుకువచ్చిన క్రైమ్ కథలు వంటి సంకలనాలలో సైతం నా కథలు చోటుచేసుకున్నాయి.

 ...