Make Peace

కనక ప్రసాద్

"ఎక్కో మామీ ఎక్కో మామీ ఎక్కో ఎఖ్ఖో..." అని చేతులిచ్చి మీదికి ఎక్కిపోయేడు.

"కన్నా! You are too heavy for Mommy! I can't ఎక్కో you! You are a big boy now!" అని నచ్చ చెప్పింది. "ప్లీజ్...ప్రెటీ ప్లీజ్....!" అని బతిమాలింది. వాడి కళ్ళల్లోకి సూటిగా చూసి జబ్బలు రెండూ పట్టుకుని. క్షణంలో బుగ్గలు ఎర్రగా చేసుకుని కళ్ళంట నీళ్ళు తెచ్చుకుని కిండర్ కేర్ గుమ్మం మీద పడిపోయేడు. వీరంగం వెయ్యటానికి. "My wanna ఎక్కో... my wanna ఎక్కో మామీ..." అని. ఇంక గతి లేక వాడ్ని ఎత్తుకుని తన బేగ్ , వాడి బేగు, వాడు ఖరాబు చేసిన బట్టల సంచీ పట్టుకుని పళ్ళ బిగువున ఒక్కొక్క మెట్టూ దిగుతూ ఉంటే వాడు "And the mommies on the bus go shh..shh....shhh!" అని ఎగురుతున్నాడు. పడిపోకుండా మెట్టు మీదే నిలదొక్కుకుని "కన్నా! బజ్జో on mommie shoulder! బజ్జో బజ్జో ప్లీజ్....." అని బతిమాలింది. వాడు దయ తల్చి వెంటనే భుజం మీద వాలిపోయి నోట్లో వేలు పెట్టుకున్నాడు. వన్ హమ్మ....టూ... హమ్మ....త్రీ...హమ్మా అని పళ్ళ బిగువున ఇరవయ్యెనిమిది మెట్లూ దిగి గ్లాస్ డోర్స్ తీసుకుని పార్కింగ్ లాట్లోకి వస్తే మూడున్నర ఎండ గాడ్పు ఈడ్చి కొడుతోంది. వాడ్ని కిందికి దింపి "OK! Now.........Who is the lion and who is the kitty cat?" అంది. "I am the yuyun and...um..and...mommie is the kitty cat!" అన్నాడు. 'Do like kitty mommie!' అని దబాయించేడు. 'అదిగో డక్స్ చూడు డక్స్ డక్స్!' అంటే బలవంతంగా మొహం తనకేసి తిప్పుకుని "Do like kitty mommay!" అని వెనక్కి విరగబడిపోయి ఏడుస్తున్నాడు. వేలాడుతున్న వాడ్ని పడిపోకుండా కాళ్ళ దగ్గర గట్టిగా అదిమిపట్టుకుని చేతిలోని బేగ్ లు రెండు గడ్డిలోకి వదిలి ఏడుపు ఆపుకుని వెంటనే పిల్లిలాగ "మియ్యాఁవ్.... మియ్యాఁవ్....." అని అరుస్తూ వాడ్ని పైకి లేపి గట్టిగా భుజానికి హత్తుకుంది. వాడ్ని మరిపింతలు పెట్టి ఎలాగో వేన్ వరకు లాక్కెళ్ళి వాడి సీట్లో కట్టి పడేస్తే రెండో గండం గట్టెకిపోయినట్టే. "I am the yuyun...Grrrr..Grrr..! Do like a kitty!" అని చెవి తమ్మి కొరికేడు వరసపెట్టి. "అబ్బా..కన్నా...Don't bite my తిత్తీ కన్నా....అబ్బా...అవ్వీ..." అని ఏడ్చింది. బర్ ఓక్ చెట్ల కింద నీడలు పారుతుంటే బాతు పిట్టలు గుంపులుగా కూర్చొని సేద తీర్చుకుంటున్నాయి. బాతు పిల్లలు బుద్ధిగా వాటి మమ్మీలు ఎటు నడిస్తే అటే నడుస్తుంటే వాటిని అసూయగా అపనమ్మకంగా చూస్తూ జారిపోతున్న వాడ్ని రెక్క పట్టుకుంది. ఎంత గట్టిగా అదిమి పట్టుకున్నా వాడు తటాల్న ఒడుపుగా చంకలోంచి జారిపోయి విడిపించుకుని గట్టు మీదికి దిగిపోయేడు. "Mommie is the yuyun....I am a duckie.." అని బాతుల మధ్యలో పడ్డాడు. అవి బెదిరి కొలనుకేసి పరిగెడుతుంటే వాటి వెనకే "Hey! Sto....pppp!" అని దీర్ఘం తీస్తూ.

వాడు బాతుల వెనకే డక్ పాండ్ కేసి పరిగెడుతుంటే బెంబేలు పడి "ఏయ్ కన్నా! నో నో..... అవ్వీ ..... అక్కడ వాటర్ రా......! Don't go there!" అని వాడ్ని రెక్క పట్టుకుని ఆపింది.

"Will I die?"

"Yes! ... I mean no..But you get ouvvee in the water!"

ఎత్తుకోడానికి ప్రయత్నిస్తే తనని తనని వెనక్కి నెట్టి "You smell yucky mommie..." అన్నాడు. ఫార్మాల్డెహైడ్ ఐవీ బేగ్ లు మందుల లేబ్ వాసన. ఇంటికెళ్ళి తొందరగా బట్టలు మార్చుకుని స్నానం చెయ్యాలి. తల పగిలిపోతుంది. ఇటూ అటూ కణతలు నుదురు ఎవరో పట్టకారుతో నొక్కుతున్నట్టు. కాఫీ గింజలు ఫ్రెష్ గా గ్రైండ్ చేసుకుని బురుగుల కాఫీ తాగుతుంది! అమ్మ పెట్టిన కాఫీలా చేసుకుని. వీడు వేన్లో కూర్చుంటే! అమ్మే ఉంటేనా! తనకి ఇక్కడ దిక్కెవరూ లేరు. రోహణ్ వేన్లోకి రాడు. తీరా వచ్చినా అద్దాలు స్టీరింగ్ వైపర్లు అన్నీ విరుస్తాడు గాని సీట్లో కూర్చోడు. ఎవరూ సాయానికి రారు. 'నువ్వెళ్ళి చదువుకోవే మున్నా! నేను వాడ్ని చూసుకుంటాన్లే..! లేచెళ్ళవే పరవాలేదూ!' అని చనువుగా గద్దించే వాళ్ళు. "ఛీ ఈ కాఫీ ఏంటే ముష్టి లాగా? స్ట్రాంగా పెట్టకపోతే నాకొద్దని ఎన్ని సార్లు చెప్పాల్ నీకూ..? ముష్టీ...!" అని బోర్లా పడుక్కునే అటు చూడకుండా కసురుకుంటే "అబ్బ ఏం పదున్లమ్మ నీకూ మీ అబ్బకీ..!" అని గర్విస్తూ ఆ వేడి కప్పు జాగ్రత్తగా చెంగుతో పట్టుకుని మళ్ళీ కాఫీలు తెచ్చే వాళ్ళు. "ఇదుగో నా కూతురు ఎంసెట్ టాపరు! కాఫీయే కదే అడిగింది అద్చెప్పినట్టు చేసియ్యి శారదా ?!" అని దబాయించేవాళ్ళు. "ఒరేయ్ సంగం! అయ్యగారు ఇవాళ్టికి జీపులో ఎళిపోతార్లే గానీ, వానొచ్చీటట్టుగున్నాది నువ్వు మెడికల్ కాలేజి కెళ్ళి మున్నమ్మ గార్ని తీసుకోనొచ్చి!" అని పురమాయించిందే తడవు తెల్ల అంబాసడర్ తెల్ల టర్కీ టవల్ సీట్లని అక్కర్లేకున్నా తుడిచి తుడిచి 'రండమ్మా యెల్దారి!' అని ఆహ్వానించే వాళ్ళు. కళ్ళ నీళ్ళ పొరల్లోంచి రోహణ్ గాడు మళ్ళీ బాతుల కొలనుకేసి పరిగెడుతున్నాడు. చర్చ్ దగ్గర పెద్ద పడవలాగ తెల్లటి కారు ఆపి ఒక ముసలాయన సానుభూతిగా తనవైపు చూస్తూ వెళ్ళేడు. ఆయనకున్నపాటి జాలి రఘుకి లేదు. ఇవాళసలు తన 'టర్న్' కాదు! ఉక్రోషంగా కింది పెదవి కొరుక్కుని చెమటలు టాప్కి తుడుచుకుంటూ 'ముష్టి bloody idiot!' అని అలాగే గట్టిగా పైకే తిట్టుకుంది. ఇదివరకు, అఖిల చిన్న పిల్లప్పుడు అలా ఉడుకుమోత్తనానికి కోపం వచ్చి తిట్టుకున్నప్పుడు వెంటనే తనలోనే అయ్యో ఛా అనిపించి 'రఘూని కాదు! తన లైఫ్ ని!' అనుక్కొనేది. ఆ తిట్లు ఎవరికీ కావు, ఎవర్నీ కావు, నిస్సహాయంగా పసి పిల్లకీ తన ఆకాంక్షలకీ మధ్య నలుగుతున్న తన జీవితాన్ని మాత్రమే అని. ఇప్పుడలా అనుక్కోలేదు.

"If you sit in the car seat కన్నా I will buy you a yummie yummie milk shake!" అని మళ్ళీ ట్రై చేసింది.

"No milkshoper....Go away! ..Go away!!" అని తల గుండ్రంగా తిప్పుతూ అబద్ధం లంచాలు పోల్చుకోలేనా అన్నట్టు, కావాలనే తనని ఏడిపించాలనే అక్కడికక్కడే గడ్డిలోనే దూర దూరంగా వలయాలు తిరుగుతున్నాడు. కిండర్ కేర్లోంచి మిగతా పిల్లలు అమ్మలు డాడీలు ఒక్కొక్కరే కార్లు వేన్లు స్టార్ట్ చేసుకుని పద్ధతిగా రివర్స్ చేసుకుని ఇళ్ళకెళిపోతున్నారు. ఒక్క టూ అవర్స్ ఎగ్జామ్ కి చదువుకుందాం అని అనుక్కుంది. వంటంతా రాత్రే చేసి పెట్టుకుంది. హేండ్ బేగ్ లోంచి అద్దం తీసి ముఖం ఇటూ అటూ తిప్పి చూసుకుంది. లిప్ స్టిక్ పెదవుల మధ్యన చెరిగిపోయి చుట్టూ గీతల్లా మిగిలింది. ఐ బ్రోస్ ట్రిమ్ చేయించుకోవాలి. ముక్కు కొన మీద నల్లగా బ్లాక్ హెడ్స్ మళ్ళీ వస్తున్నాయి. వేపరైజ్ చేయించుకోవాలి. తనది కోల మొహం, దుద్దులు నప్పవు. కాని పెండెంట్స్ పెట్టుకొని హాస్పిటల్ కి రావొద్దని బాస్ చెప్పింది - 'Its just a suggestion, of course!' అనే. జుత్తు కొంచెం పైనుండి తెచ్చి నుదుటి మీదికి సర్దుకుంది. స్థిరంగా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తటాల్న అద్దం, లిప్ స్టిక్ బేగ్ లో పడీసి లేచి రోహణ్ వెనకే బాతుల్లో బాతులాగ పరిగెట్టి వాడ్ని దొరకపుచ్చుకుంది.

"రారా....కన్నా...నా బంగా తండివి కదూ...నా రామ సక్కని నా కిష్ట సక్కని తండెవరు? నా అంజు మింజు రాజా.... నువ్వే కదా! రోహణ్! Look at me! Look at mommie!! If you come sit in the van like a good boy, I will take you to Chuck-e-Cheese!"

వాడు వినిపించుకోలేదు. బాతుల లోకంలో విహరిస్తున్నాడు. "Bad Mommie.....!" అని అకారణంగా కోపగించుకుని చేతిలో కర్ర పుల్ల మీదికి విసిరి బాతుల మధ్యకి పరిగెట్టేడు. 'Duck said chibbi chuck chibbi chuck Duck said kwack kwack' అని పాడుతున్నాడు. తొందరగా వెళ్ళి 'Don't cook rice today!' అని పనమ్మాయికి చెప్పాలి; పొద్దున్న వీడు స్నానానికీ నెబ్యులైజర్ తీసుకోకుండా చేసే అల్లరిలోన, రఘుతో గొడవలో పడి నోట్ పెట్టడం మర్చిపోయింది. రఘు డిన్నర్ కి ఇంటికి రానని 'పొడి'గా ఆన్సరింగ్ మెషిన్ లో మెసేజ్ పెట్టేడు. కావాలనే తను లేని సమయం చూసుకునే కాల్ చేసి 'Hey, it's me! Ah..I can't make it to dinner tonight! Gary wants me to stay for a Six O'clock meeting...Uh..! Okay! Gotta go...' అని. తను 'హేయ్ ' ఆ? Hay is for horses! 'మంజు', 'మంజురాజు', 'మున్నీ', 'మనో..'.... అవన్నీ ఏమయ్యేయి? మొఖం చాటుచేసుకుని తిరుగుతున్నాడు. పొద్దుటి సంగతి రఘు జ్నాపకం రాగానే ఉక్రోషంగా లేచి విసురుగా వాడి రెండు రెక్కల్లో చేతులు పెట్టి పైకి లేపి వాడు కాళ్ళు కొట్టుకుంటూ పెద్దగా ఏడుస్తున్నా ఖాతరు చెయ్యకుండా వేన్ తలుపు తీసి వాడ్ని బేబీ సీట్లో కుదేసి, కదలకుండా ఒకచేత్తో అదిమిపెట్టింది. అమ్మ పెద్ద కళ్ళల్లో పచ్చి కోపాన్ని చూసి హడిలి పోయి వాడు గుక్క తిప్పుకోకుండా ఏడుస్తుంటే సీటు దండీ వాడి గుండెల మీదికి బలంగా దించి సీట్ బెల్ట్ బిగించి "Shut Up!" అని అరిచింది. బిక్కచచ్చిపోయి ముందు బుగ్గల్నిండా జొట జొటా కన్నీళ్ళు రాల్చి ఆనక గట్టిగా ఏడుపు లంకించుకున్నాడు.

డ్రైవర్స్ సీట్లో కూర్చుని ఏసీ ఆన్ చేసి Silly Songs Toddler Tunes పెట్టింది. డేష్ బోర్డ్ కింద గూట్లోంచి చిప్స్ పేకెట్ తీసి వాడి ఒళ్ళోకి విసిరి "I said Be Quiet...!" అని కర్కశంగా గద్దించింది. వాడు తన సీట్ వెనక కాళ్ళతో తంతూ ఎగిరెగిరి ఏడుస్తున్నాడు. Exit ramp పక్కన ఎప్పుడూ నల్లి లాగ ఒక cop కాసుకుని కూర్చుంటాడు. ఆ జాగా దాటే వరకు నెమ్మదిగా వెళ్ళి అక్కడ స్పీడ్ పెంచింది అద్దంలోంచి వెనక్కి రోహణ్ ని ఒకసారి చూసుకుంటూ. ఇంక రెండు ఎగ్జిట్లు దాటితే Rock Creek. వేన్ చల్లబడింది. చిప్స్ తింటూ రోహణ్ బాతుల్ని మర్చిపోయేడు. పాటల్లో పడిపోయేడు. ఆకాశంలో చిన్న చిన్న తమాషా ఆకుల్లాగ తేలుతున్నారు స్కై గ్లైడర్లు. గాలి వాటు ఎటు వెళ్తే అటు. వేన్ లేత నీలం అద్దంలోంచి ఆకాశం ఉన్నదానికంటే ఇంకా నీలంగా కనిపిస్తోంది. తను ఫ్లైయింగ్ నేర్చుకుంటానంటే కళ్ళద్దాలు సబ్బుతో కడుక్కుంటూ 'ఊఁ ఊఁ నేర్చుకోరా! డెమీ మూర్ లాగుంటావు!' అన్నాడు. అన్నిటికీ అలాగే సరేనన్నట్టే అంటాడు గాని......! 'స్వాతీ వాళ్ళాయన నేర్చుకున్నాడంట. ఏయ్ చిన్న విమానం కొనుక్కోవాలంటే ఎంతో అవదంట తెల్సా?!' అంది. కాళ్ళ మీద హెయిర్ వేక్స్ చేస్కుంటుంటే మౌత్ వాష్ గిల గిల పుక్కిలించుకుంటూ కనుబొమలు 'అమ్మో నువ్వే విమానఁవే?!' అన్నట్టు ఎగరేసి క్లాసెట్లోకి వెళిపోయేడు. ఇంటి నెంబర్ 1871 వాళ్ళాయన, ఆవిడ నిండు గర్భిణి - చేతిలో చేతులు వేసుకుని ముందు స్ట్రోలర్లో పాపని, పక్కన కుక్కని నడిపించుకుంటూ నెమ్మదిగా నడుస్తున్నారు. అలవాటుగా mail boxes దగ్గర పక్కకి తీసి ఆగబోయినా మళ్ళీ మనస్కరించలేదు. దాన్నిండా ఏవో కట్టలు కట్టలు లెటర్సుంటాయి గాని అవి తను ఎదురు చూసే ఉత్తరాలేం కావు. రఘువీ తనవీ జర్నల్స్. బిల్లులు కట్టాల్సినవి. కూపాన్స్ . మందుల కంపెనీల చెత్త. రంగు రంగుల ప్లాష్టిక్ జంక్ ! తనకి ఎవరూ ఉత్తరాలు రాయరు, తనూ ఎవరికీ రాయదు. డాడీ కొట్టే e-mail లోనే అమ్మ కూడా Rohan ni teesukoni Kakinada vegamga ramdi. nuvvu vastavemo ani Deepavali samanlu teppimchi vunchenu. cheeralayana vasthunnadu prati varam varam. Kaatan cheeralu gani okaidu tisukomantava. tammudu eeroje phone chesedu. maremti? vuntanu. itlu amma అని ఇలా తెలుగే Englishలో రాస్తుంది. Web-cam వచ్చిన కొత్తరోజుల్లో వారానికి రెండు సార్లైనా రోహణ్ ని అమ్మకి, డాడీకి చూపించేవారు. అలా అదీ పాతబడిపోయింది. డాడీ కొట్టే ఈ మెయిల్స్ కూడా రఘుకి నౌతాలు. 'మీ డాడీ ఏం రాస్తారో చదవకుండే చెప్పేయ్ మన్నావా?' అని. 'మీ డాడీకి అదీ లేదు' అని తిప్పికొడ్తుంది. కానీ రాన్రానూ తనకే విసుగనిపిస్తాయి డాడీ ఈమెయిల్స్ . You have a Pongal Greeting from Kralajangi and family అని ఇలాగొస్తే చూడకుండానే Delete చేస్తుంది.

డ్రైవ్ వేలో ఇంకా వేన్ ఆగిందో లేదో రోహణ్ "లూబా! లూబా?!" అని మిలిట్రీ కమేండర్ లాగ అరుస్తూ ఇంట్లోకి పరిగెత్తేడు. లూబా చేతిలోని క్లీనింగ్ లిక్విడ్ వాడికి అందకుండా గాల్లోకి ఎత్తి పట్టుకుని "What sweetie? What...?" అన్నాది. వాడు పరుగెత్తి లూబాని అమాంతం కావిలించుకుని 'లూబా! లూబా! .. ఉమ్మ్.....' అని ముద్దుల్లో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. 'లెట్ మి గో స్వీటి! యూ వాన్న ఈట్ చికిన్నగెట్స్ ? ' అని లూబా మురిసిపోతుంటే వాడికి తనకంటే లూబా అంటేనే ఎక్కువ ఇది అని నొచ్చుకుంటుంది ఒక్కోసారి. అఖిల తోటకూర కాడలా సోఫాలో వాలిపోయి తలగడ మీదే ఓరకళ్ళు తెరచుకొని టామ్ ఎండ్ జెర్రీ చూస్తోంది. "ఏయ్ అఖిలూ? ఇంటికి రాగానే షూస్ ఇప్పుకోమని నీకెన్నిసార్లు చెప్పాలే?" అని విసురుగా దాని షూస్ లాగబోతుంటే లాగించుకుంటూనే "మామీ! I love youooo..!" అని మెడ చుట్టూ చేతులేసింది. దాని ఎదురుగా కెచప్ పులిమి ఉన్న ఖాళీ ప్లేట్ చూసి నోరు చికెన్ నగెట్స్ వాసనేస్తుంటే తృప్తితో అదొక పని అయినందుకు లూబా మీదే ఇష్టంగా అనుక్కుంది మళ్ళీ. అఖిలని స్కూల్ బస్ నుండి ఇంటికి తెచ్చి, తినటానికి పెట్టి, ఇల్లంతా క్లీన్ చేసి, అన్నం పప్పు వండి ఉంచుతున్నందుకు. ఫోన్ రింగవుతుంటే సున్నితంగా అఖిల పట్టు వదిలించుకోడానికి ప్రయత్నించింది గాని అది 'మామీ! ఊఁహు.....మామీ మామీ!' అని కాడల్లాటి చేతులు మెడ చుట్టూ మరింత బిగించి తననే సొఫాలోకి లాక్కుంటోంది. బలవంతంగా దాని చేతుల వేళ్ళు విప్పి విడిపించుకుని ఫోనుండే పువ్వుల పిట్టగోడ వైపు వెళ్ళే సరికి, మూడు రింగ్ లకే ఫోన్ పెట్టీసేరు ఎవరో. అది మాధవీయే ఈ టైంలో ఇంకెవరు అనుక్కుంది. అఖిలని బలవంతంగా సోఫాలోంచి లేపి కూర్చోబెట్టి "How was school?" అంది దాని షూస్ ఇప్పుతూ.

"Gooo..d!"

"Did you read your 20 minutes...?"

"But Lyuba said I can watch TV...!"

లూబా కిచెన్ కౌంటర్లు అన్నీ తుడిచి పెట్టి రైస్ కుకర్ ఆన్ చేస్తోంది. "అయ్యో లూబా నో రైస్ టుడే.... నో రైస్!" అంటే ఇప్పుడు చెప్తే ఎలాగ అన్నట్టు చూసింది. రోహణ్ గాడు ఫ్రిజ్జంతా చక్కపెట్టి, గరిటెలు చెంచాలూ పీకి పోకపెట్టి, లూబా ఇచ్చిన చికెన్ నగెట్స్ నోట్నిండా కుక్కుకుంటూ షూస్ తోనే బాణంలా వచ్చి అక్క పక్కన దూరిపోయి టీవీ రిమోట్ కోసం యుద్ధం ప్రారంభించేడు. 'ఐ వాంట్ రామాయనాయా.....!' అని దబాయిస్తున్నాడు. సంపూర్ణ రామాయణం డీవీడీ తెచ్చి జబర్దస్తీగా డీవీడీ ప్లేయర్లో తోసి చానల్ మార్చి కూర్చున్నాడు. 'షాంతాకారం బుజగా సయనం' అని వాళ్ళ వెనకాలే పాడుకుంటూ. అఖిల ఏడుస్తూ లేచిపోయి 'But I got that first...' అని యుద్ధానికి తయారైపోయింది. "Go read your book!" అని దాన్ని సోఫాలోంచి తోసి ముందు జాగర్తగా తనే రాగం అందుకున్నాడు. ఆ గొడవ రక్కుకోడాలు గిల్లుకోడాలనుండి అలా రాజుకుంటుంటే మళ్ళీ ఫోన్ మ్రోఇంది. వాళ్ళని కసిరి, టీవీ కట్టెస్తానని బెదిరించి రిమోట్ లాక్కుని అందకుండా గాల్లోకి ఎత్తి పట్టుకుని, రెండో చేత్తో రిసీవర్ విసురుగా అందుకుని చెవికీ భుజానికీ మధ్య నొక్కిపట్టుకుని 'హలో?' అంది. ఎవరూ సమాధానం లేదు. ఈసారి గట్టిగా 'ఓ హెల్ల్...యూవ్?!' అని రెట్టించింది చికాకు కలిపిన స్వరంతో.

అట్నుండి "హలో? హలో... ఈజ్ దిస్ డాక్టర్ రఘురామ్ చిటికెలాస్ రెసిడెన్స్ ?" అని మంద్రంగా ఒక పెద్ద నాన్న గొంతుక.

"అవునండీ ఇదే! ఎవరు.. ఏంకావాలి?"

ఆయన ఇంకా ఇంగ్లిష్ లోనే "Dr. Raghu Ram and Manjula......?" అని మళ్ళీ అడిగేడు.

"అవునండీ మీరెవరండీ?'

"వారు....డాక్టర్ రఘూ గారున్నారమ్మ?"

"లేరు దిసీజ్ డాక్టర్ మంజులా..!" అంది 'డాక్టర్' అనే దగ్గర కఠినంగా నొక్కి. ఆయన గొంతు చాలా పరిచయమున్న గొంతుల్లోది. డాడీ ఆఫీస్ లో హెడ్ గుమాస్తా, తన ఫ్రెండ్ శైలజా వాళ్ళ డాడీ, అమీర్ పేట్ రూట్లో ఎప్పుడూ జోకులేసుకుంటూ తిరిగే ఒక పెద్ద వయసు కండక్టర్ , St. Joseph's లో సోషల్ సర్ ! "మీరెవరండీ?" అంది. అది కాకినాడ అలవాటు. ఎవరైనా ఫోన్ చేస్తే వెంటనే డాడీని పిల్చెయ్యకూడదు. 'మీరెవరండీ?' అని ముందు అడిగింతరవాతే 'సంగం! డాడీకి ఫోనూ...!' అని కేకేసేది. ఫోన్లో వెనక ఏదో బజార్లో లాగ గొడవగా ఉంది. నల్ల వాళ్ళ మాటలు, బస్సులు కదుల్తున్న చప్పుడు.

"నా పేరు జోజమ్మ! రెవరెండ్ పాస్టర్ జోజప్ప. ఇక్కడ ...నేను, మా ఆవిడ, మా అబ్బాయి.... మేము ఇక్కడ అమెరికా టూర్ కొచ్చున్నాము. చికాగో నుండొస్తనాఁవమ్మ! ఇక్కడ గ్రేహౌండ్ బష్టేండ్ వద్దనుండి ఫోన్ చేస్తనాను. చిన్నాన్న గారు చెప్పలేదా? శశి భూషణ్రావు గారు...?"

అప్పుడు గుర్తొచ్చింది. ఎప్పుడో నెల్లాళ్ళ క్రితం డాడీ నుండి ఒక ఈమెయిల్. 'బాబాయ్ వాళ్ళ ఊర్నుండి ఎవరో క్రిష్టియన్స్ వొస్తే రావచ్చు. నీ నెంబరిచ్చేనన్నాడు!' అని. 'భూషణం బాబాయికి బుద్ధిలేదు! ఎవరికి పడితే వాళ్ళకి నెంబరిచ్చియ్యటఁవేనా? ఇక్కడ పిల్లల్తోటి నీను ఛస్తంటె! మీరైనా చెప్పలేదేంటి డేడీ?' అని ఫోన్లో కూడా 'గట్టిగా' ఇచ్చింది. ఏమనాలో, ఎలా మాట్లాడాలో ప్లాన్ చేసుకుంటూ కాసేపు ఏమీ అనకుండా ఉండిపోతే ఆయన కంగారుగా ఫోన్లోనే "ఇందల డబ్బులైపోయినట్టున్నాయి. ఆ క్వోర్టర్సుంటియ్యి అన్నమ్మా! క్వోర్టర్సుంటియ్యి.... తొందరగివ్వు అన్నమేరీ!" అని వాళ్ళావిడ మీద విసుక్కుంటున్నాడు. చప్పున సర్దుకుని

"ఆఁ ఆఁ చెప్పేరంకుల్! మీరిప్పుడెక్కడున్నారు? గ్రే హౌండంటే ఎక్కడా?" అంది.

ఆయన ఆత్రంగా "వొకాలా అమ్మ! గ్రేహౌండ్ బస్ లైన్సు! నార్త్ యీష్ట్ యెవెన్యు....! వొకాల... ఫ్లోరిడా!" అని ఒక్కొక్క మాటా స్పష్టంగా మళ్ళీ మళ్ళీ చదివేడు.

"సరే అంకుల్ ! నేనిప్పుడే...ఊఁ...ఒక పదినిమిషాల్లో బయల్దేరొస్తాను.....మీరు అక్కడే ఉంటారా? "

"ఇక్కడే ఉంటాఁవమ్మా...! మీరెందుకు రావటం? మీ ఇంటికి దగ్గర్లో గ్రేహౌండ్ ఎక్కడో చెప్పియ్యండి, అదెక్కిపోయి మేఁవే వొచెస్తాం. ఇదీ........మాకు అమెరికా కెనడా లోన బస్సు మీద ఎక్కడ్నుండెక్కడకైన చర్చి పాసు మాకు ఫ్రీయమ్మ. మీరు గ్రేహౌండెక్కడో చెప్తె వొచ్చెస్తాను!"

"ఒకాలా అంటే మాకు దగ్గరే అంకుల్! మీరక్కడే ఉంటే నేనొచ్చి పిక్ చేసుకుంటా...!"

"ఓహలాగా?! అయితెక్కడికెల్లము.....పొద్దున్న టెన్ థర్టి..." అని ఆయన ఇంకా ఏదో అంటుంటే ఫోన్లో డబ్బులైపొయేయి, కట్టయిపోయింది. పొద్దున్న టెన్ థర్టీ ఏంటి? అప్పట్నుండి కాసుక్కూచున్నారా? తన కోసం! రోహణ్ చూడకుండా రహస్యంగా లూబాని ఫ్రిజ్ పక్కకి పిల్చి తనొచ్చేవరకు వాణ్ణి చూసుకోమని చెప్పింది. హడావిడిగా అఖిలని బాత్రూంలోకి లాక్కెళ్ళి దాని బట్టలు మార్చి తనొక చేతికందిన పంజాబీ డ్రస్ తొడుక్కుంది. పెదాలు రెండూ తడిచేసుకుంటూనే పేంట్రీలో దూరి ఇన్ని జీడిపప్పులు ఒక పేపర్ కప్ లో పోసుకుని ఆబగా నముల్తూ మళ్ళీ లూబాని పిల్చి "Can you make extra rice? Two cups..! No no, make it three!" అని పురమాయించి, అఖిల 'Where are we going mommie?' అని దీర్ఘాలు తీస్తుంటే "అబ్బ నువ్వొకర్తివి రావే నసపెట్టి చంపక!" అని కసురుకుంది. రోహణ్ గాడు చికెన్ నగ్గెట్స్ నఁవుల్తూ "Go away మారీచా..! Go away సుబాహు..!..." అని రామాయణంలో లీనమైపోయేడు. అఖిలకి ముక్కు మీద వేలు పెట్టుకొని మాట్లాడొద్దని సంజ్నలు చేసుకుంటూ గరాజ్ లోంచి పైకొచ్చి 'అమ్మయ్య!' అనుకుంది. అఖిల సీట్ బెల్ట్ తనంతట తనే పెట్టుకుని ఉత్సాహంగా లోగొంతుకతో రహస్యం అడుగుతున్నట్టు "Is తాతా coming by bus mommie? Is తాతా coming tonight?" అంది. "Yes! తాతా is coming....now sit back! Here eat this!" అని ఒక చిప్స్ పేకెట్ దానిమీదికి గిరాటేస్తే అది "I hate these chips mom! I want Cheetos!" అని మళ్ళీ సామరస్యంగా "That's OK!" అంది అన్నీ రహస్యంగానే.

వేన్ రివర్స్ చేసుకుంటూ సెల్ ఫోన్ ఇప్పి మాధవీకి కాల్ చేసింది.

"ఊఁ చెప్పవే?!"

"ఏయ్ ఇందాక నువ్వుగాని కాల్ చేసేవా?"

"లేదు పిల్లా! ఏయ్...? 'నువ్వు వస్తావనీ' తెచ్చేడు మా ఆయన కావాలా? నువ్వు వస్తావని, దొంగా దొంగదీ, మున్నబ్బాయ్ ఎంబీబీయెస్ ..."

"అబ్బ ఉండవే? ఇందాక నువ్వు కాదా ఫోనూ? మా ఇంటికెవరో వొస్తనారు పిల్లా..!"

"ఎవరు పిల్లా? చుట్టాలా...మీ కనెక్టికట్ బాబాయాల్లా...?" అని అది ఇష్టంగా చెవులు రిక్కించుకుంటోంది. లేటైపోయిన తమ మధ్యాన్నం సెల్ ఫోన్ కబుర్లకోసం. ఎదురుగా రెడ్ కోసం ఆగుతున్న కార్ ని గుద్దినంత పనై కీచుమని వేన్ ఆపి "ఎవరో ఫాదర్ జోజీ అంట! తరవాత చేస్తాన్లేవే!" అని కసురుకుని ఫోన్ పెట్టీసింది. తను ఇదివరకెప్పుడూ గ్రేహౌండ్ బస్ ఎక్కలేదు, బస్ స్టేషన్ కెళ్ళలేదు. సిక్స్త్ స్ట్రీట్ దాటి వెళ్తుంటే ఆ పేటలన్నీ గుడ్డి దీపాలు తుప్పు మట్టి రంగులు పహారా తిరిగే పోలీసు కార్లతో అదొక లాగ భయం వేస్తూ ఉంటాయి. రఘు వాటిని 'నైబర్ హుడ్స్ ' అంటాడు. 'అటు సిక్స్త్ స్ట్రీట్ నైబర్ హుడ్స్ సైడు ఎళ్ళమాక!' అని డ్రైవింగ్ నేర్పిన కొత్తల్లోని మాటలు గుర్తొచ్చేయి. మసక వెల్తురు, గోడల మీద రాతలు, బిగ్గరగా నవ్వుకుంటూ నడుస్తున్న నల్ల మనుషుల్ని దాటుకుంటూ బెరుకు బెరుగ్గానే లెఫ్ట్ తీసుకోగానే గ్రేహౌండ్ స్టేషన్ వచ్చేసింది. బష్టేండ్ లా హడావిడే లేదు వరసగా రంపం ముళ్ళలాగ ఫ్లాట్ ఫాంలు, రెండు మూడింట్లో పెద్ద ష్టీల్ డ్రమ్ముల్లాగ మెరుస్తూ ఒళ్ళు చీకటి చేసుకుని నిద్రపోతున్న బస్సులు. కర్ర బెంచీల మీద ఇద్దరు ముణగదీసుకుని పడుకున్నారు. ఒక నల్ల ముసలావిడ బక్క నరాల చేత్తో న్యూస్ పేపర్ విసనకర్రలా విసురుకుంటూ పళ్ళు లేని దవడలు నముల్తూ చెయి తిప్పుకుంటూ తనకి తనే ఏదో చెప్పుకుంటోంది. యూనిఫాం వేసుకుని డ్రైవర్లాగున్న ఒకతను 'ఒర్లేండో టాంపా మయ్యేమీ కోరల్ గేబిల్స్ ఎనీ వన్?' అని ఎవరూ లేరని తెలిసే మొక్కిబడికి పాడుకుంటూ తిరుగుతున్నాడు. చుట్టూ కలయజూసి అద్దాల తలుపుల వారగా చిలక పచ్చ రంగు చెంకీల చీర కట్టుకుని పెద్ద సూట్ కేస్ పక్కన నిలబడిన ఆవిడ్ని చూసి అఖిల సంబరంగా 'Hey! That's అమ్ముమా' అని మళ్ళీ అంతలోనే 'No! She's not...!' అని చల్లారిపోయింది. ఆవిడ పక్కన ఒకబ్బాయి ఏడెనిమిదేళ్ళ వాడు, బేల చూపులు చూస్తూ మోచేతుల్లో గడ్డం పెట్టుకుని పెట్టి మీద కూర్చున్నాడు. పెద్ద గోధుమ రంగు గళ్ళ గళ్ళ కోటు, బంగారు జరీల టై కట్టుకుని జోజప్ప గారు పెద్ద నవ్వు నవ్వుకుంటూ తమవైపే వచ్చేడు. ఉంగరాల గిరజాల జుత్తు. నల్లని నలుపు. దళసరి కింది పెదవి మధ్యన చిన్న చార లాగ గులాబి రంగులో బొల్లి మచ్చ. "మంజులా మీరే కదమ్మ? తిను....? పాపా? వోహో....?!" అని పలకరించేడు. బుగ్గలు కాయల్లాగ ఎడంగా చేసుకుని నవ్వు మొహం అలాగే పెట్టుకునే ఉండి.

"నమస్తే అంకుల్ ....ఇది అఖిల!" అని ఎవరో తెలియని వాళ్ళతో ఇంకేం అనాలో తెలియక ఆయన్ని తప్పించుకుని ఆవిడకేసి చూసింది. ఆవిడ వెడల్పుగా నవ్వుకుంటూ లేచి నిలబడిపోయి పక్కన అబ్బాయిని కూడా మోచేత్తో పొడిచి లేపింది. ఆయన చొరవగా వచ్చి ఒక చేత్తో సూట్ కేస్ పట్టుకుని "దిస్సీజ్ మై వొయిఫ్ .... అన్నమేరి! అవర సన్ మేక్ పీస్!" అన్నాడు. అలాగే మర్యాదగా ముభావంగా నవ్వి "నమస్తే ఆంటీ!" అని, అంతలోకే తను తప్పు విందేమోనని సందేహంగా "బాబు పేరేంటంకుల్ ?" అంది. ఆయన పెద్ద పెట్టె, చిన్న పెట్టె రెండు చేతుల్తో ఎత్తి పట్టుకున్న కష్టం నిగ్రహించుకుంటూ "మేక్ పీస్ " అనే అన్నాడు మళ్ళీ.

"Make Peace? ఓహో!" అని సంబాళించుకుని వేన్ కేసి నడవబోయింది గాని, తన గొంతులోని ఆశ్చర్యాన్ని, అపనమ్మకాన్ని గ్రహించి అన్నమ్మ గారు సర్దిచెప్పే ధోరణి లోన " మేక్ పీస్ కారుణ్య కుమార్.... పాస్టర్ గారికి ఆ నేమ్ చాలిష్టఁవమ్మ పట్టు పట్టి పెట్టించుకున్నారు! పీస్ అంటే వాళ్ళకిష్టం కదా!" అంది. ముక్కు పుడక, పలకసర్లు, బొట్టు లేకుండా కాటుక కళ్ళు, అలాగే వెడల్పుగా చెదరకుండా నవ్వు. కళ్ళల్లోన అలసట, అభ్యర్ధన. తమాయించుకుని ఆవిడ్ని వేన్లోకి ఆహ్వానిస్తున్నట్టు "రండాంటి! రండంకుల్ వెళ్దాం..! ఏంటి బాబూ you look so tired?! అని వేన్ తలుపులు తెరిచింది. ఆ మాట వాళ్ళు ముగ్గురికీ అర్ధం కాలేదు. ఆయన పళ్ళ బిగివున పెట్టెలు ఎత్తి వేన్లో వెనక జాగ్రత్తగా పెట్టి ముందుకొచ్చి ఆ అబ్బాయితో అదిలిస్తున్నట్టు "What Make Peace? అక్కా is asking you something! What is your name? What...come on.. Come on! No shy business in America...! ఊఁ..?!"అని పెద్దగా నవ్వేడు. ఆ బాబు అందరిలో నిలబెట్టి అడిగిన ప్రశ్నకి తెలియని జవాబు అప్పచెప్తున్నట్టు "Good afternoon! My name is Balaga Make Peace!" అన్నాడు, లోతుగా, బెదురుగా, పెద్ద కళ్ళ లోంచి తను చూడనప్పుడు మాత్రం తననీ అఖిలనీ సిగ్గుగా చూస్తూ. తెల్ల టెర్లిన్ చొక్కా కాటన్ నిక్కరు గుండ్రంగా బంగాళ్దుంపకి పాపిడి దువ్వినట్టు చాలా వరకు జోజి గార్నే పోలిన మొహం, పెదాల కొసలు రెండూ తెల్లగా పాలిపోయి ఉన్నాడు. పేషెంట్ ని పట్టి చూస్తున్నట్టు 'వైటమిన్ డెఫిషెన్సీ!' అనుక్కుంది, అఖిలని దగ్గరగా లాక్కుని దాని మొహాన్ని నడుముకి హత్తుకుని.

"Oh Nice! Good afternoon! I am Manju. This is Akhila! రండ్రండి..! Actually..this is good evening..!" అంది పైకి. అఖిల అప్పుడే వాడి చెయ్యి పట్టుకుని "Come! Peace..! You want to play with me?! Yes?!" అని దాని దొంగ బార్నీ మేనర్స్ గొంతుక పెట్టుకుని వాడికి సీట్ బెల్ట్ ఎలా పెట్టుకోవాలో నేర్పించెస్తోంది. దాని ఉత్సాహం చూసి ఉన్నట్టుండి తన తలనొప్పి తగ్గిపోయిన సంగతి స్పృహలోకొచ్చింది. ఎప్పుడూ టీవీ చూసుకుంటూనో, కంప్యూటర్ ఆడుకుంటూనో తన ఈడు పిల్లలతో ఆటకి మొహం వాచిపోయి ఉంటుంది. ఆ అబ్బాయిని ఇష్టంగా అపురూపంగా చూస్తోంది, కత్తు కలపడానికి. మేక్ పీస్ మాత్రం మొహం చేతులూ విండో అద్దానికే అదిమి పెట్టుకుని వేన్ హైవే ఎక్కే తోవలో షాపింగ్ సెంటర్లనీ స్ట్రిప్ మాల్స్ నీ దీపాల్నీ కళ్ళార్పకుండా చూస్తున్నాడు. అఖిల వాడ్ని "Do you want to play with me? What do you want to play with me?" అని ఆసక్తిగా సతాయిస్తుంటే ఒక అర్ధం కాని మొహమాటపు 'యెస్ 'తో తలూపి మళ్ళీ ఆ రంగుల దీపాలు మెరుపుల అబ్బురంలో నిమగ్నమైపోతూ.

(ఇంకా ఉంది)