మార్పు

నోరి రాధిక

ప్రీతికి చాలా కోపం వచ్చేసింది. అయినా సరే, సాధ్యమైనంతగా కోపాన్ని అదుపులో పెట్టుకుని అనునయంగా మాట్లాడటానికి ప్రయత్నించింది. "గిరీ, నీ ప్లాన్‌ బాగానే ఉంది కాని అది తీరటానికి చేసే నిరీక్షణలో మన బంగారం లాంటి కాలం గడచిపోతుంది. We are losing time తెలుస్తోందా నీకు?" అని అడిగింది మెల్లగానే.

"ఏమీ ఫరవాలేదు. ఒకటి రెండేళ్ళలో కొంపలేవీ మునగవు. నువ్వు అనుకున్నంత ఆపదేమీ ముంచుకురాదు. నువ్వు భయపడుతున్నట్లు ఆకశం ఏమీ విరిగిపడదు." గిరి టక్కున సమాధానం చెప్పేసాడు.

ఒకటి రెండేళ్ళు మాత్రమేనని ఏమన్నా గారంటీ వుందా?" ప్రీతికి మళ్ళీ కోపం వచ్చేసింది.

"అబ్బా! ప్రీతీ! అమెరికా వెళ్ళిన తర్వాత కానీ పిల్లల సంగతి ఆలోచించటం జరగదని పెళ్ళికి ముందే చెప్పాను కదా! నువ్వు ఒప్పుకున్నావు కూడాను అప్పుడు. గుర్తుందా?" గుర్తు చేసాడు గిరి.

ఆ మాట నిజమే! courtship daysలోనే గిరి స్పష్టంగా చెప్పేసాడు ప్రీతికి తనకు అమెరికా వెళ్ళే వుద్దేశ్యం వున్నట్లు, ఆ తర్వాతే పిల్లల సంగతి ఆలోచించదలుచుకున్నట్లు. గిరి అన్నట్లుగా దానికి ప్రీతి అంగీకరించిన మాట కూడా నిజమే. కానీ అప్పుడు అమెరికాలో పరిస్థితి వేరుగా ఉండేది. వుద్యోగాలు తేలికగా దొరికేవి. పెద్ద డిగ్రీలు లేకపోయినా చిన్న చిన్న కంప్యూటర్‌ కోర్సులు చేసిన వాళ్ళు కూడా మంచి వుద్యోగాలు సంపాదించి బోలెడంత డబ్బు గడించేవారు. అందుకే అతి త్వరలో వాళ్ళకి కూడా అమెరికా వెళ్ళే సువర్ణావకాశం వచ్చేస్తుందని ఎంతో ఆశపడ్డారు. కానీ ప్రపంచంలో ఎవ్వరు ఊహించని విధంగా అక్కడి ఇకానమీ చాలా గట్టి దెబ్బ తినటం, యుద్ధం రావటం, దానివలన జాబ్‌మార్కెట్‌ మరీ ఘోరంగా అయిపోవటం జరగటంతో వాళ్ళ ప్లాన్‌కి అనుకోకుండా భంగం కలిగింది. అయినా గిరి అమెరికా అమెరికా అని జపం చేయటం మానలేదు. అవకాశాల కోసం ఆశపడటం మానలేదు. కానీ ప్రీతి మాత్రం పిల్లల కోసం తపించటం మాత్రం మానలేక పోతుంది. ఆడదైనందువలన తల్లి నవ్వాలన్న తపన, ఆతురుత సహజంగానే ఆమెకు ఎక్కువగా వున్నాయి. వెళ్తామో లేదో తెలీక ఒకవేళ వెళ్ళినా ఎప్పుడు వెళ్తామో తెలీని విషయానికి పిల్లల్ని కనటమన్న అతిముఖ్యమైన విషయానికి ముడిపెట్టటం చాలా అవివేకంగా అనిపిస్తోంది ఆమెకు. పెళ్ళికి ముందు ఒకటి అనుకుని గిరి పెట్టిన షరతుకు వప్పుకుంటే ఆ తర్వాత ఇంకోటి జరిగింది. అయితే ఒకసారి ఒప్పుకున్నామని ఇంక ఎప్పటికీ ఆ నిర్ణయానికి బందీగా వుండాల? పరిస్థితులని బట్టి అవసరమైతే నిర్ణయాలని మార్చుకోవటం తెలివైన పని కాదా? అని అలోచిస్తోంది ప్రీతి.

"గిరీ! కాలిఫోర్నియా నుండి నిన్ననే నా స్నేహితురాలు ఈమేల్‌ చేసింది. వాళ్ళ ఉద్యోగాలకి కూడా ముప్పు వచ్చేట్లుగా ఉంటే ఇక్కడి ప్రాజెక్ట్‌లలో ఏవన్నా అసైన్‌మెంట్స్‌ దొరుకుతాయేమోనని ప్రయత్నిస్తున్నారట. అసలు అక్కడ చాలా మంది నిలకడైన ఉద్యోగం కనుక దొరికితే ఇండియా వచ్చేయడానికి సిద్ధంగా ఉన్నారట. ఈ ఘోర పరిస్థితులలో మనకి ఉద్యోగాలు వచ్చి వీసాలు దొరికి ఎప్పటికి వెళ్ళగలమో తెలీదు. అందుకని నా మాట విని ..." ఆమె మాట ఇంకా పూర్తి కాలేదు. పక్కకు తిరిగి చూస్తే గిరి ఆదమరిచి నిద్రపోవడం చూసి ఇంక మాట్లాడటం ఆపేసింది ప్రీతి. అసహాయత్వం, దుఃఖం, కోపం, అశాంతి - వీటన్నిటితో నిద్ర పట్టక చాలా సేపు అటూ ఇటూ దొర్లి ఎప్పటికో నిద్రపోయింది.

మర్నాడు ఇద్దరూ ఆలస్యంగా నిద్ర లేచారు. రాత్రి జరిగిన వాదులాట ఇంకా గుర్తుంది ప్రీతికి. అందుకే మౌనంగా తన పని చేసుకుంటోంది. ఆదివారమని గిరి కూడా అన్ని పనులు తీరికగా చేసుకుంటున్నాడు. వ్యాయామం చేసి స్నానం పూజా అన్ని పూర్తి చేసుకుని అతడు వచ్చేసరికి ప్రీతి తీరికగా తీవీ చూస్తూ కనిపించింది. వంటింట్లో వంట మొదలు పెట్టిన సూచనలు మాత్రం ఏవీ కనిపించలేదు. నోరు తెరచి అతనేమో అడిగే లోపలే డోరు బెల్లు మ్రోగింది. ఆటోకి డబ్బులిచ్చి తల్లితో లోపలికి వచ్చాడు. "అక్కడ అందరు ఎలా ఉన్నారమ్మ అంటున్నాడు". "బాగానే ఉన్నారురా. ఇక్కడ మీరిద్దరు ఎలా ఉన్నారు?" అంటోంది ఆవిడ.

"బాగున్నార అత్తయ్య? బస్సు టైముకే వచ్చేసినట్లుందే" అంటూ పలకరించింది ప్రీతి.

"టైముకే వచ్చింది కాని, అబ్బ, ఒళ్ళు మాత్రం హూనం అయిపోయింది" అంది ఆవిడ.

తల్లి స్నానానికి వెళ్ళగా చూసి మెల్లిగా ప్రీతిని అడిగాడు గిరి "ప్రీతి వంట ఇంకా మొదలెట్టినట్టు లేదే" అని.

ప్రీతి చటుక్కున తలెత్తి చూసింది. వెంటనే తనను తాను సంబాళించుకుని "లేదు, ఇవాళ ఏం వండాలని లేదు. ఈ పూటకి బయట తినేద్దాం. రాత్రికి తరువాత ఆలోచిద్దాం" అంది మెల్లిగా.

గిరికి కోపం ముంచుకొచ్చింది. "నీకేమన్నా మతి పోత్‌ఉందా? ప్రయాణం చేసి అలసిపోయి మా అమ్మ ఇంటికి వస్తే ఇంట్లో వండను, బయట హోటలులో తిందాం అంటావేమిటి? ఇదేనా అత్తగారంటే నీ మర్యాద?" గట్టిగా అడిగాడు.

"ఇందులో అమర్యాద ఏం ఉంది? బద్ధకంగా ఉండి ఒక్క పూటకి కాస్తా బయట తినేద్దం అన్నాను. అదేమన్నా తప్పా? ఇంతకుముందు ఎన్నిసార్లు అలా తినలేదు?" అంటూ రెట్టించింది ప్రీతి.

"ఇదివరకటికీ, ఈ రోజుకీ చాలా తేడా ఉంది. మార్పు కోసం ఎప్పుడైనా సరదాగా తినటం వేరు. వూరినుండి అప్పుడే వచ్చిన వృద్ధురాలు, అలసిపోయి వుంటుదేమోనన్న ధ్యాస కూడా లేకుండా అత్తగారు అన్న గౌరవం కొంచెమన్నా లేకుండా ఇంట్లో వండను, బయట తినండి అనటం వేరు. ఈ తేడా కూడా తెలీనంత పొగరుగా ఉంది నీకు. అసలు మొదటే చెప్పాను నీకు. అస్తమానం ఈ హోటళ్ళ తిండి నాకు నచ్చదు, సింపుల్‌గా అయినా సరే ఇంట్లో వండిన భోజనమే నాకిష్టమని" అన్నాడు గిరి. అతని కోపం ఇంకా చల్లారలేదు.

నిజమే! పెళ్ళికి ముందే ఈ విషయం చెప్పేసాడు అతను ప్రీతికి. అయితే ముందు అలా అనా ఆ తర్వాత అతనే మారుతాడులే అనుకొంది ప్రీతి. కానీ ఆమె ఆశించినట్లు అతనేమీ మారలేదు. చాలామంది మగవాళ్ళు బయట తినడానికి సరదా పడతారు. అస్తమానం ఇంట్లో వంటేనా అని విసుక్కుంటారు. అదేమిటో గిరికి అలాంటి సరదాల్లేవు అనుకుంటూ నిరుహ్సాహ పడుతూ ఉంటుంది ప్రీతి.

వీళ్ళిద్దరూ ఇలా వాదించుకుంటూ వుండగానే గిరి తల్లి మెల్లిగా అక్కడికి వచ్చి "ప్రీతి! నువ్వు ఇంకా వంట మొదలుపెట్టినట్టు లేదు. వంకాయ కూర తరిగి వేసి కుక్కర్‌లో అన్నం పెట్టాను" అంది.

గిరి కోపంగా అక్కడినుండి వెళ్ళిపోయాడు. ప్రీతి ఏమీ మాట్లాడలేదు. ఆ పెద్దావిడ వీళ్ళిద్దరి ఘర్షణని గమనించిందో లేదో బయటకి మాత్రం ఏమీ అనలేదు.

ఒక వారం తర్వాత ఒకరోజు గిరి అన్నాడు ప్రీతితో "వచ్చే శనివారం మంచి రోజని మా అమ్మ చెప్పింది. మా చెల్లెల్ని ఆ రోజు పురిటికి తీసుకురావాలిట. పసుపు, కుంకుం అవీ ఇవ్వటానికి నువ్వు కూడా రావాలి" అన్నాడు.

"అవును. అత్తయ్య చెప్పారు. వెళడాం ఇద్దరం" అంది ప్రీతి. పైకి అలా అంది కాని ఈ బాధ్యతలన్నీ నిర్వర్తించాలంటే విసుగ్గా ఉంది ఆమెకి. ఆమె పెళ్ళి అయిన తరువాత తెలిసిన వారి చేత రికమండ్‌ చేయించి మరిదికి ఉద్యోగం వేయించారు. ఆడపడుచుకి మంచి సంబంధం వెతికి ఘనంగా పెళ్ళి చేసారు బోలెడంత కట్నంతో. ఇప్పుడు మళ్ళీ ఆ అమ్మాయికి పురిటి బాధ్యత. అది అయిన తరువాత మరిది పెళ్ళి కాబోలు. ఇలా ఈ బాధ్యతలు ఒకటి తరువాత ఒకటి ఇంకా ఎప్పటికీ తరగవేమో అసలు. పెళ్ళికి ముందే గిరి ఈ బాధ్యలన్నిటి గురించి దాపరికం ఏమి లేకుండా అన్ని వివరంగా చెప్పాడు. అప్పుడన్నింటికి సరే అని ఒప్పుకున్నా ఇప్పుడు విసుగ్గా ఉంది ఆమెకి. వాళ్ళ ఫ్యామిలీలో అందరూ చాలా క్లోస్‌ గా అందులో తండ్రి లేకపోవటం వలన పెద్ద కొడుకుగా తనకి బాధ్యతలెక్కువని ఏదీ దాచకుండా చెప్పాడు గిరి. ఇప్పుడవన్నీ దయ్యాల లాగా కనిపిస్తున్నాయి ప్రితికి. అందులోనూ తను గాఢంగా కోరుకుంటున్నట్లు తనకి ఒక బిడ్డ అంటూ ఉండివుంటే అప్పుడు పరిస్థితి వేరుగా వుండేది. బరువునీ బాధ్యతలనీ మోసే శక్తి వచ్చివుండేది ఆమెలో. కానీ అద్దీ జరగకపోవటంతో ఆమె విసుగు అప్పుడు పదిరెట్లు ఎక్కువైనట్లుగా వుంది. సాధారణంగా మగవాళ్ళు పెళ్ళయిన తర్వాత మారుతారు. మరీ పెళ్ళాం అంటే బెల్లం, తల్లిదండ్రులు అంటే అల్లం అన్నట్లు కాకపోయినా తల్లిదండ్రులు తోబుట్టువుల కంటే పెళ్ళాం, పిల్లలకి ఎక్కువ చేరువ అవుతారు అని అంటారు. మరి గిరిలో అలాంటి ఏ మార్పు రాలేదే అని ఆమె ఆశ్చర్యపోతూ వుంటుంది.

అనుకున్నట్టుగానే గిరి చెల్లలు పురిటికి రావటం, బిడ్డ పుట్టిన మూడు నెలల తర్వాత ఘనంగా చీర సారెతో అత్తవారింటికి వెళ్ళటం జరిగిపోయాయి. ప్రీతి గిరిల గిల్లికజ్జాలు మాత్రం ఏమీ తగ్గలేదు. ఒకసారి అతని ఇష్టప్రకారం, ఇంకోసారి ఆమె ఇష్టప్రకారం పనులు జరిగిపోతూ వున్నా ఇద్దరి మధ్యా ఘర్షణ మాత్రం తప్పటం లేదు. ఈ చిన్న చిన్న కీచులాటలకి ఇద్దరూ అలసిపోతున్నారు. ఎవరి అభిప్రాయం ఎవ్వరు మార్చుకోరు. కనీసం మన ఆలోచన తప్పేమో, అవతలివారి వాదన సమంజసమేనేమో అన్న ఆలోచన కూడా వాళ్ళకి రావటం లేదు. నాలుగయిదు సార్లు గిరికి అమెరికా వెళ్ళే అవకాశాలు వచ్చినా, పూర్తిగా తృప్తికరంగా లేవని అతను వాటిని వదులుకోవలసి వచ్చింది. గిరి, ప్రీతి ఎవరికి వారే వారి వారి కోరికలు తీరటం లేదని అసంతృప్తిగా, నిరుత్సాహంగా వున్నారు. ఆ ఫ్రస్ట్రేషన్‌, డెస్పరేషన్‌, అంతా ఒకరి మీద ఒకరు చూపించుకోవటం, దాంతో మళ్ళీ దెబ్బలాటలు, అశాంతి, అసంతృప్తి పెరిగిపోవటం - ఇలా దినదిన గండం నూరేళ్ళాయుషు లాగా గడ్‌అచిపోతున్నాయి వారిద్దరి రోజులు.

ఒక ఆదివారం మధ్యహ్నం ప్రీతి తన స్నేహితురాలి దగ్గరికి వెళ్ళింది. గిరి మెల్లిగా టీవీ చూస్తున్న తల్లి దగ్గరికి వచ్చాడు. "అమ్మ!" అన్నాడు మెల్లిగా. తలెత్తి చూసిన ఆవిడకి తెలిసిపోయింది గిరి ఏదో మాట్లాడటానికి ప్రత్యేకంగా తన దగ్గరికి వచ్చాడని. "ఏమిటి బాబు!" అంది ప్రేమగా.

"ప్రీతి విషయమేనమ్మా! పెళ్ళైన ఈ నాలుగేళ్ళూ బాగానే జరిగిపోయాయి. కానీ ఈ మధ్య ప్రతిదానికీ పోట్లాడుతోంది. ఏ సినిమాకి వెళ్ళాలి అన్న చిన్న విషయం దగ్గరినుండీ ఉద్యోగం మారాలా వద్దా అనే పెద్ద విషయం దాకా నేనేం అంటే దానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంది. ప్రతిదానికి కయ్యమే! ప్రతిదానికీ వాదనే! ఏదీ స్మూత్‌ గా జరగదు. విసుగ్గా ఉంది నాకు" మెల్లిగా అన్నా అతని గొంతులో విసుగు స్పష్టంగా ధ్వనించింది.

గిరి తల్లి టీవీ తీసేసింది. గిరి చెప్పేదంతా శ్రద్ధగా వింది.

"గిరి! భార్యా భర్తల మధ్య అభిప్రాయ బేధాలు చాలా సహజం. ఆ మాటకొస్తే అసలు ఈ ప్రపంచంలో ఏ ఇద్దరి మనుషుల అభిప్రాయాలూ అన్నివేళలా అన్ని విషయాలలోనూ ఒకేలా ఉండవు. కానీ అలా అని ఇంక ప్రతి చిన్న విషయానికి కొట్టుకుంటూ ఉంటే ఇంక జీవితం సాగించలేము. కొన్ని సార్లు నువ్వు తగ్గాలి. కొన్ని సార్లు ప్రీతి తగ్గాలి. నేనే గెలవాలి, నా మాటే జరగాలి అని మొండిగా వుంటే సమస్యలు తప్పకుండా వస్తాయి. చిన్నవైనా పెద్దవైనా ఎక్కడ మీ ఇద్దరికీ తేడా వస్తోందో గమనించు. ఆ తరువాత నింపాదిగా మీరిద్దరూ అన్ని విషయాలు చర్చించుకోండి. ఏ రిలేషన్‌షిప్‌ లో అయినా కమ్యూనికేషన్‌ చాలా ముఖ్యం. ముఖాముఖి మాట్లాడుకుంటే ఏదో ఒక పరిష్కారం దొరక్కపోదు. నాకు తెలిసినంత వరకూ ప్రీతి తెలివైన పిల్ల. అవివేకి కాదు" అంది ఆవిడ.

"ఏం తెలివో ఎమో! నేనెప్పుడు మాట్లాడుదామని మొదలుపెడితే అది పోట్లాటలోకి మారి, అసలు విషయం అడుగున పడి వాదన పక్క దారులు తొక్కి, అనవసర మాటలు అనుకునే పరిస్థితి కలుగుతుంది కానీ సరైన మీనింగ్‌ఫుల్‌ డిస్కషన్‌ జరగటం లేదు. జీవితం ప్రశాంతంగా, రోజులు సంతోషంగా గడచిపోవాలే గాని, కాస్తా నువ్వు తగ్గితే నష్టం ఏముంటుంది బాబు! నాలుగు సార్లు నువ్వు అలా అడ్జస్ట్‌ అయితే అయిదోసారి ఆ అమ్మాయే దిగి వస్తుంది. ఇంక నీకు సరిపెట్టుకోవాల్సిన అవసరమే ఉండదు. అలా ఓడిపోయి గెలవడానికి ప్రయత్నం చెయ్యరాదూ? సంసారంలో సంతోషం ప్రశాంతత ఇద్దరికీ కావాలి కదా!" చాలా నెమాదిగా, ప్రేమగా అంది ఆవిడ.

"అప్పుడు ఇంకా నెత్తికెక్కి తాండవం చేస్తుంది. ప్రీతి సంగతి నీకు పూర్తిగా తెలీదమ్మా! మంచితనాన్ని చేతకాని తనాంగా నిదానాన్ని చవటతనంగా చూస్తుంది తను" విసుగ్గా అన్నాడు గిరి. స్వానుభవం అతని గొంతులో వినిపించింది.

"గిరీ! ప్రీతి గురించి నువ్వు ఇలా అనటం చాలా ఆశ్చర్యంగా ఉంది. ప్రీతి చాలా మంచిది, మా ఇద్దరి అభిప్రాయాలు, స్వభావాలు ఒకటే, మేం ఇద్దరం పెళ్ళి చేసుకోవటానికి నిశ్చయించుకున్నాం. ఈ పెళ్ళి వల్ల మేం ఇద్దరమే కాకుండా మనందరం కూడా సంతోషంగా ఉంటామన్న నమ్మకం మా ఇద్దరికీ ఉంది అని నాలుగేళ్ళ క్రితం అన్నది నువ్వేనా?" తల్లి సూటిగా అడిగే సరికి ఒక్క క్షణం సిగ్గుపడ్డాడు గిరి. వెంటనే సమాధనం ఏం చెప్పాలో తెలియక తికమక పడ్డాడు.

"గిరి! చాలా వరకు ప్రేమ వివాహాలు ఫెయిల్‌ అవటానికి కారణం ఏమిటో తెలుసా? ప్రేమ వివాహాల్లో ఒకరంటే ఒకరికి ఎక్స్పెక్టేషన్స్‌ చాలా ఎక్కువగా ఉండటం వలన. ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసునని ఒకరి మీద ఒకరికి చాలా ప్రేమ ఉందని ఆ ప్రేమ వలన ఏ త్యాగమైనా చేయటానికి ఎదుటివారు అనుక్షణం సిద్ధంగా ఉంటారని ఆశిస్తారు. అవన్నీ నిజం కాదన్న చేరు రుచి తెలియగానే, ఇదిగో, మీ ఇద్దరిలాగే తలక్రిందులౌతారు. ఇది పెద్దవాళ్ళు కుదిర్చిన పెళ్ళిళ్ళలో అంతగా ఉండదు, ఎందుకంటే కనీసం initial selection పెద్దవాళ్ళు చేస్తారు కాబట్టి. మీలాంటి వుడుకు రక్తం వారికి వుండని ముందు చూపుతో మనుషుల స్వభావాలను సరిగ్గా అంచనా వేయగలరు కాబట్టి. పోనీలే, ఇప్పుడవన్నీ ఎందుకు కానీ, అన్నీ మరచిపోయి నువ్వు అడ్జస్ట్‌ అవటానికి ప్రయత్నం చేయరా. ఈ ప్రపంచంలో చాలా మందికి లేని మంచి ఉద్యోగాలు, సంపాదనలు, వసతులు, సుఖాలు - ఎన్నో మీ దగ్గర ఉన్నాయి. అయినా ఇంకా ఏదో లేదు, ఏదో కావాలి అన్న తపన, అది అందలేదు, ఇది దగ్గర లేదు అన్న అసంతృప్తి - ఇవన్నీ మానేయండి. చక్కగా తృప్తిగా ఆనందంగా ఉండండీ" అంది ఆమె. ప్రపంచాన్ని చూసిన అనుభవం, వయసు తెచ్చిన వివేకం ఆమె మాటల్లో వినిపించాయి.

అమ్మ పెద్దగా చదువుకోకపోయినా ఎంత కరక్టుగా చెప్పింది అనుకున్నాడు గిరి. నిజమే! పెళ్ళికి ముందు పరిచయంలో ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసని అనుకున్నారు ఇద్దరు. అక్కడికీ తన బాధ్యతలు, నిర్ణయాలు, ఆశలు అన్నీ వివరంగా చెప్పడు ప్రీతికి. అప్పుడేమో అన్నింటికీ సరే అని ఒప్పుకుంది. మరిప్పుడు ఈ అసంతృప్తి ఎందుకు? ప్రీతికి తన పేరుకి తగ్గట్టు రోజురోజుకీ కోరికలు మారిపోతున్నాయి. ఊసరవెల్లిలాగా రకరకాల రంగులు మారుస్తూ చివరికి మెత్తం మనిషే మారిపోయింది అనుకున్నాడు గిరి బాధగా.

సరిగా అదే సమయానికి ప్రీతి తన స్నేహితురాలితో చెపుతోంది. "పెళ్ళికి ముందు ఈ విషయాలన్నీ గిరి వివరంగా చెప్పిన మాట నిజమే. వాటిల్లో కొన్ని నాకు నచ్చకపోయినా ఏవో కొన్ని నచ్చని విషయాల కోసం మొత్తం మనిషినే వదులుకోవటం ఇష్టం లేక అన్నింటికీ సరే అన్నాను. పైగా క్రమంగా తను మారుతాడని కూడా ఆశించాను. కానీ నాకేం తెలుసు, తనలో ఇంత మొండితనం దాగుందని? మనిషన్న ప్రతివారికి మార్పు సహజం అంటారు. కానీ గిరి, తన పేరుకు తగ్గట్లే ఒక రాయి, ఏ విధమైన చలనమూ, మార్పు లేని ఒక పెద్ద బండరాయి" చాలా కక్షగా అంటోంది ప్రీతి.