కేసు

విప్లవ్

కేసు జడ్జీ గారు బెంచీ ఎక్కడమే లేటన్నట్టుగా అంతా లేచినిలబడ్డారు ఒక్క సారే. గడియారం తొమ్మిదిన్నరకు ఒకే గంట కొట్టింది.

ముకుందరావుగారిగురించి ఒక పుస్తకమే రాయొచ్చు ఆ పాతకాలపు గడియారాన్ని చూస్తూ. ఆయన ఏ జిల్లాకు జడ్జీగా బదిలీ అయితే ఆ జిల్లా కోర్టుకు తనతో చంకలో పెట్టుకుని వెళ్ళేది ఆ గడియారాన్నొక్కటినే. ఆయన భార్య కూడా వెక్కిరిస్తుంది అప్పుడప్పుడూ, ఆయనకు ఆ గంటలు కొట్టేదే ఎక్కువ ఈ వంటలు చేసే దానికంటే అంటూ. జడ్జీలు పుస్తకాలు లేకున్నా బ్రతకవచ్చు కానీ సమయపాలన లేకపోతే కష్ఠమోయ్ అంటాడాయన. నిజానికి ఆయన ఆ గడియారాన్ని కోర్టులో అందరినీ బెదిరించే సాధనంగా, ఒక మొరిగే కుక్కగా ఉపయోగిస్తాడని చాలామంది (లాయర్ల) అనుమానం.

ఆ భయంతోటో లేక ఆ రోజు వాదనకొస్తున్న కేసుకున్న తీవ్రత గురించో మరి హాలు క్రిక్కిరిసి పోయింది. మామూలుగానే అటూ ఇటూ హడావిడిగా నల్లకోట్లతో తిరిగే లాయర్లు ఈ రోజు కిమ్మనకుండా ఎవరి జాగలో వాళ్ళు కూర్చుని వున్నరు. వాది లాయరు శ్రీనివాస్, ప్రతివాది లాయర్లుగా వ్యవహిరిస్తున్న పబ్లికు ప్రాసిక్యూటరు సత్తెన్న, మరో ప్రతివాది లాయరు జాఫర్ తమ ముందున్న పేపర్ల కట్టలు అదేపనిగా సరిచేసుకుంటున్నరు. వాళ్ళెంత అనుభవస్తులైనా, ప్రక్క లాయరుకు తెలియకుండా ఎంత జాగ్రత్త పడ్డా ఆ చేతుల్లో తత్తరపాటు అందరికీ తెలిసిపోతూనే ఉంది. కోర్టు అటెండరు దర్వాజ దగ్గరుండి హాల్లో చూడ్డానికొచ్చిన మిగతా లాయర్లనూ, జనాలనూ చప్పుడు చేయొద్దన్నట్టు అప్పుడప్పుడూ చేతులు ఊపుతున్నడు. ఆతనికి దగ్గర్లోనే పంకా తిరుగుతున్నా అతని మొఖంలో చెమట పేరుకుని ఉంది.

ఆ హాల్లో ఆ గంటల గోడ గడియారానికీ, వాది లింగమ్మకూ తప్ప మిగతా అందరికీ ఏదో ఒక టెన్షన్ ఉన్నట్టే చెప్పుకోవచ్చు. వాళ్ళిద్దరే జరిగేది జరక్క మానదు, జరిగిందానికి ఇవ్వాళ మనం చేయగలిగేదేం లేదు అన్నట్టు ఒకరు గోడకు, మరొకరు చెక్క కుర్చీకి జారగిల బడి కూర్చున్నరు. లింగమ్మ న్యాయవాది శ్రీనివాస్. లింగమ్మ కేసు పెట్టింది ప్రభుత్వమ్మీద. లింగమ్మ కేసులో ప్రతివాదులుగా పేర్కొన్నవాళ్ళలో ప్రభుత్వమొక్కటే అయితే ఇంత ఆరాటమెవ్వరికీ ఉండేది కాదు. ప్రభుత్వమ్మీద ఉన్నన్ని కేసులు వేరెవ్వరిమీదా ఉండవు అని అందరికీ తెలుసు. కానీ లింగమ్మ ప్రతివాదులుగా ప్రభుత్వంతోపాటుగా మరో ఇద్దరిని చేర్చింది. వాళ్ళిద్దరూ ప్రభుత్వమ్మీద, దాని విధానాల మీద బహిరంగంగా పోరు ప్రకటించిన విప్లవ రచయిత వర వర రావు, గాయకుడు గద్దర్.

ప్రభుత్వానికి ఈ విప్లవ రచయితలూ విప్లవ కారులూ ప్రతివాదులుగా మాత్రమే తెలుసు, అందుకే ఇదెన్నడూ ఊహించని విషయం. ప్రభుత్వాన్ని కూల ద్రోయడమే ధ్యేయంగా పెట్టుకున్న విప్లవకారులను తమ వైపు పార్టీగా ఊహించడం, ఎంత ఈ ఒక్క కేసువరకే అయినా సరే, నమ్మశక్యంగా లేదు ఈ ఒక్క జిల్లలోనే కాక హైకోర్టు పబ్లికు ప్రాసిక్యూటర్లకు కూడా. అందరి దృష్ఠీ ఇటువైపే అని వేరే చెప్పనక్కరలేదు. జాఫర్ సత్తెన్నలు ఇద్దరూ ఒకరితో ఒకరు వాదించుకున్న వాళ్ళే తప్ప ఎన్నడూ కలిసి కేసుకు ప్రిపేర్ అయింది లేదు.

అటు విప్లవకారులుగా పేరుపడ్డ వర వర రావు, గద్దర్ ఇద్దరికీ కూడా మింగుడు పడని విషయం సరిగ్గా అదే. ప్రభుత్వాన్ని సర్పంగా తాము చలిచీమలుగా రాసుకుని, గీసుకుని ప్రజల నోళ్ళలోకి వెళదామనే తమ గ్రాండ్ స్కీం కు లింగమ్మ గండికొట్టిందని పీ పీ సత్తెన్న జోకితే రోషంగా మొఖాలు ఎర్రగా చేసుకోవడం తప్ప మరేం చేయలేక పోయినరు. అందుకే గుర్రుగా ప్రక్క టేబులు దగ్గరే నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్న లింగమ్మను గుర్రుగా చూస్తున్నరు ఇద్దరూ, అప్పుడప్పుడూ వాళ్ళిద్దరి లాయర్ జాఫర్ మందలిస్తున్నా సరే.

లింగమ్మ కేసు పెట్టి రెండు నెలలైంది. మామూలుగా ఇంత త్వరగా విచారణకు వచ్చేది కాదు. ఆమె కేసు పెట్టిన రోజునుండీ అంటే ఆ మరుసటి రోజు తెల్లవారే కోర్టుకు వచ్చి కూర్చుంది, విచారణకు సిద్ధమై. అక్కడ అటెండరుకు చెప్పలేక నెత్తినొప్పి వచ్చింది, ఈ దునియాల ఎక్కడా కేసులు అంత త్వరగా విచారణకు రావు తల్లీ అని. ఆవిడకు ఏమర్ధం కాలేదు. లింగమ్మకు స్వతహాగా అంత తెలివైంది కాదు అని ఆవిడ ఊళ్ళో పేరున్న విషయం ఆ అటెండరుకు తెలిసే అవకాశం లేదు.

సరే మరి ఇవ్వాళంటే రాకపోవచ్చు, నిన్న కేసు రాసుకున్న ఎస్సై పిల్లగానికి జ్వరమొచ్చి ఇంటికి పోయుండొచ్చు, కనుకనే పొలీసు స్టేషనుకు రెండు అంగల్లోనే కోర్టు వున్నా ఆ పత్రాలు తేలేక పోయుండొచ్చు, రేపయినా రాకపోతుందా విచారణకు అని కోర్టు ప్రహారీకి ఆనుకుని అక్కడే పడుకుంది ఒక రాత్రంతా. మళ్ళీ తెల్లవారి అదే తంతు. అటెండరు ఆవిడను వదిలించుకోవడానికి కోర్టు బయటే ఉన్న చిన్న బడ్డీ 'కొట్టు తాడికి పో, అక్కడ ఎవర్నడిగినా చెప్తారు ఎన్ని రోజులు అవుతుందో ఒక కేసు కోర్టుకు రావడానికి ', అని.

సరిగ్గా అదే పాపంఅయింది. ఆవిడను ఇంటికి పోయి నెలకో సారి వచ్చి పొమ్మంటే సరిపోయేది. కానీ ఆవిడకు బడ్డీ కొట్టొకటి చూపించాక మరి లింగమ్మ ఊరుకుంటుందా. అక్కడ కొట్టాయన, భాషాను అడిగింది, నీకేమన్న తెలిస్తే చెప్పు కేసు ఎప్పుడు వస్తుందో అని. భాషా తన పనిలో తను ఉండి, ఈ మేళాన్ని త్వరగా వదిలించుకుంటే మంచిదనుకుని ఒక చాయ తాగి పో కానీ నాకా విషయాలు పెద్దగా తెల్వదు, ఇక్కడికి లాయర్లు వస్తుంటారు వాళ్ళనే అడుగు అన్నడు.

రోజంతా ఎవరిని అడిగినా లింగమ్మ దగ్గర ఒక చిన్న చేతి సంచీ తప్ప మరొకటి, ఆఖరికి మెళ్ళో నల్లపూసలు కూడా కనిపించక ఏ లాయరూ ఆవిడతో పెద్దగా మాట్లాడింది లేదు. సాయంత్రం కోర్టు వదిలాక ప్రొద్దంతా ఏదో పని చేసి అలిసినట్టు వచ్చిన లాయర్ల గుంపును చూసి ఆశగా అడిగింది.

"అయ్యా లాయర్ బాబులూ మొన్ననగా కేసు పెట్టిన టేషనుల ఇంకా కోరటుకు రాలేదు అది మీకేమయినా తెలుసునా", అని.

"కేసెవరిమీద పెట్టినవు" అందరిలో ఇప్పుడిప్పుడే తెలివైన వాడుగా పేరు తెచ్చుకున్న ఒకడు అడిగాడు.

లింగమ్మ చెప్పింది, గవర్మెంటు మీద బాబూ, అని ఆగి వరాల్రావు గద్దర్ బాబుల మీద కూడా అని చివరన చేర్చింది.

పక్కలో బాంబు పడ్డట్టు అనిపించి, ఇదేదో పిచ్చి మాలోకం ఉన్నట్టుంది, తమకెందుకొచ్చిన గొడవ ఇది అనుకుని, "ఇదిగో లింగమ్మా నువ్వు ఈ కోర్టుంఉందు అన్నం నీళ్ళు బంద్ చేసి కుసున్నా నీ కేసు ఈ ఏడాది రాదు విచారణకు, ఈడ సారా కంట్రాక్టర్ల కేసులు, కార్మికుల కొట్లాటల కేసులు, అన్నదమ్ముల పంచాయితీలు తొందరగా వస్తయి కాని నీ కేసు ఇవ్వాళయినా ఒకటే రేపయినా ఒకటే అయినప్పుడు వచ్చే కోర్టుకు అంత తొందర ఉండదు" అని తమకు తెలిసింది నిజాయితీగా చెప్పినరు.

"అన్నం నీళ్ళు బంద్" అన్న ఒక్క మాట అర్ధమైంది లింగమ్మకు. కోర్టు గేటు ముందు కూర్చుంది ఆ రోజునుండీ, నాలుగు రోజులెవరూ పట్టించుకోలేదు. ఒక పేపరాయన అడిగితే మాత్రం చెప్పింది విశయం. సాయంత్రం లోగా కొత్తగా పెట్టిన టీ వీ వాళ్ళొచ్చినరు. ఆవిడ ఏం మాట్లాడలేదు కనుక ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడినరు. తెల్లవారి పేపర్లలో, టీ వీల్లో వచ్చిన న్యూసెన్స్ ఎక్కువై మొట్టమొదట కేసు రాసుకున్న ఎస్సై ఆవిడను తొలగించడానికి వచ్చి అక్కడున్న విలేఖరులను చూసి బెదిరిపోయి ఇంటి దారి పట్టినడు. జడ్జీ ముకుందరావు నోటీసుకు మొదటి రోజే వచ్చింది ఆ విషయం. తన సన్నిహితుడు సీనియర్ పీ పీ వెంకట రెడ్డితో ఒక సారి మాట్లాడాడు, అనవసరంగా తన కోర్టు గురించి పేపర్లకు ఎక్కడం, రాజధానిలో అదో విషయం కావడం ఆయనకు ఇష్టం ఉండదు.

వెంకట రెడ్డి కేసు విషయం తీసి అన్నీ ముకుంద రావుకు చేర వేసాడు. ఎటూ తేలని కేసులు బాగా నానాక గానీ తీసుకోకూడదు అని ఒక నియమంగా పెట్టుకున్న ముకుంద రావుకు ఇది అటువంటిదే అనిపించింది. కానీ పేపరోళ్ళు ప్రతి రోజూ కవరేజ్ ఇచ్చినరు లింగమ్మకు. దానికి రాష్ట్రంలో ఎక్కడా పెద్ద వార్తలు రాకపోవడం కూడా ఒక కారణం. మరో వారం తిరిగే సరికి రాష్ట్రమంతా అన్ని ప్రధాన వార్తల్లో లింగమ్మ పేరు వచ్చేసింది. కేసు పెట్టడానికీ తీర్పుకూ టైం వద్దని అడుగుతున్న ముసల్ది లింగమ్మ అని ఒకాయన రాస్తే, తాను చనిపోయే లోపైనా తీర్పు రావాలని పోరాటం చేస్తున్న మరో లక్ష్మీ బాయి అని మరో పేపరు రాసింది.

హైదరాబాదులో మిత్రుడు, హైకోర్టు జడ్జీ ఒకాయన పిల్లవాడి పెళ్ళికి వెళితే ఆయన నోటి మీదుగా విన్న విషయం, ఒక వేళ తన కోర్టు మరీ అంత బిజీగా ఉంటే హైకోర్టుకు పంప వచ్చుగా ఈ లింగమ్మ కేసు అని. ఇక అది విన్నాక ఇక ఇదేదో తీసుకోక తప్పట్లేదనిపించింది ముకుంద రావుకు. తెల్లవారి రావటమే లింగమ్మను తన కోర్టులోకి తీసుకురమ్మన్నడు అటెండరుకు చెప్పి. అటెండరు ఆవిడకు నచ్చ చెప్పి, పట్టుకొస్తే వారం రోజులుగా ఏం తినలేదని గుర్తొచ్చి ముందు నాలుగు ఇడ్లీలు తిని రా నీ విషయం మాట్లాడుదామని చెప్పాడు ఆయన.

లింగమ్మ "నా కేసు బాబూ, నీ కాల్మొక్కుత" అన్నది.

"నేను నీ కేసుగురించే మాట్లాడుతున్న ముందు ఏదన్న తిని రా, తర్వాత మాట్లాడుదాం" అన్నడు. అటెండరు పక్కనుంచి, సారు మాట అంటె మాట అంతే, ఆ గడియారం గంట కొట్టే లోపల వస్తె నీ కేసు తీర్పుకొస్తది, పొయ్యి రా తొందరగ అన్నడు. బయట భాష కొట్టు దగ్గర రెండిడ్లీలు తిని నీళ్ళు తాగి పరిగెత్తుకు వచ్చింది ఆవిడ. పేపరోళ్ళు అంతా జమ అయినరు కోర్టుల ముకుంద రావేం చేస్తడో చూద్దామని.

"నీ కేసుకు ఒక లాయరును పెడుతున్న ఇదిగో ఈ శ్రీనివాస్ నీకు లాయర్", అని అప్పుడే కొత్తగా కేసులు తీసుకుంటున్న బక్క పలుచటి మనిషిని చూపెట్టినడు. లింగమ్మ టిఫిన్ తిని వచ్చే లోపు చెప్పిన విషయమే కాబట్టి, అదీ కాక ముకుంద రావంటే ఉన్న భయం తోటి శ్రీనివాసు తన పనికి గవర్నమెంటే భరోసా కదా అన్నట్టు తీసుకున్నడు కేసును. వేరే మార్గం కూడా లేదు మరి.

'రాజు తల్చుకుంటే, ' అన్నట్టు కేసు పుటప్ కావడం, స్క్రూటినీకి నిలవడం, ప్రతివాదులైన వర వర రావూ, గద్దర్ ఇద్దరినీ కోర్టులో హాజర్ కమ్మని చెప్పడం అన్నీ చక చకా జరిగిపోయినయ్. సత్తెన్న, జాఫర్ ఇద్దరూ కలిసి ముకుంద రావు సూచన మేరకు కలిసి పని చేయడానికి ఒప్పుకున్నరు. పత్రికల వారికి పెద్ద పెద్ద కుంభకోణాలయితే మామూలుగా రెండు రోజుల్లో మర్చి పోయే వాళ్ళేమో కాని ఈ కేసునెందుకో మరి కొన్ని వారాలు తిరిగినా ఇంకా కవరేజీ ఇస్తూనే ఉన్నరు. ఒకరకంగా వాళ్ళు కూడా మరి ఆవిడ పక్షాన చేరరేమో.

మూణ్ణెల్లు తిరిగినయి, లింగమ్మ ఆ కోర్టుకు ప్రతి రోజూ వచ్చే లాయర్లకూ, విలేఖరులకే కాదు అప్పుడప్పుడూ వాయిదాలకు వచ్చే వాదులకూ నేరస్తులకూ పోలీసులకూ కూడా బాగా ముఖ పరిచయమైంది. రాత్రిళ్ళు కోర్టు ఆవరణలోనే పడుకున్నా మధ్యాహ్నాలు అటెండర్లు తెచ్చుకున్న అన్నాలే అంతో ఇంతో పంచుకుని తిన్నా అక్కడి గూర్ఖాలు ఆవిడంటే ఉన్న అదొక రకమైన సానుభూతితో పట్టించుకోవట్లేదు. స్వీపర్లు, ఆయాలు ఆవిడ కూడా కోర్టులో ఒక భాగమే అనుకునే పరిస్థితిలోకొచ్చారు. లింగమ్మకు కోర్టు ఎట్లా పని చేస్తుందో కొద్దిగా అర్ధమైంది కూడా.

తన లాయరు శ్రీనివాసు ప్రక్కనే కూర్చుని కూడా ఆయనెవరో కూడా తెలియదన్నట్టు తనకు ఆ హాల్లో మొత్తంగా కావలసిన వాళ్ళు ఆ గోడ గడియారమొక్కటే అన్నట్టు గంట కొట్టినాక ఇంకా వస్తున్న ఆ ప్రకంపనలను మౌనంగా భరిస్తున్న ఆ గడియారాన్ని గురించే ఆలోచిస్తున్నట్టు, ఆవిడ చూపులు తిప్పలేదు.

గంట కొడుతూనే జడ్జీ ముకుందరావు గారు కోటుతో అప్పుడే ప్రత్యక్షమైనట్టు వేగంగా తన కుర్చీలో వచ్చి చేరారు. మిగతా వాళ్ళంతా లేచినిలుచుంటే లింగమ్మ ఇంకా కూర్చునే ఉంది. రెక్కను తట్టి శ్రీనివాస్ దాదాపుగా ఆవిడను తనే లేపాడు. అర్ధమైనట్టుగా లేచి నిలబడింది. జడ్జీ గారు ఆవిడవైపు చూస్తూ కూర్చోమన్నట్టు సైగ చేసాడు. అంతా కూర్చున్నరు. జవానును కేసు గురించి చెప్పమన్నడు జడ్జీ. కేసు విషయం చెబుతూ ఉంటే రిపోర్టరు నోట్స్ తీసుకుంటున్న చప్పుడు తప్పితే అక్కడ మరొకటి మిగల్లేదు.

జవాను తన రాత ప్రతిలోంచి కేసు సంక్లిప్తంగా చదివిన ప్రకారం, లింగమ్మ తన కొడుకు చచ్చి పోయినందుకు బాధ్యులు ప్రభుత్వం, ఈ రచయితలు అని కేసు పెట్టింది. ఆ రెండు పార్టీలు, తన కొడుకుకు తీరని అన్యాయం చేసాయనీ, ఈ రచయితల వ్యవస్థనీ గవర్నమెంటునూ రెంటినీ కఠినంగా కోర్టు శిక్షించాలని కేసు. వాదిగా లింగమ్మ పేరు చెబుతూ కొద్దిగా నవ్వాడు జవాను. ప్రతివాదులుగా గవర్నమెంటునూ, వర వర రావు, గద్దర్ ల పేర్లు చదివాడు.

లీడ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సత్తెన్న లేవ బోతూ ఉంటే వారిస్తూ జడ్జీ మొట్టమొదట తను చెప్పేది అందరూ వినాలని ఆపాడు. కొన్ని గ్రౌండ్ రూల్స్ చెప్పాలి నేను మొదట అంటూ జడ్జీ మొదలు పెట్టాడు.

మొదటిది: ఈ కేసు అన్ని కేసుల్లాంటిది కాదు. నేను లింగమ్మతో చెప్పిన విషయం వీలయినంత త్వరగా తీర్పునిస్తానని. విచారణ మాత్రమే చేస్తానని కాదు. విచారణ పేరుమీద నెలలకు నెలలు వాయిదాలు పెడతానని కాదు. అందుకే నేను చెప్పేది చెవులు పెట్టి సరిగ్గా వినడం ఇక్కడ లాయర్లకు చాలా అవసరం. 'ఎవరైనా వినకపోతే వాళ్ళ చెవులు మెలెయ్యడం ఖాయం' అన్నట్టు ధ్వనించింది ఆయన కంఠం.

ఇక రెండవది: ఈ కేసు తేలే వరకు ఎవరూ భోజనానికి వెళ్ళరు అనేది నా ఇప్పటి నిర్ణయం, మధ్యలో పెద్ద అవాంతరం ఏదైనా వస్తే తప్ప. అంటే ఈ రోజే, ఇప్పుడే ఈ కేసు తేలిపోతుంది. అట్లా నోర్లు వెళ్ళబెట్టనవసరం లేదు, ముందే చెప్పాను ఈ కేసు అన్నిటివలే కాదు అని.

మూడు: ఇది నాకోర్టు. ఇక్కడ లాయర్లు కానీ, వాళ్ళ క్లయింట్లు కానీ, చూస్తున్న వాళ్ళు కానీ నా అనుమతికి లోబడి ప్రవర్తించాలి. లేకపోతే జైలు ఖాయం.

నాలుగు: ముందే అనుకున్న ప్రకారం వాది ప్రతివాదులు లాయర్లు ఇక్కడే ఉన్నారు, ఇప్పటికే చెప్పిన ప్రకారం పూర్తి ప్రిపరేషన్ తో వచ్చి ఉండాలి. సాక్షులెవరూ ఉండరు ఈ కేసులో. ఎందుకంటే వాదాలు తప్ప జరిగిన విషయాలన్ని రెండు వైపుల వాళ్ళూ ఒప్పుకుంటున్నారు గనక. లింగమ్మ కొడుకు చచ్చిపోయాడనేది అందరూ ఒప్పుకున్నదే. అతడిని నక్సలైట్లే చంపారని రెండు వైపుల వాళ్ళూ ఒప్పుకుంటున్నదే. అతడిని ఇంఫార్మర్ అని నక్సలైట్లు అన్నరు, తమకు వచ్చిన సమాచారం అతడిద్వారా వచ్చిందే అని పోలీసులు అన్నరు. అందుకే ఇక్కడ ప్రతివాదులుగా పేర్కొన్న గవర్నమెంటూ, రచయితలూ ఒప్పుకుంటున్నది అతను కోవర్టుగా మారినడు అని. అందుకే నక్సలైట్లే చంపినారు అని. లింగమ్మ ఒప్ప్కునేదల్లా అతణ్ణి నక్సలైట్లే చంపినారని, కోవర్టుగా మారినాడా లేదా అన్నది పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు అని. లింగమ్మ ఈ కేసు పెట్టింది ఆవిడ కొడుకు కోవర్టా, కాదా అన్న దాని మీద కాదు. ఎట్లాగూ అతను కోవర్టే అని అటు రచయితలూ ఇటు గవర్నమెంటూ ఒప్పుకున్నరు గనకనే అతని చావుకు వీళ్ళీద్దరే పరోక్షంగా సహకరించినరు అని. ప్రత్యక్షంగా హత్య చేసిన వాళ్ళను గవర్నమెంటు పట్టుకున్ననాడు వాళ్ళ మీద కేసు సాగించవచ్చు కానీ ఇప్పటికి ఈ పరోక్షంగా సహకరించిన వాళ్ళను శిక్షించమని ఆవిడ కేసు.

మరోవైపు ఇట్లా "పరోక్షంగా సహకరించినరు " అనే విషయం ఇటు రచయితలూ, నక్సలైట్లను సమర్ధించే వాళ్ళూ ఇటు గవర్నమెంటూ ఒప్పుకోవడం లేదు. లింగమ్మ మాత్రం ఉత్త పుణ్యానికి, అంటే ఇటు నక్సలైట్లను అన్నలుగా, అటు ప్రభుత్వమున్నది తమ కోసమే అని నమ్మిన తన కొడుకును అన్యాయంగా నోముకున్నరు, అన్ని నాళ్ళూ తమలో ఒకనిగా మెలిగిన వాణ్ణి, వీళ్ళిద్దరూ కలిసి చంపినరు అని కేసు పెట్టడం జరిగింది.

ఇప్పుడు మీకు మాట్లాడడానికి అనుమతి ఇస్తాను ఒకరి తరువాత ఒకరికి. ఇంతవరకూ నేను చెప్పింది అర్ధం కాని వాళ్ళు రెండు వైపుల లాయర్లలో ఎవరైనా ఉన్నారా?

జడ్జీ గారు ఊపిరి పీల్చుకోవడానికి అన్నట్టుగా అగాడు.

సత్తెన్న ముందుగా లేచాడు. "యువరానర్ నక్సలైట్లు వాళ్ళలో వాళ్ళనే చంపుకుంటే ప్రభుత్వం బాధ్యత ఎట్లా వహిస్తుంది?" అంటూ.

"అయ్యా పీ పీ గారూ, నిన్ను కేసు వాదనకు దిగమనలేదు, నేను చెప్పిన నాలుగు మాటల్లో నీకు అర్ధంకానిది ఒక్కటే ఉన్నట్టుంది, అది చెప్పిన విషయాన్ని సరిగ్గా వినమని. మళ్ళీ మళ్ళీ చెప్పను ఈ సారినుంచీ విను సరిగ్గా. నీకు నేను చెప్పినదాంట్లో ఏదైనా అర్ధం కానిది ఉంటే చెప్పు, ఇదే చివరి అవకాశం మీ లాయర్లకు." కొంత కటువుగా ధ్వనించాడు జడ్జీ.

ఎవరూ తలెత్తలేదు. శ్రీనివాస్ వైపు చూస్తూ జడ్జీ, "ఏమయ్యా నీ సంగతేమిటి, నేను మూణ్ణెల్ల క్రితం నీ క్లయింటుకు ఇచ్చిన మాట ప్రకారం కేసు ఈ రోజు తేలుస్తాను, నువ్వు లా పాయింట్లు తక్కువగా, కొంచెం బుర్ర ఎక్కువగా పెట్టి ఆలోచించగలిగితే " అన్నాడు.

"అలాగే యువరానర్", శ్రీనివాస్.

"జాఫర్ ఇప్పుడు నువ్వు చెప్పేది చెప్పొచ్చు" జడ్జీ

జాఫర్ కుర్చీలోంచి లేచి "జడ్జీ గారూ మీరు అన్ని కేసుల్లాగా దీన్ని తీసుకోవడం లేదని మొన్నే చెప్పారు కనక మీరు చెప్పినవి అర్ధమైనవి. ఈ సారి గవర్నమెంటులాయరు గారు మా వైపునే ఉండడం మంచికో చెడ్డకో తెలియడం లేదు. మా క్లయింట్లకు శ్రీయుతులు వర వర రావు, గద్దర్ ఈ పరిస్థితిలో ఉండటం ఏమాత్రం ఇష్ఠం లేదు. అయినా సరే ఇక కేసు నమోదయ్యాక తప్పదు కనక మీ మీద నమ్మకంతో గవర్నమెంటు మీద ఎంత అపనమ్మకమున్నా సరే మీ తీర్పుకు ఒప్పుకుంటాం. కేసు మొదలు పెట్టే ముందు ఒక చిన్నమనవి. నా క్లయింట్లిద్దరికీ ఈవిడ తెలియదు. చచ్చిపోయిన ఆవిడ కొడుకు అసలే తెలియదు. ఇది ఎందుకిలా వచ్చిందో లేక ఎవరి కుట్రయినా ఉందో దీంట్లో మాకు తెలియదు. మీరే ఆలోచించి గవర్నమెంటు మీద పెట్టిన కేసుకీ మాకూ ఎటువంటి సంబంధం లేదని అంతగా అవసరమనుకుంటే ఆవిడ కొడుకుని చంపిన వారిమీద మరో కేసు పెట్టమని వాది లింగమ్మకు సరైన సలహా కోర్టు వారు ఇవ్వాలన్నదే మా కోరిక" అని కూర్చున్నాడు.

"శ్రీనివాసూ దీనికేమంటవు" జడ్జీ అడిగాడు.

శ్రీనివాసు లేచి "నా కోలీగ్ జాఫర్ చెప్పిందానితో నేనూ ఏకీభవించేవాడినే, కానీ ఇక్కడ అర్ధం కానిది ఒకటుంది. కోవర్టులను చంపడం కరెక్టే అని ఈ విప్లవ రాజకీయపంధాను సమర్ధించే నాయకులు ఈ ఇద్దరూ అని ఉండకపోతే లింగమ్మ కొడుకు బ్రతికే ఉండే వాడు అన్నదే మా అభిప్రాయం. అందుకే ఈ కేసు వారిద్దరి మీద కూడా పెట్టవలసి వచ్చింది." చెప్పాడు.

"విప్లవ పంధాకు వీళ్ళే నాయకులు అని వీళ్ళిద్దరూ చెప్పారా?"

"అవును రక రకాలుగా చెప్పారు. వీళ్ళే మేధావి వర్గమని వాళ్ళ రాతలు విప్లవానికి ప్రేరకాలుగా ఉంటాయనిచెప్పారు. ఆ విప్లవ క్రమంలో ఆత్మ పరిశీలనలో అడ్డొచ్చే ఈ చిన్న చిన్న అవాంతరాలు 'కోవర్టులు ' అట. వాళ్ళను అడ్డు తొలగించడం విప్లవానికి ఉపయోగంఏ, శస్త్ర చికిత్సలో ఒక భాగమే కాదు, అవసరం కూడా అన్నారు ఈ విప్లవ నాయకులు. అంతే కాదు, వీళ్ళెక్కిన వేదికలూ, పెట్టిన మీటింగులూ చూస్తే చెప్పొచ్చు యువరానర్ వీళ్ళంతా నక్సలైట్ల సాయుధ రూపాలకు అక్షరాన్ని తొడిగే వాళ్ళే వారని. వీళ్ళెన్ని రాతలు రాసినా నా క్లయింటు కెటువంటి అభ్యంతరం ఉండదు, పైగా మంచిదే వాళ్ళకా ఓపిక ఉన్నందుకు, కానీ నా క్లయింటు లింగమ్మ కొడుకును కోవర్టు పేరుతో చంపడాన్ని సమర్ధించడం మాత్రం తగని పని. కోవర్టులను చంపడాన్ని వీళ్ళు సిద్ధాంతం ద్వారా ప్రచారం చేసుండకపోతే అతనిప్పుడు బ్రతికే ఉండే వాడు." ముగించాడు శ్రీనివాస్

"శ్రీనివాస్ చెప్పింది కరెక్టే అనిపిస్తున్నది ప్రస్తుతానికి జాఫర్ నీకేమైనా అభ్యంతరాలుంటే తరువాత చెప్పు. మన పీ పీ గారికి ఏమైనా ఉన్నాయేమో ముందు అడగనీ."

సత్తెన్న గొంతు సవరించుకుని "యువరానర్ జాఫర్ శ్రీనివాస్ ఇద్దరూ చెప్పిందానితో నేను ఏకీభవిస్తున్నాను. ఇది విప్లవ కారులమని చెప్పుకుంటున్న వాళ్ళు చెప్పినందుకే కోవర్టును వాళ్ళు చంపారంటున్నారు. మరిక్కడ ప్రభుత్వం ఎక్కడినుండొచ్చింది? ప్రభుత్వానికి అసలు వీళ్ళిద్దరూ తెలియదు. ప్రభుత్వాన్ని ప్రస్తుతం మాతో పాటుగా ప్రతివాదులుగా పేర్కొనబడ్డ వీళ్ళిద్దరూ గుర్తించరు. మరి మేం కలిసి లింగమ్మ కొడుకు చావుకు కారణమయ్యే ప్రసక్తే రాదు కదా" అన్నడు.

శ్రీనివాస్ వైపు జడ్జీ చూపు మరల్చగానే, అతను"మీరే అలోచించాలి లింగమ్మ కొడుకును కోవర్టుగా ప్రభుత్వమే ఒప్పుకున్నది.ప్రభుత్వమే కోవర్టులను తయారు చేస్తున్నది. కోవర్టుగా మారితే ఇనాములిస్తున్నరు. పొలీసుల సతాయించుడు తక్కువుంటది. ఇట్లాంటి వాటితోటి ప్రొత్సాహాన్నిస్తూ ఒకసారి కోవర్టు అని తేలగానే మాకేం సంబంధం లేదన్నట్టు ప్రవర్తించినంత మాత్రాన గవర్నమెంటుకు ఏం అంటదని మీరనుకుంటే ఆ మాటే చెప్పండి కోర్టు పరంగా" అన్నాడు.

"సరే ముగ్గురూ ముగ్గురే ఉన్నరు, మొదటి రౌండ్ ఎవరికీ ఇవ్వలేను. కానీ జాఫర్ నీకొక ప్రశ్న: నీ క్లయింట్లు సాయుధ విప్లవంలో కోవర్టులను చంపడం మంచిదే అంటారా? అట్లాంటి రాతలు రాస్తారా?"

జాఫర్: అవును యువరానర్, కానీ అది వాక్ స్వాతంత్ర్యం క్రిందికి వస్తుంది. భావ స్వేచ్చ ప్రజాస్వామ్యంలో ఉండి తీరాలి. ఈ మాట ఎవరైనా ఎప్పుడైనా చెప్పవచ్చు.

జడ్జీ: మరి భావ స్వేచ్చతో ఇక్కడ ఒకరి ప్రాణాలు పోయినయి అని చెబితే?

జాఫర్: మాటలు చంపవు సార్ చేతలు మాత్రమే ప్రాణాలు తీస్తాయి.

జడ్జీ: ఇక్కడ ఆ ప్రాణాలు తీయడాన్ని సమర్ధించారు మీ క్లయింట్లని మీరే అంటున్నారు కదా.

జాఫర్: కానీ చరిత్రలో పలికిన పలుకుకూ, మాటలకు శిక్షించేది ప్రజాస్వామ్యం కాదు అని రుజువులున్నై. ఇది ప్రజాస్వామ్యానికే ముప్పు.

జడ్జీ: మరి హత్యా వస్తువును వదిలేసి హత్య చేసినవాణ్ణి శిక్షిస్తాం కదా. అట్లాగే హత్యకు ప్లాన్ వేసిన వాళ్ళను కూడా శిక్షిస్తాం కదా.

జాఫర్: నా క్లయింట్లు ఎవరి హత్యకూ ప్లాన్ చేయలేదు. కోవర్టులు విప్లవానికి శత్రువులుకనుక, వాళ్లను వేరేయడాన్ని సమర్ధించారు అంతే.

జడ్జీ: మరి అట్లాంటి సమర్ధనే ఇక అదే నియమంగా మార్చే అవకాశం ఉంది కదా, వీళ్ళు ఆయుధాలు పట్టకపోయినా సరే, ఆ పట్టిన వాళ్ళు వీళ్ళ మాటలను నమ్మి చేతలకు ఒడిగడితే ఎవరు బాధ్యులు? నువ్వేమంటావు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు?" అంతూ సత్తెన్న వైపు చూసాడు జడ్జీ.

జాఫర్ కూర్చున్నాడు.

సత్తెన్న: జడ్జీ గారూ మీ వాదనతో కూడా నేనేకీభవిస్తాను. ఇందులో ప్రభుత్వానికి సంబంధం లేదు.

జడ్జీ: ప్రభుత్వమే కోవర్టులను ప్రొత్సహించిందని అంటున్నారు అవునా?

సత్తెన్న: అట్లా అని ఎప్పుడూ చెప్పలేదు ఏ ప్రభుత్వం కూడా. వాళ్ళే ఎవరైనా వాళ్ళకు తెలిసిన విషయాలతో వస్తే మాత్రం ఆ విషయాన్ని ప్రభుత్వానికి అవసరమైంతే తప్పకుండా తెలుసుకోవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. దొంగ సొమ్ము ఫలానా చోట ఉంది అని ఎవరైనా చెబితే తెలుసుకోకుండా ఉండటం ఎట్లా? ఇందులో ప్రభుత్వ బాధ్యత ఉంది. నిజానికి యువరానర్ ఈ లింగమ్మ కొడుకు ఒక నక్సల్ డంప్ ఆయుధాల గురించిన సమాచారం అందించాడు అంతే. దాని వల్ల కొన్ని వందల ప్రాణాలు కాపాడబడ్డయి. అతనికీ అతని కుటుంబానికీ అవసరమైన ఉపాధి ఇవ్వడానికి ప్రభుత్వం తయారుగా ఉంది. ఈ కేసులో నిజానికి ప్రభుత్వానికేం సంబంధం లేదు.

జడ్జీ: అయీతే ఇట్లా సమాచారం ఇచ్చిన వాళ్ళకు ప్రభుత్వం హెల్ప్ చేస్తుందన్నమాట.

సత్తెన్న: అవును యువరానర్. దీని వల్ల ప్రజలకు మేలు కలుగుతుంది కనుక దీంట్లో తప్పు లేదు.

జడ్జీ: ఈ సమాచారం ఇచ్చిన వాళ్ళను ప్రొటెక్ట్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉందా లేదా/

సత్తెన్న: ఎంతమందినని ప్రభుత్వం ప్రొటెక్ట్ చేయగలదు యువరానర్. నిజానికి ప్రతి వ్యక్తీ ఒక కోవర్టుగా మారినప్పుడే ప్రభుత్వానికి నిజమైన ఉపయోగం. ప్రజాస్వామ్యంలో పారదర్శకత వ్యక్తినుండే మొదలవుతుంది. అట్లా అని అందరినీ కాపాడుకుంటే తిరిగితే అది మళ్ళీ ప్రజా ప్రయోజనాలకి విరుద్ధంగా తయారయ్యే ప్రమాదం ఉంది. నిజానికి లింగమ్మ కొడుకును మేం కాపడుతాం అని ఇద్దరు పోలీసులను పెడితే నక్సలైట్లకు అతడే కోవర్టని ముందుగానే తెలిసే ప్రమాదం ఉంది. అతని ప్రాణాలు ఇంకొన్ని రోజులు దక్కాయి అంటే అతనెవరో అందరికీ తెలియకపోవడం వల్లనే.

జడ్జీ: అయితే శ్రీనివాస్ నిజానికి ప్రభుత్వం నీ క్లయింటు కొడుకు చేసిన పనిని గోప్యంగా ఉంచి రివార్డుల్లాంటివి ఇవ్వడం వల్ల ప్రజలను కాపాడినట్లయింది. అట్లాగే అతనికి ప్రత్యేకమైన ప్రొటెక్షను ఇవ్వకపోవడం వల్ల అతడి పట్లా తన బాధ్యతను నిర్వర్తించినట్లే అయింది కదా. మరి దీనికి నువ్వేమంటవు? ప్రభుత్వం మీద కేసు పెట్టడం సరైనదేనా?

శ్రీనివాస్: ఖచ్చితంగా సరైనదే యువరానర్. నిజానికి నా క్లయింటు లింగమ్మ కొడుకు ఎక్కడో అడవుల్లో ఉండే నక్స్లైట్ కాదు. ఈ జిల్లాలో ప్రతి ఇంట్లో ఒక నక్సలైట్ ఉంటాడని మన ఎం. పీ. గారే చెప్పినారు. నా క్లయింటు లింగమ్మ కొడుకు అతి మామూలు రోజువారీ కార్మికుడు. ఒంట్లో బాగాలేక పొలం పనులకు కొద్దిగా ఆలస్యంగా వెళుతూ అన్నలు దాచిపెడుతున్న విషయం చూసి తోటి వాడితో అన్నాడు. ఆతడెవరికో అదే విషయం చేరవేస్తే పోలీసులు వచ్చి ఆ ఆయుధాల డంప్ పటుకున్నారట. దాంతో నష్ఠపొయిన వాళ్ళు లింగమ్మ కొడుకును పట్టుకుని ఊరి మధ్యలో కాల్చి చంపినారు. ఎక్కడో అడవుల్లో కాదు. అతడు చేసిన పనితో లాభపడ్డవాళ్ళు వెనక్కి తిరిగి చూడలేదు. అతడికి కోవర్టు ముద్ర వేసిన వాళ్ళు విప్లవ మేధావులుగా చెలామణీ అవుతూ కోవర్టు హత్యలను వర్గ పోరాటంలో అనివార్యమైనవిగా రాస్తూ సమర్ధిస్తున్నరు. ప్రభుత్వం లాభపడికూడా, ఒక సాధారణ పౌరిడికి సరైన సెక్యూరిటీ ఇవ్వలేక పొయింది. పైగా ఇప్పుడు మన పీ పీ గారు చెప్పినట్టు రివార్డులు ఇచ్చి మిగతా వాళ్ళనుకూడా ముందుకు రమ్మని ప్రొత్సహిస్తుంది. ఇప్పుడు ఆయన చెప్పిన మాటలు విని ప్రభుత్వం చచ్చిపొయిన వాడి భార్యకు డబ్బు ఉద్యోగం ఇవ్వడం వాడిమీద జాలితో కాదు. ఇట్లా ఇస్తే రేపు మరొక పౌరుడు ముందుకు వచ్చి కోవర్టుగా మారతాడని. అతణ్ణికూడా చంపమని ఈ విప్లవ కారులు వీధుల్లో చెబుతారు. చరిత్ర పునరాఋతమవుతుంది. ఇట్లాంటి బాధ మరొక తల్లికి రావద్దని లింగమ్మ కోర్టునాశ్రయించింది.

జడ్జీ కొద్దిసేపు మాట్లాడలేదు.

గడియారం పదకొండున్నర కొట్టింది.

ఒకసారి గడియారం వైపు చూసి జడ్జీ అడిగాడు: ఇప్పుడు శ్రీనివాస్ చెప్పిన మాటల్లో 'నేరమెవరిదీ అన్న సంగతి పక్కకు పెడితే మీ ప్రతివాది లాయర్లిద్దరూ అంగీకరిస్తారా? అందులో ఉన్న ఫాక్ట్స్ వరకే.

జాఫర్: ముందు మనవి చేసుకున్నట్లుగా మాకు ఈ లింగమ్మ తెలియదు, ఆవిడ కొడుకు తెలియదు. ఆయన పట్టించిన ఆయుధాల విషయాలు తెలియదు. మా క్లయింట్లకు అతడిని చంపిన వాళ్లు తెలియదు. అతడిని చంపమన్ ఎవరికీ చెప్పలేదు. మా క్లయింట్లు వర్గ శత్రువుల గురించి రాతలు రాస్తారు. మాట్లాడతారు. అంతవరకే. దానివల్ల ప్రాణాలు పొయినయి అని ఎవరైనా చెబితే అది అబద్ధం.

జడ్జీ: జాఫర్ నీ ఆఖరి మాటకు టైం అయిపోయింది. పీ పీ సత్తెన్న గారూ మీ సంగతి?

సత్తెన్న: జాఫర్ క్లయింట్ల లాగానే, మాకూ లింగమ్మ కొడుకు ఎవరో తెలియదు, అతడిని చంపిన వాళ్ళు తెలియదు, చంపమని చెప్పలేదు. మా క్లయింట్లు ప్రజలను ప్రజాస్వామ్యంలో బ్రతకమని చెప్తారు. ఇక్కడ అందరికీ అన్నీ మాట్లాడే అవకాశం ఉంది. కొన్ని ప్రాణాలు కాపాడిన వాడిని పట్టుకుని కోవర్టువు అని అతడిని చంపినందుకు గవర్నమెంటు అన్ని విధాలా అతడి కుటుంబానికి సహాయపడుతుందని మరోమారు చెప్తున్నాను.

జడ్జీ: సరే ఇక తీర్పుకు టైమైంది. లింగమ్మకూ నాకూ కుదిరిన ఒప్పందంప్రకారం ఆవిడ కేసు విచారణ తీర్పు అన్నీ ఒక్కసారే జరగాలని కోరుకున్నది. ఈ దేశంలో ఇట్లాంటివి జరగవని నాకు తెలుసు, ఒక్క నా కోర్టులో తప్ప. ఆవిడ కేసు నాకు సరిగ్గానే కనిపిస్తున్నది. ఇద్దరూ నేరస్తులే అనిపిస్తున్నది. అదే నా తీర్పు. కాల్చి చంపిన వాళ్ళు ఖచ్చితంగా సమాజానికి అక్కర లేని వాళ్ళు. కానీ వాళ్ళిక్కడ లేరు. వాళ్ళు ఈ హేయమైన పనిని ప్రోత్సహించడాన్ని కూడా మనం సమర్ధించలేం. ప్రభుత్వం రివార్డులిచ్చి ప్రొటెక్ట్ చేయకపోవడం కూదా తప్పే. ప్రభుత్వం అందరినీ ప్రొటెక్ట్ చేయలేదు అంటూ తప్పించుకో చూడటం తప్పు. ప్రజాస్వామ్యంలో నేరస్తుడిని కూడా ప్రొటెక్ట్ చేయవలసింది ప్రభుత్వమే. ప్రతి వ్యక్తినీ అతడి స్వేచ్చనీ పరిరక్షించ వలసింది ప్రభుత్వమే. కేసు విచారణ ఎట్లా నూతనంగా సాగిందో, తీర్పు కూడా అట్లాగే ఉంటే బాగుంటుందని కోర్టు అభిప్రాయం. అందుకే నేను లింగమ్మకే ఆ నిర్ణయం వదిలేస్తాను.

లింగమ్మా, నీ బాధ నాకర్ధమైంది. ఇక్కడ ఉన్న వాళ్ళు రెండు పార్టీలు. ఒకటి గవర్నమెంటు. రెండు విప్లవ మేధావులు. తమకు తాముగా విప్లవాన్ని సిద్ధాంతీకరణ చేయడం లేదని ఒప్పుకుంటే తప్ప, వాళ్ళిద్దరూ ఏనాడైనా ఈ చర్చకు నిలబడవలసిందే. కాబట్టి వాళ్ళనే నేను నేరస్తులుగా నిలబెడతాను. ఇక గవర్నమెంటు తరఫున ఈ కోర్టులో అత్యున్నత స్థానంలో ఉన్నది నేనే. శిక్ష నాకే వేయాలి. నీకు తోచిన శిక్ష చెప్పు, అటు వాళ్ళు ఇటు నేను అనుభవించేలా చర్యలు తీసుకుంటాను.

లింగమ్మ లేచింది. తన కళ్ళు గడియారం మీదినుండి తీసేస్తూ, "అయ్యా గడియారాన్ని కూడా శాసించే మీరు నా ముందు దోషిగా నిలబడటం చూస్తుంటేనే తెలుస్తున్నది, మీ గొప్పతనం. ఈ లాయరుబాబులందరికీ ఎందుకంత భయమో ఇప్పుడే తెలుస్తున్నది. నా కొడుకును ఉత్త పుక్యానికి నోముకున్నరు. నేను అందరి తల్లుల లాగనే తొమ్మిది నెలలూ మోసిన. నా మగడు లేకపోయినా అన్ని పనులూ చేసి ఈపు మీద ఏసుకుని పెంచిన. ఆనికి మంచిదేదో చెడ్డదేదో చెప్పిన, నాకు తెలిసినంతలో. ఆనికి ఊరంత ఎతికి సక్కని సుక్కని ఆని మనసుకు నచ్చిన దానితోటి మనువు చేసిన. కోడలు నీళ్ళు పోసుకుంటె ఊరంత పండుగ చేసిన. నా మనువడు నా కొడుకు లాగనె తండ్రి లేకుండ పెరుగొద్దని నా కొడుకును కండ్లల్ల పెట్టుకున్న. ఇన్ని చేసినా కూడ ఈ బద్మాశ్ గవుర్మెంటు, దానికి తోడుపోయిన ఈ ఇప్లవ ముండా కొడుకులు, నా కొడుకును మింగినరు. ఆళ్ళ నోళ్ళు పడ. ఆళ్ళ ఇండ్లు కూల. ఆళ్ళ పెండ్లాలు ముండమొయ్య. అని నా నోటితోటి ఆళ్ళ మొఖాల మీద తిట్టి సాపిద్దామని ఈ కేసు పెట్టిన. కోరట్లమ్మటి తిరగవట్టిన. ఏం జేతును నేను." కండ్లలో ఒక్క చుక్క నీళ్ళు లేవు, ఒంటిలో ఒకింత వెరపు లేదు ఆవిడలో. తెగబడ్డ ధైర్యం తప్ప ఆవిడ మొఖంలో మరొకటి కనిపించడం లేదు. గుక్క తిప్పుకోవడానికి అన్నట్టు ఆగింది.

"పొద్దుగాల సంది నువ్వు ఈ సార్లు అంత కలిసి మాట్లాడింది నాకొక్కటి అర్ధం కాలే. నువ్వు ధర్మ ప్రభువు అని నమ్ముతున్న. నువ్వు న్యాయం చెప్తవని అనుకున్న. అటు తిరిగి ఇటు తిరిగి నువు నాకే పెట్టినవు. ఈ మొఖాలు చూస్తె తిట్ట బుద్ధయితలేదు. నీ మొఖం చూసుకుంట ఏమని తిట్టను సారు. నాకు తోచిన న్యాయం చెప్త ఇనుండ్రి, నువ్వు అడిగినవు కాబట్టి. నా కొడుకులాగ ఇంకెవలి కొడుకు కావొద్దు. నువ్వు సారు గవర్మెంటోనివి అని చెప్పినవు కనుక నువ్వు ఒక్క రాత్రి జైల్ల ఉండు. లింగమ్మ గవర్మెంటును జైల్ల పెట్టిందని ఊర్లె చెప్పుకుంటె చాలు. గవర్మెంటుకు కూడ ఇంత భయముంటది, అందరికి అది జవాబుదారీ అని.

ఈ ఇప్లవం అనేటోళ్ళను జెయిల్ల పెడితె నా కొడుకు రాడు. ఆళ్ళు ఇప్పుడు చెప్పినట్టే ఒక మనిషిని చంపితే ఇప్లవానికి పనికొస్తది అని చెప్పకుండా ఆగరు. అందుకే ఆళ్ళ మీద కేసు పెట్టిన. ఈల్లకు శిక్ష ఎయ్యాలె సారు. కోరటుకు ఈడ్చిన. అది సాలు. కాని ఇంత అల్కగ పోనిస్తె ఎట్ల? ఈ ళ్ళు కూడ జైలుకు పోవాలె. నా కొడుకు ఇగ రాడు. ఈళ్ళు మాత్రం బయటెందుకు ఉండాలె. కాని ఈళ్ళు సంపలేదట నా కొడుకును. అదే మాట పబ్లికుల చెప్పమను. ఈళ్ళు నా కొడుకులాంటోళ్ళను సంపడాన్ని, సావడాన్ని మంచి పని కాదు అని పబ్లికుల ఒక్క మాట అనుమను. గదొక్క మాట చాలు నాకు. ఆ మాట చెప్పకుండ ఈ కోర్టునుంచి నేను పోను. అన్నం నీళ్ళు ముట్టను. ఇయ్యాళ వదిలిపెడితె, రేపు నా మనవణ్ణి కూడ ఇదే తుపాకీ మింగితె మళ్ళ ఈడికే వస్తది ఈ ఇషయం. నాకేడుపు లేదు. నాకు కోపం లేదు ఈళ్ళ మీద. నన్ను ఈడ్చి అవతల పారేస్తె అట్లనే కోర్టు ముందట సావనన్న సస్త గని ఈళ్ళు ఆళ్ళ తప్పు ఆళ్ళు ఒప్పుకోకుండ ఒదిలిపెట్టను.

ఈ కోర్టుకు ఆళ్ళ తప్పు ఒప్పుకునేటట్లు చేసే అధికారం ఉందా? గదొక్క మాట చెప్పు సారు నాకు." చివరి మాట చెప్పి మళ్ళీ కూలబడ్డది.

లాయర్లూ, విలేఖరులతోపాటుగా గడియారం ముల్లులు రెండు కూడా అలసిపోయినట్టు ఆగిపోయినయి, జడ్జీ ఏం చెప్తాడో చూద్దాం అన్నట్టుగా.