జన్మదిన రాహిత్యం

జె. యు. బి .వి ప్రసాద్

నాకు పుట్టినరోజులన్నా, పెళ్ళిరోజులన్నా వళ్ళు మంట! సంవత్సరాలు లెక్క పెట్టుకోవడానికి తప్ప అవెందుకూ పనికిరావని నా గాఢ విశ్వాసం. ఈ రోజుల పేరిట జనాలు జరుపుకునే సెలబ్రేషన్సు నాకు చాలా ఇరిటేషన్‌ కలిగిస్తూ వుండేవి.

కానీ పుట్టినప్పటి నించీ చుట్టూ వున్న వాతావరణం వల్ల నేను కూడా ఈ పుట్టినరోజుల, పెళ్ళి రోజుల సంస్కృతిలోనే పెరిగాను. చిన్నప్పుడు నా పుట్టినరోజు వొచ్చినప్పుడల్లా మా అమ్మ పరమాన్నం వండేది. ఎప్పుడన్నా కొత్త బట్టలు కుట్టించేది. పెళ్ళయిన యేడాదికి పెళ్ళిరోజంటూ ఫ్రెండ్సందరినీ పిలిచి పార్టీ చెయ్యడం, అందరూ వచ్చి గిఫ్ట్‌లు ఇవ్వడం కూడా జరిగాయి. నేనూ ఎగురుకుంటూ పిలిచిన వాళ్ళందరి ఇళ్ళకీ గిఫ్ట్‌లు తీసుకుని వెళుతూ వుండే వాడిని కూడా.

ఒకసారి మా కొలీగ్‌ కుమార్‌, వాళ్ళమ్మాయి మొదటి యేడాది పుట్టినరోజుకి వాళ్ళింటికి పార్టీకి పిల్చాడు. నన్నే కాకుండా మా కంపెనీలో ఇంకా కొంతమందిని పిలిచాడు.

వాళ్ళలో ఒకరికి కొత్త అయిడియా వచ్చింది. ఆయన నా దగ్గరకి వచ్చి, "అందరూ తలో పదో, ఇరవయ్యో పెట్టి ఏదో చిన్న గిఫ్ట్‌ కొనే బదులు, అందరం డబ్బు పోగు చేస్తే, ఏదన్నా పెద్ద వస్తువు కొనివ్వచ్చు కుమార్‌ వాళ్ళమ్మాయికి. ఏమంటారూ?" అని అడిగాడు.

నాకు, ఈ అయిడియా నచ్చింది. వెంటనే ఆయనకి ఇరవై రూపాయలిచ్చేశాను. ఆయన మిగిలిన వారందరి దగ్గర నించీ కూడా ఇలాగే పోగుచేసి, ఏదో పెద్ద గిఫ్ట్‌ కొన్నాడు. పార్టీకి రాలేమన్న వాళ్ళు కూడా కొంతమంది గిఫ్ట్‌కని డబ్బులిచ్చారు. వాళ్ళకి వేరే పనులుండటం చేత రామన్నారు.

ఆ రోజు సాయంత్రం ఆఫీసు అవగానే అక్కడ నించీ బయలుదేరాను కుమార్‌ వాళ్ళింటికి మా కొలీగ్‌ మురళితో కలిసి. గేటు దగ్గ ఇంకో కొలీగ్‌ గోపాల్‌ కలిశాడు.

"మా ఆవిడ వూళ్ళో లేదు. నేను ఒక్కడినే వస్తున్నాను" అన్నాడు గోపాల్‌.
"మా ఆవిడా వూళ్ళో లేదు. మీ సంగతేమిటీ?" అని అడిగాను మురళిని.
"ఆవిడకి ఆఫీసులో ఏదో మీటింగు వుంది. రావడం కుదరదని ఫోను చేసింది" అని చెప్పాడు మురళి.
"అయితే మనం ముగ్గురం కలిసి ఆటోలో వెళ్దామా?" అన్నాను.

వాళ్ళిద్దరూ ఒప్పుకున్నారు. మురళి ఆటో పిలిచాడు. దారిలో, "మన ఆఫీసు వాళ్ళందరం కలిసి ఒక గిఫ్ట్‌ ఇస్తున్నాము కదా? మనం విడి విడిగా కూడా ఏదన్నా గిఫ్ట్‌ ఇవ్వాలా?" అని అడిగాను సందేహంగా.

"అక్కర్లేదండీ! ఒక్కొక్కరూ ఎన్ని గిఫ్ట్‌లని ఇస్తాం?" అన్నాడు మురళి.
"అవును" అంటూ తలూపాడు గోపాల్‌.

మేము కుమార్‌ వాళ్ళింటికి చేరుకున్న కాస్సేపటికి నిద్రపోతూ వున్న వాళ్ళమ్మాయిని లేపి హాల్లోకి తీసుకువచ్చారు. వెంటనే గోపాల్‌ మాయల ఫకీరులాగా తన భుజానికున్న బేగ్‌ లోంచీ ఏదో గిఫ్ట్‌ పేకెట్‌ తీసి ఆ అమ్మాయి చేతిలో పెట్టాడు, "హేపీ బర్త్‌ డే" అంటూ.

నేనూ, మురళీ ఒకరి మొహం ఒకరు చూసుకున్నాం. నాకైతే వళ్ళు మండిపోయింది. అక్కడే గోపాల్‌ని దులిపేద్దామనుకున్నాను గానీ, మరళి నన్ను వారించాడు.

ఈ లోపల మా ఆఫీసులోని ఇంకొకాయన ఒక పెద్ద గిఫ్ట్‌ బాక్సు, పుట్టినరోజు పిల్ల పక్కనే పెట్టి, "హేపీ బర్త్‌ డే టూ యూ" అంటూ ఒక పెద్ద కేక పెట్టాడు. ఆ యేడాది పిల్లా ఒక్కసారిగా దడుచుకుంది. వెం టనే యేడుపు మొదలు పెట్టింది. అసలే నిద్దట్లో లేచిన పిల్ల! తల్లీ, తండ్రీ పిల్లని సముదాయించడం మొదలుపెట్టారు. మా ఆఫీసు వాళ్ళిచ్చిన గిఫ్ట్‌ని పరికించి చూశాను. ఆ పెద్ద బాక్సు మీద "హేపీ బర్త్‌ డే" అన్న చిన్న కార్డు మాత్రం వుంది.

"మురళీ! ఆ గిఫ్ట్‌ మీద మన పేర్లు రాయలేదు. కనీసం ఇది మనందరి తరపున గిఫ్ట్‌ అని కూడా చెప్పలేదు ఆ మనిషి. మనందరం కాంట్రిబ్యూట్‌ చేసినట్టు వాళ్ళకెలా తెలుస్తుందీ?" అని అతన్ని గుస గుసగా అనుమానంగా అడిగాను.

"మీరొకరు! మీ కన్నీ అనుమానాలే! ఆ విషయాలెవరూ పట్టించుకోరు ఈ పార్టీల్లో!" అన్నాడు మురళి సముదాయిస్తూ.

"యేడిసినట్టుంది పద్ధతి! ఎవరేం ఇస్తున్నారో పట్టించుకోకపోతే, ఇవ్వడం ఎందుకూ, తీసుకోవడం ఎందుకూ?" విసుక్కున్నాను నేను.

అంతలో లోపల్నించీ ఒకాయన వొచ్చి, ఆ పుట్టినరోజు పిల్ల మెడలో ఒక పూల దండ వేశాడు. ఆ దండ పిల్లంత పొడుగూ వుంది. అది ఒకటే గుచ్చుకోడం. పిల్ల యేడుపు ఎక్కువ చేసింది.

వెంటనే ఫొటోల ప్రహసనం మొదలుపెట్టారు. యేడుస్తున్న పిల్లని సముదాయిస్తూనే, ఆ యేడుస్తున్న పిల్లతో అందరూ విరగబడి ఫొటోలు తీయించుకున్నారు. యేడుస్తున్న పిల్ల కేక్‌ మీద కొవ్వొత్తి యేం ఆర్పుతుంది!? కాస్సేపు పిల్లని బతిమాలి, ఎంతకీ పిల్ల వినకపోవడం వల్ల, తండ్రే ముందర కొచ్చి కొవ్వొత్తి ఆర్పాడు. పిల్ల ఇంకా యేడుస్తూనే వుంది గానీ, ప్రజలందరూ కేక్‌ తినడం ముగించి, భోజనాల మీద పడ్డారు.

ఆ పుట్టినరోజు పార్టీ ప్రహసనం చూసినప్పటినించీ బుద్ధుడిలాగా నాకూ జ్ఞానోదయం అయి, విరక్తి మొదలైంది. అప్పటి నించీ పుట్టిన రోజులకీ, పెళ్ళిరోజులకీ దూరంగా వుండేవాడిని.

"ఒక యేడాది పూర్తి చేసిన సందర్భంగా సెలబ్రేట్‌ చేసుకుంటే తప్పేమిటీ?" అని ప్రశ్నించేవారు అందరూ.
"ఒక యేడాది పూర్తి చేయడంలో నీ ఘనత ఏంఇటీ? ప్రకృతిలో చీమలూ, దోమలూ కూడా యేడాది పూర్తి చేస్తాయి.

మీరేదైనా గొప్ప పని చేస్తే, దాన్ని మీ అఛీవ్‌మెంటుగా సెలబ్రేట్‌ చేసుకుంటే అర్థం వుంటుంది. మీ పిల్లలకి పరీక్షల్లో తాము కోరుకున్న మార్కులు కష్టపడి సంపాదించుకుంటే, అది అఛీవ్‌మెంటుగా మీ స్నేహితులని పిలిచి పార్టీ చేసుకోండి. కనీసం అందులో కొంతన్నా అర్థం వుంది" అనేవాడిని.

"పిల్లల అఛీవ్‌మెంటు గురించి పార్టీ చేస్తే, అందరూ మేము గొప్ప పోతున్నామని మా వెనకాల చెవులు కొరుక్కుంటారు. అందుకే ఇలాంటి పార్టీలు. అందరికీ అవకాశం వస్తుంది. ఇందులో తప్పేముందీ?" మళ్ళీ అదే పాట.

"మీరూ, మీ కుత్రిమ సంస్కృతీ! మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి" అని వూరుకున్నాను.
మురళి వూరుకోలేదు. "మీరు కూడా మీ మొదటి పెళ్ళిరోజూ, మీ అమ్మాయి మొదటి పుట్టినరోజూ చేసుకున్నారు కదా!" అని ఎత్తి పొడిచాడు.
"అవును. అప్పట్లో నాకు బుద్ధి లేదు. ఇప్పుడొచ్చింది" నిజాయితీగా ఒప్పేసుకున్నాను.
"అప్పుడే మీకు బుద్ధి వున్నట్టుంది. ఇప్పుడే పోయినట్టుంది. మళ్ళీ వస్తుందేమో లెండి!" అన్నాడు మురళి నవ్వుతూ.

నేనూ నవ్వాను ఆ మాటలకి. అభిప్రాయ భేదాలున్నా మురళి మంచి మనిషి. జాలీ, కరుణా, సానుభూతీ వున్న మనిషి. ఇతరులకి సాయపడేవాడు కూడా. సరదాగా వుంటాడు. మరీ ఎక్కువ చాదస్తాలు లేవు. ముఖ్యంగా కుల పిచ్చి లేదు. అందుకే మా స్నేహం ఇంకా కొనసాగుతూనే వుంది. ఇద్దరం రెండు, మూడు నెల్ల తేడాలో అమెరికా వచ్చాం కుటుంబాల సమేతంగా.

మాతో పాటూ కుమార్‌, గోపాల్‌ వాళ్ళు కూడా వచ్చారు అమెరికాకి. ఇక్కడకి వచ్చినప్పటి నించీ ఈ పార్టీలూ, సెలబ్రేషన్లూ పెరిగిపోయాయి అందరికీ. కొన్ని పుట్టినరోజుల పార్టీల్లో బెల్లీ డాన్సులు పెట్టిస్తారు. కొన్ని పుట్టినరోజుల పార్టీల్లో మనుషుల్ని పిలిపించి మాజిక్‌ చేయిస్తారు. ఒక్కోసారి బఫూన్లు వస్తారు. వీళ్ళ పుట్టినరోజు పండగలు చూస్తే, చిన్నప్పుడు చదివిన చందమామ కథల్లో రాజుల పుట్టినరోజు పండగలు గుర్తొచ్చేవి. నలభై యేళ్ళు దాటిన వాళ్ళు కూడా పుట్టినరోజంటూ కేకులు పంచుకుంటూ తిరగడం చూస్తే సిగ్గేసేది నాకు. చిన్నపిల్లలకే కాకుండా అన్ని వయసుల వారికీ పక్షపాతం లేకుండా పుట్టినరోజులు జరిపేవారు. కొంతకాలానికి నా విముఖత తెలుసుకుని, నన్ను ఇటువంటి వాటికి పిలవడం మానేశారు. రోగీ పాలే కోరాడూ, వైద్యుడూ పాలే ఇచ్చాడూ అన్న తీరుగా సుఖంగా వుండేవాడిని.

కొన్నేళ్ళు గడిచాయి. మురళీతో స్నేహం మరింత గట్టిపడింది. ఎంతో ఇష్టంగా వుండేది స్నేహితుడంటే. ఒకసారి పిల్లలనడిగాను.

"మురళీ అంకుల్‌ నాతో ఎంతో స్నేహంగా వుంటాడు ఎప్పుడూ. అతని కోసం ఏదన్నా స్పెషల్‌గా చేద్దామనుకుంటున్నాను. మీరేమైనా సలహాలివ్వకూడదూ?"

"వచ్చేవారం అంకుల్‌ బర్త్‌డేట. వాళ్ళబ్బాయి చెప్పాడు నిన్న. ఆ రోజు ఏదన్నా గిఫ్ట్‌ ఇవ్వచ్చు అంకుల్‌కి. నువ్వెప్పుడూ బర్త్‌డే గిఫ్ట్‌లు ఇవ్వవు గాబట్టీ, అంకుల్‌ చాలా స్పెషల్‌గా ఫీలవుతారు" అన్నారు పిల్లలు. "మరి అలా బర్త్‌డే గిఫ్ట్‌లు ఇవ్వడం నాకు ఇష్టం లేదు కదా? నా పద్ధతులకీ, నా భావాలకి విరుద్ధంగా నేనెలా ప్రవర్తించగలుగుతానూ?" అభ్యంతరం చెప్పాను.

"చేసేది అంకుల్‌ కోసం చేస్తున్నప్పుడు, ఆయన కిష్టం అయినది చెయ్యాలి కదా? ఇది మరీ చెడ్డ విషయం కాదు గాబట్టి, నీకు ఇష్టం లేకపోయినా, ఈ ఒక్కసారికీ అంకుల్‌ కోసం చేస్తే, అది మీ స్నేహానికి సింబల్‌గా వుంటుంది. ఆలోచించు" అంది మా అమ్మాయి నాకన్నా రెండాకులు ఎక్కువ చదివిన తెలివితో. ఇదేదో కాస్త బాగానే వుందనిపించింది.

"సరే! ఈసారికి అలాగే చేస్తాను. అలా అని చెప్పి వచ్చే యేడాది కూడా ఇలా చేస్తాననుకోవద్దు. అలాగే ఇప్పుడేదో చేస్తున్నాను గాబట్టి, మీ పుట్టినరోజులకి కూడా ఏదో చేస్తానని ఆశించవద్దు" అని నిక్కచ్చిగా చెప్పాను పిల్లలకి.

నేను వేసిన ముందరి కాళ్ళ బంధాలకి పిల్లలిద్దరూ నవ్వారు.

మురళి పుట్టినరోజు పొద్దున్నే లేచి ఇంటిల్లిపాదిమీ మురళీ వాళ్ళింటికి వెళ్ళాము కేకూ, గిఫ్ట్‌లూ మోసుకుంటూ. మమ్మల్ని చూసి చాలా ఆశ్చర్యపోయాడు మురళి. కానీ బాగా సంతోషించాడు కూడా.

"మీకిలాంటివి ఇష్టం లేదు కదా! ఎలా చేస్తున్నారు మరీ?" అని మురళీ భార్య అడిగింది.
"ఇండియాలో పోయిన బుద్ధి మళ్ళీ ఇప్పుడు వచ్చిందేమో!" అన్నాడు మురళీ నవ్వుతూ. నేనూ నవ్వాను ఆ మాటలకి.
"అదేం కాదండీ! మురళీకి ఇష్టం కదా అని నేను కాస్త నా మనసుని మంచి చేసుకుని చేస్తున్నాను" అన్నాను.
కాస్సేపు కూర్చుని వచ్చేశాము. స్నేహితుని మనసు సంతోష పెట్టినందుకూ, వ్రతం చెడ్డా ఫలం దక్కినందుకూ సంతోషించాను.

కొన్నాళ్ళకి ఆ విషయం పూర్తిగా మర్చిపోయాను. ఒకరోజు పొద్దున్న ఆరింటికే డోర్‌ బెల్‌ మోగితే, "ఇంత పొద్దున్నే ఇంటికి వచ్చేదెవరబ్బా" అనుకుంటూ, కళ్ళు నులుముకుంటూ వెళ్ళి తలుపు తీశాను. మురళి తన కుటుంబంతో సహా వచ్చాడు చేతిలో గిఫ్ట్‌ పేకెట్లతో.

చూడగానే, "హేపీ బర్త్‌ డే" అన్నాడు మురళి.
ఆశ్చర్యపోయాను నేను. "ఇవాళ నా బర్త్‌ డే అని మీకెవరు చెప్పారూ?" అడిగాను.
అంతా లోపలకి వచ్చి కూర్చున్నారు. ఆ మాటలకి మా ఇంటిల్లిపాదీ కూడా లేచి వచ్చారు.

"నిన్న ఆఫీసులో మీ డ్రైవర్‌ లైసెన్సు చూశాను. అప్పుడు తెలిసింది ఈ రోజు మీ పుట్టినరోజని!" సంతోషంగా చెప్పాడు మురళి.

"అయ్యో! నా అఫీషియల్‌ డేటాఫ్‌ బర్త్‌ తప్పండీ. నన్ను స్కూల్లో చేర్చడం కోసం అది తప్పుగా వేశారు. అదీగాక నాకు ఇలాంటి బర్త్‌ డే సెలబ్రేషన్లు ఇష్టం లేవని మీకు తెలుసు కదా?"

"అది కాదండీ! ఆ మధ్య మీరు మా ఇంటికి నా బర్త్‌డే నాడు వచ్చి నన్ను విష్‌ చేసి, గిఫ్ట్‌లిచ్చి సంతోష పెట్టారు కదా! అందుకని మిమ్మల్ని కూడా సంతోష పెట్టడానికి వచ్చాను" అన్నాడు మురళి సంజాయిషీగా.

"ఇదా నన్ను సంతోషపెట్టడం? మీ బర్త్‌డే అని చెప్పి, మీ కిష్టమైన పని చేస్తే మీరు సంతోషపడ్డారు. ఈ రోజు నా బర్త్‌డే అని చెప్పి, మీ కిష్టమైన పని చేస్తూ, మళ్ళీ మీరే సంతోషపడుతున్నారు. ఇందులో నా సంతోషం ప్రసక్తి ఏదీ? ఇదెక్కడి న్యాయం మన స్నేహంలో?" సూటిగా అడిగాను.

"అంటే?" అర్థం గాక అడిగాడు మురళి.
"మిమ్మల్ని సంతోషపెట్టడానికి మీకిష్టమైనది నేను చేస్తే, నన్ను సంతోష పెట్టడానికి మీరు నాకిష్టమైనది చెయ్యాలి కదండీ న్యాయంగా?"
"అలాగా! ఏం చేస్తే మీకు సంతోషం కలుగుతుందీ?"

"ఇప్పుడు తెచ్చిన గిఫ్ట్‌లు మీరు తిరిగి తీసుకు వెళ్ళిపోతే నాకు సంతోషం కలుగుతుంది. నా పద్ధతి ప్రకారం అయితే ఈ రోజు నా పుట్టిన రోజు అయినా, మీరు ఏమీ పట్టించుకోకుండా, ఆ విషయం గుర్తు పెట్టుకోకుండా వుంటే నాకు సంతోషంగా వుంటుంది. నా పద్ధతికి విలువిచ్చి, నన్ను గౌరవించారని నేను ఫీలవుతాను" "పోనీలెండి! ఈ సారికి తెచ్చేశాను కదా, తీసేసుకోండి. ఇక మీదట తీసుకురాను లెండీ"

"ఈ ఒక్కసారికీ నన్ను బాధపడమంటున్నారు కదూ?"

"అంత మాటెందుకు లెండి! గిఫ్ట్‌లు తీసుకోవడంలో అంత బాధ యేముందీ?"

"ఇదన్న మాట మీరు నన్నర్థం చేసుకుంది! ఎప్పుడూ మీకు నచ్చిందే ఇతరులకి చెయ్యడం చాలా అన్యాయం. మీరు దయచేసి మీ గిఫ్ట్‌లు తీసుకుపొండి" అన్నాను నిక్కచ్చిగా.

చిన్నబుచ్చుకున్న మొహంతో మురళి తీసుకువచ్చిన గిఫ్ట్‌లు తీసుకుని కుటుంబంతో సహా వెళ్ళిపోయాడు. ఇప్పుడే అర్థమయింది నాకు నేను చేసిన తప్పు. తను చెయ్యకూడని పని ఎదటివాళ్ళ సంతోషం కోసం కూడా చెయ్యకూడదు అని. ఇప్పుడిక ఏమనుకుంటే ఏం లాభం? పుట్టిన రోజులు పాటించని నేను దానికి గిఫ్ట్‌లు ఇవ్వడం ఏమిటీ? ఆ తప్పే కదా ఇలా వచ్చి పడిందీ? "చేసుకున్నవాళ్ళకి చేసుకున్నంత" అని అంటే ఇదేనన్న మాట. నాకీ శాస్తి కావలిసిందే!

"మా స్నేహానికేదో ముప్పు వస్తుందని" దిగులు పడ్డాను ఆ రోజంతా.

కానీ మర్నాటి నించీ మురళి తన ప్రవర్తనతో ఒక మంచి స్నేహితుడని రుజువు చేసుకున్నాడు.

- * **** * * ****** --