రాం రాం శిబిరాం
శ్రీనివాస ఫణికుమార్‌డొక్కా
శనివారప్పొద్దు ఫదయ్యుంటుంది. శ్రీనివాసు పెందలకడనే లేచి, పళ్ళూ గట్రా తోమి,ఇంట్లో వున్న కుళ్ళు బట్టలన్నీ పోగేస్తూ చాకి రేవు కి తయారౌతున్నాడు. "సాయంత్రం పార్టీ వేళకి ఇల్లు ఇలానే వుందంటే, మళ్ళీ ఎవడూ పిలిచినా కూడా రాడు కొంపకి" అనుకుంటూ మెల్లిగా చాకలి గదిలోకి దూరాడు. ఇంతలో ఫోను మోగింది.
కాసేపు రిసీవరు కోసం వెతుక్కుని, అది కనబడక, విసుగొచ్చి స్పీకర్‌ఫోను ఆంచేసాడు
"హలో.."
"ఆ, హలో హలో..నేనే మాట్టాడుతున్నా. ఇంతకీ మీటింగుకి ఒస్తున్నట్టా రానట్టా?".
ఈ "నేనే" ఎవరో చప్పున తట్టకపోయినా, ఖచ్చితంగా మాధురీ దీక్షిత్‌మొగుడు మాత్రం
అయ్యుండడని నిర్ధారించుకుని, మీటింగు ఉన్నమాట గుర్తొచ్చి, "ఆ, పన్నెండుకే కదా,
వస్తున్నా వస్తున్నా, సీ యూ" అనేసి స్విచ్చాపు చేసేసాడు.
"నిజమే, ఈ రోజు రజతోత్సవ కార్యక్రమాల ప్రణాళిక సిద్ధంచేసే సభ వుందన్నమాటే మర్చిపోయాను, త్వరగా తెమలాలి " అంటూ చాకలి పనుల్లో మునిగిపోయాడు..
మధ్యాన్నం రెండింటికి అందరూ రావడం పూర్తైఎది. ప్రెసిడెంటుగారూ, వారి అనుచర గణాలూ, శాశ్వత సభ్యులూ, అశాశ్వత సభ్యులూ, స్పాన్సర్లూ అందరూ వచ్చి టీ గ్రోలుతూ కార్యక్రమం మొదలెట్టారు. ముందుగా ప్రెసిడెంటుగారు ఎజెండా చదివి వినిపించారు. తరవాత ఒకాయన లేచి " అందర్నీ చూసైనా మనం నేర్చుకోవాలి, ఆ గ్రాఫైటు ఆంధ్రావాళ్ళని చూడండి, అదరగొట్టేసారు, లాభం లేదు, ఈ సారి ఏదైనా పేద్ద ఎత్తున చెయ్యాల్సిందే " అన్నాడు. " అయితే స్టోను మౌంటెన్‌మీద చెయ్యండి, చాలా ఎత్తులో వుంటుంది" అన్నాడు శీను. "అయ్యా, జోకులు కాదు, నిజంగానే మనం ఈసారి భారీ కార్యక్రమాలు చేస్తేనే గానీ అందరికీ తెలిసిరాదు మనం ఎంత సేవ చేస్తున్నామో" అన్నారో భుజంగం గారు.
"అవును, ఎంత ఖºర్చెనా సరే వెనుకాడేది లేదు, ఈసారి మన కార్యక్రమాలు చూసి అందరికీ
దిమ్మ తిరిగిపోవాల్సిందే, తిక్క కుదరాల్సిందే" అన్నారు ప్రెసిడెంటుగారు.
"ఎవరికీ?" అని అడుగుదామనుకున్నాడు శీను, బావుండదని ఊరుకుని వినడం మొదలెట్టాడు. మరో
పెద్దాయన లేచాడు, ఏదో రాసుకొచ్చాడు గామాల్ను, జేబులో చెయ్యి దోపి, అది బైటికి రాక,
కాసేపు కుస్తీ పడి, చెయ్యి, దాంతోబాటే ఒక నలిగిపోయిన కాగితం తీసి, సాఫు చేసి చదవడం
మొదలెట్టాడు.
"మనం ఈ సారి రక్తదాన శిబిరాలూ, ఆటల పోటీలూ, కుటుంబ నియంత్రణ శిబిరాలూ" అనేసి నాలిక్కరుచుకుని "సారీ సారీ, కుటుంబ శిబిరాలూ", ఇంకా ముద్దుల...ఆ..ముగ్గుల పోటీలు, పిల్లకాయలకి చెంచాలో నిమ్మకాయ పోటీలు, డిప్పకాయలకి గోలెంలో కొబ్బరికాయ పోటీలూ, ఇంకా.." అంటూండంగానే శేషారావు అడ్డుతగిలి.."బావుందండోయ్ గోలెంలో కొబ్బరికాయ పోటీలా? ఎట్టా ఎట్టా.." అన్నారు.
"అవును, ఎక్కగలిగిన వాళ్ళంతా కొబ్బరిచెట్లెక్కుతారు. ప్రతీ కొబ్బరిచెట్టు కిందా పేద్ద గోలెం, దాన్నిండా నీళ్ళూ ఉంటాయి. చెట్టు మీదనించి దింపు తీసి ఒక్కో కాయా గోలెంలో వెయ్యాలి. ఐదు నిముషాల్లో ఎవరు ఎక్కువకాయలు కోస్తారో వారికి "కపి సమ్రాట్ బిరుదు, వెండి తోకా ఇస్తాము" అన్నాడు ఇందాకటాయన ఉత్సాహంగా..
"అంతాక్షరి, అంతాక్షరి "అని గొణిగాడు ఇంకో ఆయన. "అబ్బా అంతాక్షరి ఎప్పుడూ ఉండేదేనయ్యా..పాడుతా తీయగా టైపులో పాటల పోటీలు పెడితే ఎలావుంటుంది?" అన్నాడో గంధర్వ రావు. అవును "పాటల పోటీ, ఫది సంవత్సరాల్లోపు వాళ్ళకి, ఫది నుంచి ఇరవై, ఇరవైపైబడ్డ వాళ్ళకి, మూడు గ్రూపులుగా నిర్వహించి, నెగ్గిన వాళ్ళకి ఫ్రీ ఇండియా టిక్కెట్టు ఇద్దాం" అన్నాడో లలితా రావు.
వాళ్ళమ్మాయిలు, వాళ్ళావిడా సంగీతం పాడతారు, ఫ్రీ టిక్కెట్లు కొట్టేద్దామని ఆయన కుళ్ళు ఐడియా. "పేద్ద తిరనాళ్ళు ఏర్పాటు చేద్దాం" అని అంటుండగానే, ప్రెసిడెంటుగారు కల్పించుకుని..."అయ్యా, చూస్తుంటే అందరూ కుటుంబ శిబిరానికే వోటేసినట్టున్నారు, కాబట్టి అత్యంత ప్రతిష్టాత్మకంగా, వైభవంగా, ఖర్చుకి వెనకాడ కుండా, పేద్ద కుటుంబ శిబిరం ఏర్పాటు చేద్దాం. దాన్లో, అన్నీ కొత్త అంశాలు పెడదాం. ఆ కొత్త ఐటెములు ఏవిటో మీరంతా చెబితే లిస్టు చేసేద్దాం" అన్నారు. ఇది నచ్చక కొంతమంది, "అయితే మీ ఇష్టం వచ్చినట్టు తగలడండి" అని లేచ్చక్కాపోయారు. నిర్వహణ సంఘంలో అన్ని కులాలవారికీ, అన్ని ప్రాంతాలవారికీ తగిన ప్రాతినిధ్యం కల్పించాలని కొందరు గెట్టిగా పట్టుబట్టి, పంతం నెగ్గించుకున్నారు.
ఫైనలుగా తేలిన ఐటెమ్‌లు ఇవీ..
1) రెజిస్ట్రేషను వద్ద నిజం ఏనుగులతో పూల మాలలు వేయించి, హారతి పళ్ళేలతో స్వాగతం
2) ఈగలూ, దోమలూ ప్రత్యేక ఆకర్షణగా పిడతకింద పప్పు, చెంబప్పచ్చులు, పానీ పూరీ వారి
బండి..
3) రోడ్డంతా తమలపాకు నవిలేసి ఉమ్మిన రంగులతో అలంకరణ
4) ఆడవాళ్ళకు లంక పొగాకు చుట్టల పోటీ ( చుట్టడం మాత్రమే )
5) మగవారికి "జీళ్ళ పాకం" లాగుట, జీళ్ళ తయారీ మరియు గోలెం కొబ్బరికాయాట
6) పిల్లలకి చెంచా నిమ్మకాయ, సోడా గోళీకాయ, మాయా మొట్టికాయ ఆటలు
7) ఆడపిల్లలకి తొక్కుడు బిళ్ళ, వామన గుంటలు, వీరీ వీరీ గుమ్మడి పండు ఆటలు
8) ముసలి వారికి పుల్లాట, దాడి, గుళ్ళ బోర్డు ఆట
9) చదరంగం (బుర్ర ఉన్నవారికి)
10) కులాల కురుక్షేత్రం (వచ్చినవారంతా కులాల వారీగా విడిపోయి, కర్రలతో, కాళ్ళతో
తన్నుకు చచ్చే ఆట)
11) ఇంటింటి రామాయణం ( వెరైటీగా మొగుళ్ళు పెళ్ళాలని విసుక్కుని, తరవాత పెళ్ళాలు
మొగుళ్ళని ఛావబాదే ఆట !!)
12) " పల్లెకుపోదాం "నాటకం
13) జై తెలంగాణా ఒగ్గు కథ, జై ఆంధ్ర బుర్ర కథ, జై బజరంగ్‌బళీ హరికథ...
తన ప్రమేయం లేకుండానే శ్రీనువాసుని అన్ని కమిటీలకీ ప్రధాన పర్యవేక్షకుణ్ణి చేసేసి చేతులు దులిపేసుకున్నారంతా. గుండెల్లో రాయి పడింది శీనుకి. ఇంకా నెల రోజులే వుంది, ఏమిచెయ్యాలో ఎలా చెయ్యాలో అని తన్నుకుంటూన్న తరుణంలో ఇంటినుంచి ఫోనొచ్చింది " పొద్దున్న ఫదికనగా బయల్దేరారు, మాయదారి మీటింగు అయ్యిందా, లేదా, ఇప్పడికైనా ఊడిపడతారా, లేకపోతే, సాయంత్రం పార్టీకి పీజ్జాలే గతి" అన్న కళత్ర ప్రబోధంతో చైతన్యవంతుడై ఇంటిదారిపట్టాడు..
పాపం నెలరోజులు అతను పడ్డ తిప్పలు పగవాడికి కూడా వద్దు. జీడిపాకం తియ్యడం నేర్చుకోడానికి ఇండియా వెళ్ళిన లలితా రావుగారి టిక్కెట్ల ఖర్చు నాలుగు వేలు. అమెరికాలో ఏనుగుల ܺటెనింగుకి పది వేలు. మయామీ అవతలనించి కొబ్బరిచెట్లు తెప్పించడానికి ఇరవైవేలు, గోలేలకీ, కర్రలకీ, చుట్టలకీ,వగైరాలకీ మరో రెండువేలు. నాటకాల సెట్టింగులకి ఎనిమిదివేలు. తిండికి ఆరు వేలు. వెండి తోకలకి మరో రెండు వేలు. వెరసి యాభై రెండు వేలు..ఇవిగాక పత్రికల కవరేజికి మరో ఎనిమిదివేలు. సంఘం సగం సొమ్మిచ్చి, మిగితాది ఆనక జూసుకుందాం అంది. పాపం శ్రీనివాసు క్రెడిట్‌కార్డు పూర్తిగా ములిగిపోయుంది.
ఎల్లాగైతేనేం శిబిరం గడిచిపోయింది. సమయానికి బేటరీలు లేకపోవడం వల్ల కోడి కుయ్యలేదు. అన్ని గుడారాల దగ్గిరికీ వెళ్ళి కోడిలా కూసే సరికి పాపం శ్రీనివాసుకీ అతని మిత్రులకీ గొంతులు పట్టుకుపోయాయి. కొబ్బరి చెట్టుమీంచి పడి శేషారావు గారి సుపుత్రుడి కాలు బెణికింది. రెండు ఏనుగులు హారతిపళ్ళేలతో ప్రముఖుల నెత్తిన మొత్తడంతో, వారికి బొప్పికట్టి, కార్యక్రమానికి రవ్వంత అంతరాయం కలిగింది. కులాల కురుక్షేత్రం లో రక్తాలొచ్చేట్టు కొట్టుకోవడం, బుర్రలు బద్దలుకొట్టుకోవడంతో పోలీసులు జోక్యం చేసుకుని విడదీయవలసి వచ్చింది. అయినా అందరికీ ఆ ఆట బాగా నచ్చింది. జీళ్ళ పాకం తీసీ తీసీ కొందరికి చేతులు చచ్చు పడిపోయాయి. చిరుతిళ్ళు తిన్న వాళ్ళకి మరచెంబు అవసరాలొచ్చాయి. చుట్ట చుట్టడంకన్నా తాగితేనే బావుందని కొందరు ఇంతులు అభిప్రాయ పడ్డారు. అయితే ఇవేవీ కవరవ్వకుండా, ఫొటోగ్రాఫరూ, వీడియోగ్రాఫరూ జాగ్రత్త పడ్డారు. ఇంటింటి రామాయణం లాంటి కొన్ని సూపర్‌హిట్టు కార్యక్రమాల్ని కవర్‌చేసారు. ఆ మర్నాడు ఆంధ్ర దేశం, అమెరికా ఖండం ఫొటోలతో వీడియోలతో దడ దడలాడిపోయాయి. అందరూ తెరిచిన నోళ్ళు తెరిచినట్టే వుంచి ఆశ్చర్య పడి..పోయారు. తెలుగు సంఘం పేరు మార్మోగిపోయింది. అయితే చిత్రం, వాళ్ళ మరుసటి మీటింగుకి ప్రెసిడెంటుగారు రాలేదు, ప్రముఖులెవ్వరూ రాలేదు. వాకబు చేస్తే, శిబిరం పుణ్యవా అని లోపల్లోపల కుమ్ములాటలూ, గుద్దులాటలూ జరిగాయనీ, దానివల్ల ఒకరి మొహవంటే మరొకరికి అసహ్యం వేసేదాకా పరిస్థితివెళ్ళిందనీ తెలిసింది. శ్రీనివాసుకి తన క్రెడిట్‌కార్డు అప్పు తీర్చే దారి కనబడక చిక్కి సగమైపోతున్నాడు.
మళ్ళీ మరో శనివారం పొద్దున్న. మళ్ళీ ఫోను మోగింది. "హలో..శ్రీనివాసు గారు, నమస్కారం, మేము ఫ్లారిడాలో ఫలానా సంఘం నించి మాట్లాడుతున్నాం. మీ కార్యక్రమం అదిరింది సార్ మేమూ చేద్దావనుకుంటున్నాం. ఏవేంకావాలో చెబుతారా?"
" ముందుగా, అందరూ కలిసి పనిచెయ్యాలి.." ఇంకా శ్రీనివాసు ఏదో చెప్పబోయాడు.
అవతల ఫోను కట్టయ్యింది...శ్రీనివాసుకి మళ్ళీ మతి పోయింది !!