ఊర్మిళ రేఖ

- సాయి బ్రహ్మానందం గొర్తి

రాత్రి పని ముగించుకొని వీధి గదిలోకి వచ్చింది నిర్మల. నిద్ర పట్టడం లేదు. పక్క గదిలో పిల్లలిద్దరికీ మావగారు కథ చెబుతున్నారు. రామాయణం వినిపిస్తోంది. ఆయన కొంతకొంతగా రోజూ రాత్రి రామాయణాన్ని చెబుతున్నారు. మధ్య మధ్యలో పిల్లలు ప్రశ్నలడుగుతున్నారు. మావగారు - రాముడి వనవాసం గురించి చెబుతున్నారు. ఆయన చెప్పే కథ నిర్మల చెవుల్నీ తాకుతోంది. ఆ దృశ్యం కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తోందామెకు.

********

చీకటి పడి చాలా సేపయ్యింది. దావానలంలాంటి వార్త రాజ ప్రాసాదం దాటి నగరంలో ప్రవేశించింది. అయోధ్యా నగరాన్ని నిశ్శబ్దం ఆవరించింది. ఆనందంగా సంబరాలతో కళ కళలాడాల్సిన నగర వీధులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. ఆ నగరం ఆ దుర్వార్త జీర్ణించుకోలేక పోతోంది. ప్రజలంతా మౌనంగానే రోదిస్తున్నారు. విధి వైపరీత్యం అనేది కళ్ళారా చూస్తున్నారు ప్రజలంతా. నిస్సహాయులై ఏమి చెయ్యాలో తోచక తలుపులు బిగించి ఎవరి ఇళ్ళలో వాళ్ళే దుఃఖిస్తున్నారు. ఎంతో బాధ ఉన్నా పైకి వ్యక్తీకరించలేని పరిస్థితి.

ప్రజలే ఇలా ఉంటే ఇక రాజప్రాసాదంలో ఇంత కంటే ఎక్కువ ఉత్కంఠ నెలకొని ఉంది. పరిచారికలు నిశ్శబ్దంగా అటూ ఇటూ తిరుగుతున్నారు. ఏం జరిగిందో దాదాపుగా అందరికీ అవగతమే. ఎప్పటికప్పుడు కొత్త పరిణామాలని చేరవేస్తున్నారు పరిచారికలు. అంతఃపురం నుండి ఎవరూ బయటకు రాలేదు. పరిచారికల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం అందుతోంది అందరికీ.

కాంతులు వెదజల్లే అంతఃపురాలని చీకటి అలమరించుకుంది. అక్కడక్కడ మినుకు మినుకుమంటున్నదీపాలు. ఏం చెయ్యాలో తోచక అటూ ఇటూ తిరుగుతోంది ఊర్మిళ. మనసు మనసులో లేదు.

అసలు ఏం జరిగింది ? ఎందుకు మహారాణి కైకేయి అనువుగాని సమయంలో ఈ వరాలు కోరుకుంది ?కోరితే కోరవచ్చు - మరీ ఇంత నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించడమా ? తెల్లారితే పట్టాభిషేకం జరగాల్సిన రామభద్రునికి ఈ ఆకస్మిక వనవాసం ఏమిటి ? కైకేయి కోరడమేమిటి? రామభద్రుడు అంగీకరించడమేమిటి ? తన సోదరి సీతని కలిసి విచారించుదామనుకుంటే అంతఃపురం విడిచి రావద్దని అత్తగారు సుమిత్ర పంపిన ఆదేశంతో ఇక్కడే ఉండిపోయింది. ఎప్పుడు తన స్వామి లక్ష్మణుడు విచ్చేస్తారా అని ఎంతో సమయంగా వేచి చూస్తోంది.తన పరిచారికలద్వారా తెలిసింది - తన సోదరి సీత కూడా బావగార్ని అనుసరిస్తున్నట్లు.

అయితే తన భర్త ఏం చేస్తున్నట్లు? మామగారు దశరథ మహారాజు ఇంకా స్పృహలోకి రాలేదన్న విషయం తప్ప ఆయనకి ఎలా ఉందో తెలియదు తనకి.

తన లక్ష్మణ స్వామి కబురే తెలియ లేదు. తన భర్త వస్తే విషయం తెలుస్తుంది. ఎన్నో ఆలోచనలతో సతమత మవుతోంది. ఇంతలో పరిచారిక వచ్చి లక్ష్మణ స్వామి రాకను తెలియ పరిచింది. మనసు కొంచెం కుదుట పడింది. ఉత్కంఠ వీడే సమయం వచ్చింది. తన భర్త ద్వారా విషయాలు తెలుస్తాయి.

ఆత్రంగా ఎదురు చూస్తోంది ఊర్మిళ. లక్ష్మణుడు తలదించుకొని మౌనంగా ప్రవేశించాడు. ప్రవేశిస్తూ ఊర్మిళ వైపు చూసాడు. తన ముఖంలోని బాధని, నిస్సహాయత ఆవరించిన కోపాన్ని చూసింది ఊర్మిళ. లక్షణుడు మౌనంగా తల పట్టుకుని హంసతూలికా తల్పం మీద కూర్చున్నాడు. కొద్ది క్షణాలు మౌనం. ఊర్మిళే నెమ్మదిగా అంది.

" నే విన్నది నిజమేనా ? "

లక్ష్మణుడు అవునన్నట్లు తలూపాడు.

" అయితే బావగారు వనవాసానికి సంసిద్ధులయ్యారా ?"

" అవును ఊర్మిళా - మా వదిన గారు కూడా పయనమయ్యారు ? "

"అదేమిటి - బావగారు మా సోదరి సీతని వద్దని వారించలేదా ? "

"వారించారు. ఎంతో సుకుమారంగా పెరిగిన మా వదినగారు ఆ అరణ్యంలో గడపడం కష్టమని చెప్పారు. వనవాసంలో ఎదుర్కోవలసిన భయాలు అన్నీ వివరంగా చెప్పారు. కానీ..." ఒక్కసారి ఆగిపోయాడు లక్ష్మణుడు.

" కానీ...? " ఊర్మిళకి అర్థంకాలేదు.

" అత్తమామలకు సేవలు చేస్తూ ఈ అయోధ్యలోనే ఉండమని అర్థించారు."

" అయితే మా సోదరి అభ్యర్థనని అంగీకరించారా ? "

" లేదు. భర్తని అనుసరించడమే భార్య ధర్మమని ఆ మహాసాధ్వి అనడంతో గత్యంతరంలేక, ధర్మనిష్టాపరుడైన మా అన్నగారు సరే నన్నారు. "

" అయితే మా అక్కగారికి తోడుగా అంతఃపుర పరిచారికలు అందరూ సిద్ధమవుతున్నారా ?"

" లేదు దేవీ ! ఈ వనవాసానికి మా అన్నగారు వదిన గారు ఇద్దరే ఉపక్రమిస్తున్నారు. నేను వారికి తోడుగా, రక్షకుడిగా వెళదామని నిర్ణయించుకున్నాను. మా అన్నగారిని విడిచి నేను ఇక్కడ రాజ సౌఖ్యాలు అనుభవించడానికి నాకు మనస్సు లేదు. "

" రక్షకులుగా సైన్యాన్ని, పరిచారికల్ని కూడా పంపచ్చుకదా ? "

" మొత్తం ఈ అంతఃపురం కదిలి వెళితే ఇది వనవాసం అవ్వదు ఊర్మిళా ! విహారయాత్రగా మారుతుంది. కేవలం మా అన్నగారు మాత్రమే ఒంటరిగా వెళ్ళడానికి సిద్ధపడ్డారు. ఆయనకి తోడుగా నేనూ వెళతాను. "

" అదేమిటి స్వామీ - మీరూ ఈ వనవాసానికి వెళతారా ? అయితే నేనూ మీతో పయనమవుతాను. మా సోదరికి తోడుగా కూడా ఉంటుంది. "

" వద్దు ఊర్మిళా ! నువ్వు అత్తమామలకి సేవ చేస్తూ ఇక్కడే ఉండు. ఈ వనవాసం మా అన్నగారికి కాని ఆయన బంధువులందరికీ కాదు. "

" మరి మీరు ఆయత్తమవుతున్నారు కదా ! నేనూ మీ సహధర్మ చారిణి గా వస్తాను. "

" వద్దు ఊర్మిళా ! నేనొక్కడ్నే వెళతాను. నా మాట విను. ఈ రఘువంశపు కోడలిగా అత్తమామలకు సేవ చేసి అందరి మన్ననలు పొందు. ఇదే రాజధర్మంగా పాటించు. ఈ వనవాసం నీకు తగదు. "

" ఇదేమి న్యాయం స్వామీ ! నా సోదరి సీత తన భర్తననుసరించి వెళ్ళవచ్చు. కానీ నేను మాత్రం రాజధర్మం అంటూ ఇక్కడే ఉండిపోవాలి."

" అదికాదు ఊర్మిళా ! ఆ అన్నగారిని విడిచి ఉండలేనని మా వదినగారు..."

" అంటే నేను మిమ్మల్ని విడిచి ఉండగలనా స్వామీ ? మా అక్కగారికి ఏ ధర్మమో నాకూ అదే వర్తిస్తుంది కదా ! నేనూ వస్తున్నాను. నా మాట కాదనకండి. " ప్రాధేయ పడింది ఊర్మిళ.

" ఊర్మిళా ! నేను నా అన్నగారికి తోడుగా రక్షకుడిగా వెళుతున్నాను. నువ్వు నాకూడా వస్తే నా ధ్యేయానికి ప్రతిబంధకం అవుతుంది. "

" నా రాక మీ ధ్యేయానికి ప్రతిబంధకమా? " అర్థంకానట్టుగా చూసింది ఊర్మిళ.

" అవును దేవీ. ఆ అరణ్యాల్లో క్రూర మృగాలు ఉంటాయి. రాక్షసులు ఉంటారు. వారి బారినుండి రక్షించడానికి వారికి తోడుగా ప్రతీరాత్రి వారికి కాపలా గా ఉంటాను. పగలు అలసి సొలసిన మా అన్నగారికి రాత్రిపూట నేను తోడుగా ఉంటాను. నేనే లేకపోతే రాత్రంతా మా వదినగారికి భయం లేకుండా ఉండాలని మా అన్నగారు కాపలాగా ఉండాల్సి వస్తుంది. పగలు ఆహార సేకరణ రాత్రి కాపలా ఇవన్నీ చేయడం కష్ట సాధ్యం. అందుకే వారికి తోడుగా నే వెళితే మా అన్నగారు ఈ వనవాసం పూర్తిచేయగలరని నా విశ్వాసం. నువ్వు వస్తే నా పనికి ఆటంకమే ! ఎందువలన అంటావా - భర్తగా నేను నీ రక్షణ భారం నిర్వహించాలి. నీ అవసరాలను కనిపెడుతూ నీతో సమయం వెచ్చించాలి. అలా చేస్తే నేను మా అన్నగారిని విడిచి గడపాలి. నాకున్న సమయమంతా మా అన్న గారి సేవకే వినియోగించాలన్నదే నా లక్ష్యం. నువ్వు వస్తే నేను నా కర్తవ్యాన్ని నిర్వర్తించలేను ఊర్మిళా ! దయ చేసి నా మాట విను. "

" అంటే మీరొక్కరు వెళితే నేనొక్కదాన్ని ఇక్కడ సుఖంగా ఉండగలనంటారా ? "

" ఉండవు. ఉండలేవు. ఆ విషయం నాకు తెలుసు. నా కోసం ఈ త్యాగం చేయమని అర్థిస్తున్నాను. వేడుకుంటున్నాను. భర్తగా మాత్రం శాసించడంలేదు ఊర్మిళా ! నీకెంత వియోగమో నాకూ అంతే - కాని ఈ తప్పని పరిస్థితుల్లో ఇంతకంటే ఏ మార్గమూ లేదు నాకు. "

" స్వామీ - ఒకటీ రెండు సంవత్సరాలు కాదు. పధ్నాలుగేళ్ళు. ఎలా గడపడం స్వామీ ? "

" నాకు తెలుసు దేవీ ! ఈ వియోగంలో ఉండే కష్టం. తప్పదు మరి. నా కోసం, మా అన్నగారికోసం ఈ త్యాగం చేయమనే అర్థిస్తున్నాను. "

ఊర్మిళకి వదనం దుఃఖ పూరితం అయ్యింది. మాట రావడం లేదు.

"కాదనకు దేవీ - నాకు తెలుసు భర్తని అనుసరించడమే భార్య ధర్మమని. ఆ ధర్మాన్ని పక్కన బెట్టి నిన్ను ఇక్కడ ఉండమనడం న్యాయం కాదని తెలుసు. అయినా మరొక్కసారి అభ్యర్థిస్తున్నాను. కాదనకు. "

ఊర్మిళ స్తబ్ధువై నిలుచుంది. గొంతు పెగలడం లేదు. భర్త మాట జవదాటి తను పయనం కాలేదని తెలుసు. అలాగని ఇక్కడ ఒంటరిగా నివసించలేదు. తనకు పరిచారికలు, ఈ సౌఖ్యాల కంటే భర్త అనురాగమే ముఖ్యం. అటువంటిది ఆ అనురాగాన్నే భర్త కొంతకాలం త్యజించమంటున్నాడు. భరించలేని నిర్ణయం.

కళ్ళనీళ్ళ పర్యంతమై స్థాణువులా నిలిచిపోయింది.

తన భర్తకి తను ప్రతిబంధకం అన్న మాట శూలంలా గుచ్చుకుంది.

" మీ ఇష్టం స్వామీ ! మీకు నేను ప్రతిబంధకం కానని ప్రమాణం చేస్తున్నాను. " గద్గద స్వరంతో అంది ఊర్మిళ.

" నాకు తెలుసు దేవీ నువ్వు నా మాట జవదాటవని. నా ఈ పధ్నాలుగేళ్ళ వ్రతానికి నీ సహాయ సహకారాలు లభించడమే నా కర్తవ్య నిర్వహణ విజయ లక్ష్యానికి శుభ సంకేతం. భర్తకోసం నువ్వు చేసిన ఈ త్యాగం అజరామరం దేవీ ! "

పొగడ్తల వర్షం కురుస్తున్నా ఊర్మిళ హృదయ జ్వాలల్ని ఆర్పడం లేదు. "నా ప్రయాణానికి సిద్ధ పరచు దేవీ ! మా అన్నగారిని కలిసి నా నిర్ణయం నివేదిస్తాను " అంటూ ఊర్మిళ చెక్కిలి పై రాలిన కన్నీళ్ళని తుడిచి భారంగా అక్కడనుండి నిష్క్రమించాడు లక్ష్మణుడు.

తన యోగాన్ని వియోగం ఆవరించుకుందని దుఃఖిస్తోంది ఊర్మిళ.

ఈ పధ్నాలుగేళ్ళు తనకి తన మనసుకి ఇక యోగ నిద్రే శరణ్యం. కరడు కట్టిన హృదయంతో ఆ రాత్రంతా మేల్కొనే ఉంది ఊర్మిళ.

ప్రతిబంధంకం వియోగం గా మారి, త్యాగంగా రూపాంతరం చెందిన ఆ రాత్రి భారంగా తెల్లారింది.

********

ఆమె మౌనంగా వింటోంది. చెప్పాల్సినవి చెప్పి తీసుకోవాల్సిన నిర్ణయాలు భర్త అప్పటికే తీసేసుకున్నాడు. నిర్ణయం తీసుకునే ముందు అడిగితే విషయం వేరుగా ఉంటుంది. నిశ్శబ్దంగా ఆ నిర్ణయం ఆమెను కొంచెం కొంచెం గా కుదిపింది.

సంపాదన కోసం భర్త వేరే దేశం వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు.

అందులో తన అభిప్రాయాలకి చోటు లేదు - కేవలం శిరస్సు వంచడం తప్ప. తల వంచడం తాళి కట్టిన క్షణం నుండే ఆమె అలవాటు చేసుకుంది.

" అదికాదు నిర్మలా ! మనం డబ్బుకోసం ఎంత ఇబ్బందులు ఎదుర్కుంటున్నామో నీకు తెలుసు కదా ! అమ్మ ఆరోగ్యమా అంతంత గా ఉంది. ఈ దుబాయ్ ఉద్యోగం వదులుకోవడం అంతగా మంచిదికాదేమో - నాకు తెలుసు నువ్వు ఒక్కదానివి ఇక్కడ ఉండడంలో కష్టం - నాకు మిమ్మల్ని విడిచి వెళ్ళడం కష్టమే - అయినా తప్పదు - మన సంసారం కోసం మనం ఆ మాత్రం వదులుకోవాలి. "

అతని భావం నిర్మలకి అర్థం అయ్యింది. పిల్లల్ని అత్తమామల్ని చూసుకుంటూ ఇక్కడ తను ఉండాల్ఇ. ఒకటీ రెండు నెలలు కాదు - కొన్ని ఏళ్ళు !

"నేనూ వస్తాను ! " మెల్లగా అంది - అతను వద్దంటాడని తెలిసినా !

మరలా అతను చెప్పిన వివరణే చెప్పాడు. ఈ సారి " నాకోసం ఆమాత్రం చెయ్యలేవా ? ఇది మన కుటుంబ క్షేమం కోసమే - ఎంతో కాలం కాదు – అయిదేళ్ళు ఇట్టే గడిచిపోతాయి - అదీకాక అమ్మా నాన్న ఎక్కడుంటారు చెప్పు - ఈ వయసులో వాళ్ళని వదిలి వచ్చేయడం అంత మంచిది కాదు. " ఈ సారి ఒక సెంటిమెంటు అస్త్రం తీసాడతను.

అత్తమామల్ని హైద్రాబాదులో ఉంటున్న అతని తమ్ముడి దగ్గర ఉంచచ్చు అన్న విషయం ఆమెకు తెలుసు. అతని తమ్ముడికి తల్లితండ్రులు పట్టరు అనీ ఆమెకు తెలుసు. కాని ఒకసారి అడిగి చూడచ్చు కదా? ఇప్పుడు తను అడగడం లాంటిదేనని తెలుసుకొని ఆమె మాట్లాడ లేదు.

" నువ్వు - పిల్లలూ రావడం నాకిష్టమే - కాని దుబాయ్ లో మీరు ఉండలేరు - సరికదా పిల్లల చదువు పాడైపోతుంది. అదీకాక అమ్మా నాన్న ఎలా ఉంటారు చెప్పు. నువ్వు ఇక్కడ ఉండడం అనేదానిమీద ఎన్నో అధారపడి ఉంటాయి. " అతను గట్టిగా చెప్పాడు.

అసలు సమస్య తను వస్తాననడం అన్న విషయం అర్థం అయ్యింది. తను తన కుటుంబం కోసం అక్కడే ఉండి పోవాలి.

పదే పదే అడగడం ప్రయోజనం లేదని ఆమెకు తెలుసు. అందుకే అతని నిర్ణయానికి కట్టు బడింది. తన అభిప్రాయాలూ, తన భావాలు ఆమె మరోసారి ఆలోచనల పెట్టెలో మూసేసింది.

ఆమెను అత్తమామల సేవలో వదిలి అతను ఉద్యోగ రీత్యా దుబాయి ప్రయాణమయ్యాడు.

********

చిత్రకూట పర్వతం. అనేక ఫల వృక్షాలు, పూల సౌరభాలతో నిండి ఉంది. దాని క్రిందుగా, మందాకినీ నది ప్రవహిస్తోంది.

భరద్వాజ ముని ఆశ్రమంలో విడిది అయ్యాక భరతుడు, అతని వెనుకే కౌసల్య, సుమిత్ర మరియు కైకేయి అందరూ చిత్రకూట పర్వతం దక్షిణ దిశగా పయనించారు.

వశిష్ట మహర్షి, మంత్రి సుమంతుడు, గుహుడు, భరతుని ఆధ్యాత్మిక సలహాదారు ధ్రితి, భరతుని సైనికులు అతని వెంటే బయల్దేరారు.

భరతుని మనస్సు ఇప్పుడు స్థిమిత పడింది. రాముడ్ని చేరుకునే సమయం ఆసన్న మయ్యింది అన్న విషయం అతని మనో ధైర్యాన్ని పెంచింది.

భరతుడు తన సైన్యాన్ని రామ లక్ష్మణుల జాడ తెలుసుకోమని పంపించాడు.

చిత్రకూట పర్వతారణ్యంలో ఒక దిక్కుగా పొగలు రావడం చూసి, దట్టమైన ఆ అడవి ప్రాంతం మధ్యలో సన్నిని పొగ రావడం మానవ సంచారాన్ని తెలుపుతోందని అక్కడే రామ లక్ష్మణులుండ వచ్చునన్న విషయం చెప్పారు. సైన్యాన్ని, తన మాతా పరివారాన్ని అక్కడే ఉండమని భరతుడు బయల్దేరాడు.

ఆ సమయానికి రాముడు మందాకినీ నదీ తీరం దగ్గర తన ఆశ్రమం బయట సీతకి చిత్రకూట పర్వత విశేషాలు, మందాకినీ నది అందాలు వర్ణిస్తుండగా, దూరంగా ఏనుగుల ఘీంకారాలు, తరలి వస్తున్న సైన్యం కదలిక ఓ భూకంపంలా తోచి, విషయం ఏమిటో చూడమని లక్ష్మణుడికి చెప్పాడు.

లక్ష్మణుడు ఒక చెట్టు పైనుండి దూరంగా భరతుడు సైన్యంతో రావడం చూసి, భరతుడు రాముడ్ని చంపడానికి ఒస్తున్నాడనుకున్నాడు. భరతుడ్ని, అతని సైన్యాన్ని, కైకని అందర్నీ హత మార్చేందుకు అనుజ్ఞ ఇమ్మని రాముడ్ని అడిగాడు. భరతుడి మనసు తనకు తెలుసునని, తనకు కలలో నైనా భరతుడు హాని చేయడని కోపాన్ని ఉపశమించుకొని శాంతంగా ఉండమని నిర్దేశించాడు. వచ్చే వ్యక్తి భరతుడు కాకపోతే, దశరథుడైనా అయ్యివుండవచ్చని అన్నాడు.

దూరంగా వారికి దశరథుడి ఏనుగు శత్రుంజయ కనిపించింది. కాని దానిపై దశరధుడి శ్వేత వర్ణ గొడుగు కనిపించక పోయేసరికి మనసు ఏదో శంకించింది.

దూరాన్న ఉన్న రాముడ్ని, అతని పక్కనే లక్ష్మణుడ్ని చూసి, భరతుడు సైన్యాన్ని కిందనే ఉంచి ఆశ్రమం వైపుగా వడివడిగా నడుచుకుంటూ వెళ్ళాడు.

రాముడ్ని చూడగానే అతని మనస్సు కరిగిపోయింది. దూరాన్నుంచే " రామా " అంటూ ఒక్క ఉదుటున అతని పాదాలపై పడ్డాడు. జరిగిన దానికి పశ్చాత్తాప పడుతూ, తనని, తన తల్లి కైకని క్షమించమని అర్థిస్తూ, తను వచ్చిన వైనం, జరిగిన విషయం చెప్పాడు. దశరథుడి మరణ వార్తని చెప్పాడు. ఆ వార్త విని హతాశుడైన రాముడు, లక్ష్మణుడు కన్నీరు మున్నీరుగా విలపించారు.

దశరథుడి అంత్యక్రియలు చేసే అదృష్టం భరతుడికి లభించిందని, తను తండ్రి కడ సారి చూపుకు నోచుకోని అభాగ్యుడనని రాముడు వాపోయాడు.

భరతుడు తమకు హాని చేయడానికి వస్తున్నాడనుకున్న తన తొందరపాటు మనస్తత్వం చూసి లక్ష్మణుడికి సిగ్గేసింది.

తండ్రి మరణ వార్త విన్నాక, రాముడు, లక్ష్మణుడు, దశరథుడికి మందాకినీ నదిలో ధర్మోదకాలు విడిచారు. రాముడు తల్లి కౌసల్యని, కైకని, సుమిత్రని చూసి బాధతో విలపించాడు. చీకటి పడడంతో, ఆ రాత్రికి అక్కడే బస చేయడానికి నిర్ణయించాడు భరతుడు. తన సైన్యాన్ని రప్పించి తన పరివారానికి గుడారాలు ఏర్పాటు చేయించాడు. కౌసల్య తన సవతులతో ఒక గుడారంలో ఉంది.

ఆ రాత్రంతా రామునికి నిద్ర పట్టడంలేదు. సీత పరిస్థితీ అంతే !

తన తల్లి కౌసల్య నిద్రించిందో లేదో చూసి రమ్మని రాముడు లక్ష్మణుడ్ని పంపాడు.

లక్ష్మణుడు కౌసల్య, కైకేయి, సుమిత్ర ఉండే గుడారం వైపుగా వచ్చాడు. దూరంగా సన్నని దీప కాంతి లో చెలికత్తెలతో సంభాషిస్తున్న కౌసల్య గొంతు వినిపించింది లక్ష్మణుడికి.

ఎందుకో ఒక్క సారి ఊర్మిళ గుర్తుకొచ్చింది.

తమ పరివారం అంతా వచ్చారు.

ఊర్మిళ ఎందుకు రాలేదు ? అన్న ప్రశ్న అతని మనస్సులో ప్రవేశించింది. తన తల్లి సుమిత్రనడుగుదామని నిశ్చయించుకున్నాడు. గుడారం లోపల్నుంచి నెమ్మదిగా మాటలు వినిపిస్తున్నాయి. లోపలికి ప్రవేశిద్దామనుకొన్న లక్ష్మణుడు గుడారం వెలుపలే ఆగిపోయాడు. కౌసల్య గొంతు నెమ్మదిగా వినిపిస్తోంది.

"విధి వైపరీత్యం ఎంతగా ఉందో చూసావా సుమిత్రా ! రాజభోగాలతో తులతూగుతూ, పట్టాభిషిక్తుడు కావలసిన రామభద్రుడిని చూస్తే గుండె తరుక్కుపోతోంది. రాముడినే కాదు, సీత ని చూస్తే మనసు పరిపరివిధాల రోదిస్తోంది. " కౌసల్య గొంతుని గుర్తించాడు లక్ష్మణుడు.

" అవును సోదరీ - నుదుటి రాతని ఎవ్వరూ తప్పించలేరు. మన దౌర్భాగ్యం ఇలా దాపురించింది. ఒక పక్క రాముని వనవాసం, మరో పక్క పతి వియోగం. ఒకటి మరిచిపోదామనుకున్నా రెండవది ఎప్పుడూ మనసుని బాధిస్తూనే ఉంటోంది. " తల్లి సుమిత్ర భాధని విన్నాడు.

" అంతేకాదు మహారాణీ - మన మహారాణి సీతమ్మని చూస్తే ఎంతో బాధ కల్గుతోంది. హంసతూలికా తల్పం మీద శయనించాల్సిన పట్ట మహిషి, కటిక నేల మీద... చూడలేక పోతున్నామమ్మా ! "

ఎవరిదో ఈ కొత్త గొంతు. బహుశా కౌసల్య చెలికత్తెదయ్యుంటుంది. మరలా ఆమే అంటోంది.

" అంతే కాదమ్మా ! రాజభోగాలు అన్నీ త్యజించి ఇలా వనవాసం చేయడానికి ఎంతో మనస్థైర్యం కావాలి. మనలాంటి మామూలు మనుషుల వల్ల కాదు. సుఖాల్ని త్యజించి రావడం అంత సులభం కాదమ్మా ! "

" అవును - సీత మహా త్యాగశీలి. భర్తననుసరించడమే భార్య విధ్యుక్త ధర్మమని మరొక్క సారి తన చర్యల్లో చూపించింది. నువ్వన్నట్లు సీత మామూలు మనిషి కాదు, మహా సాధ్వి. త్యాగశీలి - సీత లాంటి పత్ని లభించడం మా రాముడి అదృష్టం !" ఈ మాటలు వింటూంటే కౌసల్య గొంతు బొంగురు పోయింది.

" అంతేకాదమ్మా - మన లక్ష్మణ స్వామిని చూస్తే ఎంతో గర్వంగా ఉందమ్మా ! అన్నగారి కోసం సర్వ సౌఖ్యాలు వదిలేసి ఇలా అడవుల వెంట రావాలంటే ఎంతో నిబ్బరం, ధైర్యం కావాలి. మహా త్యాగశీలిని కన్న ఈ సుమిత్రమ్మ ఎంతో అదృష్టవంతురాలమ్మా ! వీళ్ళందరూ ఒకరిని మించి మరొకరు మణి పూసలు. ఒకరిని మించిన త్యాగధనులు మరొకరు...." చెలికత్తె గొంతులో భక్తి భావం స్పష్టంగా వినిపించింది లక్ష్మణుడికి.

బయటనున్న లక్ష్మణుడికి త్యాగం పేరు చెప్పగానే ఊర్మిళ గుర్తొచ్చింది. తన మాటని జవదాటకుండా అంతఃపురానికే అంకితమయ్యింది. ఒకరకంగా ఊర్మిళని వదిలి రావడం భర్తగా తను చేసింది తప్పే - కాని అన్నగారి మీద ప్రేమ, భక్తి ఈనాటివి కాదు. అభిమానాలు, ప్రేమలు న్యాయ ధర్మాల తర్కానికి అందవు. తను అన్నగారిననుసరించి త్యాగం చేసాననుకుంటున్నారు వీళ్ళందరూ ! తన త్యాగం వెనుక మరొక మూర్తి త్యాగం కూడా వుంది. ఊర్మిళే కనక తనని అడవులకు వెళ్ళ వద్దని నిర్బందిస్తే ? ఒకరకంగా తనకు పరీక్షే - తను వద్దనగానే మరోమాట మాట్లాడకుండా మౌనంగా అంగీకరించింది.

ఒక్కసారి ఊర్మిళ మీద ప్రేమ అభిమానం పొంగుకొచ్చాయి లక్ష్మణుడికి. రాజ పరివారమంతా బయల్దేరివచ్చినా ఊర్మిళ మాత్రం రాలేదు - ఎందుకు రాలేదు ? భర్తని చూడాలని అనిపించలేదా ? ఏదో కారణం ఉండే ఉంటుంది.

తల్లి సుమిత్ర నడిగితే తెలుస్తుంది. లక్ష్మణుడు గుడారం లోపలకి ప్రవేశించగానే చెలికత్తెలు పక్కకు తప్పుకున్నారు. తల్లి సుమిత్రకి, పెదతల్లి కౌసల్యకి ప్రణామాలు చేసి, ఈ అడవిలో సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారేమో చూసి రమ్మని అన్నగారి ఆజ్ఞని విన్నవించాడు. కొంతసేపు కుశల ప్రశ్నల అనంతరం సుమిత్రని అడిగాడు లక్ష్మణుడు.

" తల్లీ - అయోధ్యలో అందరూ కుశలమేనా ? ఊర్మిళ ఎలా వుంది ? మీరందరూ అడవికి ఆయత్తమవుతుంటే తనూ వస్తానని అనలేదా ? మీతో పాటు ఊర్మిళ ఎందుకు రాలేదు ? "

" నాయనా లక్ష్మణా - మేమందరమూ భరతునితో బయల్దేరుతున్నామన్న విషయం స్వయంగా నేనే వెళ్ళి చెప్పాను. తనని కూడా రమ్మనమని చెప్పాను...కానీ.. " మధ్యలో ఆగిపోయింది సుమిత్ర.

" కానీ..."

" తనే రానని నిష్కర్షగా చెప్పింది. ఎంత బ్రతిమాలినా రానంది. "

" అదేమిటమ్మా - నువ్వు బ్రతిమాలినా రానని అందా ఊర్మిళ - పోనీ ఎందుకు రానందో కారణమైనా విన్నవించిందా నాకు...."

" కారణం..." తటపటాయిస్తూ ఆగిపోయింది సుమిత్ర.

" సందేహం వద్దు - చెప్పమ్మా ! నేనేమూ కోపగించుకోను..."

" నీకు ప్రతిబంధకం కాకూడదని..." సుమిత్ర మధ్యలో ఆగిపోయింది.

ఒక్కసారి లక్ష్మణునకు మనుసుని ఛెళ్ళుమని కొట్టినట్లనిపించింది.

బయల్దేరేముందు తనకి, ఊర్మిళకి జరిగిన సంభాషణ గుర్తుకొచ్చింది. ఇంకేమీ మారు మాట్లాడకుండా మౌనంగా లక్ష్మణుడు బయటకు వచ్చేశాడు. ఊర్మిళ అభిమానవతి. అంతేకాదు భర్త కర్తవ్యపాలనకోసం అంతఃపురానికే అంకితమయ్యిన మహాసాధ్వి. బాధలు, సంతోషాలు పంచుకోవడానికి వదిన గారు సీతకి అన్నగారు రాముడున్నారు. మరి ఊర్మిళకెవరున్నారు ? పక్కన ఉండాల్సిన తను....లక్ష్మణుడు వడి వడిగా అడుగులువేసుకుంటూ తమ కుటీరం వైపు మరలాడు. వెన్నెల రాత్రిలో కుటీరం ముందు వదినగారు పుష్ప రేకలతో వేసిన ముగ్గు చూసాడు. గబుక్కున త్రొక్కబోయి పక్కకు ఒరిగాడు. పసిడి వెన్నెల్లో గీతల్లా వేసిన ముగ్గులో ఆ పుష్పాలు మరింతగా మెరుస్తున్నాయి.

ఆ పుష్పాల్లో ఊర్మిళే కనిపించింది లక్ష్మణుడికి. కనిపించే పెద్ద గీత - దాని వెనుక మరుగైన చిన్నగీత - సీత - ఊర్మిళ.

********

అత్తగారికి సుస్తీ చేసింది. ఆసుపత్రిలో చేర్చారు. పదిరోజులుగా ఆవిడకు అన్నీ మంచం మీదే ! అన్నీ తనే చేస్తోంది. ఇంట్లో పిల్లల చదువులు - వాళ్ళని ఉదయాన్నే స్కూలికి పంపడం - తరువాత వంట చేసి ఆసుపత్రికి కేరీరు తీసుకెళ్ళడం - అక్కడ అత్తగారికి సేవలు చేసి మధ్యాన్నం పిల్లలు స్కూల్ నుండి వచ్చే సమయానికి చేరుకోవడం - మరలా రాత్రికి వంట - ఆసుపత్రి కి వెళ్ళడం - గత పది రోజులుగా నిర్మలకు తీరిక లేదు. రాత్రి ఆసుపత్రిలో మావగారు ఉంటున్నాడు. ఆయనికి ఎనభై దాటింది. ఓపిక లేని మనిషి. అందుకే నిర్మల ఆయన్ని కష్టపెట్టదు.

అతని తమ్ముడు, తమ్ముడి భార్య డాక్టర్ విజయ ఇద్దరూ వచ్చారు. భర్త దుబాయ్ నుండి తిరిగి వచ్చాడు. బంధువులూ కొంతమంది వచ్చారు. డాక్టర్ విజయ అత్తగారికి బీ. పి. ఎక్కువైందని - దాని వల్లే నీరసించిపోయిందని చెప్పింది. అందరూ పడుకోడానికి ఇల్లు ఇరుకు అని - అదీకాక ఆసుపత్రిలో అయితే ఏ. సి ఉంటుందని విజయ అత్తగారి దగ్గర రాత్రి ఉంటానని చెప్పింది.

ఆమెతోటే మరిది కూడా అక్కడే ఉన్నాడు. తను, భర్త, పిల్లలూ, మావగారు ఇంట్లో ఉండిపోయారు. ఆ రోజు రాత్రి అత్తగారికి హార్ట్ ఎటాక్ వచ్చింది. పక్కనే ఉన్న విజయ ముందుగా గ్రహించి ఆసుపత్రిలో అందర్నీ ఎలర్ట్ చేయడం వల్ల అత్తగారికి ప్రాణాపాయం తప్పింది. విజయ డాక్టర్ గా అత్తగారి పక్కనే గడపడం ఆ ఆసుపత్రిలో అందరూ మెచ్చుకున్నారు. ఉదయం అత్తగారికి భోజనం పట్టుకెళ్ళడానికి ఆసుపత్రికి వెళ్ళినప్పుడు, డాక్టర్ వచ్చి పరీక్ష చేసాడు.

"ఫరవాలేదమ్మా ! ఈవిడకి గండం గడిచినట్లే - కొంత కాలం అయిన తరువాత యాంజిప్లాస్టీ చేయాల్సి ఉంటుంది. విషయమంతా డాక్టర్ విజయకి చెప్పాము " అని అత్తగారి వైపు తిరిగి - "మీకు విజయ లాంటి కోడలు దక్కడం మీ అదృష్టం - ఇంత చదువుకున్నా రాత్రంతా ఇక్కడే గడుపుతూ అత్తమామల్ని సేవ చేసే విజయ గారి లాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. మీకు ఇలాంటి కోడలు ఉండడం మీ అదృష్టం. "

డాక్టర్ మాటలు వింటూ నిర్మల భర్త పక్కనే ఉన్నాడు. అవునన్నట్లు గా డాక్టర్ మాటలకి తలూపాడు. మావగారు, మరిది, అక్కడకి వచ్చిన బంధువులు అందరూ విజయని పొగడడం మొదలుపెట్టారు. ఆమె సేవల్ని అందరూ కొనియాడేరు, తన భర్తతో సహా !

********

రాత్రి పిల్లలిద్దరికీ మావగారు రామాయణం కథగా చెబుతున్నారు. మధ్య మధ్యలో పిల్లలు ప్రశ్నలడుగుతున్నారు. అప్పుడే ఆయన రాముడ్ని భరతుడు వనవాసం నుండి వెనక్కి రమ్మనమని అభ్యర్ధిస్తున్న సన్నివేశం చెబుతున్నారు. పిల్లలు ఆ కథలో లీనమై పోయి ఊ కొడుతున్నారు. అదొక అంతులేని కథ.

నిర్మలకి అవే దృశ్యాలు మరలా మరలా కళ్ళముందు కనిపిస్తున్నాయి.

[ వాల్మీకి రామాయణంలో ఊర్మిళ గురించి అతి తక్కువగా ప్రస్తావించబడింది. ఊర్మిళా లక్ష్మణ సంవాదం అవాల్మీకమే కాదు, ఇది నా ఊహ మాత్రమే. - రచయిత ]