కొన్ని మినీ కవితలు
--- మూలా సుబ్రహ్మణ్యం
రైలుబండి
కొందరికి ఆనందాన్నీ
మరికొందరి విషాదాన్నీ
మోసుకుంటూ రైలుబండి
రానూ వచ్చింది
పోనూ పోయిందికబుర్లలో మునిగిపోయి మనం
రైలు ఉనికినే గుర్తించం!
ఆట
తూగుడు బల్లాట
ఆడుకుంటూ
సూర్య చంద్రులు!
బాల్యం
తుప్పల్లోకి పోయిన బంతి
ఎప్పటికీ మరి కనిపించదు
గోరింట
అమ్మాయిలు రాత్రి పెట్టుకున్న గోరింట
ఉదయానికి పండితే
ఆకాశం ఉదయం పెట్టుకున్న గోరింట
రాత్రికి పండుతుంది!
చుక్కలు
రాత్రంటే
ఆకాశానికి సైతం
ఎంత ఆకర్షణోఒళ్ళంతా
కళ్ళు చేస్తుకుంది!
మేఘం
ఎంత చిత్రమైనదీ మేఘం
సరిహద్దులెరుగని స్వేచ్ఛకలిగీ
సూర్యుణ్ణి సైతం నిలువరించగలిగీ
ఏ చల్లని స్పర్శకైనా కరిగిపోతుందిఎంత తడిని
తనలో దాచిందో!