కారు కోసం ..
ఫణి డొక్కా
కారువున్ననాడు కష్టంబు తెలియదు
పూని దిరుగ వచ్చు పురము లెల్ల
కారు పోయెనేని గడప దాటగలేము
కారె కాళ్ళుగాని, కాళ్ళు కావు !!కుర్ర చోదకుండు కులుకులాడితొగూడి
కన్ను మిన్ను గనక కారు నడిపి
కొంప ముంచినాడు గోడెవరితో దెల్పు
పచ్చడాయెకారు పట్ట పగలేజరిగినంత సేపు జలసాల కారెక్కి
మురిసిపోతిగాదె ముదము మీర
నేడు తీరిపోయె నేనాటి బంధమో
కారు జూడ తిరిగె కంట నీరుఆయువున్న నాడు ఆటాడు జీవుండు
తనదు గడువుదీర తరలిపోవు
మరలిరారు తిరిగి మనిషైన కారైన
కర్మ బంధమిలను కాటివరకేఎమర్జెన్సీ పేరు, ఎవరు పలుకగబోరు
ఎన్ని గంటలైన ఎదురుచూపే,
దిక్కులేని నాడు, దిక్కు నీవేనయ్య
పిలుపునాలకించు, భిషగ్దేవాచేతనయిననాడు చేసిన పుణ్యంబు
కాచెనేమొ నేడు కష్టమందు
మంచి చేయుటొకటె మనిషి కర్తవ్యంబు
చేటుకాలమెపుడు చెప్పి రాదుఇంక ఇన్సూరెన్సు ఇక్కట్లు మొదలాయె
ఆరు పొద్దు లిచ్చి రద్దెకారు,
అయిదు రోజులరగె, ఆఫీసు పనులలో
ఆరు మిగిలెనయ్య కారుకొనగ !వేన్లు, పెద్దకార్లు, వేగన్లు, టూడోర్లు
కొంత పాత కార్లు, కొత్త కార్లు,
వెదకి వెదకి తుదకు వేడెక్కె తలకాయ
వీళ్ళ దుంప తెగను, ఇన్ని కార్లా !!హంసనెక్కి నీవు, హాయిగుంటివమ్మ
వీణ మీటుకొనుచు, వీటిలోన
సుతుని బాధ జూచి, సుంతైన దయ తలచి,
కావుమమ్మ మంచి కారు నిచ్చి !!