డే జా వూ

-- అఫ్సర్


ఏ అన్నాల వేళో
మిమ్మల్నందర్నీ విడిచేసి వచ్చాను
అది మధ్యాన్నమో, రాత్రో గుర్తులేదిప్పుడు.

నేను సగంలోనే వచ్చాక -
మిగిలిన అన్నం మీరు తిన్నారా?
పళ్ళెంలోనే చేతులు కడుక్కొని దిగ్గున లేచారా?
ఆ తరువాత మూతిమీద ఎక్కడైనా
మెతుకులు మెరుస్తున్నాయేమో చూసుకున్నారా?

నేను వచ్చిన తరువాత
మీ దిగుళ్ళలో మీరు,
మీ సంతోషాల్లో మీరు,
మీ రోజువారీ ఈతిబాధల్లో మీరు -
ఏమో! నేను నాకే వొక జ్ఞాపకంలా పడి వున్నాను.

ఏ అన్నాల వేళో మరి
పొలిమేర దాటి,
దేశం దాటి,
సముద్రాలు దాటి వచ్చేశాను.
గుర్తున్నానా?
అని ఆ తరువాత నేనే మీకు గుర్తుచేసుకున్నాను
కాలాన్ని దాటకుండానే గతంలోకి జారుకుంటూ.

నిన్న రాత్రే
మీతో కూర్చున్నట్టుగా,
మాట్లాడినట్టుగా,
మీతో కలిసి అన్నం తింటున్నట్టుగా,
మీతో మేడమీద బిచానా వేసినట్టుగా -
ఏది అవునో ఏది కాదో?

ఏ దీపం వేళో నేను దిక్కుల్ని ముట్టి వచ్చేశాను
ఇప్పుడు కాయితమ్మీద రాస్తున్నప్పుడు
ఇది ఇప్పుడా కాదా అని సందేహం
టవర్‌క్లాక్‌లోంచి గంట మోగినప్పుడు
ఇప్పుడు నడుస్తున్న దారి వున్నట్టుండి నిన్నట్లోకి.
కాలాన్ని ఎక్కడో శుభ్రంగా జారవిడిచేశాను.

ఏ అన్నం వేళ
ఏ సగం కడుపుతో బయలుదేరానో
ఇప్పుడింకా ఆకలి
కడుపు నిండా
కళ్ళ నిండా!