"చందమామ" జ్ఞాపకాలు
డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్
పిల్లల మాసపత్రికగా దాదాపు అరవయ్యేళ్ళుగా అగ్రస్థానంలో ఉన్న "చందమామ"కు మా నాన్న కొడవటిగంటి కుటుంబరావుగారు "పేరు లేని" ఎడిటర్‌గా చాలా ఏళ్ళు పని చేశారు. 1960 ప్రాంతాల్లో నేను మద్రాసులో స్కూల్లో చదువుతున్న రోజులనుంచీ అప్పుడప్పుడూ సెలవు రోజుల్లో "చందమామ" ఆఫీసుకు వెళ్ళి రోజంతా గడుపుతూ ఉండేవాణ్ణి. అప్పటి విషయాలు కొన్ని చెప్పే ఉద్దేశంతో ఈ వ్యాసం రాస్తున్నాను.
"చందమామ" ఆఫీసు కోడంబాకం అవతల వడపళనిలో ఉండేది. 1960లలో వడపళని బస్సులకు టర్మినస్. అక్కడికి నాలుగే బస్సురూట్లు నడిచేవి. అక్కణ్ణించి ఇతర గ్రామాలకు వెళ్ళడానికి జట్కా బళ్ళుండేవి. అక్కడికి రెండు మూడు ఫర్లాంగుల దూరంలో "చందమామ" ఆఫీసుండేది. ఇంకాస్త నడిస్తే విజయా వాహినీ స్టూడియోలూ, ఇంకా దూరాన విజయా గార్డెన్స్ వగైరాలుండేవి. అప్పట్లో విజయచిత్ర పత్రికగాని, విజయా హాస్పిటల్‌గాని లేవు. విజయచిత్ర మొదలయాక అక్కడ రావి కొండలరావుగారినీ, ఆయన అసిస్టెంట్ ఈశ్వర్‌గారినీ, కార్టూనిస్టు సాంబుగారినీ కలిసేవాణ్ణి.
"చందమామ" తొలి సంచిక 1947 జూలైలో విడుదలైంది. ఆ పత్రిక పూర్తిగా చక్రపాణిగారి మానసపుత్రిక. తెనాలిలో ఆయనకు మా నాన్నగారితో చిన్నతనం నుంచీ పరిచయం ఉండేది. "చందమామ" ప్రారంభించినప్పుడు మా నాన్న ఆంధ్రపత్రికలో పనిచేస్తూ ఉండేవారు. అందువల్ల "చందమామ" పెట్టినప్పటినుంచీ చక్రపాణిగారు పిలుస్తూనే ఉన్నప్పటికీ 1951దాకా అందులో చేరలేదు. పైగా ఎక్కువ జీతం కూడా ఆఫర్ చేశారు. అప్పట్లో నాలుగు రాళ్ళ కోసం తరుచుగా ఉద్యోగాలు మారడం మర్యాదగా అనిపించేది కాదేమో. 1947 ప్రాంతాల్లో చక్రపాణిగారు "యువ", "ఆంధ్రజ్యోతి" పత్రికలను కూడా మద్రాసునుంచి ప్రచురించేవారు. వాటిలో కొన్ని శీర్షికలకు మా నాన్న తన పేరు పెట్టకుండా రాస్తూ ఉండేవారు. సర్ ఆర్థర్ కోనన్ డాయిల్ రాసిన రెండు షెర్లాక్ హోమ్స్ డిటెక్టివ్ నవలలకు అనువాదాలు చేశారు. అసలు యువ అనే పత్రికను మొదటగా మా నాన్న చాలా ఏళ్ళ కిందట తెనాలిలో నడిపారు కాని అది ఆగిపోయింది. ఆ పేరును చక్రపాణిగారు మా నాన్న అనుమతితో వాడుకున్నారు. చిత్రమేమిటంటే యువ మళ్ళీ ఆగిపోయింది. తరవాత 1961లో దాన్ని హైదరాబాదుకు మార్చి రెగ్యులర్‌గా ప్రచురణ మొదలుపెట్టగలిగారు. బుజ్జాయి ముఖచిత్రంతో మొదలైన ఆ పత్రిక బాగానే నడిచింది. అందులో మా నాన్న పనిలేని మంగలి అనే ఒక కాలమ్ పేరు లేకుండా రాసేవారు.
కొడవటిగంటి కుటుంబరావు
"చందమామ" తొలిసంచికల్లో పిల్లల ముద్దుమాటలుండేవి. "చూశారా పిల్లలూ", "ఏమోయి నేస్తం" వగైరా. ఇది చక్రపాణిగారికి అంతగా నచ్చినట్టులేదు. మా నాన్నగారికి బాధ్యత వప్పచెప్పాక కథల తీరు మారిపోయింది. కథలన్నీ సాఫీగా, పెద్దల భాషలోనే రావడం మొదలైంది. క్లుప్తంగా, ఏ విధమైన యాసా చోటు చేసుకోకుండా సూటిగా సాగే మా నాన్న శైలిని చక్రపాణిగారు "గాంధీగారి భాష" అని మెచ్చుకునేవాడట. ఇంకెవరు రాసినా ఆయనకు నచ్చేది కాదు. అంతకు ముందు రచయితలుగా పనిచేసిన ముద్దా విశ్వనాథంగారూ, తదితరులు ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకోసాగారు.
దాసరి సుబ్రహ్మణ్యం, మరొక కొలీగ్, కుటుంబరావు
దాదాపు మొదటినుంచీ ఉన్నవారిలో దాసరి సుబ్రహ్మణ్యం గారొకరు. మొదటి రంగుల సీరియల్ ఆయన స్పెషాలిటీ. తోకచుక్క, మకరదేవత, ముగ్గురు మాంత్రికులు మొదలైన అద్భుతాల నవలలన్నీ ఆయనవే. ఎందుచేతనో చక్రపాణిగారికి ఈ తరహా రచనలు నచ్చేవి కావు. పాఠకులకు మాత్రం అవి చాలా నచ్చేవి. ఒక దశలో వాటిని మాన్పించి బంకించంద్ర నవలను ప్రవేశపెట్టగానే సర్క్యులేషన్ తగ్గింది. దాంతో దాసరివారికి మళ్ళీ పనిపడింది. చక్రపాణిగారి టేస్టూ, పాఠకుల టేస్టూ వేరువేరని రుజువయింది.
ఇక తక్కిన కథలూ, శీర్షికలూ అన్నీ మా నాన్నే రాసేవారు. రచయితలుగా పత్రికలో మాత్రం కల్పితమైన పేర్లు పడేవి. పత్రికకు పేరు రావాలి తప్ప రచయితలకు పేరు రాకూడదనేది చక్రపాణిగారి సిద్ధాంతం. అదే జరిగింది కూడా. కొద్దిమంది రచయితలూ, జర్నలిస్టులూ, పరిచయస్థులూ తప్ప తక్కినవారికి ఎవరు రాస్తున్నారో తెలిసేదికాదు. మా నాన్న కూడా తన ఒరిజినల్ రచనలేవీ వెయ్యలేదు. మొత్తం మీద "చందమామ"కు త్వరలోనే ఎనలేని ప్రజాదరణ లభించసాగింది.
"చందమామ"లో కథల పద్ధతి విచిత్రంగా ఉండేది. మొదటి ఒరిజినల్ సంచిక తెలుగులో తయారయేది. అది పై నెలలో తమిళ, కన్నడ, హిందీ భాషల్లో వచ్చేది. ఎందుకంటే ఆ ఎడిటర్లకు తెలుగు చదవడం వచ్చు. ఆ తరవాతి నెలలో తమిళంనుంచి మలయాళంలోకీ, హిందీ నుంచి మరాఠీ, గుజరాతీల్లోకీ అనువాదం అయేది. అంటే ఉదాహరణకు మార్చ్‌లో విడుదలైన వివిధ సంచికలు తీసుకుంటే తెలుగులో సరికొత్త కథలూ, తమిళ, కన్నడ, హిందీల్లో ఫిిబ్రవరిలో అచ్చయిన తెలుగు కథలూ, తక్కిన వాటిల్లో జనవరిలో అచ్చయిన తెలుగు కథలూ పడేవి. ఏ భాషకా భాషలో వరస తప్పకుండా సంచికలు వచ్చేవి కనక ఎవరికీ ఇబ్బంది ఉండేది కాదు. ఇతర భాషల పాఠకులకు తెలుగే ఒరిజినల్ అని తెలిసేది కూడా కాదు. తమిళంలో అంబులిమామా, మలయాళంలో అంబిలి అమ్మావన్, మరాఠీలో చాందోబా ఇలా ప్రతిదీ దేనికదిగా పాప్యులర్ పత్రికలైపోయాయి.
తొలి సంచికల్లో దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి పిల్లల పద్యాలూ, పాలంకి రామచంద్రమూర్తిగారి కథలూ మొదలైనవి అచ్చయాయి. "తేడాలు కనుక్కోండి", "ఈ ఎలుకకు దారి చూపండి" తరహాలో బొమ్మల పేజీలుండేవి. తరవాతి రోజుల్లో ఇటువంటి ఫీచర్లన్నీ మానేశారు. ఫోటో వ్యాఖ్యల పోటీ మాత్రం చాలా సంవత్సరాలు నడిచింది. దానికి పంపిన పోస్టుకార్డులు వందల సంఖ్యలో వస్తూ ఉండేవి. వాటిని ఎంత త్వరగా ఏరిపారేసేవారో చూస్తున్న నాకు చాలా ఆశ్చర్యంగా ఉండేది. ఇవి తప్ప మొదట్లో పాఠకులు పంపిన కథలవంటివి దాదాపుగా ఏవీ ఉండేవి కావు. ఒకవేళ ఎవరైనా స్వంతంగా కథలు రాసి పంపినా అందులో సెలెక్టయిన వాటిని అవసరమనిపిస్తే "మెరుగుపరిచి" మా నాన్న తిరగరాసేవారు. మరే భాషలోనైనా ఎవరైనా కథ పంపితే అది క్లుప్తంగా ఏ ఇంగ్లీషులోకో అనువాదం అయి వచ్చేది. అది నచ్చితే తెలుగులో తిరగరాయబడి, మళ్ళీ మామూలు ప్రోసెస్ ద్వారా అన్ని భాషల్లోకీ తర్జుమా అయేది. ఈ తతంగమంతా జరుగుతున్నట్టు ఎవరికీ తెలియకపోయినా తాము పంపిన కథ తమ పేరుతోనూ, కొంత పారితోషికంతోనూ, తాము పంపినదానికన్నా మెరుగైన రూపంలోనూ అచ్చయేది కనక ఎవరికీ అభ్యంతరం ఉండేది కాదు. చక్రపాణిగారు ఈ విషయంలో రచయితల హక్కును అంతగా లక్ష్యపెట్టినట్టు కనబడదు. 1970ల తరవాత బైటినుంచి రచనలు రావడం, వాటిని "సంస్కరించి" ప్రచురించడం ఎక్కువైంది. ఒక దశలో పురాణం సుబ్రహ్మణ్యశర్మ గారు"చందమామ"లో చేరదామనుకున్నారుగాని అది ఎందుచేతనో జరగలేదు.
"చందమామ" ఆఫీసులో ఎం.రంగరావు ఫుల్‌టైం కన్నడం ఎడిటర్‌గా ఉండేవారు. తెలుగు స్టాఫ్ తప్ప తక్కినవారంతా పార్ట్ టైం పనిచేసేవారు. తమిళ ఎడిటర్ స్వామినాథన్, హిందీకి సంపాదకుడైన ప్రఖ్యాత నవలా రచయిత ఆరిగపూడి రమేశ్‌చౌదరి (తరవాత బాలశౌరిరెడ్డి గారు ఈ బాధ్యత తీసుకున్నారు), మరాఠీకి భాలచంద్ర ఆప్టే తదితరులు అప్పుడప్పుడూ వచ్చేవారు.
"చందమామ" ప్రజాదరణ పొందడానికి చాలా కారణాలుండేవి. మొదటిది కథల ఎంపిక, రెండోది కథనశైలి, మూడోది బొమ్మల అందాలు, నాలుగోది ఉత్తమమైన ప్రింటింగ్ క్వాలిటీ. ప్రతి కథనూ చక్రపాణిగారు "అప్రూవ్" చెయ్యాలి. సామాన్యంగా ఆయనకు నచ్చనివి తక్కువగానే ఉండేవి. అప్పుడప్పుడూ ప్రజల తిరుగుబాటువంటి లెఫ్టిస్టు అంశాలుంటే ఆయన తీసేయించేవాడు. అందులో ఆయనకు కమ్యూనిస్టు వాసన అనిపించేదేమో. సౖెన్స్ పేజీ కూడా ఆయనకు నచ్చక మాన్పించాడు. నాగిరెడ్డిగారు యజమాని అయినప్పటికీ పత్రిక వ్యవహారాలన్నీ చక్రపాణికే వదిలేసేవారు. నాగిరెడ్డిగారు అతి ప్రతిభావంతంగా నడిపిన బి.ఎన్.కె.ప్రెస్ "చందమామ"ను అందంగా ముద్రిస్తూ ఉండేది. ఎన్నో కొత్త రకం అచ్చు యంత్రాలను మనదేశంలో మొట్టమొదటగా నాగిరెడ్డిగారే కొని వాడడం మొదలెట్టారు. ఈ విధంగా చక్రపాణిగారి "సాఫ్ట్‌వేర్"కు నాగిరెడ్డిగారి "హార్డ్‌వేర్" తోడై "చందమామ"ను విజయవంతంగా తీర్చిదిద్దింది.
"చందమామ" కథల్లో ప్రపంచ సాహిత్యంలోని గొప్ప అంశాలన్నీ ఉపయోగపడ్డాయి. భారతం, రామాయణం, భాగవతం, ఉపనిషత్తుల్లోని కొన్ని కథలూ, కథా సరిత్సాగరం, బేతాళకథలూ, పంచతంత్రం, అరేబియన్ నైట్స్ ఇలా విశిష్టమైనవన్నీ మామూలు కథల రూపంలో వచ్చాయి. భాసుడూ, కాళిదాసూ ఇతర సంస్కృత రచయితల నాటకాలూ, షేక్‌స్పియర్ అనువాదాలూ అన్నీ పాఠకులు చదవగలిగారు. ఇవికాక గ్రీక్ పురాణాలైన ఇలియడ్, ఒడిస్సే, వివిధ దేశాల జానపద కథలూ అన్నీ "చందమామ"లో వచ్చాయి. "చందమామ" ఆఫీసులో అన్ని ప్రపంచదేశాల జానపద కథలూ ఉండేవి. ఏ కథనైనా మన దేశానికీ, తెలుగు భాషకూ సరిపోయేట్టు మలిచి రాయడం మా నాన్నగారి పని. అంతేకాక ఒరిజినల్ బేతాళ కథలన్నీ అయిపోయాక మామూలు కథలను ఎంపిక చేసి, అందులోఒక క్విజ్ ప్రవేశపెట్టి, దానికి విక్రమార్కుడి చేత సమాధానం చెప్పించడం ఆయనకు ఒక కసరత్తుగా ఉండేది. బేతాళ కథలు మొత్తం ఇరవై అయిదేనని చాలామందికి తెలియకపోవచ్చు కూడా. కథల క్వాలిటీ ఎంత బావుండేదంటే విశ్వనాథ సత్యనారాయణగారు క్రమం తప్పకుండా ప్రతి సంచికనూ తెప్పించుకుని చదివేవాడట. ఇక సర్క్యులేషన్ విషయంలో హిందీ ఎడిషన్ అన్నిటికన్నా ఎక్కువగా అమ్ముడయేది. 1966లో మా కుటుంబమంతా ఢిల్లీ, బెనారస్ మొదలైన ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మా నాన్నకు తెలుగు రచయితగా కాక హిందీ చందమామ వల్ల ప్రతి చోటా ఘనస్వాగతం లభించింది. 1957 ప్రాంతాల్లో "చందమామ" ఇంగ్లీష్ ఎడిషన్ కూడా వేశారు. అది అన్ని విధాలా తక్కిన సంచికల్లాగే ఉండేది. అదంతా మా నాన్నగారే రాసేవారు. తరవాత దాన్ని ఆపేశారు. చాలా ఏళ్ళ తరవాత, నాగిరెడ్డిగారి కొడుకులు పెద్దవాళ్ళయాక మళ్ళీ ఇంగ్లీష్ సంచికను కొత్త ఫార్మాట్‌లో మొదలుపెట్టారు.
మొదట్లో "చందమామ"కు చిత్రా (టి.వి. రాఘవన్) ప్రధాన ఆర్టిస్టుగా ఉండేవారు. ప్రారంభ సంచిక ముఖచిత్రం ఆయనదే. కథలకు కొన్నింటికి మొదట్లో కార్టూనిస్టు కేశవరావుగారు కూడా బొమ్మలు వేశారు. ఆ తరవాత శంకర్ చేరారు. చిత్రాలాగే ఈయనా తమిళుడే. చిత్రాగారు చిత్రకళ నేర్చుకోలేదు. స్వంతంగా ప్రాక్టీసు చేశారు. ఆయన మంచి ఫోటోగ్రాఫరట. ఎప్పుడూ నీట్‌గా డ్రస్ చేసుకుని వచ్చేవారు. మితభాషి. అస్తమానం ఇన్‌హేలర్ ఎగబీలుస్తూ ఉండేవాడు. చిన్నప్పుడు నాకు బొమ్మలు గీసే అలవాటుండడంతో ఆయన పక్కన గంటల తరబడి కూర్చుని చూసేవాణ్ణి. ముందుగా పెన్సిల్ స్కెచ్ గీసుకుని, ఆ తరవాత ఇండియన్ ఇంక్‌తో ఆయన బొమ్మలు వేసేవారు. ఒక సందర్భంలో బాపూ చిత్రాగారి బొమ్మలు తన కిష్టమనీ, గాలిలో ఎగిరే ఉత్తరీయం గీసే ఆయన పద్ధతి తనకు నచ్చుతుందనీ మాతో అన్నారు.
అమెరికన్ కామిక్స్ "చందమామ" ఆఫీసులో చాలా ఉండేవి. వివిధ దేశాలవారి డ్రస్సులనూ, వెనకాల బిల్డింగుల వివరాలనూ చిత్రా వాటినుంచి తీసుకునేవారు. ఈ కారణంగా విదేశీ కథలన్నీ సామాన్యంగా ఆయనకే ఇచ్చేవారు. దాసరివారి సీరియల్‌కు చిత్రాగారి బొమ్మలు ప్రత్యేక ఆకర్షణగా ఉండేవి. అప్పుడప్పుడూ ఆయన బొమ్మల కోసమేనేమో అన్నట్టుగా సుబ్రహమణ్యంగారు "మూడు కళ్ళూ, నాలుగు తలలూ ఉన్న వికృతాకారుడు" మొదలైన పాత్రలను కథలో ప్రవేశపెట్టేవారు. మొసలి దుస్తులవాళ్ళూ, భల్లూకరాయుళ్ళూ చిత్రాగారి బొమ్మలవల్ల ఆకర్షణీయంగా కనబడేవారు. శంకర్ ఆర్టు స్కూల్‌కు వెళ్ళిన మనిషి. టూరిస్టు వింతలవంటి ఒక పేజీ విషయాలకు ఫోటోను చూసి చిత్రీకరించడం ఆయన ప్రత్యేకత. మొత్తం మీద వీరిద్దరూ డిటెయిల్స్‌తో కథలకు బొమ్మలు వేసే పధతిని ప్రవేశపెట్టారు. అప్పుడప్పుడూ యువ దీపావళి సంచికల్లో కూడా కథలకు వీరు చిత్రాలు గీసేవారు. "చందమామ"కు ప్రత్యేకత రావడానికి బొమ్మలు చాలా దోహదం చేశాయి.
చక్రపాణిగారి "చాదస్తాలు" ఒక కొత్త ఒరవడిని సృష్టించాయనడంలో సందేహం లేదు. ప్రతి పేజీకీ బొమ్మ ఉండడం, బొమ్మల సరిహద్దుల్లో కథలన్నీ ఇమిడిపోవడం అంతకు మునుపెన్నడూ ఏ పత్రికలోనూ ఉండేది కాదు. ఇందుకుగాను కథల మాటలను సరైన పొడవుకు కత్తిరించే దర్జీ పని చాలా ఉండేది. కథ సరిగ్గా బొమ్మ వద్దే పూర్తయేది. అర అంగుళం ఎడం కూడా మిగిలేది కాదు. చక్రపాణి గారికున్న పట్టింపుల్లో మరొకటి విచిత్రమైనది. పత్రిక మధ్య పేజీలో (స్టేప్‌ల్ ఉండేది) ఎడమ పేజీలో కథ పూర్తవకూడదు. కథల క్రమం ఎలాగైనా మార్చి మధ్య పేజీలు రెండింటిలోనూ ఒకే కథ కొనసాగేట్టు చూడాలి. ఎడిటర్లకు ఇదొక తలనొప్పిగా ఉండేది. 1975లో ఒకసారి ఈ పొరబాటు జరగనే జరిగింది. ఇది సరిదిద్దుకోవడం ఎలాగా అని ఆలోచిస్తూండగానే అదే నెల చక్రపాణిగారు చనిపోయారు. సంచిక అంతా తయారయిపోయింది కనక ఆయన గురించి మా నాన్నగారు నాలుగు పేజీలు రాసి, ఆ కాగితాన్ని మధ్యపేజీగా సంచికలోకి చేర్చవలసి వచ్చింది. ఆ విధంగా చక్రపాణిగారి కోరికా నెరవేరింది. చక్రపాణిగారి తరవాత ఆయన బాధ్యత నాగిరెడ్డిగారి కుమారుడు విశ్వనాథరెడ్డి తీసుకున్నారు.
1952 ప్రాంతాల్లో ఎం.టి.వి. ఆచార్యగారు "చందమామ"లో ఆర్టిస్టుగా చేరారు. మహా భారతం అట్టచివరి బొమ్మకూ, అట్టమీది బొమ్మకూ ఆయన అద్భుతమైన బొమ్మలు గీశారు. ఆయనకు మనుషుల ఎనాటమీ క్షుణ్ణంగా తెలుసు. సుమారు 20 ఏళ్ళ పాటు కొనసాగిన మహాభారతం సీరియల్‌కు ఆయన వివిధ పాత్రల ముఖాలు ఏ మాత్రమూ మార్పు లేకుండా చిత్రీకరించారు. అందరూ బుర్రమీసాల మహావీరులే అయినా ధర్మరాజు, భీముడు, అర్జునుడు, దుర్యోధనుడు, ఇలా ప్రతి ఒక్కరినీ బొమ్మ చూడగానే పోల్చడం వీలయేది. భీష్ముడికి తెల్ల గడ్డమూ, బట్టతలా ఆయనే మొదటగా గీసినట్టు గుర్తు. భీష్మ సినిమాలో ఎన్.టి.రామారావు మేకప్ అంతా "చందమామ"కు కాపీ అని నా ఉద్దేశం. ఆ తరవాత ఆయన వ్యక్తిగత కారణాలవల్ల బెంగుళూరుకు వెళ్ళిపోయారు. అప్పటికే చక్రపాణి గారికి వడ్డాది పాపయ్యగారి బొమ్మలంటే మోజు పెరిగింది. ఆ తరవాత సంచిక లన్నిటికీ పాపయ్యగారే బొమ్మలు వేశారు. పాపయ్యగారు మహాపండితుడు. (చివరి దశల్లో దేవీ భాగవతం సీరియల్ రాయడం మా నాన్నగారికి ఇబ్బందిగా తయారవడంతో ఆయన సంతోషంగా ఆ పనిని స్వీకరించాడు). కాని బొమ్మల్లో ఆయనకు ఎనాటమీ పట్ల అంత శ్రద్ధ ఉండేది కాదని నా కనిపించేది. ఆచార్యగారి బొమ్మలకు అలవాటుపడ్డ నాలాంటి వారికి పాపయ్యగారి బొమ్మలు అంతగా నచ్చలేదు. కొన్ని సంచికలకు బాపూగారు కూడా బొమ్మలు వేశారు. "చందమామ" ఫార్మాట్‌లో గీసినా ఆయన తన శైలిని మార్చుకోలేదు. ఉత్పల సత్యనారాయణాచార్యగారి గేయ కథలకు ఆయన మంచి బొమ్మలు గీశారు. ఉత్పలవారికి పేరు రావడం వల్లనో ఏమో ఆయన రచనలు కొనసాగలేదు. అంతకు మునుపు విద్వాన్ విశ్వం గారూ (పంచతంత్రం), ఇంకా మునుపటి సంచికల్లో ఆలూరి బైరాగిగారూ తమ కవితలను "చందమామ"లో ప్రచురించారు.
"చందమామ"వల్ల యాజమాన్యానికి విపరీతమైన లాభాలు వచ్చినా పత్రికను కొద్దిమందితోనే, ఒక చిన్న ఆఫీసులో, తక్కువ జీతాలతో నడిపేవారు. ఎటొచ్చీ రిటైర్‌మెంట్ వయస్సు వగైరాల పట్టింపులుండేవి కావు. ఆఫీసులో వాతావరణం ప్రశాంతంగా, ఫ్రెండ్లీగా ఉండేది. నెలనెలా ఒకే రకమైన పని కనక ఎవరి పని వారు హడావిడి లేకుండా చేసుకుపోతూ ఉండేవారు. ఆఫీసులో చిన్న పనులు చేసే బాబూరావు, ఆర్ముగం మొదలైనవారు కూడా "పాత కాపులే" గనక పనంతా సాఫీగా జరిగేది. ప్రింటింగ్ ప్రెస్ చాలా బావుండేది. దాన్ని చూడడానికి మొదట్లో పెద్దలంతా వస్తూ ఉండేవారు.
1950లలో బి.ఎన్.కె.ప్రెస్‌ను చూడటానికి వచ్చిన రాజకీయ ప్రముఖులు.
కుడి పక్కన చివర కుటుంబరావు
1952 ప్రాంతాల్లో నాగిరెడ్డిగారు కినిమా అనే సినీ మాసపత్రికను మొదలుపెట్టారు. అందులో కూడా శీర్షికలూ, వ్యాసాలూ అన్నీ మా నాన్నగారే రాసేవారు. అది రెండు మూడేళ్ళకే ఆగిపోయింది. రంగులు లేకపోయినా కంటెంట్ విషయంలో అది ఆ తరవాత వచ్చిన విజయచిత్ర కన్నా ఎన్నో రెట్లు బావుండేది. అప్పుడే పైకొస్తున్న నటీనటులూ, సినీ గాయనీ గాయకులూ అనేకమందితో మా నాన్న జరిపిన ఇంటర్వ్యూలు ఇప్పుడు చదవటానికి చాలా ఆసక్తికరంగా ఉంటాయి. "పి.లీల అనే కొత్త అమ్మాయి" గొంతు గురించీ, ఎస్.వి.రంగారావు నాటకానుభవం గురించీ వివరాలు లభిస్తాయి.
కినిమా డెస్క్ వద్ద కుటుంబరావు
నాకు చిన్నప్పుడు సినిమా పిచ్చి లేకపోయినా "చందమామ"కు వెళ్ళినప్పుడు లంచ్ విరామంలో సినిమా షూటింగులూ, సినీ రికార్డింగులూ చూడడానికి మా నాన్నతో వెళ్ళేవాణ్ణి. ఎప్పుడైనా ఆంధ్ర ప్రాంతాలనుంచి మా బంధువులూ, మిత్రులూ ఎవరైనా వస్తే వారికి తోడుగా షూటింగులకి వెళ్ళి చూడడం మరొక బాధ్యతగా ఉండేది.
"చందమామ" కాంపౌండ్ అంతా అందమైన మొక్కలతో, మంచి లాండ్ స్కేపింగ్‌తో చూడముచ్చటగా ఉండేది. ఎప్పుడూ ఎక్కడో అక్కడ ఏదో ఒకటి పడగొట్టి కొత్త బిల్డింగులు కడుతూనే ఉండేవారు. జాతకరీత్యా అలా చేస్తూ ఉండడం మంచిదని నాగిరెడ్డిగారికి జ్యోతిష్కులు చెప్పారని ఎవరో అన్నారు. మా నాన్నగారు చివరిదాకా "చందమామ"లో పనిచేస్తూనే ఉన్నారు. ఆయన పోయే ముందురోజు (శనివారం ఆగస్టు 16, 1980న) ఆయనను చివరిగా కలుసుకున్న జర్నలిస్టు పురాణం సుబ్రహ్మణ్యశర్మ. అంతకు ఒకటి రెండేళ్ళ ముందు మా నాన్నకు అనారోగ్యంగా ఉన్నప్పుడూ, ఆయన పోయిన తరవాతా "చందమామ" నిర్వాహకులు మా కుటుంబానికి ఎంతో సహాయపడ్డారు. ప్రతి నెలా రెండు మూడు నెలల పని అడ్వాన్సుగా సిద్ధం చేసేవారు కనక మా నాన్న రాసిన కథలన్నీ "చందమామ"లో నవంబర్ 1980 సంచిక దాకా వేశారు.
నేను అయదో ఏటి నుంచీ తెలుగు చదవడం మొదలుపెట్టాను. మద్రాసులో పుట్టి, పెరిగిన నాలాంటివాళ్ళకు ఈ మాత్రం తెలుగు రావడానికి ముఖ్యకారణం "చందమామ" చదవడమే. నేను ఎంత ప్రయత్నించినా బొంబాయలో పుట్టి, పెరిగిన మా పిల్లలకు "చందమామ" పాత సంచికలన్నీ చదివే అలవాటు చెయ్యలేకపోయాను. ఏదో కష్టపడితే ఒక పేజీ చదవడానికి గంటసేపు పట్టేది కనక వారు అంత ఉత్సాహం చూపలేదు. ఎప్పటికైనా వారు అది చేస్తారనే నా నమ్మకం. తెలుగులో మాట్లాడడం అలవాటైన మా పిల్లలవంటివారికి "చందమామ" చదువుతూ ఉంటే భాషతో మరికొంచెం పరిచయమూ, తెలుగు నుడికారమూ పట్టుబడతాయని నా ఉద్దేశం. పిల్లలను తెలుగు చదవమని ప్రోత్సహించడానికి "చందమామ" మంచి సాధనమని నాకనిపిస్తుంది. ఎందుకంటే అమెరికాలో ఉంటూ ఇంటర్నెట్ మీద తెలుగు టీవీ వార్తలను చూస్తున్న నాకు ఆంధ్రప్రదేశ్‌లోనే తెలుగు మరిచిపోతున్నారన్న వాదనలో కొంత నిజం లేకపోలే దనిపిస్తోంది. పిల్లలకు ఎంటర్‌టైన్‌మెంట్‌తో బాటు తెలుగు చదవడం రావాలంటే "చందమామ" వంటిది చదవడం ఒక్కటే మార్గమేమో.
"చందమామ" మొదలుపెట్టినప్పుడు తెలుగుభాషను గురించిన ఇటువంటి భయాలేవీ ఉండేవి కావుగాని పిల్లలకు ఆరోగ్యకరమైన సాహిత్యం అందించాలనే ఉద్దేశం మాత్రం ఉండేది. భూతప్రేతాల గురించిన భయాలు తగ్గడానికీ, జానపద సాహిత్యంలో తప్పనిసరిగా ఉండే కొన్ని మూఢవిశ్వాసాలు మితిమీరకుండా చూడడానికీ గట్టి ప్రయత్నాలే జరిగాయి. సర్కార్ వంటివారి చేత ఇంద్రజాలం గురించిన వివరాలను ప్రచురించడంతో పిల్లలకు కొన్ని కిటుకులు తెలుస్తూ ఉండేవి. పురాణాల్లో కూడా వాల్మీకి రామాయణాన్నే అనుసరిస్తూ, ఇతర రామాయణాల వెర్రిమొర్రి అంశాలేవీ కథలోకి రాకుండా చూసే ప్రయత్నం జరిగింది. 1969లో బాలసాహిత్యం గురించి రాసిన ఒక వ్యాసంలో మా నాన్నగారి దృక్పథం స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన లెక్కన "బాలసాహిత్యం పిల్లల మెదడులో కొన్ని మౌలికమైన భావనలను బలంగా నాటాలి. ధైర్యసాహసాలూ, నిజాయితీ, స్నేహపాత్రత, త్యాగబుద్ధీ, కార్యదీక్షా, న్యాయమూ మొదలైనవి జయించటం ద్వారా సంతృప్తిని కలిగించే కథలు, ఎంత అవాస్తవంగా ఉన్నా పిల్లల మనస్సులకు చాలా మేలుచేస్తాయి...పిల్లలలో దౌర్బల్యాన్ని పెంపొందించేది మంచి బాలసాహిత్యం కాదు...దేవుడి మీద భక్తినీ, మతవిశ్వాసాలనూ ప్రచారం చెయ్యటానికే రచించిన కథలు పిల్లలకు చెప్పటం అంత మంచిది కాదు...కథలో నెగ్గవలసినది మనుష్య యత్నమూ, మనిషి సద్బుద్ధీనూ". ఇది "చందమామ" కథల్లో ఎక్కువగా కనబడుతుందని అందరికీ తెలిసినదే.
అసలు "చందమామ" పిల్లల పత్రికేనా అనే అనుమానం కూడా వ్యక్తం చేసినవారున్నారు. ఎందుకంటే అందులోని కథలు అందరూ చదవదగినవే. ఏది ఏమైనా తెలుగు బాలసాహిత్యం జాతకంలో "చంద్ర మహాదశ" వంటిదేదో "చందమామ"తోనే మొదలైనట్టుగా అనిపిస్తుంది. దాని ధాటికి అంతకు ముందు వచ్చిన "బాల", తరవాత మొదలైన "బాలమిత్ర" వగైరా పత్రికలేవీ నిలవలేకపోయాయి. తెలుగులో "చందమామ"కు పోటీయే ఉండేది కాదు. ఇప్పటికీ అది అందరికీ అభిమాన పత్రికే.