తెలుగు కథలో తన మార్గం

కల్పనా రెంటాల

తెలుగు సమాజంలో, సాహిత్య జీవితంలో స్త్రీ దృక్పథం, స్త్రీ చైతన్యం, స్త్రీవాదం మూడు ప్రధాన దశలు అనుకుంటే ఆ మూడు దశల ద్వారా ప్రయాణం చేసిన ఒక రచయిత్రి స్వీయ సాహిత్య వికాసాన్ని మనం అబ్బూరి ఛాయాదేవి కథాప్రస్థానంలో చూడవచ్చు. దాదాపుగా ఆరు దశాబ్దాల కథాయాత్రలో అబ్బూరి ఛాయాదేవి కథలు స్త్రీ దృక్పథంతో మొదలై స్త్రీవాద దృక్పథంతో సంభాషించే దశ వరకూ ప్రయాణిస్తాయి.

మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబాల స్త్రీల జీవనచిత్రణ మొదలుకొని స్త్రీలు ఉద్యోగ వ్యవస్థలోకి, ప్రపంచీకరణ పరిణామాల్లోకి ప్రవేశించేవరకూ పడే మానసిక, సామాజిక ఒత్తిళ్లను ఛాయాదేవి గారి కథలు సాధ్యమైనంత సమతౌల్యంతో, సంయమనంతో చర్చకు తీసుకువస్తాయి. ఈ మొత్తం పరిణామాల మధ్య ఎక్కడా కూడా ఎటో ఒకవైపు తెగేదాకా లాగడం ఆమె ధోరణి కాదు. భిన్నదృక్పథాల మధ్య ఓ కొత్త వాస్తవికత వైపు వెలుగు ప్రసరించే మధ్యేమార్గం తనకు ఇష్టమని ఆమె స్వయంగా చెప్పుకున్నారు. ఆమె కథలు అందుకు ఉదాహరణ.

ఈ అరవై యేళ్ళ కథాజీవితంలో ఛాయాదేవి కథలు ఇతివృత్తం లోనూ, దృక్పథంలోనూ సాధించిన మార్పుని గమనిస్తే మూడు ప్రధానమైన అంశాలు కనిపిస్తాయి. అవి స్త్రీ పురుష సంబంధాల్లోని అసమత్వం; పట్టణ, నగర జీవితాల్లో స్త్రీలు కొత్తగా ఎదుర్కొనే కుటుంబ సామాజిక ప్రభావాలు; ఉద్యోగవ్యవస్థ, అది కల్పించే ఆర్థిక ఒత్తిళ్లు. ఇవి కాకుండా ఇప్పుడు స్త్రీవాద కథారచయిత్రులు ముఖ్యంగా చర్చిస్తున్న ప్రపంచీకరణ గురించిన ప్రాథమిక రూపాల్ని కూడ ఛాయాదేవి గారి కథల్లో చూడవచ్చు. ఛాయాదేవి గారి కథాయాత్రని అర్థవంతం చేసిన మరో ముఖ్యమైన అంశం 1965 లో రాసిన "ప్రయాణం" కథ నుండి ఇటీవలి కథల దాకా కథాకథనంలో, కథనదృక్పథంలో సాధించిన పరిణామం.

"ఫెమినిజం" అన్నమాట తెలుగుసాహిత్యరంగంలో వినిపించటానికి ముందునుంచే ఆమె తన కథల్లో దాని ఛాయల్ని సున్నితంగా చూపించగలిగారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమే చెప్పుకున్నట్టు "ఫెమినిజాన్ని తీవ్రంగా, సూటిగా చెప్పకుండా సుగరంకోటెడ్ మాత్ర లాగా చెప్పటం వల్ల" ఆమె ఎక్కువమంది పాఠకులకు దగ్గరయ్యారు. చాలామంది సాహిత్యవిమర్శకులకు, కథాభిమానులకు ఆమె అభిమాన రచయిత్రి కాగలిగారు. ముఖ్యంగా ఆమె కథల్లో అందర్నీ ఆకట్టుకునేది చక్కటి భాష, తెలుగునుడికారం, కథను సహజంగా నడిపించే తీరు.

విద్యార్థి దశ నుండే కలం పట్టి తన అనుభవాల్ని, అనుభూతుల్ని కథలుగా చెప్పటం మొదలెట్టారు ఛాయాదేవి. 1952లో రాసిన "అనుబంధం" కథతో ఆమె కథాప్రస్థానం మొదలైంది. కుటుంబంలో పురుషాధిపత్యం ఎలా ఉంటుందో, అందులోనే స్త్రీలు ఎలా ఆనందాన్ని వెతుక్కుంటారో ఆ కథలో చెప్పారు. ఆ తరువాత వైవాహిక జీవితంలోని మంచిచెడుల్ని విశ్లేషిస్తూ రాసిన కథ 1955లో "తెలుగుస్వతంత్ర"లో అచ్చయింది. దాదాపు పదేళ్లకు 1965లో ఆమె రాసిన "ప్రయాణం" కథ ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. స్థూలంగా, అరవైయవ దశకంలో ఆమె రాసిన కథల్లో స్త్రీ దృక్పథం నుండి జీవితాన్ని సునిశితంగా పరిశీలించడం కనిపిస్తుంది.

వాటిలో "ప్రయాణం" కథ ఇవాళ్టికీ నిత్యనూతనంగా వుంటుంది. తల్లిదండ్రుల్ని ఎదిరించైనా ప్రేమించిన వాడిని పెళ్లిచేసుకోవాలన్న రమ వాల్తేరు వెళుతూ మధ్యలో రాజమండ్రిలో దిగి స్నేహితురాలింటికి వెళుతుంది. అక్కడ స్నేహితురాలి భర్త ఆమెపై అత్యాచారం చేస్తే ప్రేమించిన వ్యక్తి ఆమెతో పెళ్లికి వెనకడుగు వేస్తాడు. రామకృష్ణ మిషన్‌లో చేరిపోవాలనుకుంటున్న రమను శరీరం మలినపడటం అనే భావనే ఎంత తప్పో వివరించి తన జీవితంలోకి ఆహ్వానిస్తాడు ఆమెను పెళ్లిచేసుకోవాలనుకున్న శేఖరం. 1960ల్లో ఈ కథకు ఇచ్చిన పరిష్కారం అప్పట్లో స్త్రీకి కుటుంబం పట్ల, జీవితం పట్ల వున్న అవగాహనను చూపిస్తుంది. ఆ కథ ముగింపు స్త్రీ చైతన్యవంతం కావాలనటానికి ఓ సంకేతం. అయితే ఈ కథలో గొప్పతనం పరిష్కారం రమ వైపు నుండి చూపించకపోవడం. పురుషపాత్ర నుండి అభ్యుదయభావాన్ని, సంస్కారాన్ని చూపించడం వల్ల ఆనాటి పాఠకుల నుండి ఆ పరిష్కారం పట్ల ఎలాంటి నిరసన కానీ, వ్యతిరేకత కానీ ఎదురుకాలేదు. ఈకథను ఛాయాదేవి గారు 90ల్లో రాసివుంటే తప్పనిసరిగా అది రమ తీసుకున్న నిర్ణయంగా చూపించి వుండేవారు.

జీవితంలోని సంఘర్షణను తార్కికంగానే కాకుండా తాత్వికదృక్కోణం నుంచి కూడా చూపటం ఆమెకున్న ప్రత్యేకమైన నేర్పు. మధ్యతరగతి కుటుంబ జీవితంలో స్త్రీ పురుషుల మధ్య అసమసంబంధాలు కుటుంబపరంగా, ఆర్థికపరంగా, సాహిత్యపరంగా ఎలా వుంటాయో ఆలోచనాత్మకంగానే కాకుండా వ్యంగ్యంగా ఆవిష్కరిస్తాయి ఆమె కథలు. ఉపగ్రహం-1 కథలో పెళ్లి తరువాత భర్తే సర్వస్వం అనుకుని తనకంటూ సొంతప్రపంచం లేకుండా మానసికంగా అతనిపై ఆధారపడి అతని చుట్టూ ఉపగ్రహంలా తిరగాల్సి రావడం ఎంత బాధాకరమో చూపిస్తారు. తన ఆఫీసు, తన స్నేహితులే తప్ప భార్య అనే మనిషి జవజీవాలతో తనతో కలిసి ఇంట్లో కాపురం చేస్తోందన్న కనీసస్పృహ లేని భర్తలతో కాపురం ఎంత నరకమో ఆమె ఈకథ ద్వారా చెపుతారు. ఉద్యోగం చేయడం ఈ సమస్యకు పరిష్కారమేమో అనుకుంటుంది ఈ కథలో నాయిక. అయితే భార్య బైటకెళ్లి ఉద్యోగం చేసినా కుటుంబజీవితంలో భార్య హోదాలో ఎలాంటి మార్పూ రాదని చెప్తారు "శ్రీమతి - ఉద్యోగిని" కథలో.

స్త్రీల జీవితంలో సుఖనిద్ర ఎంత కరువో, చివరకు నిద్రమాత్రలు మింగితే తప్ప ఆదమరిచి కంటినిండా నిద్రపోవటం ఎలా సాధ్యం కాదో "సుఖాంతం" కథ చెపుతుంది. స్త్రీల జీవితాలు కుండీల్లో ఎదగకుండా కత్తిరించేసిన బోన్‌సాయ్ మొక్కల్లాంటివని, ఆడపిల్లలు, మగపిల్లల పెంపకంలో తేడా వల్ల మగపిల్లలు స్వేచ్ఛగా తురాయిచెట్ల లాగా ఎత్తుకు ఎదిగితే ఆడపిల్లలు బోన్‌సాయ్ మొక్కల్లా కుదించుకుపోయి వుంటారని చెప్పే ఈకథ ప్రపంచవ్యాప్తంగా మంచి కథగా గుర్తింపు తెచ్చుకుంది. స్త్రీలు కుటుంబం నుండి బైటకు కాలుమోపి ఉద్యోగం చేస్తున్నప్పుడు మగబాస్‌ల నుండి, తోటి కొలీగ్స్ నుండి ఎదురయ్యే సమస్యలను చర్చకు పెడతారు "కర్త, కర్మ, క్రియ" కథలో. సాహిత్యలోకంలో స్త్రీ పురుషుల మధ్య అసమత్వం ఎలా వుంటుందో చెప్పే కథ "సతి". భార్యాభర్తలిద్దరూ రచయితలైనప్పుడు దురదృష్టవశాత్తు భర్త చనిపోతే భార్యను కూడా "సాహితీసతి" చేసే విధానాన్ని వేలెత్తి చూపుతూ పాఠకుల్ని ఆలోచింపచేస్తారు ఈ కథలో.

ఛాయాదేవి గారి కథల్లో స్త్రీపాత్రలు కుటుంబం లోనూ, సమాజం లోనూ తమకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తిస్తాయి. వాటి గురించి ఆలోచిస్తాయి. చివరకు వాటితో రాజీపడిపోతాయి తప్ప వాటికి ఎదురుతిరిగి నిలబడటం 80వ దశకం వరకూ ఆమె రాసిన కథల్లో పెద్దగా కనిపించదు. స్త్రీలు తమ సమస్యల్ని తాము గుర్తించగలగటం, వాటి గురించి ఆలోచించటమే ఆనాటికి స్త్రీచైతన్యం కింద లెక్క. ఆ తరువాత రాసిన కథల్లో మాత్రం పరిస్థితులకు తలొగ్గకుండా ధైర్యంగా తాము నమ్మిన మార్గంలో ప్రయాణిస్తాయి ఆమె స్త్రీ పాత్రలు. "తన మార్గం", "పరిధి దాటిన వేళ" లాంటి కథలు అందుకు మంచి ఉదాహరణ. భర్త చనిపోతే కొడుకు దగ్గరకో, కూతురు దగ్గరకో వెళ్లనక్కరలేదని, తన బతుకు తనిష్టం వచ్చినట్టు తాను బతకవచ్చని చెప్తారు "తన మార్గం" కథలో. ఛాయాదేవి గారు రాసిన చాలామంచి కథల్లో ఇదొకటి.

జీవితం పట్ల ఆమెకున్న సునిశితమైన అవగాహన, లోతైన పరిశీలన ఆమె కథల్లో మనకు స్పష్టంగా కనిపించే అంశం. ఒకప్పుడు మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబాల్లో ఆడపిల్లలకు అరుదుగా లభించేది తండ్రిస్పర్శ. పిల్లలపై ప్రేమ వున్నా గంభీరంగా, కఠినంగా కనిపిస్తూ ఆమడదూరంలో వుంచే నాన్న ముసలివయసులో ఆప్యాయంగా కూతురి చేయి పట్టుకున్నప్పుడు ఆ తండ్రి స్పర్శ ఎంత అపురూపంగా కనిపిస్తుందో ఆర్ద్రంగా మనసుకు హత్తుకునేలా చెప్పిన కథ "స్పర్శ". ఈకథే కాదు, తన తండ్రి తనకు రాసిన ఉత్తరాల ఆధారంగా ఛాయాదేవి గారు రాసిన "మృత్యుంజయ" కూడా ఉత్తమ రచనగా, విలక్షణప్రయోగంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

అయితే ఎక్కడా కూడా ఆమె కథల్లో స్త్రీపాత్రలు హఠాత్తుగా స్త్రీవాద చైతన్యం తెచ్చుకుని తిరుగుబాటు చేసినట్టు కథనంలో కానీ, శిల్పరీత్యా కానీ చూపించకపోవడం ఛాయాదేవి గారి ప్రత్యేకత. దృక్పథపరంగా ఆమెలో వచ్చిన మార్పుకు తార్కాణం 90ల నుండి ఆమె రాసిన కథలు. మొదటి నుంచి జీవితాన్ని స్త్రీలదృక్కోణం నుండి ఆలోచించడం, విశ్లేషించడం, చైతన్యవంతం కావాలన్న ఆకాంక్షను వ్యక్తం చేయడం వల్ల స్త్రీవాదం ఆమె ఆలోచనలకు మరింత పదును తెచ్చింది, దాంతో కథాయాత్రలో తన మార్గం ఏమిటో ఆమె స్పష్టం చేసుకోగలిగారు. అందుకే ఆమె ఆ తరం రచయిత్రులకు, నవతరం రచయిత్రులకు కూడ సన్నిహితం కాగలిగారు.

ఆమె కథల్ని విశ్లేషించటానికి పెద్దపెద్ద సాహిత్యగ్రంథాలు తిరగెయ్యనక్కర లేదు. మధ్యతరగతి స్త్రీల జీవితం గురించి తెలిసివుంటే చాలు. ఆమె ఎక్కువగా తన కథల్లో పట్టణ, మధ్యతరగతి స్త్రీల జీవితాన్ని తన జీవితానుభవంతో విశ్లేషించారు. స్వాతంత్ర్యానంతరం స్త్రీలు విద్య, ఉద్యోగ రంగాల్లో ప్రవేశించడంతో క్రమంగా వారి ఆలోచనల్లో, వారి జీవితాల్లో అంతర్గతంగా వచ్చిన మార్పుని పట్టుకుంటాయి ఆమె కథలు. అవి ఊహించి రాసినవి కావు. తన చుట్టుపక్కల వున్న సమాజం నుంచి తీసుకున్నవి. అందుకే ఆమె పాత్రలన్నీ సహజత్వానికి దగ్గరగా వుంటాయి. పాత్రలన్నీ మనింట్లో మనం ఎలా మాట్లాడుకుంటామో అలాగే మాట్లాడతాయి. కథల్లో ఆమె చూపించిన ఈ సహజత్వమే ఆమెను ఉత్తమ రచయిత్రిని చేశాయి. కేవలం స్త్రీల సమస్యల పైనే కాకుండా జీవితంలోని ఇతర సమస్యలపై కూడా ఆమె "కర్ఫ్యూ", "ఆఖరి అయిదు నక్షత్రాలు" లాంటి మంచి కథలు రాసి అందరి మెప్పూ పొందారు. అవార్డులే ప్రతిభకు తార్కాణం కాకపోయినా ఛాయాదేవి గారి లాంటి ఉత్తమ రచయిత్రికి ఇప్పుడు కేంద్ర సాహిత్య అకాడమీ వారు అవార్డు ఇవ్వడం వల్ల ఆ అవార్డుకే గౌరవం తెచ్చారు.