2005 తానా కథ-నవలల పోటీ బహుమతి పొందిన రచనల పై సమీక్ష

కథా సమీక్ష :

విముక్తుడు (రచయిత్రి: జొన్నలగడ్డ రామలక్ష్మి)

ఓ చేయితిరిగిన రచయిత చదివించే గుణంతో ఓ చిన్న విషయం గురించి రాసిన కథ. కేన్సరుతో బాధపడుతున్న భార్యకు మనసా వాచా తోడుగా ఉండి సేవలు చేసే నరసింహారావూ, కేవలం తండ్రి ఆజ్ఞానుసారం తనకు ఇష్టం లేకున్నా ఐఐటి ఎంట్రన్సు కోసం చదువుతున్న సుదర్శనం - వీరిద్దరి గురించీ ఈ కథ. భార్యను పోగొట్టుకుని ఆయనా, పరీక్ష తప్పి ఈ కుర్రాడూ, సాధ్యాసాధ్యాలను తమ ఆశయాలకు అనుగుణంగా నిర్ణయించుకోలేకపోవడం నుంచి విముక్తిని పొందుతారు. కథనం సాఫీగా సాగడం, సందర్భోచితంగా పోషింపబడ్డ పాత్రలూ, ముగింపు అస్పష్టంగానే ఉన్నా ఆలోచింపచేసేదిగా ఉండడం, శిల్ప రీత్యా ఇవి రచయిత నైపుణ్యానికి సూచనలు. ప్రథమపురుషలో మనకు ఈ కథ చెపుతున్న పాత్ర తన చుట్టూ ఉన్నవారిపై చేసే పరిశీలనలూ, అంతర్గత ఆలోచనా ధోరణీ ఎంతో లోతున్నట్లుగా భ్రమింపచేస్తుంటాయి. సుదర్శనం, నర్సింహారావుల విముక్తుల్ని ఒకే రాటన కట్టడం కృతకంగా ఉంది. మొదట్నించీ ప్రతీదీ సుదీర్ఘంగా విశదీకరించిన "నేను" పాత్ర చివర్లో చాలా క్లుప్తంగా ముగింపును తేల్చివేసినట్లు అనిపించింది. ఉపోద్ఘాత ధోరణితో మొదలు కావడం, అక్కడక్కడా సంభాషణల్లో అసహజత్వం ఈ కథలో లోట్లు.

రాతి తయారి (రచయిత: ముని సురేష్ పిళ్ళై)

మన సమాజాన్ని వెల్లువలా ముంచెత్తుతున్న ఎలక్ట్రానిక్ మీడియా అహర్నిశమూ అందించే వార్తాకథనాల వెనక ఉన్న మీడియా పాత్రికేయుల గురించిన కథ ఇది. ఆకలి చావును కూడా సంచలనాత్మకంగా మార్చి "ఇప్పుడే అందిన వార్త"లందించే పాత్రికేయుల మనసు ఎలా పాషాణంగా మారిపోయుంటుందో చెప్పే కథ. కథ చెప్పిన తీరు చాలా చక్కగా ఉంది. మాటల పొదుపు తెలిసిన రచయిత. చీకటైపోయిన గుండె మామూల్ది కాదు, క్షణంలో తేరుకోవడమే కాకుండా సాటి గుండెను వెటకారమాడగలిగేంత రాయిగా తయారైపోయిన గుండె అది, అంటూ "ప్రొఫెషనల్ మెంటాలిటీ" గురించి నాలుగు వాక్యాల్లో ఇమిడ్చిన నాలుగు పేరాగ్రాఫుల సారాంశం. ఇంత చక్కగా చెప్పిన ఈ కథకున్న పెద్ద లోపాలు: వస్తు విస్తృతి లేకపోవడం, ఆలోచనాత్మక విశ్లేషణకు తావు నివ్వకపోవడం ద్వారా కథ చదివిన తర్వాత గుర్తుండేదిగా లేకపోవడం ఒకటే కోణం నుంచి చూపించిన సన్నివేశంలా ఉండడంతో కథలో వెలితి ఏర్పడింది.

నవలా సమీక్ష :

నీరు నేల మనిషి (రచయిత: సుంకోజీ దేవేంద్రాచారి)

జనవరి ఒకటి, 2004 నుంచి అదేరోజు 2005 దాకా ఒక్క సంవత్సరంలో ఒక రైతు కుటుంబం గురించి ఈ నవల. తీర్చలేని అప్పులూ, ఎదిగిన పిల్లలనూ చూస్తూ గుండె చెరువైపోయిన రైతు రామచంద్ర. పేరుకే పెద్ద రైతు, కుటుంబమంతా కూలీలతో పాటు పనిచేయాల్సిందే. రెండు మూడు రకాల పంటలేసినా, ఏదో ఒక కారణంగా అవి లాభాలనివ్వకపోవడం, పెరిగిపోతున్న అప్పుల బాధ, గాయపడ్డ ఆత్మాభిమానం, పరువు పోతుందన్న బెంగా, రామచంద్ర చచ్చిపోవడానికి కారణాలు. పరువు కోసం జీవితంలో ఓటమి అంగీకరించడానికి సిద్ధపడ్డ రామచంద్రతో మొదలైన నవల, దూరతీరాల్లో ఎండమావులకోసం పరిగెత్తి చతికిలబడ్డ కొడుకు బాలకృష్ణ మీదుగా నడచి, ఆటుపోట్లకు జడవకుండా కష్టాలకు ఎదురొడ్డి నిలిచి జీవితంతో పోరాడి గెలవడానికే నిశ్చయించుకున్న రామచంద్ర భార్య రమణమ్మతో ముగుస్తుంది.

తీసుకున్న వస్తువు కొత్తది కాదు. రైతులూ వారి కుటుంబాలూ పడుతున్న వెతలపై చాలా రచనలే వచ్చినై. అయితే, ఒక నిర్ణీత కాలపరిధిని ఎంచుకోవడం, కేవలం కష్టాల చిట్టాపద్దు ఏకరువు పెట్టకుండా, కొంత సహజత్వంతో చేసిన రైతు జీవిత చిత్రణ, గ్రామీణ జీవనంలో ఆర్ద్రమైన మానవసంబంధాలు ఈ రచనలో చెప్పుకోదగ్గ అంశాలు. అనవసరమైన నిడివి, సుదీర్ఘమైన సంభాషణలూ, చెప్పదల్చుకున్న విషయానికి ఏమాత్రమూ తోడ్పడని సంఘటనలు, సన్నివేశాలు, ఏ ఒక్క సమస్యనీ లోతుగా చర్చించలేక పోవడం, నవలాంశంపై పాఠకులకు ఒక కొత్త దృక్కోణాన్ని ఇవ్వలేకపోవడం ఈ నవలని బలహీనపర్చాయి. రచయిత నిజాయితీగా పడ్డ శ్రమ, చూపిన శ్రద్ధ మనకి కనిపిస్తూనే ఉంటాయి.

సింగిల్ డైరీ - (రచయిత: వెల్చేరు చంద్రశేఖర్)

చిన్నతనంలోనే పెంపుడుకు వెళ్ళిన ఒక మధ్య తరగతి మనిషి తన జీవనాన్ని విశ్లేషించుకుంటూ చెప్పిన ఆత్మకథ.ఆత్మకథల్లా సాగే నవల రాయడంలో ఓ ఆకర్షణ ఉంటుంది (బహుశా రచయితకి నవలాంశంతో ఉండే ప్రత్యేకమైన పరిచయం వల్ల కావచ్చు). ఈ ఆత్మకథ చెప్పే పద్ధతుల్లో, మనకు ప్రధానంగా రెండు రకాల "నేను" లు కనిపిస్తాయి. ఒక "నేను" తామరాకు పై నీటిబొట్టులా ఉండి, గోడమీది నుంచి తదేకంగా గమనించే బల్లిలా తన జీవితాన్ని నిర్విచారంగా దూరం నుంచే ఆవిష్కరిస్తుంది. రెండో "నేను" తన చుట్టూ ఉన్న సమాజం, వ్యక్తులూ, పరిసరాల ప్రభావాల వల్ల నిత్యరూపాంతరం చెందుతున్న తన జీవన పరిణామాన్ని ఆ పరిధి లోనుంచే మన ముందు నిలుపుతుంది. ఈ నవల్లో రచయిత రెండో నేను కోసం ప్రయతంచినా, ఒకటో నేనును మాత్రమే సాధించినట్లు అనిపిస్తుంది.

ఈ నవలలో నచ్చిన విషయాలు చాలానే ఉన్నై. సన్నివేశాలు వాస్తవానికి చాలా దగ్గరగా నిజంగా, నిశితంగా మనసుకు తాకేట్టూ ఉన్నై. కొన్ని సన్నివేశాలు మనసును కదిలించేవైతే, మరికొన్ని ఆలోచనను ప్రేరేపించేవి. మచ్చుకి, తల్లి చచ్చిపోవడం, కూతురి పుస్తకాల్లో ప్రేమలేఖ దొరకడం లాంటివి చక్కగా రాయబడిన సన్నివేశాలు. వెంటవెంటనే జరిగిపోయే సన్నివేశాల పరంపర మనల్ని చివరిదాకా చదివించేలా చేస్తుంది. కాకపోతే, అన్ని సన్నివేశాలకు సమానమైన ప్రాముఖ్యత నివ్వడం ఈ నవలలో పెద్ద లోపం. కొన్ని సంఘటనలు ఎందుకు చోటుచేసుకున్నయ్యో, ఆ సంఘటనలు ప్రధానపాత్రపై ఏ ప్రభావాన్ని చూపించినయ్యో, చాలా సార్లు మనకు అర్ధం కాదు. ఇలా ఈ నవలలో పాఠకుల్ని పక్కదారి పట్టించే సంగతులే ఎక్కువ. ఉదాహరణకి, ఆఖరి ఇరవైఐదు పేజీల్లో విస్తరించిన మితృడి కథ ఈ నవలకు పెద్దగా దోహదం చేసినట్లు లేదు. కథకు సంబంధం ఏ మాత్రమూ లేని ఆడంబరం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది, ఆల్బర్ట్ కామూ, సిడ్నీ పోటియే లాంటి పేర్లు జారవిడవడం దీనికో ఉదాహరణ. రచయిత ఎంచుకున్న భాషా శైలి ఈ నవలకు చాలా హాని చేసిందనే చెప్పొచ్చు.

వాస్తవికతకి అతిదగ్గరగా ఉన్న సన్నివేశాలూ సంఘటనలూ, నిజజీవితంలోంచి వచ్చినట్లున్న పాత్రలూ ఉండి ఒక అద్భుతమైన నవల కావడానికి ఆస్కారం ఉండి కూడా, రచనలో లోపాల వల్ల, ఏమీ కాలేకపోయిన నవలలు ఈ రెండూ కూడా. ఇప్పుడొస్తున్న అనేకానేక రచనల్లానే వీటికి కూడా రచయితకు ఉండవలసిన సంయమనం, సవరింపూ, కుదింపూ లేకపోవడం, ప్రస్ఫుటంగా ఈ నవలల్లో కనిపించిన లోపాలు.

తానా న్యాయనిర్ణేతల కమిటీ
వాడ్స్‌వర్త్, ఇల్లినాయ్
మే 30, 2005