విన్యాసం

"క" అనే అక్షరం, "వి" అనే అక్షరం కలిస్తే "కవి" అనే రెండక్షరాల పదం అవుతుంది. ఆ రెండక్షరాలు కలవక వేరే వేరే వుండిపోతే "క" "క" గానే వుండిపోతుంది, "వి" "వి" గానే నిలిచిపోతుంది కాని "కవి" కావు. చీలిక "కవి"ని చేయదు, కూడిక మాత్రమే చేస్తుంది "కవి"ని. విశ్లేషణ (analysis) కవితను కూర్చదు, కవితను కూర్చేది సంశ్లేషణ (synthesis).

"కవి" అనేవి రెండక్షరాలు అయినా, ఆ రెండక్షరాలు లక్షల అక్షరాలను విన్యస్తపరుస్తాయి. ప్రతి అక్షరానికీ అర్థం ఉండదు, శబ్దం తప్ప. అక్షరాలు కలిస్తేనే అర్థం జనించేది. కవితార్థం వేరు, లౌకికార్ధం వేరు. లౌకికార్ధంలో "వాడినపూలు వికసిస్తాయి" అనటం తప్పు అవుతుంది. కారణం వాస్తవజగత్తులో వాడినపూవు రాలిపోతుంది కాని వికసించదు. కాని కవితార్ధంలో "వాడినపూలు వికసిస్తాయి" అనటం ప్రతీకాత్మకం కనుక అది సమంజసమే అవుతుంది. లౌకికార్ధంలో వాడినపూవు అంటే నిజంగా వాడిపోయిన పూవు అనే అర్ధం, కాని కవితార్ధంలో వాడినపూవు అంటే క్రుంగిపోయిన హృదయమో, నిరాశచెందిన జీవితమో, అటువంటిది ఇంకేమైనా సూచించబడుతుంది. క్రుంగిపోయిన హృదయం, నిరాశ చెందిన జీవితం తిరిగి వికసించవచ్చు.

ఇదివరలో కవితను పద్యం అనీ, కవిత కాని దానిని గద్యం అనీ పిలచే వారు. నేడు ఆ పిలవటం కుదరదు. నేడు కవిత అంటే పద్యం మాత్రమే కాదు, గద్యం కూడ. కనుక "కవిత", "అకవిత" అని అనవలసివుంటుంది పద్యం గద్యం బదులు.

లౌకికార్ధం వేరు, కవితార్ధం వేరు అన్నప్పుడు లౌకికమైన వాస్తవజగత్తు కవితారచనకు వస్తువుగా పనికిరాదని అర్ధం కాదు. కవితా వస్తువు వాస్తవజగత్తుకు చెందినా కూడ అది ఇచ్చే అర్ధం లౌకికార్ధానికంటే భిన్నంగా వుంటుంది. వాడిన పూవు వాస్తవజగత్తుకు చెందింది అయినా, వాడినపూవు వికసిస్తుంది అనేవరకు అది లౌకికార్ధాని కంటే భిన్నమైన అర్ధం ఇస్తుంది.

రేవతీదేవి రచించిన "శిలాలోలిత" ఈ లోకానికి చెందిందే. ఈ మట్టికి, ఈ మనుషులకు చెందిందే. నిత్యజీవితంలోని వెలుగునీడలు, సుగంధాలు దుర్గంధాలు, తీపులు చేదులు, సుఖాలు దుఃఖాలు, జీవితాలు మరణాలు, ఈ విధంగా ఎన్నో మరెన్నో ఇందులో కవితావిన్యాసంలో ప్రత్యక్షమవుతాయి. అవి కవితలెందుకు అయినాయి, అకవిత లెందుకు కాలేదు అంటే వాటిని రచించింది కవయిత్రి కనుక అవి కవితలయినాయి. ఆమె కవయిత్రి ఎందుకయింది అంటే కవితలను రచించింది కనుక కవయిత్రి అయింది! కవయిత్రి రచించినవన్నీ కవితలవుతాయా? కావు. విడిసమయాల్లో కవితలు కాని వాటినెన్నిటినో కవయిత్రి రచిస్తుంది. అవన్నీ కవితలు కావు. కవితాసమయ సృజనాత్మక ఘడియల్లో కవయిత్రి రచించినవి మాత్రమే కవితలవుతాయి. రేవతీదేవి అంటుంది "శిలాలోలిత" లో:


"దిగులు
దిగులుదిగులుగా దిగులు
ఎందుకా
ఎందుకో చెప్పే వీలుంటే
దిగులెందుకు"

ఎందుకో చెప్పే దిగుళ్ళు కూడ ఉంటాయి కాని ఎందుకో చెప్పలేని దిగుళ్ళే నేటి జగత్తులో చాలా ఎక్కువ. కారణం తెలిసిన దుఃఖాలుంటాయి కాని కారణం తెలియని దుఃఖాలు ఎక్కువగా వుంటాయి. అందుకే కవయిత్రి దిగుళ్ళను గురించి ఆ విధంగా వాపోయింది! దిగులంటే అందరికీ తెలుసుకాని దిగులెందుకో ఎందరికో తెలియదు. రేవతీదేవి కవితల్లో ఇటువంటి దార్శనిక సత్యాలెన్నో గోచరిస్తాయి.

ఆమె కవితల్లో కవితాశిల్పం కంటే దార్శనికచింతన, మనోవైజ్ఞానిక అవగాహన ఎక్కువగా గోచరిస్తాయి. వీటికితోడు నిత్యజీవితంలోని వడుదుడుకులు, సామాజిక అన్యాయాలు, నిరాశానిస్పృహలు మొదలైన వాస్తవానుభూతులు కూడ ఇందులో తొంగిచూస్తుంటాయి. వచనకవితలో కూడా కవిత్వం అనిపించుకొనే శిల్పం కొంత వుంటుంది. అటువంటిది కూడ లేనప్పుడు వచనకవిత వచనంగా మాత్రమే నిలచిపోయే ప్రమాదం వున్నది!

రేవతీదేవి రచించిన ఇందులోని దీర్ఘకవితల కంటే హ్రస్వకవితలు ఎక్కువ ప్రభావాత్మకంగా వున్నాయి, సూటిగా, పదునుగా. కవయిత్రి ఈ హ్రస్వకవితల్లో చూపినవి మనోమయ నగ్న సత్యాలు మాత్రమే కాదు, నిరలంకారమైన నగ్నపదాలు కూడ. నిరలంకారమైన పదాలకు గహన భావాలను అభివ్యక్తపరిచే శక్తి ఆలంకారిక పదాలలో కంటే ఎక్కువ వుంటుంది. అందుకే రవీంద్రుడు తన గీతాంజలిలో అంటాడు:

"My song has put off her adornments. She had no pride of dress and decoration. Ornaments would mar our union; they would come between thee and me; their jingling would drown thy whispers."(నా గీతిక అలంకారాలను ఆవల వుంచింది. తనకు వేషభూషల గర్వం లేదు. ఆ భూషణాలు మన మిలనానికి ఆటంకమవుతాయి. అవి నీకూ నాకూ మధ్య అడ్డు నిలుస్తాయి. వాటి గలగలలు నీ గుసగుసలను మరుగుపరుస్తాయి.)

రేవతీదేవి కవితలు రవీంద్రుని వాటి వలె పూర్తిగా మర్మవాద కవితలు (mystic poetry)కాకపోయినా ఆమె సామాన్య కవితల్లో కూడ కొద్దో గొప్పో మర్మవాదపు ఛాయలు గోచరిస్తూనే ఉంటాయి. ఆమె తన "హృచ్ఛితి" అనే కవితను వ్రాస్తుంది:


"క్షితిజరేఖ వేడివేడిగానే ఉంది
నిరంతర చిత్తకార్తి కుక్కలు
కుక్కల్లాగే తిరుగుతున్నాయి
నాటి నుంచి ఆవరించిన అనుబంధపుటూదర
వెచ్చగా కమ్ముకుంటూనే ఉంది
ఐనా
ఈ హృదయం
ఫ్రీజర్ లోంచి తీసిన శవం కన్నా చల్లని
మాంసపు మంచుముద్ద
అది కరగటానికీ స్పందించటానికీ కావాల్సిన
నిజాయితీమంచుమంటకి
ఈ లోకం భగ్గుమని తగలడిపోతుందిట
అందుకే
ఈ హృది ఎన్నటికీ రగలని చితి"

ఈ కవయిత్రి కవితల్లో ఇదొక కళాఖండం. ఇందులోని ప్రతి చరణమూ కవితాజీవంతో స్పందిస్తూంది. క్షితిజరేఖ వేడిగా వున్నా అనుబంధపుటూదర వెచ్చగా కమ్ముకొంటున్నా హృదయం మాత్రం వేడెక్కక "మాంసపు మంచు ముద్ద" గానే వుంది. దాన్ని నిప్పుమంట కరిగించదు కాబోలు, నిజాయితీ మంచు మంట మాత్రమే కరిగిస్తుందట. అయితే ఆ నిజాయితీ మంచుమంటకు ఈ లోకం తగలబడిపోతుందట. కనుక ఆ హృదయం ఎన్నటికీ రాజని చితిగానే వుండిపోతుందట! ఈ కవిత ఒక గొప్ప మార్మిక చిత్రణ. కవయిత్రిలోని గంభీరత ఇందులో కమనీయంగా ప్రతిబింబించింది, ప్రతిస్పందించింది. ఈ కవితలో మాటలు వినిపించవు, సూటిగా భావవేణు సంగీతమే వినిపిస్తుంది. వినిపించటం కూడ అంతగా వుండదు. ఆ సంగీతం చెవితో పనిలేకుండా సూటిగా వెళ్ళి హృదయపు నిమ్నత మస్తరంలోని వెలగని దీపాన్ని వెలిగిస్తుంది! పరిసర తిమిరంలో కాంతిని కలిగిస్తుంది!

భావాలు మాత్రమే కవితలు కావు, పదాలు మాత్రమే కవితలు కావు. రెంటి సమ్మేళనం కూడ కవితలు కావు. భావాలను అభివ్యక్తపరచటానికి పదాలు అవసరం, సందేహం లేదు. అయితే భావం వ్యక్తమైనంత మాత్రాన అది కవిత కాలేదు. భావానికి సుగంధం వున్నట్లే పదానికి కూడ మాధురి వుండాలి. మామూలు వచనంలో భావాన్ని అభివ్యక్తపరచి పదం నేపధ్యంలోని కెళ్ళిపోతుంది. భావాభివ్యక్తి మాత్రమే మామూలు వచనంలో పదం చేసే పని. వచనం మాత్రమే వచనకవిత కాదు, కనుక వచనకవితలో భావానికి తోడు పదానికి కూడ ప్రాముఖ్యం వున్నది. కవితలో (అది వచనమైనా పద్యమైనా) భావాన్ని ప్రదర్శించి పదం నేపధ్యంలోకి అదృశ్యమైపోదు. భావంతో పాటు అదీ నిలుస్తుంది కవితాకుంజంలో. దీని అర్ధం కవితలో పూర్వం నుంచి పరంపరగా వస్తున్న కవితాపదాలనే వాడాలని కాదు. అటువంటి సంప్రదాయిక పదాలు ఆధునిక భావాలకు సరైన వాహనాలు కావు. నేడు సామాన్యభాషకూ కవితాభాషకూ గొప్పగా తేడా లేదు. దైనందిన వ్యావహారిక పదాలతో కవితానిర్మాణం చేస్తున్నారు. అయినప్పటికీ కవితలో పదాల ప్రాధాన్యత నిలిచే వుంటున్నది. ఆ ప్రాధాన్యం లేనప్పుడు భావాలెంత భవ్యంగా వున్నా కూడ వచనకవిత అనబడేది వచనంగా మాత్రమే వుండిపోతుంది. అయితే, మరీ భావ తీవ్రత వున్నప్పుడు మాత్రం పదాలతో సంబంధం లేకుండానే భావాలు కవితారూపం తాలుస్తాయి. వచనకవితలో కూడ అనేకమంది అనేక రీతులను అనుసరిస్తున్నారు, ఛందోబద్ధ కవులు తమ కవితా రచనలొ అనేక రీతులను ఉపయోగించినట్లే.

రేవతీదేవి అనుసరించిన వచనకవితలో వచనాత్మకత ఎక్కువ వున్నది. అయినప్పటికీ ఆమె ప్రయోగించే కొన్ని పదాలూ, ఆమె భావావేశం, విశిష్టచింతన మొదలైన సామగ్రి ఆ వచనాత్మకతకు ఒక కావ్యాత్మకతను ప్రసాదిస్తూంది. ఆమె ఉపమానాలు ప్రత్యేకంగా మౌలికంగా వుంటాయి. "ఉన్మాదప్రకృతి" అనే కవితలో అంటుంది: "నూనెలో ఊరిన నీలంకంబళిలా" అని. కారుమేఘాలు కమ్మిన ఆకాశం ఆ విధంగా వున్నదట. మరో ఉపమానం, "తెల్లలోహపు కొరడాల్లాంటి మెరుపులు". ఇవన్నీ వాడుకలోలేని తన స్వంత ఉపమానాలు. "సూర్యగోళాలు చిట్లి దభీమని కిందకి పడుతున్నట్లు పిడుగులు". ఈ విధంగా ఎన్నెన్నో నూతనమైన మౌలిక ఉపమానాలు లభిస్తాయి, ఇందులో.

కొందరి రచనల్లో మరికొందరి ప్రభావాలు గోచరిస్తాయి. ఆ విధంగా గోచరించటంలో ఏమీ అసహజత్వం లేదు. దాని అర్ధం ఒకరి భావాలను మరొకరు అనుకరించారని కాని అనుసరించారని కాని కాదు. అందువల్ల మౌలికతకు కూడ భంగం రాదు. ఒకరి ప్రభావం మరొకరి మీద పడటం అంటే రచయితకు కాని రచయిత్రికి కాని తెలియకుండానే కొందరి భావాలు వారి మీద ప్రభావం వేస్తాయి.

ఈ కవయిత్రి తన "మలిపలుకు" లో చెప్పుకున్న ప్రభావం ఈ కవితలన్నింటిలోనూ స్పష్టంగా గోచరిస్తుంది. కొందరి భావాలలో కొంత సామ్యం వుంటుంది. ఆ వున్న సామ్యం, అవతలి వ్యక్తి భావాల బలంతో, మాధుర్యంతో, ఇవతలి వ్యక్తి కృతుల్లో ఎక్కువ స్పష్టరూపం తాలుస్తుంది. రేవతీదేవి కవితల మీద ఆ ప్రభావం ఎవరిదో నేను చెప్పేసి, ఎవరికి వారు గుర్తించటంలోని (thrill) పులకింతను పోగొట్టతలచలేదు.

ఈ కవయిత్రి మానవ మనోభావాలను ఎంత మనోజ్ఞంగా వర్ణిస్తుందో ప్రకృతి వైచిత్రిని కూడ అంత మనోజ్ఞంగా వర్ణిస్తుంది. తుఫాను భీభత్సాన్ని వర్ణిస్తుంది:


"నింగి నుంచీ నేలకి
బలంగా బరువుగా వర్షపుధారలు (*)
ధారాపాతంగా వర్షపుధారల వర్షం
శిలాగర్భంలో క్కూడా చొరబడగల ధారాపాతం

నింగినీ నేలనీ చుట్టేసే గాలి
...
ఆకాశంలోకీ భూగర్భంలోకీ విస్తరించిన భవనాలను కూల్చే పెనుగాలి
...
సమస్తమూ
కొట్టుకుపోయి తుడిచిపెట్టుకుపోతున్నాయి
నీటిగాలిలో పిచ్చెక్కిన నీటిగాలిలో
గాలినీటిలో పిచ్చెక్కిన గాలినీటిలో
ఈ వానకి
అయ్యో పాపం సూర్యుడు కూడా
పిండిముద్దలా తడిసిచీకిపోయాడు"
...

(*) ఇక్కడ "వర్షపుధారలు" అని ఎందుకనాలసొచ్చిందో? "వర్షధారలు" అంటే బాగుండేదిగా.

ఈ విధంగా "శిలాలోలిత" లో మనకు నూతన రీతులు ప్రత్యక్షమవుతుంటాయి. చాలామంది తమ కళ్ళతో కాక ఇతర్ల కళ్ళతో చూచి జీవిస్తుంటారు. అది బరువులేని పని. తమ కళ్ళతో చూచే శ్రమ తప్పుతుంది ఇతర్ల కళ్ళతో చూచి జీవిస్తుంటే. కాని రేవతీదేవి తన కళ్ళతో చూచే జీవిస్తుంది, రచిస్తుంది.

మానవజీవితంలో స్మరణాతీత కాలం నుంచీ కూడ హృదయానికి గొప్ప స్థానం వుంది, ఆనందానుభూతి కాని, విషాదానుభూతి కాని అందులో నుంచే ఆవిర్భస్తుంది కనుక. మేధా ప్రాధాన్యం మేధకే వున్నది, అది లేంది మనిషి అజ్ఞానంలో, అంధకారంలో, అజ్ఞానాంధకారంలో జీవిస్తాడు కనుక. అయితే కళాకారులు ప్రత్యేకంగా హృదయధర్మావలంబులు. అందుకే మధుర సంగీత శిల్పి స్వర్గీయ కుందన్ లాల్ సైగల్ ఒకచోట అంటాడు. "జబ్ దిల్ హీ టూట్ గయా హం జీకే క్యాకరేంగే" అని. మనసే విరిగిపోతే ఇంకా మనం బ్రతికుండి చేసేదేమిటని. ఈ విధంగా హృదయానిదొక ప్రత్యేక స్థానం ప్రత్యేకించి కళాకారుల్లో. అందులో ప్రత్యేకించి కవులు హృదయధర్ములు. కవితకు రసం ప్రధానం. అటువంటి రసం హృదయానుభూతి నుండి జనిస్తుంది. అయితే ప్రపంచ సాహితీ చరిత్రని తిరగవేస్తే హృదయానికి సంబంధించి మాత్రమే కాక మేధకు సంబంధించి కూడ ఎంతో కవితారచన జరిగినట్లు తెలుస్తుంది.

మనం నివసిస్తున్న ఆధునిక యుగం వైజ్ఞానిక యుగం. విజ్ఞానం మేధాజనితం. అందువల్ల మన యుగం మేధాయుగం. కనుకనే మన కళల్లో కూడ, ప్రత్యేకించి ఆధునిక రూపకళల్లోను, ఆధునిక కవితాకళలోను మనకు అనుభూతి కంటే ఆలోచనే ప్రధానంగా గోచరిస్తుంది. అందుకే అంటారు, ఒకప్పుడు పాడటానికి కవితారచన జరిగేదనీ, నేడు కవితా రచన ఆలోచించటానికి జరుగుతున్నదనీ. నేటి కవిత ఛందో నియమాలన్నింటినీ ఉల్లంఘించి ముక్తఛందంగా రూపొందింది. అనుప్రాసలు, అంత్యప్రాసలు, యమకాలు మొదలైనవన్నీ అనవసరమైన గలగలలు గణగణలుగా ఎంచబడుతున్నాయి. ఈ విధంగా నిబద్ధ కవితకు బదులు అనిబద్ధ కవితాసృష్టి ప్రపంచం అంతటా ఎక్కువ జరుగుతూంది. ఛందోనియమాల మీద పూర్ణంగా ఆధిపత్యం సంపాదించిన కవులకు ఇబ్బంది లేదు కాని మధ్యరకం కవులు తమ కవితలు ఛందోబద్ధంగా రచించాలసి వచ్చినప్పుడు తమ భావాల ననుసరించి రచించక ఆ ఛందోనియమాల ననుసరించి తమ భావాలను మలుచుకుని రచిస్తారు. అటువంటి సందర్భాలను గుర్తులో వుంచుకునే సోమర్సెట్ మాం తమాషాగా అన్నాడు, "We do not write as we want to but as we can". మనం కోరుకున్నట్లు మనం వ్రాయక మన చేతయినట్లు మనం వ్రాస్తామట. ఆ నియమాలను పాటించకపోవటంలో కవికి చాలా స్వేచ్ఛ దొరికిన మాట నిజమే కాని ఆ స్వేచ్ఛ వెర్రితలలు వేయకుండా చూచుకోవాలి. మనిషికి స్వేచ్ఛ వుండాలి కాని స్వేచ్ఛకు స్వేచ్ఛ అతిగా వుంటే ప్రమాదం. స్వేచ్ఛకు కొన్ని హద్దులు లేనప్పుడు అది త్రాగుబోతుల స్వేచ్ఛ వలె, ఉన్మాదుల స్వేచ్ఛ వలె పరిణమిస్తుంది.

రేవతీదేవి ఆధునిక కవయిత్రి. రీతిలో ఏమి, నీతిలో ఏమి, భావాలలో ఏమీ, ప్రభావాలలో ఏమీ, ఆమె నేటి కవయిత్రి. తన కవిత "మూగవోయిన గొంతు" లో అంటుంది:

"ఇన్నాళ్ళూ గలగలా మాట్లాడితే
నే చెప్పాల్సిందేమీ లేనందున
నేనేం చెప్పినా విన్నారు

ఇప్పుడేమో నాకూ
చెప్పాల్సిందేదో ఉండి
చాలా గాఢమైంది
చాలా ఇష్టమైంది
చాల స్వచ్ఛమైంది
చెప్పాల్సిందేదో ఉండి
మాట్లాడబోతే
ఎవరూ వినిపించుకోరు
అందుకో మరెందుకో
ఈ గొంతు మూగవోయింది

తాదాత్మ్యపు మత్తు వల్లనో
మాధుర్యపు తీపి వల్లనో
లేదూ మీరెలాగు వినిపించుకోరనో
మూగవోయింది ఈ గొంతు"

ఈ విధంగా ఆమె తన impressions కు expression ఇవ్వటంలో అస్పష్టతను కాక సుస్పష్టతను ప్రదర్శిస్తుంది. ఆధునిక కవితలో అస్పష్టత ప్రస్ఫుటం అవుతున్నదని వాడుక. అటువంటి అస్పష్టత కవితకు కళంకం కాదు కాని అదే ప్రధానం కారాదు. పై కవితలో ఆమె ఆలోచనా స్రవంతి లోని లయాత్మక రీతి సుస్పష్టం అవుతుంది. ఆమె ధోరణి కొంత చాటువుల రీతిలో ఎపిగ్రమాటిక్ గా వుంటుంది, చాలామంది దార్శనికుల్లో వున్నట్లు. అది మనోరంజకంగానూ, జ్ఞానప్రదంగాను కూడ వుంటుంది. దాన్ని కూడా అదుపులోనే వుంచాలి. ప్రతి విషయం కూడా కొంత అదుపులో వుండాలి కాని కొన్ని విషయాలు ఎక్కువ అదుపులో వుంచబడాలి.

ఈ కవయిత్రి దుష్ట సమాసాలనబడే వాటిని లక్ష్యం చేయనట్లే దీర్ఘ సమాసాలు వాడటానికి కూడ వెనకాడదు: "ఈ సాంద్ర లాలసా తప్త వేదనాస్తిత్వం" అటువంటి వాటిలో ఒకటి.

"శిలాలోలిత" లో "అనురాగ దగ్ధ సమాధి" అనేదొక ఆకర్షక కవిత; ఇటువంటి కవితలు ఇందులో ఇంకొన్ని వున్నాయి. వాటన్నిటినీ ఉదహరించాలనిపిస్తుంది కాని వీలుపడదు. అందుకని కొన్నిటినైనా ఉదహరించకుండా వుండటం కూడ వీలుపడదు. "అనురాగ దగ్ధ సమాధి" లో కవయిత్రి వ్రాస్తుంది:

"నేనెవరినో మీకెవరికీ తెలియదు
ఆర్తిసెగతో ఎర్రగా జ్వలించే నీలం నిప్పుపువ్వును

నా చుట్టూ అనాది ప్రాణిని రగిల్చిన
జగల్లీలా కేళికా సప్తవర్ణ జ్వాలా వలయాలు
ఆ కళ్ళు ఆ అనురాగం కళ్ళు
అనురాగం ఎంత అందంగా ఉండటానికి వీలుంటుందో
అంత అందంగానూ ఉండే ఆ అనురాగం కళ్ళు
లోకమంతట్లోనూ నన్నే చూసే ఆ అందమైన అనురాగం కళ్ళు
నాలోనే లోకమంతటినీ చూసే ఆ అనురాగపుటందమైన కళ్ళు
అనురాగ జలధులై
యుగయుగాల సమస్త ప్రాణికోటి అనురాగాన్నీ
నా పైన అవిరళంగా వర్షించే అనురాగమేఘాలు ఆ కళ్ళు
...
ఈ హృదయం
రసజ్వలిత దాహంతో వెచ్చగా విచ్చుకున్న నెత్తురుపువ్వు
...”

లోకం అంతట్లో తనను చూడటం, తనలో లోకం అంతటినీ చూడటం, ఎంత ఉదాత్త భావన! దీన్నే మనోవిజ్ఞానంలో, "ప్రొజక్షన్" అనీ, "ఇన్ ట్రోజక్షన్" అనీ అంటారు. లోకంలో తనను చూడటం మొదటిదానికి చెందితే తనలో లోకాన్ని చూడటం రెండవదానికి చెందుతుంది. "నీలం నిప్పురవ్వ" "వెచ్చగా విచ్చుకున్న నెత్తురుపువ్వు". ఈ రెండూ కూడ మరుపుకురాని మంచిమంచి అభివ్యక్తులు, ఈ రెండూ కూడ వాటికవే మేలైన కవితలు!

మరొక కవితలో ఈమె అంటుంది "మరిగేనెత్తుటి వరదలా" అని. నెత్తుటి వరదనే భరించటం కష్టం. ఇంకా ఆ వరద పారే నెత్తురు మరుగుతూ వుంటే? అందుకే అంటాను ఈ కవయిత్రి భావాలూ పదాలూ ప్రత్యేకమైనవి అని.

కవయిత్రి ఇవన్నీ ఎందుకు రచించినట్లు? రచించినందున ఎందుకు రచించిందని ప్రశ్నిస్తున్నాం. రచించక పోయినట్లయితే ఎందుకు రచించలేదివన్నీ అని ప్రశ్నిస్తాం. ఈ రెండవ ప్రశ్న వేయించుకోకుండా వుండాలనే ఆమె వీటిని రచించింది. రచించకపోతే రెండో ప్రశ్న వచ్చేది. రచించినందున మొదటి ప్రశ్న వచ్చింది. మొదటి ప్రశ్నకు జవాబివ్వటం సులభం అనీ, రెండవ ప్రశ్నకు జవాబివ్వటం కష్టమనీ ఆమెకు తెలుసు. అంటే, ఎందుకు వ్రాసింది అనే ప్రశ్నకు జవాబివ్వటం సులభమనీ, ఎందుకు వ్రాయలేదనే ప్రశ్నకు జవాబివ్వటం కష్టమనీ ఆమెకు తెలుసు కనుకనే వీటిని వ్రాసింది ఆమె!

ఆమె కవితల్లో నుంచి మరొక చిన్న కవిత "నిష్క్రమణ" అనే దాన్ని ఆఖరిసారిగా ఇక్కడ ఉదహరించకుండా వుండలేకపోతున్నా.

"నువ్వంటే నాకెంతో ఇష్టం ఎవరంటేనూ లేని ఇష్టం

ఎన్నో రకాల అన్ని ఇష్టాలకీ అతీతమైన ఇష్టం
కానీ
నువ్వంటే నాకలాంటి ఇష్టం ఉంటే
ఈ లోకానికేదో అవుతుందిట
అందుకని
నీ నుంచి పారిపోవాలని
నువ్వున్నావని ఇంట్లోంచి వెళ్ళిపోయాను
నువ్వున్నావని ఊళ్ళోంచి వెళ్ళిపోయాను
నువ్వున్నావని హృదయం లోంచి"

ఎందులోంచి వెళ్ళిపోయినా ఆ ఇష్టమైన వ్యక్తిలోంచి వెళ్ళిపోలేదు. పైగా, ఎక్కడ నుంచి వెళ్ళిపోయినా, వెళ్ళిపోయింది మరొకచోటుకు కాదు;ఎక్కడ నుంచి వెళ్ళిపోయినా ఆ ఇష్ట వ్యక్తి అంతరంగం లోకేగా వెళ్ళి నిలచింది!

సంజీవదేవ్
ఫిబ్రవరి 1980.


“Creativity is aesthetic. Aesthetic is the pulse of creativity. Aesthetic is rapturous strain as assimilated by an existence.

An existence, through realisedness, sculptures the aesthetic. The sculpture of the aesthetic -- the flowing sculpture is the bearings of the history of existences.

Creativity is drealistic. Dreality is the unity of repeatedness and novelty. Creativity dreams the reality and reals the dream.”