ఉక్కు శిశువు
మరో శిశువు
పుట్టగొడుగులా మొలుచుకొచ్చింది
ఈ పొగలోకి ఈ చీకట్లోకి
ఈ బొగ్గులోకి ఈ మసిలోకి
ఈ బురదలోకి ఈ పేడలోకి
ఈ మురికిలోకి ఈ రొచ్చులోకి
ఈ ఈగల్లోకి ఈ దోమల్లోకి
మరో శిశువు పుట్టగొడుగులా మొలుచుకొచ్చిందిదరిద్రానికి చిహ్నంగా
ఏ అవయవాలూ పుష్టిగా లేని
ఈ శిశువుమతంలేని ఈ శిశువు
భాషలేని ఈ శిశువు
దేశంలేని ఈ శిశువు
బట్టల్లేని ఈ శిశువు
ఈ ఆకలి శిశువుతనని మొయ్యలేక మోస్తున్న తొమ్మిదో నెలలో
పనిలోకెళ్ళలేక చేసిన అప్పుబరువు
వ్రణంగా ఈ పసివీపు మీదకి రానున్నట్లు తెలీని
ఈ శిశువు ఎందుకు పుట్టుకొచ్చినట్లు
ఎందుకు పుట్టుకొచ్చినట్లు ఈ శిశువుఈ పుణ్యభూమిలో
ఈ పవిత్ర భారతంలో
ఈ కర్మభూమిలో
కర్మసిద్ధాంత మర్మంలోకి
ఒచ్చి చిక్కుకున్న ఈ శిశువుఏడవకు ఏడవకు పేడపురుగూ
ఏడవకు బొమికలగూడూ
నీకు ఆకలేస్తే కన్నీళ్ళిచ్చారు
నీకు ఆవేదనొస్తే నిట్టూర్పిచ్చారు
నీకు కోపమొస్తే చెరసాలిచ్చారుతిండిలేని మందుల్లేని
పోషణలేని రక్షణలేని
నీ బానిసజన్మ తరించగా
అశోకచక్రం కింద పడినలిగి
విముక్తమవటానికి
శ్వాస పీల్చుతన్నులకీ గుద్దులకీ పోట్లకీ
రాటుతేలి ఈ మట్టిశిశువు
రేపటి ఉక్కుశిశువు
ఊపిరి పీల్చే ఉక్కుశిశువుఇది పుణ్యభూమి
ఈ పుణ్యభూమిలో
నిన్నేం చేసినా
ప్రాణం పోయేలా చావగొట్టినా
నోరెత్తగూడదుఅందరూ దేవుడి సృష్టేననీ
అందరూ సమానమేననీ
మరి ఈ అసమానత లెందుకంటే
ప్రారబ్ధకర్మ పరిపాకమనీ
నరనరాన జీర్ణించుకున్న
బికారీ దళితజాతి లోకి
అవధరించిన ఈ బొమికలశిశువుఅగ్రవర్ణాల అగ్రవర్గాల అభిజాత్యాన్నీ
వాళ్ళ అహంకార క్రూర హింసల్నీ
కర్మసిద్ధాంత పరంగా నమ్మే
ఆమోదించే భరించే
అజ్ఞాన దరిద్ర వారసత్వంలోకి
ఈ తోళ్ళశిశువుఛీత్కారం భరిస్తూ అసహ్యింపు సహిస్తూ
యాచించి ఒక పట్టెడు మెతుకులు
కాల్మొక్కి ఒక గుక్కెడు గంజినీళ్ళు
అడుక్కుని ఒక చింకిపాతఈ బానిస చెరసాలలో
నీ కెంతో స్వేచ్చ నిచ్చారు
ఎప్పుడన్నా ఏపనీలేనప్పుడు
నీక్కావాల్సినంత గాలి పీల్చుకోవచ్చుఈ బానిసశిశువు
అగ్రవర్ణాల అగ్రవర్గాల వారి
చేతిపరికరం
అవసరమైతే ఆటబొమ్మానువ్వు పుట్టావని
నీకు పని కల్పించటం కోసం
ఆనకట్టలు కాల్వలు పంటలు
రోడ్లు కర్మాగారాలు భవంతులు
గనులు విమానాలు సినిమాలు
కరెన్సీమిషన్లు కార్లు టెలిఫోన్ లు
లాఠీలు తుపాకులు తూటాలు
ఇవన్నీ నీ కోసం
నీకు పని కల్పించటం కోసం
కల్పించారు
అందుకని అందుకు
కృతజ్ఞతగా విశ్వాసంగాకనీసం ఈ శిశువైనా
అజ్ఞానం ఒదిలితే
కర్మసిద్ధాంతం ఒదిలితే
భీరుత్వం ఒదిలితే
కుక్కవిశ్వాసం ఒదిలితే
తనకీ అన్నిటికీ హక్కుందనీ
ఈ పుట్టుకుచ్చిన శిశువు
వైప్లవ్యంగా తలెత్తితేరండి
శిశువుల్లారా రండి
లక్షలుగా పుట్టుకొచ్చిన
కోట్లాది దీన దరిద్ర శిశువుల్లారా
రండి ఈ శిశువు వెంట
ఈ స్వేచ్ఛ బాట లోకి
రండి ఈ శిశువు వెంట
వెయ్యిరెట్ల బలంతో
ఈ విప్లవశిశువు వెంట
నెత్తుటి జాగితాల నెదుర్కోను
రండి శిశువుల్లారా రండిసామర్ధ్యాన్ని బట్టి వ్యత్యాసాలుండొచ్చు
అలా ఉండనివ్వకపోతేనూ అన్యాయమే
ఉండకుండా సాధ్యపడుతుందనుకోవటం
మానవ మౌలిక స్వభావం తెలియనితనంఅన్యాయాల్లేని అక్రమాల్లేని
దోపిడిలేని దగాలేని
అమానుషాల్లేని అవమానాల్లేని
సామాజిక వ్యవస్థ కోసం
మనిషి మనిషిగా బ్రతకటానికి
కావాల్సినవన్నీ అందరికీ సమకూర్చే
సామాజిక వ్యవస్థ కోసంనిస్సంకోచంగా నిర్భయంగా
నిస్వార్థంగా నిజాయితీగా
మరిగే నెత్తుటివరదలా
ఏదవసరమైతే అది చేసేందుకు
కదిలి రండి ఉక్కుశిశువులూ
కరిగిన సీసంలా జ్వలించగల
ఉక్కుశిశువులూ కదిలి రండిరండి
ఈ పంటలు మీవి
ఈ తోటలు మీవి
ఈ గాలి మీది
ఈ నీరు మీది
ఈ వెలుతురు మీది
ఈ భూమి మీది
ఈ దేశం మీది
మీదే మీదే
మీరే మీరే
మీరే పాలించుకోండి