ఆశాగ్ని రేణువు

పుట్టిన ఇంత కాలానికి
నేను బ్రతికున్నట్లు తెలిసి
తొలిసారిగా ఏడుపొచ్చింది
నేను నిజంగా బ్రతికుండే అవకాశం లేదని

సుఖదుఃఖాలకి అతీతమైన స్థితప్రజ్ఞ కాదు
సుఖదుఃఖాలూ ఏదీ అసలుకే తెలీని జడత్వం
అజ్ఞానం లాంటి అభేదం లాంటి జడత్వం

నా పుట్టుకలాగే నా జీవితంలో
ఘటనా ప్రతిఘటనా లేని
ఏవో కొన్ని జరిగాయి నా కర్తృత్వం లేకుండానే

శారీరకంగా మానసికంగా నైతికంగా
నా పుట్టుకకి నాదెంత బాధ్యతో
వీటన్నికీ అంతే బాధ్యతనిపిస్తుంది

ఒక్క వుదుటున చిచ్చుబుడ్డిలా ఎగిసిన ఈ చైతన్యం
నన్ను నేను తొలిసారిగా చూసుకున్న ఈ క్షణం
నేను బ్రతికున్నట్లు తెలిసిన ఈ క్షణం నుంచి
నేనేం చేసినా చెయ్యకపోయినా
అందుకు బాధ్యత నాదే

ఏదో వెలితీ లోటూ కొరతా
ఏదో తపనా ఆవేదనా అశాంతీ
ఏదో ఒంటరితనమూ శూన్యమూ

గతం నన్ను బంధించేసిందట
నా బ్రతుకు నా సొంతం కాదట
ఈ క్షణంలో పుట్టిన నేను
ఆ నానారకాల బంధనాలను తెంచి ఎదురుతిరిగితే

బంధనాలు తెంచలేకా కాదు ఎదురుతిరగలేకా కాదు
లోకపు ములుకుమాటలకి వెనకాడీ కాదు
ఒకానొక బలహీనతకి లొంగిపోయిన
ఆశాగ్నిరేణువును నేను



prev   next