ఓటమిలోని గెలుపు

ఉన్నట్లుండి అమాంతం ఈ లోకంలో ఊడిపడ్డాను
అంతకు ముందేమిటో నాకేం తెలియదు
అలా చైతన్యించి చుట్టూ నాచుట్టూ పరికించాను

ఇది తెలుపు ఇది నలుపు ఇది పసుపు ఇది ఎరుపు
ఇది తప్పు ఇది ఒప్పు ఇది నిప్పు ఇది నీరు
ఇది ఊరు ఇది పేరు ఇది నీది ఇది నాది
అంటూ నియమనిబంధనలు పరిధులు వివరించారు

అది సరే ఇదంతా నాకంటే ముందు సంగతి కదా
నేను అవుననో కాదనో ఏదో అనకుండా
నాకెలా వర్తిస్తుంది

నేను చైతన్యించిన క్షణాన
అనురాగానికి అనురక్తించి అణువణువూ రాగరంజితమై
స్పందించి ఓ మనసున మనసంకితమై
నేను చూసిన రంగులు విన్న ధ్వనులూ
గమనించిన వివరణలు పరికించిన అవధులూ
మరింకెలాగో ఉన్నాయి

ఇంతకీ నేను పుట్టిందెప్పుడు
పుట్టినప్పుడు పుట్టినట్లా
చైతన్యించినప్పుడు పుట్టినట్లా

చైతన్యించిననాడు తొలిసారిగా ఓడిపోయాను
అప్పటినుంచి నిత్యం ఓడిపోతూనేవున్నాను
ఐనా
నన్ను ఓడిస్తున్నవాళ్ళెన్నటికీ
నన్ను గెలుచుకోలేరు
ఇది నా ఓటమిలోని
నా గెలుపు



prev   next