నిసి ఒక్కసారిగా లేచి, విక్టర్‌కి ఎదురుగా పరుగెట్టింది. టెరేస్ మీదకు కాలు పెట్టబోతున్న వాడిని ఆ ఆఖరు మెట్టు మీదే నిలబెట్టి, గాఢంగా కౌగిలించుకుంది. వారి ఎత్తులు సమాన మయ్యాయి. ఆమె అతని ముఖం చేతుల్లోకి తీసుకుని, అతని స్ఫుటమైన, ముద్దుల కాహ్వానిస్తున్నట్టుగా ఉండే విలువంపుల పెదవుల మీద తన గులాబీ పెదవుల ముద్దు ఉంచి, అలాగే నిలిపి ఉంచింది. దీర్ఘంగా అతని శరీరపు పరిమళాన్ని ఆఘ్రాణించింది. విక్టర్ అప్రయత్నంగా, ఆమెను చుట్టివేశాడు. ఎంతో రిజర్వ్‌డ్ నిసి. తన షెల్ నుంచి బయటకు వస్తున్నదా? విక్టర్, లోలోపల ఆశ్చర్యపోయినా, ఆమె కౌగిలికి, ముద్దుకు పరవశుడై, తిరిగి కౌగిలించి గాఢంగా ఆమెను ముద్దాడాడు.
టెరేస్ మీద కూర్చొన్న వారు ఆ సుందర దృశ్యాన్ని ఆనందించారు. The world loves the lovers.
నిసి, విక్టర్ మెట్లెక్కి వస్తుండగా, అక్కడి రెస్టరాంట్ స్టాఫ్ ఆనందంగా కన్నులతో సైగలు చేసుకున్నారు. ఎందుకంటే అంతకు ముందు సారి ఆమె ఫోర్ సీజన్స్‌లో, అక్కడ గెస్ట్‌గా ఉన్నప్పుడు ఒక యోగినిలా ఉండింది. అక్కడి వారందరితో ఆమె ఎంతో మర్యాదగా వ్వవహరించినా, ఏదో మారుమూల టేబిల్ దగ్గర మౌనంగా చదువుకుంటూ ఉంటం, రుచికరమైన వంటలు వైన్‌లు తెప్పించుకునీ, వాటిని అంటీ ముట్టకుండా నిరాసక్తంగా ఉండేది. ఆ సారి విజిట్‌లో, ఆఖరు రోజు ఆమె పుట్టిన రోజు అని గ్రహించి, ఛీఫ్ షెఫ్ ఆమెకు బఫే టేబిల్ దగ్గర, పక్కనే ఉండి, ఈ ట్రఫుల్స్, తప్పక తినాలి. ఇవి ఇక్కడి డెలికసీ. ఈ సీజన్లో తప్ప దొరకవు. ఈ సున్నితమైన క్రేప్స్, ఈ ఫ్రెంచ్ పేస్ట్రీలు, ఈ క్వెయిల్, ఈ వైన్ లతో, అంటూ ఆమె తినవలసినవన్నీ వేరు వేరు ప్లేట్లలో సర్దించి, వేరే వెయిటర్లతో ఆమె బల్ల దగ్గరికి పంపాడు. తర్వాత కొంచెం సేపు తనే వచ్చి ఆమెతో పాటు కూర్చొన్నాడు. అతని కుటుంబపు కబుర్లు చెప్పాడు. ఆ అపరిచితుల మర్యాదలకు ఆమె చలించింది. ఫ్రెంచ్ వారు మర్యాద లేని వారు, వేరే దేశాల వారితో రూడ్‌గా ఉండి, వారిని గమనించనట్టు ప్రవర్తిస్తారన్నారేం పుస్తకాలలో. తన అనుభవం ఏ ఒక్కసారీ అది కాదు. నిసి వారితో పాటు నవ్వింది. ఆమె ఉదాసీనతను మరిచింది. ఆ సారి ప్రొవాన్స్ నుంచి, ఫ్లారిడా వెళ్ళిపోయాక ఆ హోటల్ మేనేజ్‌మెంట్‌కు పొగడ్త ఉత్తరం రాసి, స్టాఫ్ తన ఫుడ్ ఎలర్జీ విషయంలో శ్రద్ద చూపుతూనే, ఎన్నో మంచి వంటలను వండిపెట్టినందుకు, ఆదరం చూపినందుకు, ఆ హోటెల్ పనివాళ్ళ ఫండ్‌కు పెద్ద మొత్తాన్ని గిఫ్ట్‌గా పంపింది.
నిసి, విక్టర్ చుట్టూ చేతులు చుట్టి అక్కడ కూర్చుందాం అంటూ, తన టేబిల్ దగ్గరకు నడిపించింది. ఈ సారి వారు కేవలం పరిచితులలాగా, అమెరికాలో స్నేహితుల వలె ఎదురు బొదురుగా కూర్చోలేదు. బూడపెస్ట్‌లో గ్రిషామ్ పాలస్‌లో లాగా ఫార్మల్‌గా, మర్యాదల గిరి లోనూ లేరు. అమెరికాలో వారి ప్రధమ పరిచయాలు గుర్తు చేసుకునే దశలో లేరు. యూరప్‌లో ప్రేమికుల లాగానే, ఆ చిన్న బల్ల దగ్గర కుర్చీలు పక్క పక్కన అతి దగ్గరగా జరుపుకున్నారు. ఆమె భుజాల చుట్టూ అతని చెయ్యి చుట్టే ఉంది. మధ్యలో వారు ఒకరిని ఒకరు చూస్తూ, ఎంతో కాలంగా చూసుకోక బెంగ పడిన వారిలాగా ముద్దులు పెట్టుకుంటున్నారు.
వారి బల్ల వద్దకు షాంపేన్, చిన్ని ఫలహారాలు, ఆలివ్‌లూ వచ్చి చేరాయి. తెచ్చిన వెయిటర్, “డాక్టర్ షామల్ అండ్ గెస్ట్‌కి కాంప్లిమెంట్స్‌తో” అన్నాడు.
విక్టర్ ఆమెకు ఛీర్స్ చెపుతూ, “ఈ దేశం నాది అనుకున్నా. ఇక్కడ పలుకుబడి ఎప్పుడూ, మీకే ఎక్కువున్నట్టుంది.”
ఆమె, ఒక ఆలివ్ అతని నోటికందించి, వెనువెంటనే ముద్దు పెట్టింది.
విక్టర్‌కి అర్ధమయింది. నిసిలో మార్పు. నిసి ఈజ్ ఇన్ లవ్ విత్ హిమ్ నౌ. అతని హృదయంలో ఎంతో సంచలనం. నమ్మలేని ఆనందం.
అతడైతే ఆమెను ఎప్పటి నుండో ప్రేమిస్తున్నాడు. ఆమెను తెలుసుకున్న ముందు రోజులలోనే, ఆమె పట్ల ప్రేమ కలిగింది. అప్పుడు నిసిని తన అక్కయ్యని, మృత్యు ముఖం లోంచి తప్పించే ఒక వీర వనితగా చూశాడు. ఆ రోజుల్లో ఆమెను గురించి, ఆమెను మనసులో ఉంచుకుని, అతను చిన్ని కంపోజిషన్స్ చేసేవాడు. అప్పుడప్పుడూ తన కాన్సర్ట్ లలో, శ్రోతలు చివరలో మరొక్క పాట, మరొక్క రొమాంటిక్ సాంగ్ అన్నప్పుడు, నిసిని గురించి తను రాసుకున్న ప్రెల్యూడ్‌స్, చిన్ని లీడ్స్ పియానో మీద వాయించి, తనే పాడి వినిపించేవాడు. నెమ్మదిగా, పోను పోను, ఇదివరకటి మోజార్ట్, షాష్టకోవిస్కీ, బ్రామ్స్, లిజ్స్ట్ సంగీతం తను వాయిస్తే ఎంత సంతోషంగా శ్రోతలు వింటారో అంతే ఆనందంగా ఆడియన్స్ అతని సొంత కాంపొజిషన్స్ వినేవారు.
నిసి అమెరికాలో ఆమె క్లినిక్ లలో తనను చూసినా, అప్పుడప్పుడు పేషెంట్లతో పాటు, ఆమె ఆఫీస్‌లో గాని, తర్వాత పేషెంట్ దగ్గర బంధువుగా పేషెంట్ లేకుండానే ఫామిలీతో డిస్కషన్ రూమ్స్‌లో కలిసినా కూడా, చాలా ప్రొఫెషనల్‌గా వ్యవహరించేది. ఆమె తన వైద్యవృత్తిలో పేరు గడించుకుంటున్న రోజులవి. రోగుల వైద్యం, పాత కొత్త పధ్దతులు బేరీజులు, రోగ నిదానం, కుటుంబం నుండి రోగికి సరైన ప్రేమ, ఆర్ధిక సహాయాలు కల్పించటం, ఎప్పటికప్పుడు, రోగి పరిస్థితిని గూర్చి, కుటుంబంలోని వ్యక్తులకు సరిగా చెప్పి, ఒకవేళ పిల్లలుంటే, వారికి సరైన భద్రత – మానసికంగాను, ఇంటి దగ్గర వారి పరిరక్షణ లోను, ఇవన్నీ ఆమె ముందు చూపుతో ఆలోచించి, నర్సులతో, సోషల్ వర్కర్ లతో కలిసి పని చేస్తూ, చాలా చురుకుగా ఉండేది. విక్టర్‌కు ఆమె అప్పట్లో ఇలా కనిపించి అలా మాయమయ్యే తళుకు తార. ఒక బ్రైట్ స్టార్.
ఆమె అప్పట్ల్లో తన పేషెంట్ తమ్ముడైన అతనిని గురించి ఏమీ ఎక్కువగా తెలుసుకునే ప్రయత్నమే చెయ్యలేదు. ఐనా ఆమెను గురించి అతని అడ్మిరేషన్ పెరుగుతూ వచ్చింది. నర్సుల ద్వారా, ఆమె వివాహిత అని విన్నప్పుడు అతడ హతాశుడయ్యాడు. అతడు యూరోపియన్. తనయందు అనురక్తి ఉంటే, ఆ స్త్రీ పొందు అతనికి అభిలషనీయమే. కాని నిసి ఇండియన్. ఎంతో మోడర్న్‌గా కనిపిస్తున్నది. ఆమె బ్రిలియన్స్‌తో మెప్పిస్తున్నది. కానీ ఆమె కల్చర్ వేరు. ఐనా ఆ సందర్భంలో అతని అక్కయ్య జబ్బు గురించిన ఆలోచనలు, ఆమె క్షేమం, అతనికి ప్రధానం. నిజానికి డాక్టర్ నిసి షామల్ మీద ఆకర్షణకు, తనకు తన అక్క మీద ఉన్న ప్రేమాభిమానాలే ఎక్కువ కారణం ఏమో అని అతను చాలా సార్లు వితర్కించుకున్నాడు.
ఏమైనా ఆమెను లండన్‌లో, తర్వాత రోమ్‌లో కలవటం అతని జీవితంలో అనుకోకుండా వచ్చిపడిన వసంతం. అతడు ఆమెతో ఉత్తరాల ద్వారా గాని, ఫోన్‌లో అప్పుడప్పుడూ మాట్లాడి కాని, మరీ మరీ కాంతిమంతుడవసాగాడు. అతని సంగీతం, ఎంతో హృదయ స్పందనను కలిగించేదిగా మార్పులు చెందుతూంది. అతని స్నేహితులు, సంగీత విమర్శకులు, ఎంతో వివేచనతో, ఆ మార్పులను గమనించి, వ్యాసాలలో, పత్రికలలో నమోదు చేస్తున్నారు. ఇప్పుడు అతని లైవ్ కాన్సర్ట్ లకు ఎంత సేల్స్ ఉన్నాయో, అతని రికార్డింగ్ లకు కూడా అలాటి మార్కెట్ క్రియేట్ అవుతున్నది. ఆ కళాకారునిలో ఇంతటి కళా విస్ఫోటనానికి కారణం ఐన నిసికి ఈ విషయాలేమీ తెలియనే తెలియవు. ఇప్పుడు ఈ నాటికి తనంటే, తను గౌరవించే ఈమెకు ప్రేమ ఉద్భవించింది. విక్టర్ నిజంగా విజేత ఐనాననుకున్నాడు. సహజంగా ఉత్సాహశీలి, సహృదయుడు అతడు. అతని కల నిజమయింది.
వారిద్దరూ మెన్యూ లోంచి ఇద్దరికీ ఇష్టమైన పదార్ధాలు ఆర్డర్ ఇచ్చారు. వైన్ వారిద్దరికీ అతడినే సెలక్ట్ చెయ్యమంది. అతడు ఫ్రెంచ్‌లో వెయిటర్ను ఏవో ప్రశ్నలడుగుతున్నప్పుడు, తెలియకుండానే “డార్లింగ్ నిసీ! ఇది నీకోసం తెప్పిస్తున్నా” అంటే, “ష్యూర్ ఐ లవ్ ఇట్ స్వీటీ!” అంది. ఆ వెయిటర్ వాళ్ళ ముందు నుండి మెన్యూలు తీసీ తియ్యగానే అతని జుట్టు సవరిస్తున్నట్టు ఇంకొంచెం చెరిపి, అతని చెంప పైని చేయి ఆనించి, పెదిమ చివరలు అంటి, మెడ పైని వేళ్ళుంచీ, ఏదో ఒక మిషతో అతనిని తాకటంతో, విక్టర్‌కు ఎంతైనా సంతోషం కలిగింది. ఎంత రిజర్వ్‌డ్‌గా ఉండే నిసి, అతి ప్రైవెసీని మెయింటైన్ చేస్తూ, ఎవరినీ తన లోపలి పరిధి లోనికి రానివ్వని ఈమె, ఈ విద్యావతి, నా కోసం తన హృదయపు తలుపులు తెరిచింది. ఎందరైనా స్నేహితులు ఉండి ఉండాలే, ఆమె విద్యార్థి దశ నుండి ఇప్పటివరకూ. నేనే ఎందుకు ఇష్టమయ్యాను? సంగీతమంటే ఆమెకు ఇష్టమున్న మాట నిజమే, కాని అలా అంటే ఆమె ఆలెక్స్ రూబెన్ స్టూడెంట్. హి ఈజ్ ఎ టెరిబ్‌లీలీ ఎట్రాక్టివ్ గై. ఒకరికొకరు దగ్గర్లో ఉండి తరచూ కలుసుకుంటారు కూడాను. వై నాట్ హిమ్! అనుకున్నాడు. ఆ ఆలోచనలన్నీ ఇప్పుడెందుకు! ఆమె స్పష్టంగా తనపై ప్రేమ చూపుతుంటే.
విక్టర్ ప్రేమశీలి. ఆమెకు, “యూ మస్ట్ టేస్ట్ దిస్ నిసీ!” అని ఆమెకు తన ఫోర్క్‌తో తినుబండారాలు నోటికి అందిస్తూ, మధ్య మధ్యలో “యూ నో వాట్ హాపెన్డ్ ద అదర్ డే ఇన్ మొనాకో,” అంటూ, వాళ్ళు ఎన్నో సంవత్సరాలనుండి ఎడం లేకుండా కలిసి ఉన్నట్టే కబుర్లు చెప్పాడు. “ఈ రిసార్ట్ చాలా బాగుంది. బ్యూటిఫుల్ ఔట్ డోర్ స్కల్ప్‌చర్. బ్యూటిఫుల్ ఇన్ఫినిటీ పూల్! వాట్ ఎ లొకేషన్. నిసీ! ఆ కనిపించే దూరపు కొండల బారులలో ఉన్న విలేజెస్ ఫయాన్స్, సెయాన్స్, మాఁస్, అక్కడి పాత ఆర్కిటెక్చర్, చర్చెస్, చిన్ని చిన్ని వీధులు, వారి కూరగాయల మార్కెట్, ఆ కొండ దారుల్లో ప్రకృతి దృశ్యాలు అద్భుతంగా ఉంటాయి. అవన్నీ తప్పక చూడాలి.”
నిసి టెర్రబ్లాంచ్ ఫోర్ సీజన్స్ రిసార్ట్ ఆర్కిటెక్ట్ నుమాయెర్‌ని చాలా మెచ్చుకుంది. మెయిన్ హోటెల్, విడి విడిగా విల్లాలు, ఈ కొండలలో, లోయలలో సమ్మిళితమై పోతూనే, గాల్ఫ్ కోర్స్‌తో, భవనాల లోపల మాత్రం అత్యంత ఆధునికమైన సౌకర్యాలు, కలిగి ఉండటం చాలా హాయినిస్తున్నదనీ, ఎన్ని దారులలో నడిచినా, ప్రొవాన్స్ చెట్టు చేమల పరిమళాలు ఆఘ్రాణించటంలో తనివి తీరటం లేదని అతనితో అన్నది.
కబుర్లాడుకుంటూ తేలిక తేలికగా, ఎన్నో డెలికసీలు రుచి చూసి, ఆఖరుగా, లెట్ అజ్ షేర్ క్రిమ్ బ్రూలె అండ్ సమ్ షెర్రీ, అనుకున్నారు వారు. అప్పుడే పైన ఆకాశంలో మూన్ ప్రకాశమానమవుతున్నది. ఆ కాంతిలో నిసి చక్కని వంపుల విగ్రహం ప్రదర్శితమైంది. ఆమె వంకుల పొడవు జుట్టు మిలమిలలాడింది. ఆమె బిల్ సైన్ చేస్తుండగా, “నా కార్ టెంపరరీ పార్కింగ్ లో ఉంది, కెన్ యు మూవ్ ఇట్ ప్లీజ్?” అని విక్టర్ అంటే వెయిటర్ నిసి వంక చూసి, ఆమె తల ఊపు అర్ధం చేసుకుని, “మీరు కీస్ ఇస్తే, మేడమ్ విల్లాకి దగ్గర పార్కింగ్‌కి మారుస్తాము. వెన్ యూ ఆర్ రెడీ, ఎ గాల్ఫ్ కార్ట్ విల్ టేక్ యు టు ద విల్లా. అన్లెస్ యు వాంట్ టు వాక్. ఎంతో అందమైన రాత్రి.” అన్నాడు.
“వియ్ వాంట్ టు వాక్, ధాంక్స్ అండ్ గుడ్ నైట్!” అని చెప్పేసి వెళ్ళి పోయారు నిసి, విక్టర్.
“యు రిమెంబర్ ద నైట్ ఇన్ రోమ్ నిసీ!?” అన్నాడు విల్లాలో, అతడు. బాల్కనీ మీదికి వెళ్ళే స్లైడింగ్ డోర్స్ బార్లా తెరిచి ఉన్నాయి. వెన్నెల పొడలు పొడలుగా వారి మీద పడుతోంది. అతడు హోటల్ రోబ్ ధరించి కాళ్ళు బార చాపుకొని, సోఫాలో జారగిలబడి ఉన్నాడు. అతని ఒడిలో నిసి.
“ఎనీ బాండ్ ఎయిడ్స్ ఫర్ ద ఫుట్ టునైట్, డార్లింగ్! యు వాంట్ ఎ పొయట్రీ రీడింగ్!?” అడిగాడు ఆమెను ముద్దులాడుతూ.
“ఐ కెన్ డూ విత్ ఎ సాంగ్! నా కోసం పాడండి.” అంది నవ్వుతూ నిసి, తన పాదాల గోళ్ళ రంగుల కేసి చూస్తూ.
మెల్లగా, మధురంగా పాడాడా సంగీతకారుడు.
ఆకాశంలో ఆడే తారలు!
నడయాడే చంద్రిమ
ప్రేమించనా నిన్నొకసారి!
నిన్ను చూసింది మొదలూ
చెప్పాలనుకున్నా,
కావాలని నీతో సంగమ భోగం
రాతిరి జరిగే, సమయం తరిగే
ఉషస్సు తోచే;
ప్రేమించనా నిన్నొక సారి!
(నిసి షామల్ 2014 డైరీ నుండి.)