కృషితో దుర్భిక్షం

ఇంకో రెండు రోజులు పోయిన తరువాత విత్తనాలు మొలకేత్తవేమో నన్న అనుమానం కలిగి ఇంకో నాలుగు రోజుల తరువాత బలపడింది. ఇలా ఎందుకు జరిగిందా అని బాసింపట్టు వేసుకొని తీవ్ర మేధోమధనం చేసుకున్నాను. లేచి ఒక కప్పు కాఫీ తాగి మంచం మీద పడుకొని చింతన్ బైఠక్ చేసుకున్నాను. ఈ తీవ్ర పరిశోధన వల్ల నా మనోవీధిలో కొన్ని సత్యాలు దృగ్గోచరమయ్యాయి.

  1. సూర్య కిరణాలు పడుచున్న చోటే పూల మొక్కలున్నాయి.
  2. సూర్యకాంతి పడక పోవడం వల్ల విత్తనాలు మొలకెత్తలేదు. బహుశా కుళ్ళి, కృశించి నశించిపోయాయి.
  3. గోడకు పక్కనే ఉండడం వల్ల సూర్యకిరణాలు, మన వ్యవసాయ క్షేత్రంలో పడటం లేదు.
  4. సూర్యరశ్మి పడాలంటే వెనకింటాయన, పక్కింటాయన సహాయ సహకారాలు అవసరం. వారి సహాయాన్ని కోరాలి.

మర్నాడు మొదటగా వెనకింటాయన ఇంటికి వెళ్ళాను. ఆయన సాదరంగానే ఆహ్వానించారు. విత్తనాలు మొలకెత్తక పోవటానికి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గాఢ సంతాపాన్ని ప్రకటించారు. విత్తనాల ఆత్మ శాంతికి ఒక నిముషం మౌనంగా ప్రార్ధించారు. తరువాత నేను వచ్చిన పని మనవి చేయమని కోరారు. నేను విషయం వివరించాను. మా గోడ పక్కన సూర్యరశ్మి పడాలంటే ఆయన చేయాల్సిన పని చెప్పాను. ఆయన రెండు నిముషాలు రెండోసారి తీవ్ర దిగ్బ్రాంతికి లోను అయ్యాడు. నోట మాట రాలేదు. తేరుకొని వాళ్ళావిడను పిలిచాడు.

‘చూడు ఈయన ఏమి అడుగుతున్నాడో? వాళ్ళ గోడ పక్కన ఎండ పడాలంటే మన ఇంటి పైన రెండు అంతస్థులు పడగొట్టాలంట. ఎంత ధైర్యం!’ అంటూ ఆవిడను కోప్పడ్డాడు. ఆపైన వాళ్ళిద్దరూ కలిసి నామీద విరుచుకు పడ్డారు. చెడామడా, ఎడాపెడా దుమ్ము దులిపేశారు, దుర్భాషలాడారు. ఈ పక్క వాళ్ళు, ఆ పక్క వాళ్ళు పరిగెత్తుకు వచ్చారు. విషయం విని వాళ్ళు కూడా నా మీద మాటల శరాలు సంధించారు. నాకూ కోపం పేట్రేగి పోయింది. ‘అసలు ఇన్ని అంతస్థులు కట్టడానికి మీకు అనుమతి ఉందా? పక్క వాళ్ళ ఇళ్ళకి ఎండ, గాలి, వెలుతురు తగలకుండా ఇలా పై అంతస్థులు కట్టడం చట్ట విరుద్ధం,’ అంటూ లా పాయింటు విశదీకరించాను. ‘కాబట్టి మీరు చట్టాన్ని గౌరవించాల్సిన అవసరం వుంది!’ అని తీవ్రాతి తీవ్రంగా ఎదురు దాడికి దిగాను. కానీ ఫలితం లేకపోయింది. అందరూ ఏకతాటిపై నిలబడి, ఉమ్మడిగా ముక్త కంఠంతో, ‘మాకు అనుమతులు ఉన్నాయో లేవో నీకనవసరం, నీ దిక్కున్న చోట చెప్పుకో’ మన్నారు. చేసేదేమీ లేక నేను తిరిగి వచ్చాను. అయినా నేను ధైర్యం వీడలేదు.

మర్నాడు పక్కింటాయన దగ్గరికి వెళ్ళాను. ‘వెనకింటాయన్ని బాగా కడిగేశారుటగా నిన్న. నిజమే, మనకి అసలు ఎండ రావటం లేదు. టెర్రస్ మీద ఆరవేసిన బట్టలు కూడా ఆరటం లేదు,’ అన్నాడు ఆయన. ‘ఆ విషయం మాట్లాడడానికే వచ్చాను. మీరు టెర్రస్ మీద బట్టలు ఆరవేయవద్దు. అందువల్ల మా మొక్కలకి వచ్చే గంట ఎండా రావటం లేదు. కాబట్టి మీరు బట్టలు ఇంకో చోట ఆరవేసుకోండి,’ అని కోరాను. ఆయన అగ్గి ఫైర్ అయ్యాడు. ఈయన వాళ్ళావిడను పిలవలేదు కానీ వాళ్ళ కుక్కని పిలిచాడు. నేను మధ్య గోడ దూకి మా ఇంటికి పారిపోయి వచ్చాను.

ఇప్పుడు నేనేమి సేయవలెనని చింతించాను. మరల ఇంకోమారు చింతన్ బైఠక్ కూర్చునే చేశాను. ఎందుకో న్యూటన్ మహాశయుడు, బుద్ధుడు గుర్తుకు వచ్చారు. జ్ఞాన చక్షువులు విచ్చుకోవాలంటే ఆపిల్ చెట్టో, బోధివృక్షమో కావాలి, మా చుట్టుపక్కల అవి లేవు. జామకాయని పేదవాడి ఆపిల్ అంటారు కాబట్టి జామ చెట్టు కింద నుంచుని ఆలోచించాను. మెరుపు మెరిసింది. సంభ్రమానందోత్సాహములతో, ఈ పక్కింటాయన ఇంటి టెర్రస్, మా టెర్రస్ పరిశీలించాను. అక్కడనుండి మా ఇంటి గోడల దూరం కొలిచాను. కాగితం కలం తీసుకొని లెఖ్ఖలు వేశాను. బజారుకెళ్ళి కావాల్సిన పరికరాలన్నీ తీసుకువచ్చాను. ఈ పక్కింటాయన అనుమతి తీసుకొని, వారి టెర్రస్ మీదా, మా టెర్రస్ మీద, మా ఇంటి రెండు గోడలమీద, పరికరాలు అమర్చాను. మా రెండు గోడల పక్కన సూర్య రశ్మి పడింది. రోజూ కనీసం రెండు గంటలు సూర్య కాంతి పడేటట్టు పరికరాల కోణాలు సరిచేశాను. మా ఆవిడ బుగ్గలు నొక్కుకుంది. ‘మీకు మతి భ్రమించలేదు కదా,’ అని విచారంతో కూడిన ఆశ్చర్యం వెలిబుచ్చింది. వెంటనే తన అనుజుడికి టెలిఫోన్ చేసి, ‘మీ బావగారిని మానసిక వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళాలేమోరా,’ అని అనుమానం వ్యక్తం చేసింది. ఆ పక్కింటాయన కోడై కూశాడు. వెనకింటాయన దండోరా వేశాడు.

సాయంకాలానికి, కాలనీ జనం మా ఇంటికి క్యూ కట్టారు. మా శంకరరావుగారు నా భుజం తట్టి, ‘మొత్తం మీద సైంటిస్ట్ ననిపించుకున్నావు ప్రద్యుమ్నా,’ అని నా భుజం తట్టారు. ‘ఆ ఇంటి మీద, ఈ ఇంటి మీద, ఆ గోడల మీద, అంత ఎత్తులో ఇలా అద్దాలు అమర్చి, సూర్యకాంతిని పరావర్తనం చేయించి మీ గోడపక్కల పడేటట్టు చేయడం అపూర్వం!’ అని మెచ్చుకున్నారు. నా ఎదుట నన్ను మెచ్చుకున్నా నలుగురితో కలిసి నవ్వుకున్నారని తరువాత తెలిసింది. అయినా నేను లెఖ్ఖ చేయలేదు.

ఈ మారు మరింత నియమ నిష్టలతో విత్తనాలు చల్లి పవిత్ర నదీ జలాలతో అభిషేకం చేశాను. ఎందుకైనా మంచిదని గుళ్ళో రుద్రాభిషేకం చేయించి అమ్మవారికి అరటి పళ్ళు సమర్పించాను. సాయిబాబా గుళ్ళో కొబ్బరికాయ కొట్టాను. రోజూ కనీసం రెండు మూడు మాట్లు, సూర్య కాంతి పడేటట్టు అద్దాల కోణాలు మార్చేను. ఒక వారం రోజులు భారంగానే గడిచాయి. వారం రోజుల తరువాత కొన్ని విత్తనాలు మొలకెత్తాయి. ఇంకో నాల్గైదు రోజుల్లో మరికొన్ని మొలకెత్తాయి. నా మది ఉయ్యాలలూగే అని పాడుకున్నాను. కానీ వారం పదిరోజులైనా అవి ఒక సెంటిమీటర్ కూడా పెరగ లేదు. ఇంకో పది రోజులైనా పరిస్థితిలో పెద్దగా మార్పు లేదు. అవి ఓ మిల్లీమీటర్ పెరిగాయేమో. వెనకింటాయనా, ఆ పక్కింటాయనా నన్ను చూసి మళ్ళీ నవ్వడం మొదలు పెట్టారు. ఈ పక్కింటాయన కూడా, ‘ఏదో ఒకటి రెండు పూల మొక్కలు ఎలా పెరిగేయో తెలియదు కానీ భూమిలో సారం లేదనుకుంటాను,’ అని అభిప్రాయపడ్డాడు.

నేను ఓటమి నంగీకరించక సారం పెంచడానికి ఒక కేజీ యూరియా ఇంకో కేజీ ఎన్.పి.కె ఎరువులు తెచ్చాను. అర కేజీ యూరియా బకెట్టు నీళ్ళలో వేసి, యూరియా నీళ్ళు పిచికారీ చేశాను. పావుకేజీ ఎన్.పి.కె చల్లాను. ఇక మొలకలు ఉత్సాహంగా పెరుగుతాయని అనుకున్నాను. కానీ మర్నాటికి కొన్ని మొలకలు నల్లబడ్డాయి, కొన్ని వాలిపోయాయి. ఇంకో రోజులో కీర్తిశేషులైనాయి. వెనకింటి పక్కింటి పనివాడు ‘అంత యూరియా పోస్తే మానైనా పడిపోతుందండి మరి,’ అని కిసుక్కుమన్నాడు. వెనకింట్లోంచి, పక్కింట్లోంచి అట్టహాసాలు వినిపించాయి.

ఈ మాటు ఒక రెండడుగులు నేల తవ్వించి, ఆ మట్టి అవతల పాడేయించి, ఎర్రమట్టి, ఒండ్రు మట్టితో నింపితే మొక్కలు భేషుగ్గా పెరుగుతాయని ప్రణాళిక సిద్ధం చేసుకున్నాను. నా ఆలోచనలను ఇట్టే పసిగట్టే ప్రావీణ్యం గల మా ఆవిడ, ‘ఇప్పటికే నలుగురూ నవ్వుతున్నారు. ఇకపై మీరు ఏమీ పెంచఖ్ఖర్లేదు. మీరు ఎంత కృషి చేసినా మీ పర్సుకి దుర్భిక్షమే తప్ప మరేం కాదు,’ అంటూ వీటో చేసేసింది.

రచయిత బులుసు సుబ్రహ్మణ్యం గురించి: హాస్యరచయితగా బ్లాగ్లోకంలో ప్రసిద్ధులు. ఇటీవలే వారి రచనల సంకలనం "బులుసు సుబ్రహ్మణ్యం కథలు" ప్రచురించారు.  ...