కథ దేని గురించి?

ఇలాంటి కథలకు ఒక ఉదాహరణ మథురాంతకం రాజారాం గారి ‘ఎడారి కోయిల’. కథ చివర్లో ప్రధాన పాత్ర రవి ఆలోచన ఇది: “భౌతిక వనరుల విషయంలో భగవంతుడు వీళ్ళను చిన్న చూపు చూశాడు. సిరిసంపదలకు నోచుకోకపోయినా వీళ్ళలో మంచితనానికీ, మమకారాలకూ కొదువలేదు. జయాపజయాల మాటకేముందిగాని, వీళ్ళు వీరోచితంగా పరిస్థితులతో పోరాడుతూనే ఉన్నారు. ఈ పోరాటంలో ఏ అదృష్టవంతుడికైనా విజయం పొందేటట్లుగా తోస్తే, అలాంటివాణ్ణి కలిమి కలిగిన కామందులు గద్దల్లా వచ్చి తమగూళ్ళల్లోకి తన్నుకుపోతున్నారు. అలా వేరు పడిన జన సమూహంలో నుంచి తమకు నచ్చిన వాళ్ళనీ, కావలసినవాళ్ళనీ, సంపన్న దేశాలవాళ్ళు తమ సరసకు చేరదీసుకుంటున్నారు. అదంతా ఒక విజేతల వర్గం. విజేతలయిన వారికి పరాజితులపట్ల ఇసుమంతైనా సానుభూతి ఉండటం లేదు. ప్రేమ, త్యాగం, మమకారం, ఆత్మీయత మొదలైనవి వాళ్ళ పాలిటికి అర్ధహీనమైన పదాలుగా తోస్తాయి. స్వార్ధమే వాళ్ళ జీవితాకికి పరమార్ధమైపోయింది. సంగ్రహంగా ఇది ఈనాటి సామాజిక చరిత్ర అయి ఉండాలి”.

రవి ఆలోచన అంటూ రచయిత చేసిన ఈ వ్యాఖ్యానాన్ని వదిలేసి, దీనికి ముందు వరకూ ఉన్న కథను మాత్రం తీసుకుంటే, ఇదొక చక్కటి కథ. రాయలసీమలో ఒక పల్లెటూరికి చెందిన మొగిలి నరసింహారావు వరంగల్లులో, కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో, ఒక సంపన్న కుటుంబం అమ్మాయిని ప్రేమించాడు. పెళ్ళి చేసుకున్నాడు. ఆ కుటుంబం సహాయంతో అమెరికా వెళ్ళిపోయాడు. అప్పటినుంచి ఇప్పటిదాకా తల్లిదండ్రులనూ, తమ్ముళ్ళనూ, చెల్లెలినీ చూట్టానికి ఒక్క సారికూడా తిరిగి స్వగ్రామానికి రాలేదు. అతన్ని చదివించటానికి చేసిన అప్పులు తీర్చటానికి, ఉన్న భూమిని అమ్మేస్తుంది కుటుంబం. నరసింహారావుకు ఇప్పుడు ఒక కొడుకున్నాడు. అతడే కథానాయకుడు రవి. అమెరికాలో పుట్టిపెరిగిన రవి, మెడికల్ కాలేజీలో చేరటానికి ఇండియా వచ్చి, విజయవాడలో అమ్మమ్మ ఇంటికెళ్ళి, అక్కడనుంచి తిరుపతి వెళ్ళొస్తాననే నెపంతో తాత కుటుంబాన్ని చూట్టానికి రాయలసీమ వస్తాడు. అవ్వ, తాత, మేనత్త అతన్ని ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తారు. వారి బీదతనం కళ్ళారా చూసిన రవి తన తండ్రి, అంత సంపద ఉండికూడా, అతని కుటుంబాన్ని నిర్లక్షం చేశాడని సులభంగానే గ్రహిస్తాడు.

ఇంతవరకూ చదివిన పాఠకుడికి తోచేది నరసింహారావు స్వార్ధపరుడు అని. తనను చదివించి అప్పుల పాలైన కుటుంబాన్ని వెనక్కు తిరిగి కూడా చూడని హృదయం లేని వాడని. కానీ రాజారాం గారు చేసిన వ్యాఖ్యానానికీ కథా వస్తువుకూ పొంతనలేదు. పేదలు “వీరోచితంగా పరిస్థితులతో పోరాడుతూనే ఉన్నారు. ఈ పోరాటంలో ఏ అదృష్టవంతుడికైనా విజయం పొందేటట్లుగా తోస్తే, అలాంటివాణ్ణి కలిమి కలిగిన కామందులు గద్దల్లా వచ్చి తమగూళ్ళల్లోకి తన్నుకుపోతున్నారు. అలా వేరు పడిన జన సమూహంలో నుంచి తమకు నచ్చిన వాళ్ళనీ, కావలసినవాళ్ళనీ, సంపన్న దేశాలవాళ్ళు తమ సరసకు చేరదీసుకుంటున్నారు. అదంతా ఒక విజేతల వర్గం.” ఈ కథలో నరసింహారావు ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్ళిచేసుకున్నాడు. తన సొంత నిర్ణయం మీద అమెరికా వెళ్ళాడు. అత్తామామలు అతన్ని గద్దల్లా తన్నుకుపోలేదు.

పైగా రవికి అలెక్స్ హేలీ రాసిన రూట్స్ గురించి తెలుసు. తన కుటుంబానికీ కుంటా కింటే కుటుంబానికీ పోలికలున్నాయి, తేడాలు కూడా ఉన్నాయి అనుకుంటాడు రవి. తేడాల్లో ముఖ్యంగా కనిపించింది హేలీ కుటుంబీకులు అమెరికాలో ఏడు తరాలుగా ఉండటం, తను మాత్రం రెండవ తరం వాడు మాత్రమే కావటం. హేలీ పూర్వీకులను జంతువుల్లాగా గొలుసుల్తో బంధించి అమెరికా తీసుకొచ్చి బానిసలుగా అమ్మారన్న విషయం, తన తండ్రి మాత్రం స్వనిర్ణయం మీదే అమెరికా వచ్చాడన్న విషయం గ్రహించడా రవి? లేక రచయిత అతన్ని గ్రహించనివ్వడా?

నరసింహారావు తమ్ముళ్ళిద్దరూ కూడా ఇప్పుడు రాయలసీమలో స్వగ్రామంలో ఉండటం లేదు. ‘బ్రతుకు తెరువు కోసం’ వాళ్ళు పొరుగు రాష్ట్రాల్లో ఉంటున్నారని నరసింహారావు బాల్యస్నేహితుడు రవికి చెప్తాడు. పొరుగు రాష్ట్రాలు వీరిని గద్దల్లా తన్నుకుపోయాయని చెప్పడు.

క్లుప్తంగా, వ్యక్తిగత బాధ్యతలు మర్చిపోయేవారి మీద అసహ్యం కలిగిస్తుంది ఈ కథ. కానీ, సంపన్నులు బీదకుటుంబాలనుంచి తెలివైవ వారిని గద్దల్లా తన్నుకుపోవటానికీ, సంపన్న దేశాలు వీరిని దగ్గిరకుతీసుకోవటానికీ తగిన కథనం ఇందులో లేదు. అది గ్రహించిన రచయితకు చివర్లో వ్యాఖ్యానం చెయ్యటం తప్ప మరో మార్గం దొరక లేదు.


ఇక్కడ నేను చేసిన ప్రయత్నం ఏ కథలు మంచివి, ఏవి మంచివికాదు అని చెప్పటం కాదు. రచయిత తను ఎన్నుకున్న వస్తువును గురించి పాఠకుడికి కథనం ద్వారా చెప్పాడా లేదా అని మాత్రమే.

మొదటి రకం కథల విషయంలో, వస్తువు చుట్టూ అల్లిన కథలు మంచివి కాదనే అభిప్రాయం అమెరికాలో బలంగా ఉంది. నాలుగైదు సంవత్సరాల క్రితం నేనొక సృజనాత్మక రచన కోర్స్ తీసుకున్నాను. కథ దేని గురించీ అన్న ప్రశ్న అసలు రాకూడదు అన్నారు మా ప్రొఫెసర్. కానీ, అలాంటి అభిప్రాయంతో నేను ఏకీభవించను. నేనే కాదు, తెలుగు వారిలో చాలా మంది ఈ అభిప్రాయంతో ఏకీభవించరు. రచయితకు సామాజిక స్పృహ ఉండాలనే అభిప్రాయం తెలుగు వారిలో చాలామందికి ఉంది. మన కథల్లో ఎక్కువ భాగం సమకాలిక సామాజిక స్థితిగతుల్ని గురించే ఉంటాయి. కానీ, సామాజిక సమస్యల గురించి రాసినవే మంచి కథలు అని నేను అనుకోను. సమస్యలు బాహాటంగా కనిపించని జీవితానుభవాల గురించి కూడా మంచి కథలు రాయవచ్చు. అలాగే వస్తువు ప్రాముఖ్యతలేని కథలన్నీ మంచివి అని కూడా అనలేము.

ఒక వస్తువును ఎన్నుకున్న తర్వాత, దాని గురించి సూటిగా చెప్ప దలిస్తే, కథ రాయనవసరం లేదు. సూటిగా చెప్పటానికి తగిన సాధనం వ్యాసం. చెప్పదల్చుకున్న విషయాన్ని పాత్రల చేత పెద్ద ఉపన్యాసాలిప్పిస్తూనో, లేక వారి మనసుల్లో దూరి వాళ్ళ ఆలోచనలను వివరిస్తూనో, లేక బాహాటంగా వ్యాఖ్యానాలు చేస్తూనో రాసే కథలకూ (అంటే పైన చెప్పిన మూడూ, నాలుగూ రకాల కథలు) వ్యాసాలకూ పెద్ద తేడా లేదని నా అభిప్రాయం. రచయిత చెప్పదల్చుకున్నదేదో సన్నివేశ కల్పన ద్వారా, పాత్ర చిత్రణ ద్వారా చెప్పాలి – పైన చెప్పిన రెండోవిధమైన కథలద్వారా. అంటే వస్తువుకంటే శైలికి ఎక్కువ ప్రాముఖ్యత ఉండాలని కాదు. వస్తువు గురించి చెప్పే విధానం వ్యాసానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని మాత్రమే నా ఉద్దేశం.

(కథాసాహిత్యం గురించి విపులంగా చర్చించిన డీ.టీ.ఎల్.సీ మిత్రులకు, ప్రత్యేకించి కన్నెగంటి రామారావుకు నా కృతజ్ఞతలు)


ఆరి సీతారామయ్య

రచయిత ఆరి సీతారామయ్య గురించి:

ఆరి సీతారామయ్య విద్యావేత్త. ఆయన రచనలు సాహితీ ప్రియులకు ఎంతో ఆసక్తిని కలిగిస్తాయి. సామాజిక సమస్యల గురించి రాయడమే కాకుండా, మానవ సంబంధాలు, వ్యక్తిగత అనుభవాల ఆధారంగా కథలు చెప్పడంలో నిపుణులు.

 ...