“పెళ్ళి సందడి తగ్గిపోయి ఇల్లంతా బోసిపోయింది కదూ?” అన్నాడు రాజశేఖరం భార్య సుమతితో.
వాళ్ళ రెండో అమ్మాయికి ఇటీవలే పెళ్ళి చేసి బాధ్యత తీరిందన్న సంతోషంలో వున్నారిద్దరూ.ఇద్దరూ ఉద్యోగాలు చేస్తుండటం వల్ల, పిల్లల చదువులూ, పెళ్ళిళ్ళూ చేసినా అప్పుల పాలవలేదు.
“ఇంక నువ్వు ఉద్యోగం మానేసి రెస్టు తీసుకో సుమతీ” అన్నాడు రాజశేఖరం.
“ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చుంటే బోరు కొట్టదూ?” నవ్వింది సుమతి.
“ఇన్నాళ్ళు కష్టపడ్డది చాల్లే! మా అమ్మా నాన్నలిద్దరూ డెభ్భై లో పడ్డారు.పాపం, పదేళ్ళుగా మా తమ్ముడి దగ్గరే వుంటున్నారు. వాళ్ళని తెచ్చి మనతో వుంచుకుందాం. నువు వాలంటరీ రిటైర్మెంటు తీసుకున్నావంటే, నీకటు రెస్టు గా వుంటుంది, వాళ్ళని చూసుకోవటంలో ఇబ్బందీ వుండదు. ”
“అదేదో మీరే చేసి, ఆ రెస్టేదో మీరే తీసుకుంటూ వాళ్ళ సేవలేవో మీరే చేసుకోవచ్చుగా?” అని ఎప్పుడూ అడగదు ఆమె. కానీ, అతని డబుల్ స్టాండర్స్డ్ నీ, దాన్ని సమర్ధించే వ్యవస్థనీ అర్ధం చేసుకోకుండా వుండలేదు. అందుకే ఎటూ కాని ఒక నవ్వు నవ్వి లేచి వెళ్ళిపోయింది. ఎనభై ఏళ్ళు పై పడి ఎక్కడో ఒంటరిగా కాలం గడుపుతున్న తల్లి గుర్తొచ్చింది.
సరిగ్గా ఆరు నెలల క్రితం తను ఇలాంటిదే ప్రస్తావన తెచ్చింది.
“మా అమ్మ పెద్దదయిపోతుంది.ఒంటరిగా కష్టపడుతుంది. ఆమెని తెచ్చి మనతో వుంచుకుందామా?” అని.
“మనతోనా? ఎలా కుదురుతుంది? నువ్వు ఆఫీసుకెళ్తే ఆవిడ ఒంటరిగా గడపాల్సి రాదూ? ”
నవ్వొచ్చింది సుమతికి.
“ఇక్కడయితే కేవలం ఎనిమిది గంటలు ఒంటరిగా వుండాలి. అక్కడ ఇరవై నాలుగు గంటలూ ఒంటరిగానే వుంది.”
“మనకి పిల్లల చదువులూ, డబ్బు ఇబ్బందులు”
“అమ్మ మనమీదేమీ ఆర్ధికంగా ఆధారపడి లేదు. తన పెన్షన్ తనకొస్తుంది.”
సుమతిలో సహనం తగ్గిపోతుంది.
“మా అమ్మా నాన్నా ఏమంటారో”
యాభై ఏళ్ళు దాటి, పాతికేళ్ళుగా తనతో కాపురం చేస్తున్న భర్తని మొదటిసారి చూసినట్టు చూసింది సుమతి.
“ఇందులో వాళ్ళనటానికేముంది?”
“వాళ్ళకీ మనతో వుండాలని వుండదా?”
“మా అమ్మ మనతో వుంటే, అత్తయ్యా, మావయ్యా మనింటికి రావొద్దనా అర్ధం? చాలాసార్లడిగాను మనింటికి రమ్మని.వాళ్ళే మీ తమ్ముడి దగ్గరుంటామన్నారు. అయినా ముగ్గురినీ మనం చక్కగా చూసుకొవచ్చు. రాధిక ఎలాగూ పెళ్ళయి వెళ్ళి పోతుంది. ఇంకా ఇల్లు సరిపోదనుకుంటే, ఇంకో పెద్ద ఇల్లు తీసుకుందాం.” ఉత్సాహంగా అంది సుమతి.
“అదంతా జరిగే పని కాదులే. మీ అమ్మగారు మన ఇంట్లో వుంటే చూసే వాళ్ళేమనుకుంటారు? ఆవిడకీ మా అమ్మకీ గొడవలొస్తే ఎలా? నాకంతగా ఇష్టం లేదు.ఆలోచించుకో.”
అలా అన్నాడే కానీ, వారం రోజుల వరకూ ముభావంగానే వున్నాడు. తను మళ్ళీ ఆ ప్రసక్తి తీసుకురాదన్న నమ్మకం కలిగాక కానీ మామూలు మనిషి కాలేదు.
“తోబుట్టువులు లేని ఆడపిల్లని చేసుకుంటే, ఆ పిల్ల తల్లితండ్రులని దూరంగా వుంచటం కష్టం.” అత్తగారి మాటలు గుర్తొచ్చి మనసు బాధగా మూలిగి ముడుచుకుపోయింది.
“ఏమిటీ? హైద్రాబాదు ట్రాన్స్ఫరా? ఎందుకు చేసారు? “, నోరావలించాడు రాజశేఖరం.
“నేనే అడిగి చేయించుకున్నాను.” శాంతంగా అంది సుమతి.
“నన్నడక్కుండా ఎందుకు చేయించుకున్నావు?”
చెప్పినా అతనికి అర్ధం కాదనుకుందేమో, మాట్లాడకుండా వుండి పోయింది.
“ఇప్పుడెలా? నాకు ట్రాన్స్ఫర్ కుదరదు. ఇక్కడొకళ్ళం, అక్కడొకళ్ళం. మా అమ్మా నాన్నని పిలుద్దామంటే, అమ్మ ఆరోగ్యం బాగా లేదు. నాకు వంటకెలా?”
అతని వంక ఒక అసహ్యమయిన చూపు చూడాలన్న కోరిక బలవంతంగా ఆపుకుంది. ఎన్ని సంవత్సరాలు కాపురం చేసినా తన విలువ అంతే. తనకంటె ఎక్కువ కాలం కాపురం చేసిన తన అత్తగారికున్న విలువా అంతే.ఇంట్లో ఆడది లేకపోతే, వంట ఎలా అన్నదీ ముఖ్యం అందరికీ.
ఆ మధ్య తన కొలీగ్ సుందర్ తో సంభాషణ గుర్తొచ్చింది ఆమెకి.
“మీ ఆవిడ డెలివెరీ టైం దగ్గరికొస్తుంది కదా?ఎవరయినా సాయానికి వస్తారా లేక ఆవిడే పుట్టింటికి వెళ్తారా?” లంచ్ లో అడిగింది సుందర్ని.
“ఇక్కడే వుంటుందండీ.వంటకి మా పక్కింటావిడ సాయం చేస్తారు.”
కారియర్ నిండా నిండు చూలాలయిన భార్య వండి పెట్టిన భోజనం కమ్మగా తింటూ అన్నాడు సుందర్
“నీ తిండి గొడవెందుకిప్పుడు?” మనసులో తిట్టుకొని, పైకి వీలయినంత వ్యంగ్యంగా, “మీ భోజనం సమస్యే పాపం. కాని, డెలివరీ ఆవిడకి కాబట్టి, మానసికంగా,శారీరకంగా ఆవిడకి సహాయం అవసరం.దానిగురించి అడిగాను.”
అతనివంక ఒక అసహ్యమయిన చూపు చూసి లేచి వెళ్ళిపోయింది.
హైద్రాబాదు చేరి తల్లితో హాయిగా వుంది సుమతి. తను ఇంట్లో లేని సమయంలో ఆవిడని చూసుకోవటానికి ఒక పనిపిల్లని పెట్టుకుంది.
“అల్లుడుగారిని ఒంటరిగా వదిలి నువ్వెందుకే ఇక్కడ?” అంటూ తల్లి చేసే సణుగుడు పట్టించుకోకుండా వుండటం అలవాటు చేసుకుంది.
పెళ్ళయిన ఇన్ని సంవత్సరాల తరువాత భార్యలో ఇంత పట్టుదల మొదటిసారి చూసాడు రాజశేఖరం. ఇన్ని రోజులు భార్య లేకుండా గడపటం కొంచం ఒంటరిగా, చాలా ఇబ్బందిగా వుంది. ఆ రోజు పోస్టులో తన పేర వచ్చిన ఉత్తరం చూసి ఆశ్చర్య పోయాడు.
మీకు,
బాగా వున్నారని తలుస్తాను. నేను క్షేమం. చాలా సంవత్సరాల తరువాత ఇలా ఉత్తరం రాసుకోవటం బాగుంది. ఈ ఎలక్ట్రానిక్ యుగంలో మనని ఓల్డు ఫాషన్డ్ అనుకుంటారేమో.
పోతే, నా మొండి పట్టుదల చూసి మీరు ఏమనుకుంటున్నారో!నేను చేసే పనులకి సంజాయిషీ ఇవ్వటం అలవాటు లేదు నాకు. మా అమ్మకి ముప్ఫై అయిదవయేట, పెళ్ళయిన పదిహేను సంవత్సరాలకి, ఇక పిల్లలు పుట్టరన్న నిరాశలో నేను పుట్టాను. ఆ సంతోషం ఎక్కువ కాలం లేకుండానే మా నాన్నగారు పోయారు.నన్ను ఒంటరిగా పెంచలేనన్న భయంతో మా అమ్మ మా అమ్మమ్మ వాళ్ళింట్లో వాళ్ళ అన్నయ్యలకింద ఒణికిపోతూ కాలం గడిపింది.మన పెళ్ళప్పటికే మా మావయ్యలు వాళ్ళ పిల్లల దగ్గరకు వెళ్ళి పోయారు, అమ్మని ఏదయినా వృధ్ధుల శరణాలయంలో చేర్పించమని సలహా ఇచ్చి. వాళ్ళదేం తప్పు లేదు. పెచ్చు పెరిగిపోతున్న కన్స్యూమరిజం కాలం లో విధవరాలయిన చెల్లెలిని, ఆమె కూతురిని ఇరవై ఏళ్ళు ఆదరించటమే అరుదు.మన పెళ్ళయింతరువాత దాదాపు పదిహేను ఏళ్ళు ఆమె ఒంటరిగా ఇంట్లో కాలం గడిపింది.ఇక ఒంటరితనం భరించలేక, పదేళ్ళ కింద హోం లో చేరి రోజులు లెక్క పెడుతుంది. కనీసం ఈ చివరిరోజులలో నయినా అమ్మని నా దగ్గరుంచుకోని ఆవిడకి మనశ్శాంతిని ఇవ్వాలనుకున్నాను.
మిమ్మల్ని కని పెంచి పెద్దచేసినందుకు మీ అమ్మా నాన్నల్ని మీ దగ్గరుంచుకొని, వాళ్ళ బాగోగులని చూడాలని, వాళ్ళ ఋణం తీర్చుకోవాలని మీరు ఆశ పడ్డారు.అందుకు నా వంతు సాయం నేను చేయాలని కోరుకున్నారు. ఆలాంటప్పుడు నా ఆశ ఎందుకు పేరాశ అవుతుందో నాకు అర్ధం కావటంలేదు.
ఆవిడ చెప్పించిన చదువు,దాని ద్వారా తెచ్చుకున్న ఉద్యోగం, సంపాదించిన డబ్బులు వాడుకున్నారేగాని, మన దగ్గరుంచుకుందాం అంటే ఇష్టపడలేదెందుకని?
మన ఇంట్లోనే కాదు.ఎక్కడయినా ఇంతే.చెల్లెళ్ళ పెళ్ళిళ్ళూ, తమ్ముళ్ళ చదువులూ వంటి బాధ్యతలు వున్న మగవాడు తన పెళ్ళి మానుకోనక్కరలేదు.తనతో సహకరించే భార్యని వెతుక్కోవచ్చు.కానీ అదే పరిస్థితిలోవున్న ఆడ కూతురు తన పెళ్ళి మానుకుంటుంది.ఎందుకంటే, తనతో సహకరించే భర్త దొరుకుతాడన్న నమ్మకం లేక.
అదృష్టవశాత్తు, ఆర్ధికంగా, శారీరకంగా మనం మీ అమ్మా నాన్నలనీ,మా అమ్మనీ కూడా భరించగలిగే స్థితిలో వున్నాం.అలా లేని పరిస్థితిలో ఏం చేసే వాళ్ళమో, నా ఊహకందని విషయం.
ఇంట్లో బయటా, మీ పనుల్లో,బాధ్యతల్లో నేను మనస్ఫూర్తిగా సహకరించాను అని మీకు గుర్తుచేయటం నాకు ఇష్టం లేదు. నా మనసు అర్ధమయి మీరు రిటైరయాక ఇక్కడికి వచ్చినా సరే, లేదా అందరం కలిసి వుండటానికి మరే ఏర్పాటయినా నానుంచి ఎటువంటి సమస్యలూ వుండవు.
ఇప్పటికీ,
మీ,
సుమతి