ఈమాట

మా నాన్న ఏర్పరిచిన వాతావరణమే నా జీవితానికి బాట వేసింది

సాహిత్యం, సంగీతం, శాస్త్రం ఈ మూడు కలగలిసిన వ్యక్తులు తెలుగునాట చాలా తక్కువమంది ఉన్నారు. అందులో సంగీతాన్ని వదిలేస్తే వెంటనే గుర్తొచ్చే పేరు కొడవటిగంటి కుటుంబరావు. దాన్ని కలుపుకుంటే గుర్తొచ్చే పేరు వాళ్లబ్బాయి కొడవటిగంటి రోహిణి ప్రసాద్‌ది. న్యూక్లియర్‌ సైన్స్‌ చదివి ముంబాయిలోని బాబా అటామిక్‌ రిసెర్చ్‌ సెంటర్‌లో రేడియేషన్‌ సెంటర్‌కు హెడ్‌గా పనిచేసి రిటైరైన రోహిణీప్రసాద్‌ ఎన్నో పద్యాలు పాటలు రాశారు. వాటికి రాగాలు కట్టారు. నృత్యరూపకాల్ని రూపొందించారు. పరమాణు భౌతికశాస్త్రంలో 70 పరిశోధనా పత్రాలు, జీవశాస్త్రం భౌతిక శాస్త్రం భౌతికవాదంలో మరో 300 వ్యాసాలు రాసి అన్నిట్లోను చేయి తిరిగిన సృజనశీలిగా, ఆ తండ్రికి తగ్గ వారసుడిగా నిరూపించుకొన్నారు. మనిషి సజీవంగా ఉండాలంటే బహుముఖంగానే ఉండాలని నమ్మే రోహిణీప్రసాద్‌ ఓపెన్‌హార్ట్‌ ఇది.

పదిమందిలో ఎటువంటి బిడియం లేకుండా తిరుగుతాననీ, ఓ పరమాణు శాస్త్రవేత్తగా నన్ను నేను నిరూపించుకుంటాననీ, అక్కతో కలిసి నాన్న హార్మోనియం పెట్టెమీద రాగాలను ఒకనాడు పలికించడానికి ప్రయత్నించిన నేను నృత్యరూపకాలకు సంగీతాన్ని సమకూర్చగలుగుతాననీ, పాటల రచయితగా ఎదుగుతాననీ కలలోకూడా అనుకోలేదు. మా అమ్మ వరూధినికయితే ఇప్పటికీ అబ్బురమే.

చిన్నప్పుడు ఇంట్లో వాతావరణం చాలా గంభీరంగా వుండేది. నాన్న ఇంటికి రాగానే తోటలో తిరుగుతూ ఏదో ఒక పని చేయడమో, లేకపోతే పుస్తకం పట్టుకొని లీనమయిపోవడమో... అంతే. ఆ కాలంనాటి అందరి తండ్రుల్లానే నాన్నకూడా పిల్లల బాధ్యత అంతా తల్లులదే అన్నట్లుగా వుండేవారు. మా అల్లరి భరించలేక అమ్మ ఎప్పుడైనా పట్టించుకోవచ్చుకదా అంటే, 'చదువుకోకపోతే ఎవరికి నష్టం? వాళ్ళే మట్టికొట్టుకుపోతారు' అనేవారు. ఆ ఒక్క మాటతో మేం అలర్ట్‌ అయ్యేవాళ్ళం.

మొదటంతా సున్నాలే

నా బాల్యం అంతా అమ్మతోనే గడిచింది. ఐదవయేటనే నేను కథల పుస్తకాలు చదివేవాడిని. 'చందమామ' చదవడం అంటే ఎంత ఇష్టంగా వుండేదో. ఒక్కటికూడా వదిలేవాడిని కాదు. నాకు ఓ అక్క, తమ్ముడు. తమ్ముడు ఎంత తెలివైనవాడంటే... వాడు అన్నింటిలో ముందుండేవాడు. నాకేమో అన్నింటిలోనూ సున్నాలు వచ్చేవి. ఎలా అబ్బిందోగాని చిన్నప్పటి నుంచీ రాగజ్ఞానం వుండేది. నాన్న హార్మోనియం అద్భుతంగా వాయించేవారు. ఆ హర్మోనియం పెట్టెపైనే నేను కూడా వాయించేవాడిని. ఏ పాటవిన్నా... పదాలతో పనిలేదు. ఆ రాగం పొల్లుపోకుండా వచ్చేది. ఈ విధంగా నాకు తెలియకుండానే మా నాన్నగారి ఇష్టం నా ఇష్టంగా మారుతూ వచ్చింది.

అమ్మ ఎప్పుడూ అంటూండేది. 'వీడికి చదువు రాదు. ఆ సంగీత జ్ఞానం ఏదో వున్నట్లుంది. ఇక్కడ కొద్దోగొప్పో నేర్పించి ఏ బెనారస్సో పంపి సంగీతకారుడిని చేస్తే పోతుంది' అని. నాన్న కూడా అదే అభిప్రాయంతో వుండేవారు. ఇంతలో తమ్ముడు ఆరో ఏట బ్రెయిన్‌ ఫీవర్‌తో చనిపోయాడు. అప్పుడు నాకు ఎనిమిదేళ్ళు. ఆ దిగులుతో దుండుముక్కలా ఉండే నేను బాగా సన్నపడ్డాను. మొదటిసారి... జీవితంలో అంతటి దుఃఖాన్ని అనుభవించడం.

బిఎస్సీ మద్రాస్‌ జైన్‌ కాలేజీలో చేశాను. అప్పట్లో సితార్‌ నేర్చుకునే వాడిని. తరువాత ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ న్యూక్లియర్‌ సైన్స్‌లో చేరాను. విశాఖలో ఆ సమయంలో జరిగిన విరసం సభలకు నేనే ఫోటోగ్రాఫర్‌ని. 1970లో బొంబాయి చేరాను. బాబా అణు పరిశోధన కేంద్రంలో ఉద్యోగం చేయడానికి. అదే నా జీవితానికి మొదటి మలుపుగా చెప్పుకోవచ్చు.

కాని న్యూక్లియర్‌ ఫిజిక్స్‌ చదివిన నన్ను తీసుకుపోయి సెంట్రల్‌ వర్క్‌షాపులో పడేశారు. అక్కడందరూ మెకానికల్‌ ఇంజనీర్లే. అసలే నాకు సిగ్గు ఎక్కువ. అక్కడి వాతావరణంతో మరింతగా బిగుసుకుపోయాను. కొద్దికాలానికి ఎలక్ట్రానిక్స్‌ డివిజన్‌లోకి మార్చారు. అందరిలోకీ నేనే జూనియర్‌ని. ఎక్కడా వేలుపెట్టడానికి చాన్స్‌ లేదు. అయితే పరిస్థితులు దోహదం చేస్తే మనల్ని మనం నిరూపించుకోవడానికి సిద్ధంగా వుండాలి అనుకుంటుండేవాడిని. నేను ఎప్పుడూ ఒక విషయాన్ని గట్టిగా నమ్మేవాడిని, 'You shape the work. Work shapes you.'

అవకాశం వచ్చింది. నాపై అధికారి వ్యక్తిగత కారణాలతో ఉద్యోగం మానేసి వెళ్ళిపోయారు. అంతే నన్ను నేను నిరూపించుకోవడానికి పనిచేయడం ప్రారంభించాను. ఏ పనినీ వద్దనే ప్రసక్తేలేదు. అలా ఏ పనినైనా దిగ్విజయంగా చేసే స్థాయికి వెళ్ళాను. చేసే ప్రతిపనినీ, అంతర్జాతీయ సదస్సులకు పంపే ప్రతి పేపర్‌ను ఇతరుల దృక్కోణం నుంచి చూడటం, విస్పష్టంగా, ఎటువంటి సందేహాలకూ తావులేకుండా రాయడం, చెప్పాలనుకన్న విషయాన్ని సూటిగానూ, అర్ధమయ్యేరీతిలో కమ్యునికేట్‌ చేయడం వీటిపైనే నా దృష్టి అంతా వుండేది. బహుశా ఈ స్కిల్‌ నేను పెరిగిన వాతావరణం, నేను చదివిన పుస్తకాలే నాకు ఇచ్చాయి. తెలుగులోకి అనువాదమైన రష్యన్‌ సాహిత్యం, సైన్స్‌ పుస్తకాలు, నాన్న రచనలు నేను మొదటిగా చదివిన పుస్తకాలు. చిన్నతనంలో మా నాన్న ఏర్పరచిన వాతావరణమే దీనికి కారణం.

వదలని సంగీతం

విశాఖపట్టణంలో సితార్‌ సరిగ్గా నేర్చుకోవడం కుదరలేదని బొంబాయి వచ్చిన తరువాత తిరిగి నా సాధన మొదలుపెట్టాను. ఏమీ లేని చోట ఆముదం మొక్క మహా వృక్షమన్నట్లు అక్కడ నేనే గొప్ప సంగీతకారుడిని. ఓ సారి హిందీలో వచ్చిన ఓ యాడ్‌కి తెలుగు అనువాదం కోసం నా వద్దకు వచ్చారు. వారు హిందీ లిరిక్‌కు ఇచ్చిన బీట్‌లో ఈ తెలుగు లిరిక్‌ కూర్చోవాలి. నేను రాసిచ్చిన లిరిక్‌ పాపులర్‌ అయింది. తరువాత షిరిడీ సాయి చాలీసా... 108 పద్యాలు రాశాను. బొంబాయిలో తెలుగువారితో కలిసి తెలుగుసాహిత్య సమితికి శ్రీకారం చుట్టాను. ఓ మిత్రుడితో కలిసి కుమార సంభవం బాలేకు రూపకల్పన చేశాము. దానికి సంగీతం 55 రాగాలతో నేనే సమకూర్చాను. తరువాత కృష్ణపారిజాతం బ్యాలే. కూచిపూడి, భరతనాట్యం, కథక్‌, ఒడస్సీ నృత్యాలను కలిపి రూపకల్పన చేశాము. ఈ రెండు ఎంతగానో పాపులర్‌ అయ్యాయి. ఈ విధంగా సంగీత ప్రపంచంవైపు నా జీవితం అనూహ్య మలుపు తిరిగింది.

కాలనిర్ణయం ఎడిటర్‌గా ...

ఇక్కడ ఓ విషయం ... ఇంటికి ఎంతో మంది ప్రముఖ గాయకులు వచ్చేవారు. చిన్నప్పుడే బాలమురళీకృష్ణ వంటి వారితో తరుచూ మాట్లాడే అవకాశం వుండేది. కర్నాటక సంగీతం, ఆ తరువాత హిందూస్థానీ పిచ్చి పట్టుకుంది. నాకు వున్న జ్ఞాపకశక్తి ఈ విషయంలో అద్భుతంగా పనికివచ్చింది.

1996 జనవరిలో ఆరు భాషల్లో ప్రారంభ మైన కాలనిర్ణయం పత్రిక తెలుగు ఎడిషన్‌కు ఎడిటర్‌గా పనిచేయడం నా జీవితంలో మరో మేలి మలుపు. ఇప్పటికీ ఆ బాధ్యతలు చూస్తూనే వున్నాను.

ఇన్ని డైమెన్షన్‌లు ఎట్లా? అంటే... ఏదో ఒకదానిలో తలమునకలై కూరుకుపోవడం, తీరికలేనట్లు ఉండటం, ఎంత జ్ఙానం సంపాదించినా ఇంకా మిగిలే వుందని అనుకోవడం... ఎవరి భావనలు వారివేకదా! అందుకే సైన్స్‌ వ్యాసాలు రాసే నేను, కాలచక్రం పత్రికకూ ఎడిటర్‌గా వుండగలిగాను. భౌతిక విషయాలను మాత్రమే నమ్మే నేను సాయి చాలీసా రాశాను.

55వ ఏట బాబా అటామిక్‌ రిసెర్చ్‌ సెంటర్‌లో స్వచ్ఛంద పదవీవిరమణ చేసిన తరువాత అమెరికా వెళ్ళాను. అమ్మాయి మాతోనే వుంటోంది. అబ్బాయి ... బెంగుళూరులో 'డెల్‌'లో పనిచేస్తున్నాడు. పరమాణు శాస్త్రవేత్తనైన నేను జీవశాస్త్రం వ్యాసాలు రాయాలనుకోవడం మరో మలుపు. అదీ ఆసక్తి వున్న సాధారణ మనిషికి బోధపడే రీతిలో రాయాలనుకోవడం ... సాహసమే. అయితే నేను దానిలో విజయం సాధించాననే అనుకుంటాను. గతితార్కిక భౌతికవాదాన్ని నమ్మడంతో, ప్రజలందరూ బహుముఖ పార్శ్వాలను కలిగివుండే సమాజం సాధ్యమేనని నమ్మడంతో ఇప్పుడు మన పని ముగిసిపోవడంలేదు. దానిని ఆచరిస్తూ, పదిమందికీ చెప్పడమనే అవసరం రోజురోజుకూ మరింత విస్పష్టంగా కళ్ళముందు గోచరిస్తోంది. నా దారి నాకు స్పష్టంగా కనబడుతూనే వుంది.

అట్లంటాలో ఉండే రోహిణీప్రసాద్‌ ఇటీవల విజయవాడకు వచ్చిన సందర్భంగా చిగురుపాటి సతీశ్‌బాబు చేసిన ఇంటర్వ్యూ ఇది.