పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16438

  1. మధ్యమవ్యాయోగము – సమూలానువాదం గురించి K.V.S. Ramarao అభిప్రాయం:

    05/07/2026 7:05 pm

    శ్రమించి చక్కటి అనువాదం అందించిన శ్రీనివాస్ గారికి అభినందనలు, కృతజ్ఞతలు.

    భాస నాటకాలు చాలావరకు స్వకపోలకల్పితాలే. పాత్రలు పరిచితాలే ఐన సందర్భాల్లో కూడ కథలు అతనివే. ఇందుకు ప్రముఖ ఉదాహరణలు ప్రతిమా, ఊరుభంగం, ఈ మధ్యమ వ్యాయోగం. అతని అద్భుతకల్పనాశక్తికి అంజలి ఘటించి ఆస్వాదించగలగటం అదృష్టం.

    ఇకపోతే, భాసుని గురించి కొందరి సాహితీవిమర్శలు పట్టించుకోవలసినవి కావని నా అభిప్రాయం. రచనల్లో కులవ్యవస్థను చూపిన తీరునుబట్టి కవుల కాలాన్ని నిర్ణయించటమంటే రామాయణ భారతాల్నీ, మనుధర్మశాస్త్రాన్నీ, కాళిదాసు తర్వాత వచ్చినవిగా పరిగణించాల్సి వస్తుందన్న ఆలోచన కూడ వారికి తట్టినట్టు లేదు. రామాయణంలో విశ్వామిత్రుడి కథ సైతం వారికి తెలియదా? ఏమైనా ఇది ఇంతటితో ఆపుదాం.

    [Comment edited — సంపాదకులు.]

  2. మధ్యమవ్యాయోగము – సమూలానువాదం గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    05/05/2026 10:47 am

    నేనన్న “‘గౌరవనీయమైన స్థాయికి’ బదులు ‘దుస్థితికి’ అని ఉండాలి – లేకపోతే ఐరనీ పోతుంది,” తప్పేమో. ఐరనీ ఉండాలంటే వక్రత ఉండాలి కదా.

    కొడవళ్ళ హనుమంతరావు

  3. సౌతాఫ్రికాలో ప్రవాస ప్రస్థానం-2 గురించి ఎ. కె. ప్రభాకర్ అభిప్రాయం:

    05/05/2026 1:04 am

    వ్యాసం చాలా వివరణాత్మకంగా బాగుంది. వ్యాసకర్త కొండలరావు గారు ఇండియా వచ్చి అగమ్య గమ్యాలు రచయిత ముకుంద రామారావు గారిని కలిసి తమ తమ అనుభవాలు పంచుకున్న విషయం తెలిసి చాలా సంతోషించాను. అయితే దక్షిణాఫ్రికాకు రామారావు గారి పూర్వికులు కూలీలుగా వెళ్ళలేదు. ఇండెచర్ లేబర్ కు తెలుగులో వలస కార్మికులు సరైన పదం. కూలీ పదాన్ని శ్వేత జాతీయులు మనవారిని నీచంగా అవమానించడానికి అగౌరవంగా వాడేవారు. దానికి వ్యతిరేకంగా ఆత్మగౌరవ స్వరం వినిపించిన వారిలో గాంధీజీ ప్రముఖుడు. ముకుంద రామారావు తన పుస్తకంలో ఈ విషయం బలంగా ప్రస్తావించారు. కొండల రావు గారూ మీరు కూడా కూలీ పదాన్ని తొలగించి కార్మికులు అని రాస్తే బాగుంటుంది.

  4. మధ్యమవ్యాయోగము – సమూలానువాదం గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    05/03/2026 6:57 pm

    కొడవటిగంటి నవల “ఐశ్వర్యం” లో డాక్టరు, incongruity తో భాసుడు హాస్యం పుట్టించాడన్నాడు (“మా అమ్మకి నర మాసం మీద కోరిక మళ్ళింది, మీ కొడుకుల్లో ఒకరిని ఇవ్వమని,” ఘటోత్కచుడు వినయంగా కోరడం). భాసుడి ప్రధాన గుణం నాటకీయ వక్రత (dramatic irony) అని వి. వెంకటాచలం రాశారు. ఈ చక్కని అనువాదం దానిని ప్రతిబింబిస్తుంది. “ఈమాట” లోని ఉరుపుటూరి వ్యాసాలు కొద్దివే అయినా తనకున్న ఉభయ భాషాపాండిత్యం వెల్లడవుతుంది. భాసుని ఇతర రూపకాలని కూడా అనువదిస్తారని ఆశిస్తాను.

    క్రింది స్వగతంలో “గౌరవనీయమైన స్థాయికి” బదులు “దుస్థితికి” అని ఉండాలి – లేకపోతే ఐరనీ పోతుంది (చందమామలో కథ).

    భీముడు:
    (తనలో) ఇదెక్కడి తల్లి ఆజ్ఞ! పెద్దవారిని సేవించడం విషయమై ఈ అమాయకుడికి ఎంత శ్రద్ధ!
    మనుషులకైనా, దేవతలకైనా తల్లియే దైవము. అమ్మ మాటను ఔదలదాల్చినందుకే కదా మేము ఈనాడు ఈ గౌరవనీయమైన స్థాయికి చేరుకున్నాము.

    సంస్కృతం-తెలుగు పైనా కిందా కాకుండా పక్కపక్కన ఉంటే చదవడానికి ఆటంకం కలగదు.

    వాడ్రేవు వ్యాఖ్య:
    “భారతీయ సమాజంలో వర్ణాశ్రమ ధర్మాలు కాలూనుకుంటున్న సమయాన్ని కాళిదాసు నాటకాలు ప్రతిబింబిస్తే, ఆ ధర్మాలు పూర్తిగా వేళ్ళుదన్నుకున్న కాలం భాసనాటకాల్లో కనిపిస్తుంది. కాళిదాసు నాటకాల్లో ఒక వర్ణం కన్నా మరొక వర్ణం గొప్పదనే భావనగానీ లేదా ఒక ఆశ్రమవిధికన్నా మరొక ఆశ్రమ విధి గొప్పదనే ప్రచారం కానీ కనిపించవు. కానీ సమాజంలో ‘నిమ్న’వృత్తులకు చెందిన మనుషుల పట్ల తక్కువ చూపు భాసనాటకాల్లో పాత్రలు తమకు తెలియకుండానే కనపరుస్తాయి. ఏళ్ళకిందట నేను మొదటిసారిగా ‘మధ్యమ వ్యాయోగం’ నాటకం చదివినతరువాత చాలాకాలం పాటు భాసనాటకాల్ని మళ్ళా తెరవడానికి మనసు ఇచ్చగించక పోవటానికి కారణమదే.”

    తనకు నిమ్నవృత్తుల వారితో చిన్నతనం నుండీ ఉన్న దగ్గరి సంబంధాల వలన కాని, ఉన్నత సంస్కారం వలన కాని వారిపై కల సానుభూతి వలన వాడ్రేవుకి ఈహాస్య రూపకంలోని సంభాషణలు జుగుప్స కలిగించి ఉండవచ్చు. దానిని పక్కనబెట్టి తను లేవదీసిన విషయం గురించి ఓమాట.

    వాడ్రేవు వ్యాఖ్యకి సందర్భం: “Metatheatre and Sanskrit Drama,” by Michael Lockwood and A. Vishnu Bhat (2005)లో వారు భాసుని నాటకాలు ఇప్పటివరకూ పండితవర్గం అతను కాళిదాసు (క్రీ. శ. 4-5 వ శతాబ్ది) కి పూర్వం వాడు అంటున్నది తప్పని తీర్మానించారు. కాళిదాసు రచనలో “భాస” అన్నది ఒక విశేషణమే కాని రచయిత పేరు కాదు అని వారి థీసిస్. అంతేకాక భాస నాటకాలు దక్షిణ భారతదేశపు రాజయిన మహేంద్రవర్మ (క్రీ.శ. 6-7 వ శతాభ్ది) రచనలయి ఉంటాయని వారి వాదన.

    వారిని సమర్థిస్తూ వాడ్రేవు అందుకు కొంత రుజువుగా, కాళిదాస నాటకాలలో వర్ణాశ్రమ ధర్మాలు కేవలం కాలూనుకుంటున్నవనీ (still establishing), భాసుని నాటకాలలో అవి పూర్తిగా వేళ్ళుదన్నుకున్నవనీ (deep rooted) అన్నారు.

    నా పరిమిత సాహితీ జ్ఞానంతో దానికి నా ప్రతివాదం: కాళిదాస శాకుంతలంలోని జాలరి కథని చదివితే వర్ణాశ్రమ ధర్మాలు అప్పటికే వేళ్ళుదన్నుకున్నట్లు అనిపించడం లేదా?

    కొడవళ్ళ హనుమంతరావు

  5. మనసును దోచే మనస్లు– 5 గురించి Ramesh అభిప్రాయం:

    05/03/2026 6:42 pm

    మీ యాత్రానుభవాలు ఎంతో చక్కగా వున్నాయి. ఫుర్బు మీకొక book కానుకగా యివ్వడం మనసుని తాకింది., థాంక్స్, నమస్కారం, ఆరోగ్యమస్తు.

  6. సౌతాఫ్రికాలో ప్రవాస ప్రస్థానం-2 గురించి Ramesh అభిప్రాయం:

    05/03/2026 9:10 am

    చాలా చక్కగా, గొప్పగా వుంది.

  7. తెల్లారగట్ల గురించి శ్రీను కుడుపూడి అభిప్రాయం:

    05/02/2026 8:12 am

    ఈమాట సంపాదకులు మరియు వారి బృందానికి కృజ్ఞతలండీ 🙏🙏

  8. ఒక నగరం, కొన్ని పగటి కలలు గురించి Ramesh అభిప్రాయం:

    05/02/2026 7:23 am

    కథలో ఎంతో నేటివిటి అకట్టుకునే కథనం వుంది. మూల రచయితకు, అనువాద రచయితకు ధన్యవాదాలు.

  9. సౌతాఫ్రికాలో ప్రవాస ప్రస్థానం-2 గురించి ముకుంద రామారావు అభిప్రాయం:

    05/02/2026 12:39 am

    మరి కొన్ని సవరణలు ధన్యవాదాలు.

    ముందుగా కొండలరావు గారికి, ఈ వ్యాసం ప్రచురించిన ఈమాట సంపాదకులకు అనేక ధన్యవాదాలు. నా “అగమ్య గమ్యాలు” పుస్తకం కొనుక్కొని మరీ కొండలరావు గారు మా ఇంటికి వచ్చారు. ఆయనతో ఆనందంగా ఆ కాస్సేపూ గడిచింది. అందుకు వారికి మరికొన్ని ధన్యవాదాలు. ఈ వ్యాసంలో వారు ప్రస్తావించి,న నా ప్రస్తావన విషయంలో ఒకటి రెండు విషయాలు సవరణలు తప్పకుండా చెప్పుకోవాలి.

    12ఏళ్ల వయస్సులో మా తాతయ్య దుర్గయ్య తన తల్లితో వెళ్లారు. తాతయ్యతో బాటు 14 ఏళ్ల వయస్సున్న అన్నయ్య, 9ఏళ్ల వయస్సులో చెల్లెలు కూడా వెళ్లారు. అలాగే ఎనిమిదేళ్ల వయస్సులో మా నాన్నమ్మ తన తల్లిదండ్రులతో, తమ్ముళ్లు, చెల్లెళ్లతో, అంతకు ముందే మరో ఓడలో వెళ్లింది. తాతయ్యా నాన్నమ్మ వేర్వేరు గ్రామాల వాళ్లు. వీరంతా ఒప్పంద కార్మికుల జాబితాలో వెళ్లారు. ఒప్పంద కార్మికులుగా తీసుకువెళ్లన వారందరినీ బ్రిటిష్ వారు కూలీల ముద్ర వేసారు. ఒప్పంద కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రచారం చేయడంలో కీలకపాత్ర పోషించిన, అప్పట్లో దక్షిణాఫ్రికాలోనే ఉన్న గాంధీ గారే, భారతదేశం వచ్చాక, జాతీయ కాంగ్రెస్ సదస్సులో ఈ సమస్యను లేవనెత్తుతూ ఆ వివక్షకు వ్యతిరేకంగా ఇలా చెప్పుకున్నారు.

    ప్రతి భారతీయుడూ, మినహాయింపు లేకుండా, యూరోపియన్ల అంచనాల్లో ‘కూలీ’.

    దుకాణదారులు ‘కూలీ దుకాణదారులు’. గుమాస్తాలు ‘కూలీ గుమస్తాలు’,

    పాఠశాల ఉపాధ్యాయులు ‘కూలీ పాఠశాల ఉపాధ్యాయులు’.

    అంచాత సహజంగానే, వ్యాపారులను లేదా ఆంగ్లంలో చదువుకున్న భారతీయులను సైతం గౌరవించడం లేదు. భేదం లేకుండా ప్రతి భారతీయుడినీ ధిక్కారంగా ‘కూలీ’ అంటున్నారు…. భారతీయులందరూ, వారు ఎవరైనా సరే, కూలీగా చూడబడుతున్నారు.

    ఇది అప్పటి పరిస్థితి. కార్మికులుగా వెళ్లినవారిని “కూలీలు” అని పిలవడం మొదలుపెట్టి, వారు ఎక్కడ దిగినా నైపుణ్యం లేని కార్మికులుగా ఉపయోగించుకున్నారు.

    మా తాతయ్య నాన్నమ్మ వాళ్లు అక్కడున్న పది సంవత్సరాల్లో వారి వివాహం, మా నాన్నగారి జననం కూడా అక్కడే జరిగింది.

    నిజానికి బానిసత్వ నిర్మూలన వ్యవస్థ అమలయాక, అవసరానికి కావలసిన కార్మికుల్ని పూరించడానికి, ఒప్పంద కార్మిక వ్యవస్థను తమకు అనుకూలంగా బ్రిటన్ ఏర్పాటు చేసుకుంది. అన్ని విధాలుగా కార్మికులను వాడుకుంటూ తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందడానికి ఈ వ్యవస్థ రూపొందించింది. ఈ వ్యవస్థలో పెట్టుబడిదారీ విధానం, ఒప్పంద కార్మిక విధానం చేయి చేయి కలిపి నడిచాయి. ఆయా దేశాల్లో మంచి పని పరిస్థితులు, తగినంత వేతనాన్ని కల్పించే చట్టపరమైన ఒప్పందాల ఆధారంగా అయిదు నుంచి పది సంవత్సరాల వరకూ పని చేయబోతున్నట్లుగా నమ్మించి వలసరాజ్య శక్తులు భారతీయ కార్మికుల్ని తీసుకుపోగలిగారు.

    మా తాతయ్య నాన్నమ్మ లాంటి ఎందరినో 1838 నుంచి 1917 వరకు (80 సంవత్సరాలు), బ్రిటిష్ వారు దాదాపు 13 లక్షల మంది భారతీయులను తీసుకుపోయారు. అంచాత “అగమ్య గమ్యాలు” పుస్తకం నా మూలాలు తెలుసుకోవాలనే ప్రయత్నంతోనే మొదలు పెట్టినా, అప్పటి వారి పరిస్థితుల్ని తెలుసుకుందుకు నాకు పనికొచ్చింది.

    గతం గురించి నిశ్శబ్దంగా ఉండలేక, ఆ మూలాల్ని అన్వేషించిన నా పరిశోధనలో, మా తాతయ్య వెళ్లిన 1904-1914మధ్య కాలంలోనే కాక, ఆ ముందూ వెనకా, మా తాతయ్య, నాన్నమ్మల్లాంటి వాళ్లు, ఒక్క దక్షిణాఫ్రికానే కాదు, అనేక దేశాలకు రైతులుగానో కార్మికులుగానో వలస వెళ్లారనీ, అలా వెళ్లినవారు అక్కడ పడరాని కష్టాలు పడ్డారనీ తెలిసింది.

    ఆ 80 సంవత్సరాలూ, బ్రిటిష్ వలసవాదుల చక్కెర, రబ్బరు, టీ, కోకో తోటల పని కోసం ఒప్పంద కార్మిక వ్యవస్థ కొనసాగింది. అందులో మరీ ముఖ్యంగా చక్కెర కోసం. అది – హిందూ మహాసముద్రం మీదుగా (1. దక్షిణాఫ్రికా, 2. తూర్పు ఆఫ్రికా (కెన్యా-ఉగాండా), 3. సెషెల్స్, 4. రీయూనియన్, 5. మారిషస్), పసిఫిక్ మహాసముద్రం మీదుగా (6. ఫిజీ), అట్లాంటిక్ సముద్రం మీదుగా (7. ట్రినిడాడ్ టొబాగో, 8. డెమెరార లేక బ్రిటిష్ గయానా, 9. ఫ్రెంచ్ గయానా, 10. సురినామ్, 11. సెయింట్. కిట్స్, 12. నెవిస్, 13. సెయింట్. లూసియా, 14. బెలిజ్, 15. గ్వాడెలోప్, 16. మార్టినిక్, 17. గ్రెనెడా, 18. సెయింట్ విన్సెంట్, 19. సెయింట్ క్రోయి, 20. జమైకా) వరకూ కొనసాగింది.

    ఈ పనిలో నేను ఆనందించిన విషయం ఒకటి తప్పకుండా అందరితో పంచుకోవాలి. 1860-1911 ల మధ్య ఒప్పంద కార్మికులుగా దక్షిణాఫ్రికాలోని నటాల్‌కు వెళ్లిన వారిగా నమోదైన 1,52,184 సభ్యుల మొత్తం సమాచారాన్ని ఈ క్రమంలో నేను సేకరించగలిగాను. ఆ వివరాల విశ్లేషణ నా పరిధిలో నేను కొంత మేర చేయగలిగాను, ఇంకా చేస్తున్నాను. నా దగ్గరున్న ఆ దక్షిణాఫ్రికా సమాచారం ఎన్నాళ్లుగానో వారి తాతయ్యలకోసం, మామ్మలకోసం, నాన్నలకోసం, అమ్మలకోసం, అన్నలకోసం, అక్కలకోసం వెతుకుతున్న వారికి కొందరికైనా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను.

    – ముకుంద రామారావు
    హైదరాబాద్

  10. కంప్యూటర్ చిప్ కథ – 13: జె. జె. థామ్సన్ కనుగొన్న ఎలక్ట్రాన్ గురించి Ramesh అభిప్రాయం:

    05/01/2026 7:03 am

    మీరు విజ్ణానశాస్త్రాన్ని చాలా చక్కగా వివరిస్తున్నారు, థాంక్స్.