పాఠకుల అభిప్రాయాలు

కవితలు results: 258

  1. చిన్నారి – దేవత గురించి బొల్లోజు బాబా అభిప్రాయం:

    08/04/2013 4:07 am

    అందమైన పద్యం. కథనాత్మక కవిత్వం పట్ల మనవాళ్ళెందుకు విముఖత చూపిస్తారో అర్ధం కాదు. కవిత్వం అంటే మరో ప్లేన్ కి చెందిన వ్యవహారమని దాన్ని జనబాహుళ్యానికి అందకుండా ఎక్కడో ఉంచుతారు. బహుశా అందువల్లనే కథ కవిత్వాన్ని క్రమక్రమంగా ఆక్రమించేస్తున్నది. ఇంత సరళంగా, సూటిగా కథన పద్దతిలో చెప్పే కవితలు ఎక్కువమందిని ఆకట్టుకొంటాయనటంలో సందేహం లేదు.

    శీమాటి అన్న తమిళ పదాన్ని యధాతధంగా ఉంచేసారా అనిపించి, బ్రౌణ్యం చూడగా అది సీమాటి అని, దాని అర్ధం భాగ్యశాలినియైన యాఁడుది అని తెలిసింది. మనం మరచిపోయిన కొన్ని వేల తెలుగుపదాలలో ఇది ఒకటికదా అనిపించింది. మంచి కవితను పరిచయం చేసిన భాస్కర్ గారికి ధన్యవాదాలు.

    భవదీయుడు
    బొల్లోజు బాబా

  2. నిశ్శబ్దం గురించి ప్రసాద్ అభిప్రాయం:

    07/26/2013 12:36 pm

    న్యాయం
    =====

    నాకు కవితలు ఒక పట్టాన అర్థం కావు. కాబట్టి ఈ కవిత గురించి నేనేమీ చెప్పలేను. అయితే, ఇక్కడ జరిగిన ఒక వివాదం గురించి మాత్రం నా అభిప్రాయం చెప్పాలని వుంది. మొదట్లో, కొన్ని రోజులు, “నా కెందుకులే ఈ గోల”, అని వూరుకున్నాను, పట్టించుకోకుండా. ఇవాళ రవికిరణ్ గారి అభిప్రాయం చదివాక, ఇక వూరుకో బుద్ధి కాలేదు. ఈమాట వారు నా అభిప్రాయాన్ని సెన్సార్ చేసినా సరే, రాసెయ్యాలి అని అనుకున్నాను.

    ఈ వివాదంలో మాత్రం నేను రవికిరణ్ గారితో ఏకీభవిస్తున్నాను స్పష్టంగా. దీనర్థం, ఆయన ఆ బూతు పదం వాడొచ్చని కాదు. ఆ విషయంలో ఆయన మీద కూడా నాకు విమర్శ వుంది. అయితే, ఆయనతో ఏకీభవించేది, ” ఆడవాళ్ళు మాత్రం బూతులని నిరభ్యంతరంగా వ్రాయవచ్చు.” అన్న మాటల్లోని వ్యంగ్యంతో.

    అసలు ఆ పదాన్ని ముందుగా వాడింది లైలా గారు. అలా, లైలా గారు ఆ పదాన్ని వాడడాన్ని, జయప్రభ గారు, “ఆడవాళ్ళు రాస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి బహుశా లైలా ప్రయత్నం చేశారు.” అని వెనకేసుకు వచ్చారు. “బూతు పదాలు” ఆడవాళ్ళు రాసినా, మగవాళ్ళు రాసినా ఒకే లాగా వుంటాయి. దొందూ దొందే. రెండూ గాడిదలే. లైలా గారు, గతంలో, “ఎఫ్” అక్షరంతో మొదలయ్యే ఒక ఇంగ్లీషు బూతు పదాన్ని కూడా రాశారు ఒక వ్యాఖ్యలో. ఈమాట వారు దాన్ని ఎలా అంగీకరించారా అని ఆశ్చర్యం వేసింది. “సరే, వారి పత్రికా, వారి ఇష్టం. నచ్చితే చదవడం, లేకపోతే వూరుకోవడం” అనుకుని వూరుకున్నాను. ఒక్కరు కూడా ఆ విషయం గురించి అడగలేదు. ఒక స్త్రీ అలా రాస్తే, అడగడం తప్పు అనుకున్నారేమో మరి. తప్పు పురుషుడు చేసినా తప్పే, స్త్రీ చేసినా తప్పే. ఆ తర్వాత రవికిరణ్ గారి కవితకి రాసిన వ్యాఖ్యలో, లైలాగారు ముందుగా ఆ పదాన్ని వాడారు. దాన్ని కూడా ఎవరూ ప్రశ్నించలేదు. పైపెచ్చు సమర్థించిన వారే వున్నారు. లైలా గారు వాడిన ఆ పదం రాసిన వ్యాఖ్య పదాల్లో కలిసి పోయి కూర్చుంది. దానికి రవికిరణ్ గారు ఇచ్చిన జవాబులో, ఆ పదం మొదటి పదంగా కూర్చుని, అందరి దృష్టినీ ఆకర్షించింది. అప్పుడు జయప్రభ గారు చాలా న్యాయమైన ప్రశ్న అడిగారు ఈమాట వారిని, “ఇలాంటి భాషనీ ఇలాంటి అభిప్రాయాన్నీ అచ్చు ఎలా వేశారూ? అని ఒక పాఠకురాలిగా నేను సంపాదకులని అడుగుతున్నాను. దీన్ని అచ్చువేయడం లో మీ ఉద్దేశ్యం ఏమిటీ??” అని. చాలా మామూలుగా గానే వారు మౌనం వహించారు. వారి పత్రికా, వారి ఇష్టం. జయప్రభ గారు లైలా గారిని కూడా విమర్శిస్తే, ఆ పద ప్రయోగానికి, చాలా బాగుండేది. అలా జరగలేదు. రవికిరణ్‌ని మాత్రమే గట్టిగా విమర్శించారు. అప్పటికీ రవికిరణ్ గారు పాపం క్షమాపణ చెప్పుకున్నారు. అయినా వదలలేదు ఆయన్ని. వెంకటేశ్వర్రావు గారు ఆ పదం తీయించే ఏర్పాటు చెయ్యమని బోధించారు. ఇక్కడ, వెంకటేశ్వర్రావు గారిని, “మరి మీరు లైలా గారికి కూడా అలాంటి సలహా ఇవ్వలేదే?” అని ఎవరూ ప్రశ్నించలేదు. ఒకవేళ, ఎవరన్నా ప్రశ్నిస్తే, “మరి లైలా గారు తన తప్పు ఒప్పుకోలేదుగా” అని అంటారేమో, వెంకటేశ్వర్రావు గారు.

    లైలా గారూ, రవి కిరణ్ గారూ – ఇద్దరూ వాడారు ఆ బూతు మాటని. దానికి రవికిరణ్ గారిని మాత్రమే విమర్శిస్తే న్యాయం లేదు. ఎవరు ముందర వాడారూ అన్నది ఒక విషయాన్ని అర్థం చేసుకునేటట్టు చేస్తుందే తప్ప, అంగీకరించేటట్టు చెయ్యదు. రవికిరణ్ గారు ఆ పదం వాడటానికి వచ్చిన సందర్భం అర్థం అయ్యేటట్టు చేస్తుందే గానీ, ఆయన ఆ పదం వాడటాన్ని అంగీకరించేటట్టు చెయ్యదు. రవికిరణ్ గారి చెప్పే సూక్తులు లైలా గారికి కూడా చెప్పాలి.

    నేను ఇలా రాసినందుకు, నా మీద ఎన్నో విసుర్లు వస్తాయని తెలుసు. వాటికి సిద్ధపడే రాస్తున్నాను. మొదట ఈమాట వారు ఈ వ్యాఖ్యని అంగీకరించాలి. ఆ తర్వాత కదా విసుర్లు వచ్చేవి? సరే, ఏమన్నా ఒక పాయింటు వుంటే మాత్రమే, జవాబిద్దాం, లేకపోతే ఆ విసుర్లని భరించి వూరుకుందాము అని నిర్ణయించుకుని, నా అభిప్రాయాన్ని రాస్తున్నాను.

    ప్రసాద్

  3. నిశ్శబ్దం గురించి D.Venkateswara Rao అభిప్రాయం:

    07/21/2013 6:56 am

    కవితలు వాటి అభిప్రాయాలు అందరూ చదువుకునే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను.

  4. పశ్చింగోదార్జిలా తణుకు తాలూకా గురించి indrani Palaparthy అభిప్రాయం:

    07/10/2013 5:47 pm

    ఈ కధ నాకు చాలా నచ్చిన కధ. ఎన్ని సార్లు చదివినా నవ్వు పుట్టించే కధ. అందుకని ఇక్కడ టోరీ రేడియో లో చదివాను.మరికొన్ని నాకు నచ్చిన కవితలు కూడా కలిపి. మధ్యే మధ్యే పాటలు, యాడ్స్ వస్తాయి. ముందుకు జరుపుకుని వినవచ్చు.

    1999 లో రాసిన ఈ కధతో మొదలు పెట్టి 2013 వరకూ వీరి రచనలు చదివితే- బాల్యం, తరువాతీ కధల్లో యువకుడిగాను మళ్ళీ తరువాత కధల్లో భార్యా పిల్లలు ఇలా సాగుతున్నాయి. ఈ పరిశీలన చాలా తమాషాగా తోచింది. ఈ మధ్య భక్తి పాటలు రాస్తున్నారు. ఇవన్నీ ఒక వ్యక్తి జీవితంలో వివిధ దశలు- రచనల్లో కాలక్రమంగా ప్రతిబింబించడం చూడ్డం బాగుంది.

    నాకు ఈ కధ, ఇసుక, తమాషా దేఖో, డోర్స్ క్లోజింగ్ చాలా ఇష్టం. మిగిలినవి ఓకే. ఓకే.

    వ్యాసాలు తల మీదుగా వెళ్ళిపోయాయి. ఎవరో స్పూర్తి లేకుండా కవిత్వం రాయలేరా అనిపిస్తుంది గబుక్కున. కానీ మాండలికం మీద వీరి పట్టు అద్భుతం. మాండలికం భాషకు పడుచుదనం తెస్తుంది (అని నాకనిపిస్తుంది).

    ఇంద్రాణి.

  5. మన సాహిత్యంలో కవులు, పుస్తకాలు – 2 గురించి indrani Palaparthy అభిప్రాయం:

    07/07/2013 8:41 pm

    కమలా దాస్ కవిత్వం కన్నా ఆవిడ ఆత్మ కధే నాకిష్టం.
    హైదరాబాదు లో ఉన్నప్పుడు నాలుగైదు లైబ్రరీల్లో మెంబరుషిప్పు ఉండేది.
    ఎప్పుడు పుస్తకం ఇచ్చెయ్యాలో ఎప్పుడూ చూసుకోను కనుక ఎన్నోసార్లు జరిమానాలు కట్టాను.

    బ్రిటీష్ లైబ్రరీ కి నేను కట్టినన్ని ఫైన్లు ఎవరూ కట్టి ఉండరేమో.కమలా దాసు పుస్తకాలకీ కట్టాను.

    కధలు,కవితలుకన్నా ఆత్మ కధలంటే నాకెంతో ఇష్టం.

    అన్ని రంగాల్లో వాళ్ళవి.దేశీయులవి.విదేశీయులవి.

    వాళ్ళు అంతా నిజమే రాసారని నమ్ముతాను. ఒకవేళ రాసిన వాళ్ళు నిజాలు దాచిపెట్టినా, అబద్ధాలు రాసినా నాకేమీ పర్వాలేదు.వారి కధ నాకు స్ఫూర్తినిస్తే చాలు.

    ఇంద్రాణి.

  6. దైవం గురించి jayaprabha అభిప్రాయం:

    07/04/2013 9:12 pm

    సాధారణంగా నారాయణ రావు మెచ్చుకున్నాడంటే ఆ పద్యం నిజంగా బాగున్నదై ఉంటుందనే ఆలోచన ఒకప్పుడు గాఢంగా ఉండేది నాకు. అయితే అటు తర్వాత ఆయన అభిరుచి పద్యాలకి సంబంధించి చాలా మారిందని ఆయన రాసిన ఇటీవలి పుస్తకాల చివరిమాటల వల్ల తెలిసి వచ్చింది. ఆ నారాయణ రావు, ఈ నారాయణ రావూ బహుశా ఒకరై ఉండరని అనుకున్నాను.

    చాలా రోజుల తరవాత ఒక మంచి పద్యం చదివానని ఆయన అన్న ఆ మెప్పు మాట చూసి, ఏమిటా ఆ మంచి పద్యం? అని ఉదాశీనంగానే అనుకో, ఆ పాత అలవాటు వల్ల ఇదిగో ఇటుగా వచ్చి ఈ దైవాన్ని చూశాను. ఆశ్చర్యం!! నారాయణ రావు నిజంగా నిజమే చెప్పాడు. ఇంద్రాణీ!! ఇది నిజంగా మంచి పద్యం!! చాలా మంచి పద్యం. తేటగా ఉంది! నారాయణ రావు మాట మీద నమ్మకం పోగొట్టుకుని ఉండి [అనుమానంతో పేజీ తిప్పేసినట్టు] బహుశా నేను చదవక పోయి కూడా ఉండి ఉందును సుమా!! హమ్మో!! ఎంత మంచి పద్యమో!! చాలా బాగుంది. ఆయన అన్నట్టూ.. ఆ ఒక్క ” ట” నిజంగా మరీ బాగుంది.

    “దైవాన్ని” ఇలా చూపించినందుకు!! పైగా ఆయన కళ్లలోకి నువ్వు చూడటం లేదు. నీ ఉలికిపాటు కళ్లలోకి ఆయనే చూస్తున్నాడు. నీ పలుకు అందుకే మెరిసింది మరి! నీ ఇదివరకు కవితలు కూడా నాకు నచ్చినవి ఇంకా ఉన్నా.. ఇది మరీ నచ్చింది. మరొక కవితో పోల్చ వీలులేని స్వంత గొంతుక ఉన్న కవివి నువ్వు ఈ కాలాన!!

    అభినందనలు నీకు,
    జయప్రభ.

  7. మన సాహిత్యంలో కవులు, పుస్తకాలు – 2 గురించి ఆ. సౌమ్య అభిప్రాయం:

    07/02/2013 3:56 am

    చాలా బాగుంది వ్యాసం. అయితే, నాకు కొన్ని సందేహాలు వచ్చాయి. ప్రతీ కవి కథే అయితే ప్రతీ విమర్శకుడు లేదా కవి జీవిత చరిత్రని రాస్తున్నవాడు ‘కథ’ ఎందుకు కాడు? మీరన్నట్టు కవి జీవితంలో లేని విషయాలని కల్పించి రాసి డబ్బు కోసమో, కీర్తి కండూతి కోసమో తపిస్తున్నవాడిలో మాత్రం కవి, లౌకిక వ్యక్తి అనే రెండు స్వభావాలు ఉండవా? ఒక మాట నాకు బాగా నచ్చింది… కవిత్వం/రచన తరతరాలు చదవాలి. అప్పుడే రాగద్వేషాలు పోయి కవిత్వం మిగులుతుంది అన్నారు కదా. చాలా మంచి మాట చెప్పారు. ఇదే మాట కవి జీవిత చరిత్రలు రాస్తున్నవారికి కూడా వర్తిస్తుంది కదా!!

    కొంతమంది కవుల జీవితగాథలు తెలిస్తే వారి కవిత్వం బాగా అర్థమవుతుంది అన్నదాన్లో కొంత నిజం లేకపోలేదు. నా స్వానుభవంలో… కమలా దాస్ కవితలు చదువుతుంటే ఒకటే ఆవేదన నాకు. ఎందుకు ఈమెకి ఇంత బాధ! ఇంత దుఃఖం! ఎందుకు ఇంత వేదనాభరితమైన కవిత్వం రాస్తోంది! అన్న ప్రశ్నలు వేధించేవి. ఆవిడ వ్యక్తిగత జీవితం గురించి కొంత తెలుసుకున్నాక ఆవిడ కవితలమీద నా అవగాహన పెరిగింది.

    రాగద్వేషాలకు అతీతంగా కవిని అర్థం చేసుకోవడం, ప్రేమించడం సాధ్యమవుతుందా!! అని. ఎంతో ప్రేమించిన కవి లోని లౌకిక వ్యక్తి, తన సొంత రచనలకు పూర్తి వ్యతిరేకమైన పనులు చేస్తూ/మాట్లాడుతూ కళ్ళముందు కనిపిస్తుంటే ఆ కవి కథని అతని సృజన ద్వారా మాత్రమే ఎలా రూపొందించుకోవడం అని!!

  8. మల్లే పూల్ మల్లే పూల్ గురించి Muddu venkata lakshmi అభిప్రాయం:

    06/11/2013 6:19 am

    ఇంద్రాణి గారూ – మంచి పద చిత్రాలు సృష్టించ గల భావుకత ఉంది మీలో. ఇంకా ఇలాంటి కవితలు వ్రాస్తూ ఉండండి.

  9. జాతర గురించి saidulu అభిప్రాయం:

    06/01/2013 5:30 am

    చాలా బాగున్నావి మీ కవితలు.

  10. ఈమాట మే 2013 సంచికకు స్వాగతం! గురించి మోహన అభిప్రాయం:

    05/06/2013 10:30 am

    నాకు లైలాగారంటే ఎంతో ఇష్టము. వారి రచ్చబండ కవితలను కొన్నిటిని దాచుకొని అప్పుడప్పుడూ చదువుకొంటాను. వారికి ఎందుకు మా వ్యాసముపైన ఇలా కోపము వచ్చిందో తెలియడము లేదు. ప్రస్తుత సంచికలో ఎనిమిది వ్యాసాలలో నాలుగు వ్యాసములు పిబిఎస్ పైన వ్రాయబడినవి. అలాగే ఒకటి రెండు కవితలు కూడ. ముఖపత్రములో ముఖ్యపత్రము కూడ పిబిఎస్ పైననే. సంపాదకులు ఇది నివాళి అని చెప్పి ఉండకపోవచ్చును. అంత మాత్రాన ఒక గొప్ప గాయకుడు, కవి, అంతకంటె ఒక గొప్ప మనిషి చనిపోయిన తరువాత శ్రద్ధాంజలులు అర్పించడము సబబు కాదా? అందుకు కృషి చేయడము తప్పా? సుమారు ఒక వారము రోజులలో వందలాది పాటలను విని అందులో మాకు తోచిన అసంఖ్యాకమైన పాటలను పాఠకులకు, శ్రోతలకు అందించడము భావ్యము కాదా? I am indeed proud of this quilt (termed అతుకుల బొంత) stitched in a prompt manner by all the three of us, of course ably assisted by the editors. గతములో జీవంతులైన వారిపైన కూడ ఈమాట ప్రత్యేక సంచికలను విడుదల చేసినది. అప్పుడు కూడ కొన్ని బాణాల గురినుండి తప్పించుకోలేదు. ఈమాటను ఒక గొప్ప పత్రికగా చేయడములో లైలాగారి వంటి మంచి రచయితలకు కూడ ఒక భాగము, హక్కు ఉన్నది. Funeral services గురించి మాత్రమే కాదు, ఆలయములలో జరిగే wedding services పైన కూడ లైలా గారు వ్రాస్తే నేను చదివి ఆనందిస్తాను. నేను నా అభిప్రాయమును వెలిబుచ్చడానికి కారణము – ఇక్కడున్న పిబిఎస్ గారు వ్రాసిన వ్యాసాలతో బాటు ఇంతకుముందు వారు వ్రాసిన వ్యాసమును కూడ పాఠకులు చదువవచ్చును గదా అనే సదాశయము తప్ప మరేమి లేదు, నమ్మండి. లైలాగారికి నమస్సులతో విధేయుడు – మోహన