పాఠకుల అభిప్రాయాలు


11282

« 1 2 3 4 5 6 ... 1129 »

 1. గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-1 గురించి వురుపుటూరి శ్రీనివాస్ గారి అభిప్రాయం:

  09/05/2017 12:53 am

  “ఈ ఏనుగు ముఖమాయన వినాయకుడేనా? అలా అయితే ఆయనను అంత చులకన చేసిన శ్లోకాన్ని ఆయన ప్రార్థన వెనుకనే భక్తిగా ఎందుకు పఠిస్తున్నారు?”

  నాకు తెలిసి –
  శ్రీవైష్ణవసంప్రదాయంలో విష్వక్సేనుడు – కొంత స్కందుడు, కొంత గణపతి. (వైష్ణవ) సేనాపతి, విఘ్ననాశకుడు. శ్రీవైష్ణవకుటుంబాలలో తొలిపూజ విష్వక్సేనుడికే.

  ఈ విష్వక్సేనుడి పరివారంలో ఒక “గజాననర్” అనే ఒక “నిత్యసూరి” ఉంటాడు. “వీర”వైష్ణవదేవాలయాలలో గణపతికి బదులు ఈ గజాననుడి విగ్రహాలు ఉంటాయట. ఈయన ఏకదంతుడు కాదు (రెండు దంతాలూ పూర్తిగా ఉన్న మూర్తి ఈయనది). తుంబిక్కై ఆళ్వారని కూడా ఈయనకి పేరు. విఘ్నహర్తలలో ఈయనా ఒకడట.
  “శుక్లాంబరధరం…” కూడా విష్వక్సేనస్తుతి అని ఒక వాదము ఉన్నది.

 2. గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-1 గురించి సురేశ్ కొలిచాల గారి అభిప్రాయం:

  09/04/2017 8:51 pm

  శుక్లాంబరధరం అన్న శ్లోకానికి విశ్వనాథ సత్యనారాయణ చేసిన వ్యాఖ్యను ఈ అనుబంధం ద్వారా ఈమాట పాఠకులకు అందజేస్తున్నాము.

  శుక్లాంబరధరం … (విశ్వనాథ వ్యాఖ్య)

  ‘సాహిత్య సురభి’ అన్న పుస్తకంలోని ఈ వ్యాఖ్యను మాకు స్కాన్ చేసి అందజేసిన మిత్రుడు హేలీ కల్యాణ్కు ప్రత్యేక కృతజ్ఞతలు.

  సంపాదకుల తరఫున,
  సురేశ్ కొలిచాల.

 3. భూమి చాలని మనిషి గురించి amarendra dasari గారి అభిప్రాయం:

  09/04/2017 4:59 pm

  థాంక్స్ రామయ్య గారూ

 4. గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-1 గురించి మోహన గారి అభిప్రాయం:

  09/04/2017 4:40 pm

  రవి గారు – “నన్నయ, తిక్కన గారలది 11 వ శతాబ్దానికి ఈవల. వీరు తెలుగు భారతంలో గణపతిని స్తుతించకపోవడం Choice కావచ్చు.”

  తిక్కన శిష్యుడు కేతన తిక్కనకు అంకితము చేయబడిన తన “దశకుమారచరితము”లో గణపతిని స్తుతిస్తూ క్రింది పద్యమును వ్రాసినాడు.

  గ్రక్కున నేత్రయుగ్మము కరద్వితయంబున మూసి పట్టి యా
  మిక్కిలికంటికిం దనదు మిక్కిలి హస్తము మాటు సేసి యిం-
  పెక్కెడు బాల (కేళిఁ బరమేశ్వరు చి)త్తము పల్లవింపఁగా
  దక్కక ముద్దునం బొలుచు దంతి ముఖుం గొలుతుం బ్రసన్నుఁగాన్
  – కేతన దశకుమారచరితము, 1.005

  తొమ్మిదవ, పదవ శతాబ్దములలో జీవించిన కన్నడ ఆదికవి పంపకవి వ్రాసిన “విక్రమార్జున విజయము” అనబడే పంప భారతములో వినాయకునిపైన ఈ పద్యము గలదు –

  ఎన్న దానమిదాగళుం మధుపాశ్రయం ధరెగవ్యవ-
  చ్ఛిన్న దానమిదగళుం విబుధాశ్రయం గెలవంద
  నమ్నిజోన్నతియిందమీ పతి యెందు మెచ్చి వినాయకం
  తాన్నిమిర్చుగె కబ్బమం నయదిం గుణార్ణవ భూపనా
  – పంప భారతము, 1.007

  విధేయుడు – మోహన

 5. Breakrooమోపాఖ్యానము గురించి manjula గారి అభిప్రాయం:

  09/04/2017 4:33 pm

  చాలా బావుంది!

 6. గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-1 గురించి మోహన గారి అభిప్రాయం:

  09/04/2017 3:49 pm

  1) తను వసితాంబుదంబు, సితదంత ముఖం బచిరాంశు, వాత్మగ-
  ర్జన మురుగర్జనంబుఁ, గర సద్రుచి శక్ర శరాసనంబునై
  చన మదవారిదృష్టి హితసస్యసమృద్ధిగ నభ్రవేళ నాఁ
  జను గణనాథుఁ గొల్తు ననిశంబు నభీష్టఫలప్రదాతగాన్
  – నన్నెచోడుని కుమారసంభవము, 1.009

  కవిరాజశిఖామణి నన్నెచోడుడు నన్నయ సమకాలికుడు లేక నన్నయ తిక్కనల మధ్యకాలము వాడని ఊహ.

  2) గాథాసప్తశతిలో గణపతి – నా అనువాదములు –

  జో సీసమ్మి విఇణ్ణో మజ్ఝ జుఆణేహి గణవఈ ఆసీ
  తం వ్విఅ ఏహ్ణిం పణమామి హఅజరే హోహి సంతుట్ఠా – 4.72

  యం శీర్షే వితీర్ణో మమ యువభిర్గణపతి రాసీత్
  తమే వేదానీం ప్రణమామి హతజరే భవ సంతుష్టా

  తరుణులు గణపతి శిల నుం-
  చిరి నా తలగడగ నాఁడు – శృంగారములో
  హరిహరి నేఁడా శిల కీ
  జరలోన నమింతు నాదు – సౌభాగ్యముగా

  (యౌవనములో యువకులతో ఆనందించునప్పుడు గణపతి శిలను దిండుగా ఉంచుకొన్న ఒక వేశ్య అదే గణపతికి ముసలితనములో ప్రణామములను ఇస్తుంది)

  హేలాకరగ్గఅట్ఠీజలరిక్కం సాఅరం పఆసంతో
  జఅఇ అణిగ్గఅవడవగ్గి భరిఅగగణో గణాహివఈ – 5.03

  హేలాకారాగ్రాకృష్టజలరిక్తం సాగరం ప్రకాశయన్
  జయత్యనిగ్రహవడవాగ్నిభృత గగనో గణాధిపతిః

  సులభముగాఁ దొండముతో
  జలనిధిఁ దా పీల్చివేసి – సలిలేంధన కాం-
  తుల గగనపు నలుదెసలన్
  నెలకొల్పిన గణపతి కగు – నిండుగ జయముల్
  (సలిలేంధనము = బడబాగ్ని)

  (తన తొండముతో సముద్రములోని నీటినంతా త్రాగి అందులోని బడబాగ్ని కాంతులను ఆకాశములో ప్రకాశింప జేసిన గణపతికి జయమగు గాక)

  3) తేవారములో తిరుజ్ఞానసంబందర్ వ్రాసిన ఒక పద్యములో గణపతి జనన వృత్తాంతము ప్రస్తావించబడినది. దానిని ఇక్కడ చదువ వచ్చును – http://eemaata.com/em/issues/201401/3071.html?allinonepage=1
  తిరుజ్ఞానసంబందర్ ఏడవ శతాబ్దములో జీవించెనని ఊహ. శంకరులు ఇతనిని సౌందర్యలహరిలో ప్రస్తావించి యున్నారు.

  విధేయుడు – మోహన

 7. గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-1 గురించి భరత్ గారి అభిప్రాయం:

  09/04/2017 12:02 pm

  ఈ వ్యాఖ్యానాలన్నీ చూసాక గుర్తు వచ్చినది ఇది. పుస్తకం నుంది యధాతధంగా కిందన….

  (“శ్రీరామకృష్ణ కధామృతం సంగ్రహం” నుండి – ) మంగళవారం అక్టోబర్ 27, 1885:

  శ్యాం బసు: మహాశయా భగవంతుడే సమస్తం చేస్తున్నప్పుడు మనిషి పాపాలకి శిక్ష ఎందుకు అనుభవించాలి?

  శ్రీ రామకృష్ణులు: నీది వట్టి కంసాలి బుద్ధి!

  నరేంద్రుడు: అంటే లెక్కలు కట్టే బుద్ధి అని అర్ధం. కంసాలి ప్రతీ వస్తువు బరువునూ త్రాసులో ఖచ్చితంగా తూచుతాడు కదా?

  శ్రీ రామకృష్ణులు: నేను చెప్పేది ఏమిటంటే అరే బాబూ నువ్వు మామిడి పళ్ళను తిను. మామిడి తోటలో ఎన్ని వందల చెట్లు ఉన్నాయి ఎన్ని వేల కొమ్మలు ఉన్నాయి ఎన్ని కోట్ల ఆకులు ఉన్నాయి ఇలాంటి లెక్కలతో నీకు ప్రయోజనం ఏమిటి? నువ్వు మామిడి పండ్లని తినడానికి వచ్చావు. ఆ పళ్ళని తిని సంతుష్టుడివవు.

  (శ్యాం బసు తో) ఈ సంసారంలో భగవంతుడికోసం సాధనలు చేసే నిమిత్తం నీకు మానవ జన్మ లభించింది. భగవంతుడి పాదపద్మాలమీద భక్తి అనేది ఎలా కలుగుతుందో ఆ విషయమై ప్రయత్నించు తక్కిన నిరర్ధక విషయాలతో నీకు ఏమిటిపని? ఫెలోజఫీ (ఫిలాసఫీ – తత్వశాస్త్రం) చర్చించడం ద్వారా నీకు ఒరిగేదేమిటి? ఇలా చూడు అర ముంత కల్లుతోనే నువ్వు మత్తిల్లుతున్నప్పుడు కల్లు దుకాణంలో ఎన్ని కుండల కల్లు నిల్వ వుంది అన్న లెక్కలతో నీకు ప్రయోజనం ఏమిటి?

 8. గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-1 గురించి imdrakanti pinakapani గారి అభిప్రాయం:

  09/04/2017 1:33 am

  శశివర్ణం ఎలా కుదుర్తుంది విష్ణువుకి? నీలవర్ణం అనాలి కదా.

  “కృతే నారాయణో శ్వేత:” అనే పాఠం గూడా కొందరు పణ్డితులు సప్లై చేశారు. కృత యుగంలో విష్ణువు తెల్లని వాడట

 9. గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-1 గురించి రవి గారి అభిప్రాయం:

  09/04/2017 1:06 am

  చివర్నించి పైకి మూడవ పేరా – “సంస్కృత మహాభారతంలో గజముఖుడైన గణపతి ప్రస్తావన లేదు…” అన్న వాక్యంతో ఆరంభమయ్యేది – ఈ పేరాగ్రాఫ్ ఇంకా బాగానూ, వివరంగానూ, Chronological గానూ వ్రాసి ఉండాలి అని నా అభిప్రాయం.

  నన్నయ, తిక్కన గారలది 11 వ శతాబ్దానికి ఈవల. వీరు తెలుగు భారతంలో గణపతిని స్తుతించకపోవడం Choice కావచ్చు. అంతకు మునుపే సంస్కృతంలో ధనంజయుని దశరూపకంలోనూ, కుందమాల నాందిలోనూ హేరంబుని ప్రస్తావన ఉంది. బాదామి చాళుక్యుల కాలంలో(7 -9 centuries) “వాతాపి” (అనగా బాదామి) లో గణపతి విగ్రహం ఉండేదని, చాళుక్యులను పల్లవులు జయించినప్పుడు, ఆ విగ్రహాన్ని తరలించుకుపోయారని కథలున్నాయి. దరిమిలా “వాతాపి గణపతిం భజే…” అన్న కీర్తన గణపతిపై ఏర్పడింది. బాదామి దగ్గర మహాకూట అనే క్షేత్రంలో ఆ ’వాతాపి’, అగస్త్యుల కథకు మూలమైన వాతాపి, ఇల్వలులనే రాక్షసుల విగ్రహాలు కూడా మహాకూట దేవాలయప్రాంగణంలో ఉన్నాయి.

  చాళుక్యులకు మునుపు గాథాసప్తశతిలోనే గణపతి ప్రస్తావన ఉంది. ఈ విషయం మీరు వచ్చే సీక్వెల్ లో ఎలానూ ప్రస్తావిస్తారనుకోండి. 🙂

 10. గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-1 గురించి చంద్ర మోహన్ గారి అభిప్రాయం:

  09/03/2017 10:59 pm

  ఇంకొక ప్రముఖమైన శ్లోకం, పూజాదికాలలో ’శుక్లాంబరధరం…’ తరువాత చదువుతారు:
  “యస్య ద్విరద వక్త్రాద్యాః పారిషద్యాః పరశ్శతం
  విఘ్నం నిఘ్నంతి సతతం విష్వక్సేనం తమాశ్రయే”

  (ఏనుగు ముఖం కలిగినవాడిలాంటి వారు ఓ వందమంది సేవకులుగా కొలువులో ఉన్నటువంటి విష్వక్సేనుని సదా విఘ్నాలను తప్పించడం కొరకు ఆశ్రయిస్తున్నాను)
  ఈ ఏనుగు ముఖమాయన వినాయకుడేనా? అలా అయితే ఆయనను అంత చులకన చేసిన శ్లోకాన్ని ఆయన ప్రార్థన వెనుకనే భక్తిగా ఎందుకు పఠిస్తున్నారు? ఒకవేళ విఘ్ననాశకుడైన విష్వక్సేనుని కొలువులో ఉన్న ద్విరద వక్త్రుడు విఘ్నాలను తొలగించే పనిని ఇండిపెండెంట్ పోర్టుఫోలియోగా తీసుకొన్నాడా?

« 1 2 3 4 5 6 ... 1129 »