Expand to right
Expand to left

పాఠకుల అభిప్రాయాలు


ఈ పదం(పదాలు) ఉన్న అభిప్రాయాలు చూపించండి

ఇప్పటిదాకా ఈమాట లో తెలియచేసిన అభిప్రాయాలు: 9664

«కొత్త అభిప్రాయాలు 1 2 3 4 5 ... 967 పాత అభిప్రాయాలు»

 1. తెలుగు అంతర్జాతీయ భాష కావాలంటే… గురించి దేశికాచారి అభిప్రాయం:

  06/10/2015 10:35 am

  కొంపలోన తెలుగు కొండెక్కుసమయాన
  కోర్కెలేల దిశలకొసలు దాక!
  ఇంటవెలుగు నింపి ఇకపైన కకుబంత
  దీప్తి నందజేయ దివుర వలదె!!

  ఆంధ్రదేశంలో ప్రస్తుతం తెలుగుయొక్క అధ్వాన్నస్థితిని కండ్లకు గట్టే చక్కని పద్యం. ఆంధ్రదేశంలోనే తెలుగు అంతరించిపోతుంటే అడిగే నాథుడు లేడు. ఇక అంతర్జాతీయతనుగఱించి ఆలోచించడం ప్రస్తుతపరిస్థితిలో అప్రస్తుత మనిపిస్తుంది. ‘ఉట్టి కెగురలేని జెట్టి స్వర్గాని కెగుర గలడా?’ అన్న దానిని ఇది తలపిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణరాష్ట్రాల అధికారికచిహ్నాలను (official emblems) చూడండి. వానిలో ప్రధానంగా కన్పడేవి ఇంగ్లీషులో వ్రాసిన రాష్ట్రనామాలే. తెలుగులో వ్రాసినపేరు అప్రధానంగా ఒక మూలకు ఉంటుంది. ఇదొక్కటి చాలు తెలుగుపై ఆయా ప్రభుత్వాలకు ఎంత మక్కువ ఉందో గ్రహించడానికి.

  తమ్మినేనివారు లేవనెత్తిన ‘కకుభ’పదవిచారం. కకుప్ అనునది స్త్రీలింగ భకారాంతపదం. కకుప్, కకుభౌ, కకుభః – అని ప్రథమావిభక్తిలో ఏక,ద్వి,బహువచనరూపాలు. అందుచేత కకుప్+అంత = కకుబంత అనే పదం నిర్దుష్టమైనపదం. ఐతే కకుభా అనే ఆకారాంతమైన స్త్రీలింగపదం కూడ ఉన్నది. అదివాడితే కకుభాంత అని కావాలి. కాని కకుబంత అనే పదం సాధువే కాక సౌమ్యంగా కూడ ఉన్నందున అది వాడటంలో పొరపాటు లేదు. కకుభశబ్దము పుల్లింగమైనప్పుడు వీణె కరివెకు, మద్దిచెట్టుకు, కకుభరాగానికి పేరౌతుంది. కకుప్ అని స్త్రీలింగమైనప్పుడు శోభ, దిక్కు, సంపంగిదండ ఇత్యాదుల కర్థమౌతుంది.

  ‘కకుభో రాగభేదేఽపి, వీణాంగే, అర్జునపాదపే’ అనియు, ‘కకుప్ శోభా, దిశోః ,శాస్త్రే, ప్రవేణ్యాం, చంపకస్రజి’ అని విశ్వకోశనిఘంటువు.

 2. తెలుగు అంతర్జాతీయ భాష కావాలంటే… గురించి తః తః అభిప్రాయం:

  06/10/2015 4:55 am

  శ్రీ పప్పు :భారతాన అంగ్లేయుల పాలన అంతరించిన తర్వాత అనతి కాలంలోనే సైన్సూ టెక్నాలజీ ల తో ముడిబడ్డ విపణి తో పెనవేసుకు పోయిన ఒక కల్చురల్ హోమోజనై జషన్ ప్రపంచాన్ని కమ్మేసింది. దీని ప్రభావాన ఇంగ్లిష్ ను అమెరికన్ మింగేయటం జరిగింది. ఇల్లాలు ,హవ్స్ వైఫ్ , కాఫీ మేకర్ లాగా హోం మేకర్ అయింది .

  యూరప్ మెల్లిగా వెనకపడి పోయి – ఆంధ్ర విశ్వ కళా పరిషత్ లో అరవై ఐదు వరకూ అంతకు కొన్ని సంవత్సరాలు ముందు నుంచీ సైన్స్ విద్యార్థులకు జెర్మన్ నిబంధన గా బొధించేవాళ్ళు- పైన చెప్పిన అమెరికన్ ప్రభావం దట్టంగా అలుముకుని అమెరికా కడుపుకు రొట్టె తో బాటు బుఱ్ఱ కు జామూ ఇచ్చే వితరణ శీలిగా అవుపడటం తో భారతీయ భాషలు ఈ వ్యాపార సాంస్కృతిక బానిసత్వ సంకెళ్ళలోకి తమ చేతులు జాచాయి. ఇప్పుడు ‘వగచిన వగచిన యేమి ఫలము’. మీరన్న ఆనువాదాలు కూడా ప్రపంచాన్నంతటినీ కాక ఎసెన్షియల్ గా అమెరికాని ఇంప్రెస్ చేయటానికే సాగినట్టు గా నాకు అనిపిస్తుంది

  ఫ్రపంచం చిన్నదయి పోతోందంటే అమెరికా పెద్దదయిపోతోందనేనన్న నిజానికి పది పదిహేనేళ్ళ క్రితం కళ్ళు తెరిచిన వాళ్ళు చైనా వాళ్ళు. అర్జెంటుగా చైనీస్ నేర్చుకోవాల్సిన అవసరం ఉందని అమెరికా గుర్తించేటట్టు చేయగలిగారు. ఇక ముందు సైన్స్ – టెక్నాలజీలలతో ఆధిపత్యమే సాంస్కృతిక ఆధిపత్యమై తిష్టవేస్తుంది.

  నమస్కారలతో
  తః తః

 3. అంకెలు-సంఖ్యలు: రామానుజన్ నుండి భార్గవ దాకా గురించి hanmantharao అభిప్రాయం:

  06/10/2015 4:42 am

  వేమూరి గారూ,

  ఒక గణిత విషయాన్ని ఇంత రంజకంగా చెప్పచ్చని తెలీదు. చాలా బాగుందండీ…..

 4. నాకు నచ్చిన పద్యం: అమరపతి చేత ఆవరసం త్రాగించిన కవిదిగ్గజం గురించి Srinivas Nagulapalli అభిప్రాయం:

  06/09/2015 11:28 pm

  ఎప్పటిలాగే మిత్రులు కామేశ్వరరావుగారు ఓపికతో పద్యాల అర్థాలు, వాటి కథా సందర్భాలు విశేషాలు అందించినందుకు కృతజ్ఞతలు.

  “అమరపతి చేత ఆవరసం త్రాగించిన కవిదిగ్గజం” అని శీర్షిక పెట్టిన వ్యాసంలో, అసలు దానికి సంబంధించిన పద్యమే కనిపించకపోవడం వెలితిగా ఉంటుందని తోచి ఆ పద్యాన్ని పంచుకోవడం.
  —————————————————-
  “అత్తఱి నిప్పు ద్రొక్కినటు, లౌదల దేల్దినినట్టు, లావ యు
  వ్వెత్తుగ ద్రావినట్లు, విబుధేశుడు మాణవకోగ్రనిష్టకున్
  జిత్తమునన్ దపించి, యతిశీఘ్రగతిన్ క్షితికేగుదెంచె, ద
  ద్వృత్తము మానపింతునని వృద్ధమహీసుర వేష ధారియై” (పాండురంగ మాహాత్మ్యం పంచమాశ్వాసము)
  —————————————————-
  రామకృష్ణుని వర్ణనలో, పాత్రచిత్రణలో హాస్యం వ్యంగ్యం రెండూ సమ్మిళితమై కనిపిస్తున్నట్టుంది.
  ఆ పద్యంలో శబ్ద పరంగా “కవుల్ వర్ణించి వర్ణించియున్” అని అదే పదాన్ని రెండుసార్లు చెప్తూ వర్ణించడం, చాల సహజంగ ఒప్పిన సొగసు. ఇప్పటికీ తెలుగు ఇళ్ళళ్ళో చాలా సార్లు చెప్పాం అనే అర్థంలో “చెప్పి చెప్పి” బేజారు ఎత్తిపోయాం అనే వాడుకను గుర్తుకుతెస్తుంది.

  ఇక అయతుని పాత్ర చిత్రణ. “అన్నం న నింద్యాత్ తద్ వ్రతం” అని ఉపనిషత్తులు, వేదాలు చదువుకున్న అయుతుడు, అన్నాన్ని నిందించను అని చదువుకొని మరీ, అన్నం పెట్టే గృహస్తాశ్రమ ధర్మాన్ని నిందించాడని ఇంద్రుడు అనడం, కాదు, ఇంద్రుని పాత్రచేత చెప్పించడం ఆ చిత్తవృత్తిని రేఖామాత్రంగా కవి ఎత్తి చూపినట్టుంది. ఇక ముసలి బ్రాహ్మణుడి పాత్రచేత శృంగారం యొక్క గొప్పతనాన్ని చెప్పించడం, ఆ ఉదంతంలోకెల్ల హాస్యస్ఫోరకమైన చిత్రణగా కనపడుతుంది. ఇదెట్లా ఉందంటే, బట్టతల వ్యక్తి శీకాకాయ సబ్బుకు advertisement ఇచ్చినట్టుంది. అసలే వృధ్ధుడు. వృధ్ధునికి శృంగార తలపు రావడమే ఒక విపరీత అవస్థ. పండు ముసలి దాని విశిష్టతను ఇంకొకరికి బోధించడం ఇంకా పండిన అవస్థ. అంతేగాక వృధ్ధుని రూపంలో ఉన్నది సాక్షాత్తు ఇంద్రుడు. అంటే ఎంతో మంది అప్సరసలున్నా ఉపశమింపని శృంగారవాంఛ తో ఎవ్వరూ పొందనివిధంగా నిలువెల్ల పరాభవం పొందిన ఇంద్రుడే దాల్చిన పాత్రతో సైతం శృంగార గొప్పతనాన్ని చెప్పించడం రామకృష్ణుని గడుసుతనం.
  ———
  విధేయుడు
  -శ్రీనివాస్

 5. తెలుగు అంతర్జాతీయ భాష కావాలంటే… గురించి తమ్మినేని యదుకుల భూషణ్ అభిప్రాయం:

  06/09/2015 10:55 pm

  ‘ఇంటవెలుగు నింపి ఇకపైన కకుబంత’

  ‘కకుభాంత’ అని ఉండాలేమో !!

 6. తెలుగు అంతర్జాతీయ భాష కావాలంటే… గురించి తః తః అభిప్రాయం:

  06/09/2015 9:01 pm

  శ్రీ మోహన : తెలుగు ప్రపంచభాష కావడానికి ముందు భారతదేశములో అన్ని రంగాలలో (వాణిజ్య, విద్య, సాంస్కృతిక, సినిమా) విరివిగా వాడబడే భాషగా రూపు దిద్దుకోవాలి. .. ఆంటున్నారు మీరు కానీ కొన్ని సందర్భాలలో రచ్చ గెలిచి ఇంట గెలుస్తాము. ఆమెరికా లో సితార్ కు పేరొస్తే మనం ఇంట్లో రవిశంకర్ ఫొటో గోడకు తగిలించుకుంటాం. ‘ ఫథేర్ పాంచాలి’విషయమూ అంతే- ‘ ముఝే జాన్‌తా నహీ’ అంటే ‘మై నహీ జాన్తీ ‘ అనేనా?
  నమస్కారాలతో -తః తః

 7. తెలుగు అంతర్జాతీయ భాష కావాలంటే… గురించి మోహన అభిప్రాయం:

  06/09/2015 6:12 pm

  తెలుగు ప్రపంచభాష కావడానికి ముందు భారతదేశములో అన్ని రంగాలలో (వాణిజ్య, విద్య, సాంస్కృతిక, సినిమా) విరివిగా వాడబడే భాషగా రూపు దిద్దుకోవాలి. కొత్త ఢిల్లీలో, కొల్కత్తాలో, లక్నోలో, ముంబైలో తెలుగు మాట్లాడితే అక్కడి వాళ్లు (ముఝే జాన్‌తా నహీ అనక) తెలుగులో బదులు చెప్పాలి, అనగా హిందీ, వంగ మున్నగు భాషలు తెలియకపోయినా తెలుగు మాత్రమే మాట్లాడి నెగ్గుకో కలగాలి. తెలుగు చిత్రాలకు పదేపదే బహుమతులు రావాలి. తెలుగును ఇతర రాష్ట్రములలోని వారందరఱు కళాశాలలో నేర్చుకోవాలి. తెలుగు పుస్తకాలను, అనువాదాలను వాళ్లు కొనుక్కోవాలి. అప్పుడు తెలుగు భాషకు ఒక స్థానము ఏర్పడుతుంది. విదేశీయులు కూడ ఈ భాషలో ఏదొ గొప్పదనము ఉన్నది, మనము కూడ నేర్చుకొందాము అని కుతూహల పడుతారు. అప్పుడు కూడ అది ఆంగ్లమును తొలగించ జాలదు. ఇలాటి పరిస్థితి భారతదేశములో తెలుగుకు ఏర్పడాలంటే మొదట తెలుగువాళ్లు తెలుగువాళ్లుగా ఉండాలి. కలలు కనడములో తప్పులేదు. విధేయుడు – మోహన

 8. తెలుగు అంతర్జాతీయ భాష కావాలంటే… గురించి తః తః అభిప్రాయం:

  06/09/2015 5:44 pm

  శాయి గారూ నమస్కారాలు.

  ఇంక నోరు మూసుకుందామనుకున్నాను గానీ మీ, ‘ఆ రంగాలలో ఎన్నదగిన ప్రచురణలు తెలుగులో రావాలంటే ముందుగా నడుం కట్టుకోవాల్సింది పారిభాషికపదాల కోసం’ అన్నది నవ్వు తెప్పించింది . నోరు మూసుకుని నవ్వలేక ఇది రాస్తున్నాను. ‘గుఱ్ఱాన్ని కొనాలనుకుంటే ముందు నడుం కట్టుకోవాల్సింది నాడా కొనుక్కోటం కోసం’ కోపం తెచ్చు కోకండేం!

  నమస్కారాలండీ కామేశ్వరరావు గారూ! రచయితల దృష్టిలో అంతర్జాతీయ భాషా, ప్రపంచ భాషా అన్నవి పర్యాయ పదాలు అవటానికి వీలు లేదు. అలా అయితే వ్యాసంలో రెండవ పేరాలో ‘కాబట్టి తెలుగు ప్రపంచ భాషే!’ అన్న తర్వాత ఇక రాయటానికి మిగిలింది Q.E.D అని మాత్రమే. అంటే -ఇక్కడి సందర్భంలో – చెప్పవలసినది చెప్పేశాము అని.

  తః తః

 9. తెలుగు అంతర్జాతీయ భాష కావాలంటే… గురించి నాగరాజు పప్పు అభిప్రాయం:

  06/09/2015 5:01 pm

  కామేశ్వరరావుగారి వ్యాఖ్యకి పొడిగింపుగా వ్యాసంయొక్క ప్రధానమైన ప్రతిపాదన నాకర్థమయినంతలో:

  తెలుగు బాగా వచ్చిన ఓ వరప్రసాదు, ఇంగ్లీషు మాత్రమే వచ్చిన ఒక జాన్ డో ఉన్నారనుకుందాం. ఇద్దరూ ఒకే విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు, సుమారుగా ఒకేలాంటి ఉద్యోగాలు చేస్తున్నారనుకుందాం. తెలుగు వరప్రసాదుకి ఇంగ్లీషులో ఉన్న విజ్ఞానంతో పాటుగా, తెలుగులో ‘విజ్ఞానం’ (కామేశ్వరరావుగారన్నట్టుగా విజ్ఞానం అంటే నాలెడ్జ్ అనే నా ఉద్దేశం కూడా) కూడా అందుబాటులో ఉంది. దానివల్ల అతనికి ఏమైనా ‘unfair advantage’ ఉందా? ఉందని మనం ప్రపంచాన్ని నమ్మించగలిగితే, అప్పుడు తెలుగులో ఉన్న విజ్ఞానం మొదటగా ఇంగ్లీషు లోకి, తర్వాత మిగిలిన ప్రపంచ భాషల్లోకి అనువాదం చెయ్యబడుతుంది.

  అట్లాంటి విజ్ఞానం తెలుగులో ఉందా? అనే ప్రశ్నకి రచయితలు సమాధానం చెప్పలేదు. చారిత్రకంగా, మన సంస్కృతిలో – శాస్త్రభాష, అధికారికభాష, వ్యావహారిక భాష వేరువేరుగా ఉంటూ వచ్చేవి, ఇంగ్లీషు వచ్చి సంస్కృతం స్థానాన్ని ఆక్రమించుకుంది – ఈ భావన మనలో చాలామందికి ఉంది. ఇది నిజమైన పక్షంలో, దేశభాషల్లో ఉన్న విజ్ఞానం అంత లెక్కలోకి రాదు. అయితే నారాయణరావుగారి నలభై ఏళ్ళ కృషిని కాస్త లోతుగా చూస్తే, ఆయన ఈ వాదాన్ని ఎప్పుడూ అంగీకరించలేదు. సుమారుగా శ్రీనాధుడికి కొంచెం ముందు నుంచీ, బ్రిటిషువాళ్ళు రావడానికి పూర్వం ఉన్న నాయకరాజుల కాలం వరకూ ఉన్న ఒక ఐదారు వందల ఏళ్ళ కాలంలో దేశభాషల్లోనే సాహిత్యసృష్టి విస్తృతంగా జరిగింది. కాబట్టి తెలుగువారికి గానీ, మిగిలిన భాషలవారికి గానీ ఈ కాలంలో వచ్చిన సాహిత్యం చాలానే ఉంది. దీనిని అనువదించవలసిన అవసరం ఉంది అనేది ఆయన నమ్మకం అని అనుకోవచ్చు. అయితే, ఇది నా ఊహ మాత్రమే — దీనిపై రచయితలిద్దరి ఆలోచనలు మరొక వ్యాసంలో విపులంగా చర్చిస్తే బాగుటుంది. (నా ఊహకి కారణం ఇప్పటివరకూ నారాయణరావుగారు అనువదించిన సాహిత్యం – మనుచరిత్ర, కళాపూర్ణోదయం, బసవపురాణం, అన్నమయ్య, క్షేత్రయ్య, శ్రీనాధుడు, విశ్వనాథ సత్యనారాయణ, గురజాడ, చాసో…)

  మరొక ప్రశ్న – తెలుగు సాహిత్యాన్ని ఇంగ్లీషులోకి అనువదించడం మూలంగా తెలుగుసాహిత్యం ప్రపంచ సాహిత్యం అవుతుంది గానీ, తెలుగు ప్రపంచభాష ఎలా అవుతుందీ?

  రెండోది – ఈ అనువాదాలు విశ్వవిద్యాలయాలద్వారా ఎందుకు జరగాలి? ఎవరైనా చెయ్యవచ్చు కదా?

  ఇటువంటి అనువాదాలు బోధించడానికి అనువుగా ఉండాలి అనేవాదన ఒకటి ఉంది. దీనిపై ఈమధ్య షెల్లీ పోలాక్, నారాయణరావు మరికొందరు ఒక రేడియో ఇంటర్యూలో ప్రస్తావించారు.

  ఈవ్యాసం మొదట్లో తెలుగు సాంస్కృతిక సంస్థల కార్యకలాపాల గురించిన చర్చ, వ్యాసం మధ్యలో తెలుగులో సాహిత్య విమర్శ గురించిన చర్చ వ్యాసాన్ని పక్కదారి పట్టించేదిగా ఉంది.

  హార్వర్డ్ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో, పోలాక్ సంపాదకీయంలో ఇప్పుడు భారత భాషల్లో వచ్చిన సాహిత్యం అనువాదం జరుగుతోంది, అది చాలా పెద్ద ప్రయత్నం. దాని గురించి ఈ వ్యాసంలో ప్రస్తావిస్తే బాగుండేదేమో.

 10. తెలుగు అంతర్జాతీయ భాష కావాలంటే… గురించి samavarthi అభిప్రాయం:

  06/09/2015 1:55 am

  కొంపలొన తెలుగు కొండెక్కుసమయాన
  కోర్కెలేల దిశలకొసలు దాక !
  ఇంటవెలుగు నింపి ఇకపైన కకుబంత
  దీప్తి నందజేయ దివుర వలదె !!

«కొత్త అభిప్రాయాలు 1 2 3 4 5 ... 967 పాత అభిప్రాయాలు»