Expand to right
Expand to left

పాఠకుల అభిప్రాయాలు


ఈ పదం(పదాలు) ఉన్న అభిప్రాయాలు చూపించండి

ఇప్పటిదాకా ఈమాట లో తెలియచేసిన అభిప్రాయాలు: 9089

«కొత్త అభిప్రాయాలు 1 2 3 4 5 ... 909 పాత అభిప్రాయాలు»

 1. ఓ వురుమూ, ఓ మెరుపూ సృష్టించి మాయమైన తాత్విక సాహితీవేత్త శ్రీ వడ్డెర చండీదాస్ గురించి chitti balasubrahmanyam అభిప్రాయం:

  10/11/2014 8:29 am

  చాలా మంచి వ్యాసం. నలభై యేళ్ళ తరువాత మళ్ళీ చదివాను ఇవ్వాళ. హిమజ్వాలలో కొత్త అర్థాలు వచ్చాయి… కృష్ణ నుంచి సారథి అయ్యాక.

 2. నిప్పులు గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:

  10/10/2014 2:15 pm

  మాన్యులు శ్రీ మాధవ్ గారికి
  నమస్కారములతో,

  మంచి కవితను చదవగానే మనస్సుకు తోచిన ప్రథమస్పందాన్ని స్వస్పందంగా విన్నవించికొన్నాను. ఇన్నాళ్ళూ నేను వచ్చీరాని ఆంధ్రంలో వ్రాస్తున్న వ్యాసాలను స్వచ్చమైన తెలుగులోకి మారుస్తూ నన్ను ప్రోత్సహిస్తూ, ఆదరిస్తున్న మీరే అందుకు తగినవారు.

  ఆ పైని సుబోధ ప్రబోధాలకు ఛప్పణ్ణయ పరిషత్తు ఉండనే ఉన్నది.

  ఛప్పణ్ణయాణ కిం వా భణ్ణఉ కహకుంజరాణ భువణమ్మి
  అణ్ణో వి ఛేయభణిఓ అజ్జ వి ఉవమిజ్జయే జేహిం. (ఉద్యోతన సూరి)

  “What need be said of ChappaNNaya-s, the prominent poet-scholars, with whom, even to this day (అజ్జ వి), any other commentator of (howsoever) clever saying could be compared in this world?”

  :)

  సప్రశ్రయంగా,
  ఏల్చూరి మురళీధరరావు

 3. ఎంగేజ్మెంట్ గురించి Dr. CBS Venkataramana అభిప్రాయం:

  10/10/2014 2:06 pm

  కధ శైలి చాలా బావుంది. కధ చివరి వరకూ బిగువుగానే నడిచింది. కానీ వున్నట్లుండి వాళ్ళిద్దరూ ఎందుకు విడిపోయారో అర్ధం కాలేదు.

  అసలు వాళ్ళు విడిపోయారో లేదో కూడా అర్ధం కాలేదు!

 4. పార్వతి తపస్సు: నన్నెచోడుని కుమారసంభవము గురించి Rammohan అభిప్రాయం:

  10/10/2014 12:50 pm

  నన్నెచోడుని కుమారసంభవం లో పార్వతి తపస్సన్నివేశాన్ని కళ్ళకు కట్టే విధంగా ప్రస్తుతీకరించారు రాధగారు.చదువున్నంతసేపూ పార్వతి ప్రతి చర్యా చూసినట్టు అనిపించడంలో నన్నెచోడునితో పాటు రాధగారి ప్రతిభ కూడా ద్యోతకమవుతుంది. విషయానికి తగ్గ భాషను వాడటం లో రాధగారి నైపుణ్యం తెలిసిపోతుంది. ముఖ్యంగా ప్రకృతి స్వరూపిణియైన గౌరి పలుసందర్భాలలో పలురీతుల ప్రాక్రుతిక రూపాల్లో పొందుపరచిన నన్నెచోడుని రచనా వైభవాన్ని సంప్రదాయ కవిత్వప్రియులకు పసందైన విందులా అందించినందుకు కాశీనాథుని రాధగారిని అభినందిస్తున్నాను. ఫగడాల తీవ పై పరచుకున్న మంచుపొర, వంటి వర్ణనలు ,హృఅదయపాత్రలో ప్రేమచమురుతో పున్నెపువత్తినివెలిగించి ఆకసం పెంకు కు పట్టిన పొగతో మంత్రకజ్జలం తయారు చెస్తుందా అన్నట్లుగా మేఘాలను వర్ణించడం ఓహ్! ఆద్భుతం.సంప్రదాయకవిత్వపు జిగిబిగిని పట్టుకోవడానికి ,పట్టుకుని దానిని మన కందించడానికి రాధగారు పార్వతిలాగా కఠోర తపస్సు చేశారా అనిపిస్తుంది చదువుతుంటే.

 5. నిప్పులు గురించి Madhav అభిప్రాయం:

  10/10/2014 11:39 am

  మానస గారికోసం, నాకోసం, ఈమాట పాఠకుల కోసం, శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారు తమ అభిప్రాయాన్ని ఇప్పుడు తెలుగులో చెప్పాలని నా విన్నపం. :-))

  నమస్తే
  మాధవ్.

 6. నిప్పులు గురించి n s murty అభిప్రాయం:

  10/09/2014 9:04 am

  మానసగారూ,

  ఏల్చూరి మురళీధరరావుగారు కవితలోని ఆంతర్యాన్ని మీరు ఆవిష్కరించిన తీరు చాలా చక్కగా చెప్పేరు. అంతకంటే బాగా చెప్పలేను.

  హృదయపూర్వక అభినందనలు ఆశీస్సులతో,

  NS మూర్తి

 7. నిప్పులు గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:

  10/08/2014 9:45 pm

  చి.సౌ. మానస చామర్తి గారికి,

  భగవత్కరుణానుభవానికి నోచుకొన్న వాగ్విభూతితో కవితలు వ్రాస్తున్నారు. అజహల్లక్షణగా ఉన్న నాయకుని మనోగతాన్ని వ్యంగ్యం చేసి, ప్రణయినీధర్మాన్ని భావధ్వనిగా నిలిపి, పొయ్యిలో రాజుకోవటం మొదలై శీతమారుతపోతసంస్పర్శతో అంతర్హితాలైన అంగారకణికల ద్వారా శృంగారభణితిని వక్తృప్రౌఢోక్తిసిద్ధంగా నిరూపించారని లాక్షణికులంటారు. ఆ అనువర్తనీయతల మాటకేమి గాని, మనసులకు హత్తుకొనిపోయే మధురిమను మాటలతో మూటగట్టారు!

  సప్రశ్రయంగా,
  ఏల్చూరి మురళీధరరావు

 8. గ్రామ్యమా? వాడుకభాషా? గురించి Pavan Santhosh.S అభిప్రాయం:

  10/08/2014 8:12 am

  1927లోనే విశ్వనాథ వారు రాసిన ఈ వ్యాసం వారి స్పష్టమైన దృష్టికి నిదర్శనం. ఏమంటే కాలం కొన్నిటిని చూడనియ్యదు. అలా ఆ కాలం చూడనియ్యని వాటిలో వ్యవహారిక, గ్రాంథిక పదాల సంభావ్యత కూడా ఒకటి. ఐతే ఆయన కాలాన్ని దాటారు ఆ విషయంలో. వ్యవహర్తల, కవుల ప్రయోగాలను వ్యాకర్తలు సూత్రీకరించుకోవాలే తప్ప వ్యాకర్తలను అనుసరించి ఏ వ్యవహర్తా మాట్లాడడు అన్నది ఆనాటికి పరిణతమైన పరిశీలన. ఈ వ్యాసాన్ని అచ్చంగా కాక ఆనాటి పరిస్థితులు, పరిధులు గుర్తించి చదవమని ప్రతివారికి మరొక్కమారు మనవి.

 9. తెలుగులో గ్రంథ పరిష్కరణ గురించి కొన్ని ఆలోచనలు గురించి K.V.S. Ramarao అభిప్రాయం:

  10/07/2014 4:33 am

  “లలితస్కంథము..”, “దుర్వారోద్యమ ..” పద్యాల విషయంలో నాది పొరపాటే. నేననుకుంటున్న పద్యాలు వేరు, రాసినవి వేరు (ఎర్రన గారి పద్యం అన్నది “శాతనఖాగ్రఖండిత ..”; అదీ ఇదీ కూడ ద్రౌపది మాటలే కనక ఒకటి అనుకుంటూ మరోటి రాశాను); ఏమైనా పొరపాటే.

  ఐతే ఇదంతా రామాయణంలో పిడకల వేట. ప్రస్తుతవ్యాసానికి ముఖ్యాంగం కూడ కాదు. ఒక గ్రంథం తాలూకు అనేక ప్రతుల్ని సంగ్రహించినప్పుడు ఒక్కో ప్రతి గురించిన సమాచారాన్ని కూడ భద్రపరచనందువల్ల ఎంతో నష్టం జరిగిందన్నది వ్యాసం ముఖ్యవిషయం. పుస్తకాల గురించిన పాశ్చాత్య భావాలు ఇందుకు కారణం అని వారి వాదన. ఆ భావాలు తెలుగు సాహిత్య చరిత్రలో బలంగా నాటుకుపోయాయని, అందుకు బ్రౌన్ తదితరులు బాధ్యులని, ఆ భావాలు ఈనాటికీ వదలలేదని కాని మనం వాటిని వదిలించుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని వారి సిద్ధాంతం. పరిశోధకులెవరికైనా ఇది ఆహ్వానించదగ్గ విషయమేనని నా అభిప్రాయం. పాతవిషయాల్ని కొత్తచూపుతో చూడటం పరిశోధకుల గీటురాయి కదా !

 10. నన్నెచోడుని కుమారసంభవంలో ‘లలితాస్యాంబురుహంబు’ పద్యవివాదం: స్థితిస్థాపన గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:

  10/06/2014 4:04 pm

  మాన్యులు శ్రీ సూరి సీతారాం గారికి
  నమస్కారములతో,

  మీరన్న ఆ భావాన్ని లాక్షణికులు ౧) శబ్దాపహారము, ౨) అర్థాపహారము, ౩) ఉభయాపహారము, ౪) ఛాయాపహారము, ౫) ప్రతిచ్ఛాయాకరణము, ౬) రేఖాపహారము, ౭) ప్రతినిర్మాణము, ౮) వర్ణనాగ్రహణము, ౯) సర్వగ్రంథచౌర్యము అని పరిపరివిధాల నిరూపించారు. రాజశేఖరుని ‘కావ్యమీమాంస’లోని ఒక ప్రకరణమంతా ఈ విషయవివేకానికే అంకితమయింది.

  ఇది అనువాదవిషయమైనప్పుడు ౧) శబ్దానువాదం, ౨) అర్థానువాదం, ౩) భావానువాదం, ౪) మూలవిధేయం, ౫) మూలాతిక్రమణం అన్న స్వీకార్యాంశాలలో ఏది, ఏ సందర్భంలో, ఏ తీరున గ్రహణీయం అన్నది కవి ప్రతిభాపురస్కృతమై ఉంటుంది. ఆ పట్టువిడుపుల ఒడుపుకు ఉపదేష్టలు కనుకనే కవిత్రయం వారు మనకు ప్రామాణికులయ్యారు. రసప్రతీతి నిమిత్తం కథాసన్నివేశాల వైపుల్య సంక్షేపాదులకు కూడా మనకు వారు చూపినవే దారిదీపాలు. ఇక, ప్రౌఢి అన్నది కవి పాండిత్య(శక్తి)విలసనాన్ని బట్టి, ఔచితీపరిపాటిని బట్టి నిశ్చయింపబడుతున్నది.

  ఈ వ్యాసంలో చర్చింపబడిన ప్రధానాంశం ఇది: వేర్వేరు కథలను కలిగిన కుమారసంభవ – కందర్పకేతువిలాస కావ్యాలలో నన్నెచోడ – తెనాలి రామకృష్ణకవులు కవులు సందర్భావశాన ఒకే భావభావనను, రూపధేయాన్ని కలిగిన పద్యకల్పనను చేశారు. తెనాలి రామకృష్ణకవి స్వయంగా భావనోద్బోధం లేక నన్నెచోడుని నుంచి అర్థచౌర్యం చేశాడని మానవల్లి రామకృష్ణకవి గారు తీవ్రంగా విమర్శించారు. రెండు పద్యాల తీరుతెన్నులు ఒకే ఛందంలో పూర్తిగా ఒకే పదపరిపాటితో ఉన్నందువల్ల, రెండింటి చివరి పాదాలూ పూర్తిగా ఒకటే కావటం వల్ల – అవి యాదృచ్ఛికాలు కావని, ఎవరో ఒకరు మూలకర్త, మరొకరు అనుకర్త అని అంగీకరింపక తప్పని పరిస్థితి ఏర్పడింది. రామకృష్ణుని పద్యానికి మూలశ్లోకం ఒకటున్నదని, రామకృష్ణుని పద్యం ఆ శ్లోకానికి ఏ మార్పూ లేని సులక్షిత యథాతథానువాదమని ఈ వ్యాసంలో ప్రతిపాదింపబడింది. వివిధచారిత్రికప్రమాణాల వల్ల ఆ శ్లోకం పూర్వుడైన నన్నెచోడునికి తెలిసి ఉండే అవకాశం లేదని కూడా ఊహింపబడింది. ఆ శ్లోకమొకటి ఉన్నదన్న విషయం తెలియని నన్నెచోడుడు వ్రాసిన దోషపూర్ణపద్యం నిర్దుష్టమైన రామకృష్ణుని పద్యానికి మూలం కాకపోగా దానికే ఒక అసమంజసానుకరణమని నిరూపింపబడింది.

  కుమారసంభవ కందర్పకేతువిలాసాలు ఒకే కావ్యానికి అనువాదాలు కావు. అయినా, సందర్భస్థగితంగా ఒకరిని మించి ఒకరు వ్రాయదలచిన నేపథ్యం కనబడుతూనే ఉన్నది. తిరుగులేని పద్యసాదృశ్యం అందుకు కారణం. నన్నెచోడుని పద్యంలోని లోపజాతం వల్ల నన్నెచోడుడే అనుకర్త అని, ఆ కారణాన తెనాలి కవి కంటె ఆధునికుడని వ్యాసంలో ప్రతిపాదింపబడింది.

  ఈ వ్యాసంలో కవి-కాలాదులకు సంబంధించిన ప్రతికూలసాక్ష్యాలు అన్నిటిని నేను వ్రాయలేదు కాని, కేవలం “అనుకరణ” విషయాన్ని మాత్రమే తీసికొన్నా సుమారు ౨౮౦ – ౩౦౦ నన్నెచోడుని పద్యాలను పదులకొద్దీ తెలుగు కవులు, కన్నడ కవులు (ఆ మాటకు వస్తే సంస్కృత కవులున్నూ) అనుకరించినట్లు కనబడుతున్నది. ఆ అన్ని చోట్ల నన్నెచోడుని పద్యంలో “ఎంతో కొంత లోపం” ఉన్నదని, ఆ అనుసరించిన కవులు దానికి “మెరుగెక్కించా”రని విమర్శకులు అంటున్నారు. ఇంతమంది బహుభాషల మహాకవులు ఆ స్వర్ణనిధి పేరయినా చెప్పకుండా ఆ మెరుగు తరుగున్న ముడిబంగారాన్ని కొల్లగొట్టి నాణ్యమైన నగలుగా మార్చుకోవాలని ఎందుకు ఉద్యమించారో ఊహించటం కష్టం.

  ఇక్కడ వస్తువును, పద్యాన్ని మార్చి వ్రాయటానికి ఆస్కారం లేని నేపథ్యమేదీ లేదు. “అర్థచౌర్యం” నిస్సందేహంగా జరిగింది. అదే కవి కాలనిర్ణయానికి పరికరించింది. ఇప్పటి వ్యాసపరిధి ఇంత మాత్రమే.

  మీ సహృదయ స్పందనకు ధన్యవాదాలు.

  సప్రశ్రయంగా,
  ఏల్చూరి మురళీధరరావు

«కొత్త అభిప్రాయాలు 1 2 3 4 5 ... 909 పాత అభిప్రాయాలు»