Expand to right
Expand to left

పాఠకుల అభిప్రాయాలు


ఈ పదం(పదాలు) ఉన్న అభిప్రాయాలు చూపించండి

ఇప్పటిదాకా ఈమాట లో తెలియచేసిన అభిప్రాయాలు: 9045

1 2 3 4 5 ... 905 పాత అభిప్రాయాలు»

 1. తెలుగులో గ్రంథ పరిష్కరణ గురించి కొన్ని ఆలోచనలు గురించి వెల్చేరు నారాయణరావు & పరుచూరి శ్రీనివాస్ అభిప్రాయం:

  09/21/2014 7:21 pm

  బొల్లోజు బాబాగారికి:

  బ్రౌన్ మీద మేము చేసిన విమర్శని “విసుర్లు” అనుకోకండి. బ్రౌన్ వచ్చినప్పటి సందర్భాలు, పరిస్థితులు వివరించి, భారతదేశాన్ని ఉద్దరించడానికి వచ్చిన తెల్లవాళ్లకుండే దర్పం గురించి చెప్పి, తెలుగు గ్రంథ ప్రపంచం ఎలా వుందో తెలుసుకోవడానికి ఏ ప్రయత్నమూ చెయ్యకుండా అప్పటికి అమలులో వున్న పాశ్చాత్య గ్రంథ పరిష్కరణ విధానాలను తెలుగుకి పట్టించడంలో బ్రౌన్ చేసిన ప్రయత్నం వివరించి, అందువల్ల వల్ల తెలుగుకి జరిగిన అపకారం సహేతుకంగా మేము గుర్తించి రాసిన మా వ్యాసం బ్రౌన్ ని వ్యక్తిగతంగా అగౌరవ పరచడానికి రాసింది కాదు. మాకు బ్రౌన్ మీద మీకున్నట్లుగా భక్తి లేదు నిజమే. బ్రౌన్ మా దృష్టిలో ఒక వ్యక్తి కాదు. ఒక వలస ప్రపంచ భావాలకు ప్రతినిధి. ఆ భావాలు బోధపరుచుకోవడానికి మేమా వ్యాసం రాశాం కాని వ్యక్తిగతంగా ఆయన్ని అగౌరవ పరచడానికి కాదు.

  మద్దిపాటి కృష్ణారావుగారికి:

  మీరంటున్న “ప్రక్షిప్తము” అనే ఊహ బ్రౌన్ అనుసరించిన పాశ్చాత్య పరిష్కరణ విధానం లోంచి వచ్చింది. అంతకు ముందు భారతీయ గ్రంథ పరిష్కర్తలు కూడా “ప్రక్షిప్తము” అనే మాట వాడారు. ఈ రెండు రకాల ప్రక్షిప్తాలకి తాత్త్వికంగా తేడా వుందని మేము వివరంగా చెప్పలేదు. ఆ సంగతి ఈ వ్యాసంలో చర్చించడానికి అవకాశం లేదని మేము భావించాం. దాన్ని గురించి వేరే వ్యాసం రాయాలి. వేమన పద్యాలు, సుమతీ శతకం పద్యాలు, ఇలాంటి పద్యాలని దొరికినవి ఒక చోట పోగుచేసి ప్రకటించడం వల్ల జరిగిన నష్టాన్ని నారాయణరావు సుమతీశతకాన్ని గురించి రాసిన వ్యాసంలో చెప్పి వున్నాడు. అది మీరు చదివారనుకుంటాం. సుమతీ అనే మకుటంతో వున్న పద్యాలన్ని ఒక చొట పోగుచేసి ప్రచురించడం వల్ల కలిగిన నష్టం ఆ వ్యాసంలో నారాయణ రావు వివరించాడు. ఈ విమర్శ వేమన పేరుతో వున్న పద్యాలకి కూడ వర్తిస్తుంది. దొరికిన రాతప్రతులన్నిట్నీ వాటి లేఖక సందర్భాలతో సంబంధం లేకుండా పోగుచేసి పెట్టకూడదని మా ప్రతిపాదన. మీకు ఈ సంగతి ఇంతకన్నా వివరంగా చెప్పక్కరలేదు.

  మంగమ్మగారి పుస్తకం తెలుగులో తొలినాళ్లలో అచ్చయిన తెలుగు పుస్తకాల గురించిన సమాచారాన్ని చక్కగా ప్రదర్శిస్తుంది. కానీ పుస్తక నిర్మాణ చరిత్ర వేరు. అది ఎవరూ రాయలేదని మేమన్నది. నిజానికి ఆ ప్రయత్నం పప్పు నాగరాజు, పరుచూరి శ్రీనివాస్ మొదలుపెట్టారు. ఆ ప్రయత్నంలో రెండు వ్యాసాలు ప్రచురించారు. మిగిలిన వ్యాసాలు ఇంకా రావలసివున్నాయి. నాగరాజు, శ్రీనివాస్ రాసిన రెండవ వ్యాసంలో మంగమ్మగారి పుస్తకాన్ని ప్రస్తావించారు. అయినా మా వ్యాసంలో కూడా ఆ పుస్తకాన్ని ప్రస్తావించి వుండాల్సింది. అది మా ఏమరపాటే కాని ఆ పుస్తకం ఉదహరించడానికి అర్హమైనదికాదు అని మా ఉద్దేశం కాదు.

  మా వ్యాసాన్ని చదివి దాని మీద మీ అభిప్రాయాలు చెప్పిన మీ ఇద్దరికీ మా నమస్కారాలు.

  నారా, శ్రీనివాస్.

 2. మంజుఘోష గురించి కామేశ్వరరావు అభిప్రాయం:

  09/21/2014 10:23 am

  మంజుఘోష చాలా బాగుంది! అయితే యీ ఘోష ఆ కవుల చెవులకు చేరుతుందన్న నమ్మకం నాకు లేదు.

  “రమణీయామృత నవ్యవార్షుక పృషల్లాక్షణ్యవర్ణాదృతి”లాంటి సమాసోద్ధృతి కన్నా, “ములుకు ముట్టి గతించిన జంటకేడ్చు నా పిట్ట యెలుంగు” పలుకుసొబగు ఈ కవితలో నన్ను బాగా హత్తుకొంది.

  ఈ కవిత చదివగానే నాకీ దాశరథి పద్యం గుర్తుకువచ్చింది:

  ఏనాడెన్నడు కత్తితో గెలువలేదీ విశ్వమున్; ప్రేమ పా
  శానన్ గట్టుము నాలుగంబది ప్రపంచాలన్, మహాత్ముండిదే
  జ్ఞానోద్బోధను జేసె, నెవ్వడు వినెన్? సాహిత్యసామ్రాజ్యమం
  దైనన్ కొంతగ శాంతి పాదుకొననిమ్మా! నీకు పుణ్యంబగున్

 3. మనకు తెలియని బ్రౌన్ దొర: ఛాల్స్ ఫిలిప్ బ్రౌన్ గురించి తాడేపల్లి హరికృష్ణ అభిప్రాయం:

  09/21/2014 5:34 am

  ఈ వ్యాసం ఆంధ్రులందరూ ఆరాధ్యుడిగా గణిస్తున్న బ్రౌను దొరని మరో కోణంలో విశ్లేషిస్తోంది. నాకర్థమైనంత వరకూ, ఇందులో స్థూలంశాలు ఇవి:

  1. బ్రౌను ఆనాటి బ్రిటీషు ఉన్నతాధికారులందరికి వలెనే స్వావకాశాలకోసం భారత దేశానికి వచ్చాడు.
  2. తెలుగులో అతడు సాధించిన పాండిత్యం నామమాత్రం
  3. అతడు పాఠనిర్ణయాలని శాసించాడే తప్ప, అతనికి ఆ నిర్ణయాలు శాసించే వైదుష్యం లేదు.
  4. తత్ఫలితంగా మనకీ రోజు దొరుకుతున్న పాఠాలన్నీ లోపభూయిష్టాలు.
  5. వీటిలో (వ్యాసకర్తలు) ప్రస్ఫుటంగా పేర్కొన్న తార్కాణాలు: రేఫాల ఏకీకరణము, తదుపరి అర్ధానుస్వారాల విసర్జనము.

  ఇందులో రెండవ సిద్ధాంత నిరూపణకి రచయితలిచ్చిన నిరూపణం, వారి పునరుధ్ఘాటనం మినహా బహుస్వల్పం. పై నాలుగో వాక్యాన్ని ఈ వ్యాసానికి సమగ్రసారాంశంగా భావిస్తాను. శకటరేఫలు, పూర్ణానుస్వారాలు మినిహాయిస్తే, ఈ పాఠ పరిష్కారం, తదుపరి ఆ పాఠాలని చదువుకున్న తెలుగు వారి సాహిత్యావగాహనకి ఏ విధంగా నష్టం కలిగిందో రచయితలు సూచనప్రాయంగా సుమతీశతక కర్తృత్వం పైనున్న వివాదాన్ని ఉదహరించారు. మరి మనుచరిత్ర, వసుచరిత్ర, భారతం ఇత్యాదిగా గల పూర్వ గ్రంధాలన్నీ ఏ విధమైన భావచ్యుతికి లోనైనాయి? [సెప్టెంబరు ఈమాటలో ఇటువంటి ప్రశ్నలకి ఉత్తరాలుండగలవని మరో వ్యాసాన్ని ప్రచురించారు. కానీ ఈ ప్రశ్నలకి సమాధానాలు అందులో లేవని సవినయంగా చెపుతున్నాను].

  బ్రౌన్ తరవాతి పరిష్కర్తలు ముద్రాపకులు అవే లోపాలని యథాతథంగా గ్రహించారన్నారు. తదుపరి పరిష్కర్తలు తెలుగువారు, ఉభయభాషల్లోనూ, సాహిత్యంలోనూ పాండిత్యమూ, అభినివేశమూ వున్నవారు – కనక వాళ్ళు ఆ పాఠాలలోని లోపాలని తరచి, వాళ్ళకి యుక్తమని తోచిన విధంగా పరిష్కరించి వుండవచ్చు కదా. ఈ ప్రశ్నకి జవాబు మరో వ్యాసంలో రాగలదని ఆశిస్తాను.

  పూర్వకావ్యాలు, గ్రంధాలు అనేకాలు ఇంకా తంజావూరు సరస్వతీమహల్ వంటి చోట్ల అజ్ఞాతాలుగా అలాగే శిధిలాలౌతున్నయని వింటూ వుంటాము. ఎవరో బ్రౌను, వేటూరి ప్రభాకర శాస్త్రి, రాళ్ళపల్లి వంటి ఒకరిద్దరు మినహాయిస్తే ఎవరూ అ ప్రతులని చూసే ప్రయత్నాలు చెయ్యకుండానే, ఉన్న సాహిత్యసంపదమీదనే విమర్శలు, పునర్విమర్శలు, పున:పునర్విమర్శలూ వ్రాసుకుంటున్నారు. పట్టా ప్రదానాలు, పరిశొధన పత్రాలు పొందుతున్నారు. ఈ వార్తమానాన్ని తరచి చూసినట్లైతే, బ్రౌను మన తెలుగు సంస్కృతికి గొప్ప ఉపకారమే చేశాడనాలి. ఎవరి జాతీయస్వోత్కర్షని వారికి తోచిన విధంగా చాటుతూ వుంటారు. అందుకు గాను సభలు, సన్మానాలు, విగ్రహావిష్కరణలూ చేస్తూ వుంటారు. అనేకానేక సందర్భాలలో అది ప్రస్తుత రాజకీయ వాతావరణాల పర్యవసానాలు కావచ్చును. ఆ దృష్ట్యా వ్యాసకర్తల ఆదర్శవాదం సబబేను – బ్రౌను కివ్వాల్సిన యదార్ధ గౌరవమేపాటిది? కానీ అది వ్యాసం సూచించినట్లుగా శూన్యమో, అపకారమో కాదని నా అనుమానం. బ్రౌను (కు)పాండిత్యాన్ని నిరూపించే సాక్ష్యాలు వ్యాసంలో ప్రదర్శింప బడలేదు. బ్రౌను భారత దేశంలో ప్రవేశించిన పరిస్థితులూ, నాటి సమాజిక సమాజిక చిత్రణ ద్వారా బ్రౌనుకొక సజీవ వ్యక్తిత్వాన్నపాదించి, తత్పరంగా తెలుగుసాహిత్యానికి బ్రౌను చేసిన సేవని బేరీజు వేశారు.

  బ్రౌను పాండిత్యాన్ని సంశయించినా, (ఇక్కడ ఒక సహవ్యాఖ్యాత ఎవరో అన్నట్లుగా), బ్రౌనుకి పూర్వసాహిత్యాన్ని జనసామాన్యానికి అందుబాటులోకి తెచ్చి, ముద్రార్హంగా చేసిన కీర్తిని కట్టబెట్టవచ్చేమో? తమకై తాము శాస్త్రాలని విస్తరించగలిగీ కూడా, విస్తరించ గల మేధావర్గాన్ని సమీకరించి కొన్ని బృహత్కార్యాలకి విజయం కట్టబెట్టిన మేధావులు ఆధునిక భారతంలో లేరా (ఉదా: హోమీభాభా, అసుతోష్ ముఖర్జీ). కనీసం ఒక వైతాళికుడిగాను, కార్యశూరిడిగాను బ్రౌనుని గుర్తించ వచ్చును.

 4. నా గురించి నేను గురించి Pavan Santhosh.S అభిప్రాయం:

  09/20/2014 2:23 pm

  ప్రాచీన కవిత్వం ఎందుకు చదవాలంటే ఎట్లా రాయకూడదో తెలుసుకోవడానికి అని ఎవరో కాదు సాక్షాత్తు శ్రీశ్రీయే అన్నాడు.

  సాక్షాత్తూ శ్రీశ్రీ అని ఆ వాక్యాలకు ఏ విధమైన ప్రత్యెకత ఆపాదించాల్సిన అవసరం లేదు. శ్రీశ్రీ కవిత్వం, ఉపన్యాసాల్లోని మాటలు ఒకే స్థాయిలొ లేవు. కవిగా ఆయన ఔన్నత్యం ఆయన కొటేషన్స్ కి ఆపాదించేసి తెలుగు సాహిత్యంలో కొన్ని తరాలకు తరాలే నష్టపోయాయి. (అతిశయోక్తి కాదు) సహజంగా ఆయన వాక్యాల్లో ఉండే రిథం, రైం, ఒక్కొ చమక్కు వంటివి వాటిని సాహిత్యఅభిలాషులకు దగ్గర చేశాయి.

 5. కంద పద్యగాథ – 1 గురించి nagajyothi susarla అభిప్రాయం:

  09/20/2014 4:08 am

  నాలాంటి మామూలు వారికి కూడా తేలిక గా కంద పద్యం ఒంటపట్టేలా వ్రాశారు…మీకు శతకోటి ధన్యవాదములు.

 6. చేరాతో ముఖాముఖి గురించి satheesh అభిప్రాయం:

  09/18/2014 2:18 pm

  ఛందస్సు పై ఇంగ్లిష్ లో రాయలేదు. బాల ప్రౌఢ వ్యాకరణాలకు కొత్త వ్యాఖ్య రాయలేదు గానీ, ఇంగ్లీష్ లో రెండు వ్యాసాలు రాసారు. ప్రాచీనాంధ్ర భాషా వ్యాకరణం రాయలేదు. తెలుగు వచనశైలికి నమూనాలు సేకరించారు. అక్కడక్కడ వ్యాఖ్యలు రాశారు. కవిత్వం ఎట్లా చదవాలి? అనే దాన్ని ఆయన చాలా వ్యాసాల్లో చెప్పారు. ”A Sketches of Telugu grammar” రాశారుగానీ ఆచూకి దొరకలేదు. ‘తెలుగు వాక్యం’ ఇంగ్లిష్ చేసారు. త్వరలో రాబోతోంది.

 7. లక్ష్మణదేవర నవ్వు గురించి రెండుచింతల రామకృష్ణమూర్తి అభిప్రాయం:

  09/18/2014 12:59 pm

  దేవర- వైకృత విశేషణం(దేవుడు,ప్రభువు అనే అర్ధాలలో) దేవరుడు-సంస్కృతసమం,విశేష్యం,అకారాంతం,పుంలింగము(మగని తోబుట్టువు అనే అర్ధంలో) ఆధారం ;శబ్దరత్నాకరం. కాబట్టి లక్ష్మణదేవర అంటే లక్ష్మణదేవుడు అనే అర్ధం చెప్పుకోవాలి.

 8. హెల్లో…శంకరం… గురించి చెన్నూరి సుదర్శన్ అభిప్రాయం:

  09/18/2014 12:03 am

  కథానిక చాలా బాగుంది. నేను ఇండియాలో రిటరైన ఉద్యోగస్థుడను. అయినా నా బావ నుండి నాకు ఇక్కట్లు తప్పటం లేదు. నా చెల్లెలుతో ఫోన్ చేయిస్తాడు. నేనిక ATM ని. మా నాన్న అమ్మ కాలం చేసారు. చెల్లెలి ముఖం చూసి అన్నీ భరిస్తున్నాను. ఎందుకో ఈ బావలు ఇలాగా…

 9. రాగలహరి: మోహనం గురించి రెండుచింతల రామకృష్ణమూర్తి అభిప్రాయం:

  09/16/2014 12:28 pm

  లాహిరి లాహిరి పాటకు స్వరాలు తెలియ జేసినందుకు కృతజ్ఞతలు.

 10. ఈమాట సెప్టెంబర్ 2014 సంచికకు స్వాగతం! గురించి రెండుచింతల రామకృష్ణమూర్తి అభిప్రాయం:

  09/16/2014 11:08 am

  సెప్టెంబరు 2014 సంచిక లోని ఆముక్తమాల్యద యిప్పుడే చూశాను.ఉన్నంత వరకూ చదివాను.గ్రంధస్థమైనదైతే కొంతకాలానికి పాతబడి పోవచ్చు.దీనిలో ఆ సమస్య లేదు. చాలా బాగుంది.

1 2 3 4 5 ... 905 పాత అభిప్రాయాలు»