తిక్కన సోమయాజి భారత యుద్ధ కథ – రెండవ భాగం

ఏడవరోజు

ఏడవరోజు యుద్ధానికి కౌరవసేనని మండలవ్యూహంగా దిద్దాడు భీష్ముడు. అదిచూసి వజ్రవ్యూహం కల్పించమని ధర్మజుడు తన సేనాపతికి చెప్పాడు. రెండు సైన్యాలు ఆవేశంగా రెండోవైపుకు దూసుకుపోయినయ్.

ద్రోణుడు విరాటునితో, అశ్వత్థామ శిఖండితో, దుర్యోధనుడు ధృష్టద్యుమ్నుడితో, శల్యుడు కవలల్తో, విందానువిందులు యుధామన్యునితో, అనేకమంది రాజులు అర్జునుడితో తలపడ్డారు. అలాగే భీముడూ కృతవర్మ, అభిమన్యుడూ చిత్రసేన దుశ్శాస వికర్ణులు, ఘటోత్కచుడూ భగదత్తుడు, సాత్యకీ అలంబుసుడు, ధృష్టకేతుడూ భూరిశ్రవుడు, చేకితానుడూ కృపాచార్యుడు, ధర్మజుడూ శ్రుతాయువు, ఎంతోమంది రాజులూ భీష్ముడు జతలుగా పోరసాగారు.

“భీష్ముడి వ్యూహాన్ని చూసుకుని మురిసిపోతూ భయంలేకుండా వీళ్లు మనమీదికి ఎలా వచ్చారో చూశావా, వీళ్ల సంగతి చూస్తా చూడు” అంటూ అర్జునుడు తననెదిరించిన వారి మీద అమ్ములు కురిశాడు. వాళ్ళూ ఒక్కుమ్మడిగా అతని మీద దూకితే కోపంతో అర్జునుడు ఇంద్రాస్త్రం ప్రయోగించాడు. అది వాళ్లు వేసిన బాణాల్ని నాశనం చేసి, వాళ్లకి గాయాలు చేసి, గజహయాల్ని కూల్చి భీభత్సం సృష్టిస్తే ఆ రాజులు పారిపోయి తమతమ సైన్యాల వెనక దాక్కున్నారు. అది చూసి దుర్యోధనుడు, “నా ఎదుటనే మీరిలా పారిపోయి దాక్కోవటం ధర్మం కాదు. ఒక్కడే భీష్ముడు యుద్ధం చేస్తున్నాడు. అతనికి సాయం చెయ్యండి వెళ్లి” అని గద్దిస్తే అప్పుడు భీష్ముడి చుట్టుపక్కల చేరారు వాళ్లు.

ఒకవంక ద్రోణుడు విరాటుడితో తలపడి అతని రథాన్ని విరిస్తే అతని కొడుకు శంఖుడి రథం ఎక్కి తండ్రీ కొడుకులు ద్రోణుడి మీద బాణాలేశారు. ద్రోణుడు కోపించి వేసిన దొడ్డనారసం శంఖుడి వక్షాన దూరి వెనగ్గా బయటికొచ్చింది. వాడు పైలోకాలకి పోయాడు. అదిచూసి విరాటుడు, అతనితో పాటే అతని సైన్యమూ పారిపోయినయ్.

శిఖండి అశ్వత్థామతో పోరాడు. ఐతే అశ్వత్థామ అతని విల్లూ రథమూ విరిస్తే పలకా వాలూ తీసుకుని కిందికి దూకాడు. అశ్వత్థామ అవీ విరిస్తే శిఖండి సాత్యకి రథం ఎక్కాడు. ధృష్టద్యుమ్నుడు దుర్యోధనుడి మీద బాణపరంపరలు వేశాడు. అతని విల్లుని తుంచాడు. నీ కొడుకు ఇంకో విల్లందుకునే లోగా అతని రథాన్ని విరిచాడు. కత్తితో అతను కిందికి దూకితే సౌబలుడు వేగంగా వచ్చి తన రథం మీద ఎక్కించుకుపోయాడు. సాత్యకి అలంబుసుడి మాయని ఇంద్రాస్త్రంతో మాయంచేసి వాణ్ణి గగ్గోలుపెడితే వాడు పారిపోయాడు. సాత్యకి సింహనాదం చేశాడు. కృతవర్మ భీముడితో తలపడితే అతను సారథిని రథాన్ని బాణాల్తో పడేసి కృతవర్మ ఒంటినిండా బాణాలు నాటాడు. ఏదుపందిలా నడుస్తూ అతను నీ బావమరది వృషకుడి రథం మీదికి ఎక్కాడు.

భగదత్తుడు తన ఏనుగుతో పాండవసేనని వేటాడుతుంటే ఘటోత్కచుడతన్ని ఎదుర్కున్నాడు. ఐతే అతను ఘటోత్కచుడి మాయల్ని పటాపంచలు చెయ్యటమే కాక వాడి మీద అనేక బాణాలు వేశాడు. ఆ ధాటికాగలేక వాడు పారిపోతే భగదత్తుడు వాడి బలాన్ని నాశనం చేశాడు.

శల్యుడి మీద అతని మేనల్లుళ్లు శరవృష్టి కురిశారు. అతనూ కోపంగా వాళ్లని నొప్పించాడు. సహదేవుడు వేగంగా వేసిన ఒక బాణం అతని వక్షం నుంచి దూసుకుపోయి రక్తస్పర్శ లేకుండానే వెనగ్గా బయటికొచ్చింది. అతను చచ్చినట్టు మూర్ఛపడటం, అతని సారథి వేగంగా అక్కణ్ణుంచి దూరంగా నడపటం జరిగిపోయినయ్.

చేకితానుడు కృపుడితో పోరాడు. ఇద్దరూ భీషణంగా యుద్ధం చేసి చివరికి కత్తుల్తో కిందికి దూకి పొడుచుకుని మూర్ఛపోయారు. వాళ్లని వాళ్ల పక్కల వాళ్లు పక్కకి తీసుకుపోయారు. దుశ్శాసన వికర్ణ చిత్రసేనుల్తో అభిమన్యుడికి పెద్దయుద్ధమయింది. ఐతే భీముడి ప్రతిజ్ఞల మూలాన అతను వాళ్లని చంపకుండా వదిలాడు. అప్పుడు భీష్ముడు అనేకమంది రాజుల్తో ఆ అభిమన్యుడి మీద తలపడ్డాడు. అదిచూసి అర్జునుడు అటు రథం తోలమన్నాడు. అలా వెళ్తుంటే త్రిగర్తుడు సుశర్మ అతన్ని అడ్డుకున్నాడు. అర్జునుడు అతన్నీ అతని సైన్యాన్నీ తిప్పలు పెట్టాడు. అతని రథరక్షకులు ముప్పైరెండు మంది కమ్ముకుంటే అర్జునుడు చిరునవ్వుతో వాళ్లందర్నీ కడతేర్చాడు.

ఒకపక్క భీష్ముడు ధర్మజుడి విల్లుని విరిచితే కోపంతో భీముడు గదతీసుకుని దుర్యోధనుడి మీదికి పరిగెత్తాడు. అతనికి సైంధవుడు అడ్డం పడ్డాడు. చిత్రసేనుడు భీముడి మీద బాణాలేస్తే అతను కోపంతో గద విసిరాడు. అది ఎవరి మీద పడుతుందోనని నీవైపు రాజులు భయపడి పరిగెత్తారు, రారాజుని తల్చుకున్నవాడే లేడు. చిత్రసేనుడు రథం మీంచి దూకుతుండగా ఆ గదపడి అతని రథం నుగ్గయ్యింది. వికర్ణుడతన్ని తన రథమ్మీద ఎక్కించుకున్నాడు. మరోచోట భీష్ముడు అన్నిదిక్కుల తానే ఐ వీరవిహారం చేశాడు. సూర్యాస్తమయం అయింది.

ఎనిమిదవ రోజు

కురుపితామహుడు కూర్మవ్యూహంతో సన్నద్ధమైతే ధర్మజుడు దానికి సరైన ప్రతివ్యూహం చెయ్యమని తన సేనాపతికి చెప్పాడు. అతను శృంగాటకవ్యూహం పన్నాడు. రెండు సైన్యాలు మోహరించి ఉత్సాహంగా తలపడినై.

నీ తండ్రి వీరరూపంతో పాండవబలం వైపుకి కదిల్తే భీముడు తప్ప మిగిలిన వాళ్లంతా పక్కకి తప్పుకున్నారు. భీముడు సారథిని చంపటంతో భీష్ముడి రథాశ్వాలు దాన్ని లాక్కుని పరిగెత్తినయ్. నీ కొడుకు సునాభుడు భీముణ్ణి ప్రతిఘటించాడు. భీముడు ప్రళయకాలాంతకుడిలా వాడి తల నరికేశాడు. దాంతో నీకొడుకులు ఆదిత్యకేతుడు, అపరాజితుడు, బహ్వాశి, పండితకుడు, కుండధారుడు, విశాలాక్షుడు, మహోదరుడు ఒక్కసారిగా భీముడి మీద దాడిచేశారు. భీముడు భీకరాకారంతో ఆ ఏడుగుర్నీ యమపురికి పంపాడు. అదిచూసి మిగిలిన నీకొడుకులు భయంతో దాక్కున్నారు.

దుర్యోధనుడు తన చుట్టూ వున్న వీరుల్ని భీముడి మీద కలబడమని పంపి శోకగద్గద కంఠంతో భీష్ముడితో “ఇలా భీముడు నా తమ్ముల్ని చంపుతుంటే ఏమీ పట్టనట్టు చూస్తున్నావ్, అందరూ ఒకేసారి చావాలని ఎదురుచూస్తున్నావా ఏమిటి?” అని నిష్టూరాలాడాడు. అతను బాధపడి, “నేనూ, ద్రోణుడు, విదురుడు నీకు ముందే చెప్పాం ఇలా జరగబోతుందని. విన్నావా? నీ తమ్ముళ్లలో ఒకసారి భీముడి చేతికి చిక్కిన వాళ్లని కాపాట్టం ఎవరివల్లౌతుంది? వీరస్వర్గం కోసం పోరాడుతున్నాం అందరం. గెలుపోటములు దైవాధీనాలు. మన ప్రయత్నలోపం లేకుండా మన ధర్మం నిర్వర్తిస్తున్నాం. గెలుపొస్తే వద్దంటామా?” అని రౌద్రాకారంతో భీముడితో తలపడ్డాడు. ధృష్టద్యుమ్నుడు, శిఖండి, సాత్యకి వచ్చి అతనితో పోరాడారు. దుర్యోధనుడు పంపగా వచ్చిన రథికుల్ని చేకితానుడు, ద్రౌపదేయుల్తో కలిసి అర్జునుడు ఎదుర్కున్నారు. అభిమన్యుడు, ఘటోత్కచుడు కౌరవసేన మీదికి లంఘించారు. ఇలా మూడు యుద్ధరంగాల్లో పోరు సాగింది.

ద్రోణుడు ద్రుపదుడి సైన్యం మీద కాలుదువ్వాడు. అంతలో ఉలూచీ అర్జునుల కొడుకు ఇరావంతుడు గుర్రపుసేనతో కౌరవసైన్యంలోకి చొచ్చుకుపోయాడు. శకుని ఆరుగురు తమ్ములు అతన్ని పొదివి బాణవర్షం కురిపించారు. గాయాలైన అతని గుర్రం పడిపోతే ఏమాత్రం తొణక్కుండా కత్తితో కిందికి దూకి ఘోరయుద్ధం చేశాడు. శకుని తమ్ములూ కిందికి దిగి అతనితో తలపడ్డారు. అతనా ఆరుగుర్నీ పన్నెండు ముక్కలుగా నరికాడు. అదిచూసి దుర్యోధనుడు అలంబుసుణ్ణి అతని మీదికి పంపాడు. వాడి మాయాజాలంతో ఇరావంతుడి గుర్రపుసైన్యం మాయమైంది. అలంబుసుడు ఆకాశానికెగిరితే ఇరావంతుడూ ఎగిరి వాణ్ణి తన కత్తితో ఖండించాడు. ఐతే ఆ రాక్షసుడు సరికొత్త రూపంతో మళ్లీ యుద్ధం సాగించాడు. ఇరావంతుడు శేషుడి ఆకారంలో నాగబాణాలు వేస్తే వాడు గరుత్మంతుడి రూపంలో వచ్చి నాగబాణాల్ని మింగి కత్తితో అతని తల నరికాడు.

సోదరుడు ఇరావంతుడి తల అలా ఇల పడటం చూసి ఘటోత్కచుడు అపరకాలుడిగా కౌరవసేన మీద విరుచుకుపడ్డాడు. గజాల్ని, అశ్వాల్ని, రథాల్ని, రథికుల్ని అదీ ఇదీ అని చూడకుండా నాశనం చేశాడు. దుర్యోధనుడి మీదికి దూకి అతన్ని చంపటానికి శక్తి ఎత్తితే వంగరాజు అతనికి అడ్డుపడ్డాడు. ఆ శక్తితో వాడి ఏనుగు చచ్చింది. వాడు నేల మీద పడ్డాడు. ఐతే దుర్యోధనుడు ఒక్కడే ఘటోత్కచుడికి ఎదురు నిలిచి వాడి మీద ఒక మహాస్త్రం వేశాడు. దాన్ని దార్లోనే నరికి వాడు సింహనాదం చేస్తే అది విని భీష్ముడు రారాజుకి రక్షణగా వెళ్లమని కేక వేస్తే ద్రోణుడు, కృపుడు, అశ్వత్థామ, చిత్రసేనుడు – ఇలా ఎంతోమంది దొరలు అటువైపుకు పరిగెత్తి ఘటోత్కచుడితో తలపడ్డారు. అలా అంతమంది రథికులు ఒక్కసారి కమ్ముకునే సరికి ఆగలేక ఆ రాక్షసుడు ఆకాశాని కెగిరాడు.

అదిచూసిన ధర్మరాజు భీముడితో, “ఇక్కడ భీష్ముడిని ఆపటానికి అర్జునుడున్నాడు. అక్కడ ఘటోత్కచుడికి సాయంగా నువ్వు త్వరగా వెళ్లు” అనటంతో వేగంగా భీముడక్కడికి తరలాడు. ఒక అర్థచంద్రాకార బాణంతో దుర్యోధనుడు భీముడి వింటిని విరిచి మరో పదునైన బాణం అతని వక్షాన నాటాడు. ఆ దెబ్బకి భీముడు తూలాడు. అది చూసి పాండవకుమారగణం నీ కొడుకు మీద కోపంతో దూకారు. కృప బాహ్లికాదులు వాళ్లనెదుర్కున్నారు. ద్రోణుడొక బాణంతో భీముణ్ణి రక్తపరిషిక్తుణ్ణి చేస్తే భీముడు రౌద్రంగా వేసిన బాణంతో ద్రోణుడు మూర్ఛపోయాడు. దుర్యోధన, అశ్వత్థామలు భీముడి మీదికి దూకారు. ఇంతలో ద్రోణుడు తెలివికి వచ్చాడు. అతనూ కృపుడూ భీముణ్ణి చుట్టుముడితే అభిమన్యుడు, ద్రౌపదేయులు వాళ్లని అడ్డగించారు.

ఇంతలో అనూప రాజు, భీముడి మిత్రుడు నీలుడు అశ్వత్థామతో యుద్ధంలో గాయపడితే ఘటోత్కచుడు అశ్వత్థామతో తలపడితే కొడుక్కి సాయంగా ద్రోణుడూ అతని మీద బాణాలేశాడు. కోపంతో ఘటోత్కచుడు మాయ పన్నాడు. దానివల్ల దుర్యోధనుడు, ద్రోణుడు, అక్కడున్న ఇతర కౌరవరథికులు నెత్తుటిమడుగుల్లో పడివున్నట్టు కౌరవసేనకి తోచి అందరూ హాహాకారాలు చేస్తుంటే భీష్ముడు వచ్చి అది మాయే కాని నిజం కాదని ఎంతచెప్పినా వినక సైన్యం కకావికలైంది. దుర్యోధనుడు మళ్ళీ భీష్ముడి దగ్గరికి వెళ్లి నిష్టూరాలాడాడు. అతను భగదత్తుణ్ణి పిలిచి, “నీకు రాక్షసుల మాయలు అంటవు కనక వెళ్లి ఈ ఘటోత్కచుడితో పోరాడు” అని చెప్పాడు. ఆ భగదత్తుడు సుప్రతీకమనే తన ఏనుగుతో పాండవసేనని నుగ్గుచేశాడు. అభిమన్యుడు, ద్రౌపదేయులు అనేక బాణాల్తో దాన్ని నొప్పిస్తే అది పాండవబలమ్మీదికే పరిగెత్తి అనేక గుర్రాల్ని సైన్యాల్ని చంపింది.

భీముడు అర్జునుడికి ఇరావంతుడి మరణం గురించి చెప్పాడు. అది విని దుఃఖించాడర్జునుడు. అతని శవం ఎక్కడో చూపించు అని అర్జునుడక్కడికి వెళ్లి కొడుకుని తలుచుకుని రోదించాడు. అది చూసి కృష్ణుడు “ఇంతకుముందు చెప్పిన విషయాలన్నీ ఇంతలోనే మర్చిపోయావా?”అన్నట్టు చిరునవ్వు నవ్వాడతన్ని చూసి. “నువ్వు చెప్పిన మాటలు మర్చిపోలేదు, పద యుద్ధం చేద్దాం” అని అర్జునుడక్కణ్ణుంచి బయల్దేరాడు. మళ్ళీ పోరు ఘోరమైంది. ద్రోణుడు భీముడితో యుద్ధంచేస్తుంటే అతని రక్షణలో వుండి భీముణ్ణి మర్దించొచ్చని నీకుమారులు కొందరు భీముడితో యుద్ధానికి తగులుకున్నారు, ఐతే అతను ఎన్నో బాణాలు తగిలినా లెక్కచెయ్యక నీకొడుకులు గుండభేది, అనాధృష్యుడు, కనకధ్వజుడు, విరావి, సుబాహుడు, దీర్ఘబాహుడు, దీర్ఘలోచనులని దీర్ఘనిద్రకి పంపాడు.

చీకటి పడటంతో సేనలు వెనక్కి మళ్లినయ్.

శిబిరానికి వెళ్తూ దుర్యోధనుడు వెంటనే కర్ణ శకునుల్ని రప్పించమని దుశ్శాసనుడికి చెప్పాడు. ఆ ముగ్గురితో దుర్యోధనుడు “భీష్మ ద్రోణ అశ్వత్థామలు మధ్యస్తులై వుండి పాండవబలమ్మీద గట్టిగా పోరాడటం లేదు. మన బలాలు రోజురోజుకీ చచ్చి సన్నగిల్లుతున్నయ్. ఇప్పుడు ఏమిటి మన కర్తవ్యం?” అనడిగాడు. రణోత్సాహంతో కర్ణుడు “భీష్ముణ్ణి తప్పించు. నేను యుద్ధంలో దూకి పాండవబలం అంతం చూస్తా” అన్నాడు. “ఐతే నేను తాతతో మాట్లాడతా” అని చెప్పి స్నానం చేసి చక్కగా అలంకరించుకుని మణిఖచిత రథమ్మీద భీష్ముడి శిబిరానికి చేరాడు దుర్యోధనుడు, దుశ్శాసనుడితో. తాత అనుమతితో లోపలికి వెళ్ళి చేతులు మోడ్చి “నువ్వు మనసు పెట్టి యుద్ధం చెయ్యనందువల్ల ఎనిమిది రోజులైనా పాండవసైన్యానికి పెద్ద నష్టమేమీ జరగలేదు. ఇదంతా ఎందుకు, నువ్వు యుద్ధం నుంచి తప్పుకుని కర్ణుణ్ణి రప్పించు” అన్నాడు. ఆ మాటలు శూలాల్లా గుచ్చుకుంటే భీష్ముడు అత్యంత విషాదంతో కొంచెం సేపు మౌనంగా వుండిపోయాడు. “నీకోసం ఓపిక కొద్దీ ప్రాణాల మీద ఏమాత్రం తీపి లేకుండా యుద్ధం చేస్తుంటే నువ్విలా అనటం భావ్యమా? ఇన్నాళ్ల కష్టం బూడిదలో పోసినట్టేనా? అర్జునుడు ఎంత వీరుడో నీకు తెలియంది కాదు. ఐనా ఈ యుద్ధం తెచ్చిపెట్టుకున్నావ్. ఒకటి చెప్తా విను. అర్జునుడిని, శిఖండిని నేను గెలవలేను. ద్రుపద, విరాట, యాదవ సైన్యాల్ని మట్టిగరిపిస్తా. పాండవుల సంగతి మీరు చూసుకోండి. అర్థరాత్రి వచ్చి కష్టం కలిగించే మాటలంటే గెలుపు వస్తుందా? వెళ్లు. రేపు నా పరాక్రమాన్ని చూద్దువు గాని” అని పంపాడు.