కథ – నాటకం – సినీమా

ఇదీ కార్యనిర్వాహకులు నాకిచ్చిన విషయం. ఇందులో వారి గడుసుదనమయినా ఉండాలి. లేదా అవగాహనా లోపమయినా ఉండాలి. కారణం -కథ సరే, నాటకంలో, సినీమాలో కథని వెదకడం పెరుగులో పాలను వెదకడం లాంటిది. వెనకటికి మా మిత్రుడు పురాణం సుబ్రహ్మణ్యశర్మ నన్ను కథ రాయమంటూ ఆయనే కథకి బారసాల చేశాడు. ‘కాకీ చొక్కాలో కాఫీచుక్క’ అంటూ. న్యాయంగా కాకీచొక్కా ‘మీద’ కాఫీచుక్క అని ఉండాలి కదా? అయితే కాకీచొక్కాలో కాఫీచుక్క కథే రాశాను. ఇప్పుడూ క్రమశిక్షణతో ఉన్న సైనికుడిలాగ ‘కథ`నాటకం`సినీమాలో కథా నిర్మాణ ప్రక్రియ’ గురించే చెప్పబోతున్నాను.

కథలో కథ అహం బ్రహ్మాస్మి. నాటకంలో కథ అద్వైతం. సినీమాలో కథ విశిష్టాద్వైతం. త్రివేణీ సంగమంలో సరస్వతీనది లాంటిది సినిమాలో కథ. కలం పట్టుకుని రాసిన కథ చెప్పే కథకి బాహ్యరూపం. అసలు కథని చెప్పడమే ఆనవాయితీ. ఎప్పుడో నా చిన్నతనంలో విన్నాను` కథ బ్రహ్మదేవుడి ఆఖరి వ్యసనం అని. చాలారోజులు దీని అర్థం పూర్తిగా అవగాహన కాలేదు. మెల్లగా లొంగింది. కన్నూ ముక్కూ చెవులూ అన్నీ తయారుచేసి ప్రాణం పోసేముందు బ్రహ్మదేవుడు చెయ్యవలసిన ఆఖరి పని` ఆ బొమ్మకి ఓ కథని జతచేయడం. ఇతనెవరు? ఏం చేస్తాడు? ఎందుకు చేస్తాడు? ఎలా చేస్తాడు? ఎలా బతుకు తాడు? ఎప్పుడు పోతాడు? ఎలా పోతాడు? అన్నిటితో కథని నిర్ణ యిస్తాడు. బ్రహ్మదేవుడు నుదుటిన రాస్తాడు. రచయిత కాగితం మీద. ఇలా కొన్నిచోట్ల కథలు పుంఖానుపుంఖాలుగా అనునిత్యం రాస్తున్న గొప్ప రచయిత బ్రహ్మదేవుడు. నాస్తికులయినా ఈ ఆలోచనలో చిన్న ముచ్చటని గుర్తుపడతారనుకుంటాను.

రాసే కథ ఇతివృత్తం. నాటకంలో కథ అన్వయం. సినీమా లో కథ అంతర్వాహిని. కాగితం మీద కథ చెప్తుంది. నాటకంలో కథ సూచిస్తుంది. సినీమాలో కథ చూపిస్తుంది. కాగితం మీద కథ ఆలోచనదాకా ప్రయాణం చేస్తుంది. నాటకంలో కథ ఆలోచన నుంచి ఆవేశానికి నిచ్చెన వేస్తుంది. సినీమాలో కథ ఒక స్పందనకు ఆలంబన అవుతుంది. స్థూలంగా ఈ మూడు పనులూ` ఈ మూడు ప్రక్రియలూ ఆయా planesలో చేస్తున్నా ఈ ప్రక్రియల స్కోప్‌ ద్వారా యీ మాత్రం ప్రత్యేకించి చెప్పుకో వచ్చు. Story is narrative. Play is an interpretation. Film is a replsentation. కథ ఆలోచన దాకా ప్రయాణం చేసే uni-dimentional ప్రక్రియ. సినీమా multi-dimentional. మరి నాటకం? ఈ రెంటి మధ్యా నిలిచే – రెండింటికీ చేతులు చాచే ప్రక్రియ. కొంత యిదీ, కొంత అదీ – వెరసి రెండూ కానిది. అయితే రెండింటి ఛాయలూ ఏ కొంతో ఉన్నది.

చిన్న ఉదాహరణ. కథకుడు చెప్తున్నాడు.

కోనేటిరావు మంచివాడు. పరోపకారి. సజ్జనుడు.

మీ మనసు అలాంటి బొమ్మని మనస్సులో ఏర్పరుచు కుంటుంది. పాఠకుడి అనుభవంలో అలాంటి కోనేటిరావుని వెదుక్కుంటుంది. అంతకుమించి రచయిత సహకారం లేదు. అది దాని పరిమితి.

నాటకం కోనేటిరావుని మీ ముందు నిలబెడుతుంది. ‘ఇదిగో, ఈయనే కోనేటిరావు,’ అని చూపిస్తుంది. కాని, ‘ఈయనే మంచివాడు,’ అని చెప్పదు. మరేం చేస్తుంది? కొన్ని సింబల్స్‌ని వెదుక్కుంటుంది.Theater represents truth.

ఒకాయన స్టేజి మీదకు వచ్చాడు. ‘‘కాంతమ్మా, వంట చేస్తున్నావా?’’ కాంతమ్మ మాట్లాడిరది. ‘‘రండి బాబాయిగారూ, ఇప్పుడే మొదలెట్టాను. మీరు శ్రమ తీసుకుని మా కోసం ఆ క్యూ లో నిలబడి చక్కెర రేషన్‌ తీసుకున్నారటగా, ఆయన చెప్పారు.’’

‘‘మీ కోసమే కాదమ్మా, మాకూ చక్కెర కావాలిగా? పనిలో పని. చేస్తే అరిగిపోతానా?’’

Theater qualifies. ఇక్కడ చక్కెర క్యూ ఆలంబన. చేసిన సహాయాన్ని ప్రేక్షకుడు చూడలేదు. కాంతమ్మ చెప్పగా విన్నాడు. ప్రేక్షకుడి ముందు కోనేటిరావు కనిపిస్తున్నాడు. ఆయన ‘పరోప కారం’ వినిపిస్తోంది. ఆయన మంచితనాన్ని గ్రహించడానికి నాటక రచయిత ‘ఊతం’ ఇచ్చాడు. కోనేటిరావు మంచితనం అర్థమ యింది.

ఇక సినీమాలో ఈ గజిబిజి లేదు. తెగేసి తేల్చుకోవడమే. కళ్ల ముందు రేషన్‌ షాపు ఉంది. కోనేటిరావు శ్రమ తెలుస్తోంది. కనిపించే దృశ్యమది. మాట పaస షఱఅఱఎa.

నలభయ్యేళ్ల కోనేటిరావు పేవ్‌మెంట్‌ మీద నడుస్తున్నాడు. కీచుమని కారాగిన శబ్దం వినిపించింది. ఆగాడు. ఓ గుడ్డివాడి ముందు కీచుమని ఎవరో బ్రేక్‌ వేశారు. అందరూ షాక్‌ అయారు. డ్రైవరు విసుక్కుంటున్నాడు. ఈ నలభయ్యేళ్ల మనిషి` మన కోనేటిరావు` గుడ్డివాడి చెయ్యి పుచ్చుకుని రోడ్డు దాటించాడు. గుడ్డివాడు రెండు చేతులూ కలిపి దండం పెట్టాడు. కథలో రెండు విశేషణాలను దృశ్యంగా చూపింది సినీమా.

ఒక విశేషణం వాచ్యరూపం కథ. సూచనారూపం నాటకం. దృశ్యరూపం సినీమా. కథ చెప్పేది రచయిత. నాటకాన్ని విశ్లేషించేది ప్రయోక్త. దృశ్యాన్ని మనముందు నిలిపేది దర్శకుడు.

‘కళ్లకు కట్టినట్టుగా కథ రాశాడండి,’ అనడం మనం వింటూంటాం. పలుకుబడిలో ఆ మాట బాగానే వుందిగాని నిజానికి అది తప్పు. రచయిత ఊహించిన దృశ్యాన్ని మీరు కళ్లకి కట్టించుకున్నారు. కట్టేంత స్పష్టత emphasis రచయిత ఇచ్చాడు. ఆ ప్రయత్నం ఫలించడంలో మీ ప్రయత్నమూ ఉంది. ‘మీ’ అంటే పాఠకుడు. కళ్ల ముందు కట్టిన ఆ దృశ్యం` రచయిత కలం చెప్పిన కథకి మీ మనస్సు` అనగా మీ ఆలోచన, అనుభవం కట్టిన మూర్తి. The initiation belongs to the writer. The initiative belongs to the reader. The ‘initial’ is the story. కళ్లకి కట్టడం కథ యొక్క రెండో ప్లేన్‌. మొదటిదశ కేవలం చెప్పడం. ఎమ్మెస్‌ సుబ్బులక్ష్మి పాట పాడిరది. మీ చెవులకి వినిపించింది. అది జరిగిన సంఘటన. ఆ విన్నది బాగుంది. అది మీ మనస్సు ఏర్పరుచుకున్న అభిప్రాయం. మరొకసారి బూతుమాట వినిపిం చింది. మీకు అసహ్యం కలిగింది. రెండో ప్లేన్‌లో ఆ అనుభూతిని మీ మనస్సు తిరస్కరించిన సందర్భమది.

నాటకం మరొక అడుగు ముందుకు వేస్తుంది. ఎదురుగా పాత్ర ఆ పని చేస్తోంది. మీరు చూస్తున్నారు. ఇక్కడ మీ స్పందనకి ఆలంబన దృశ్యం. ఈ కోనేటిరావు మంచివాడని మీరు నిర్ణ యించుకున్నారు. నాటకంలో దృశ్యం మీ నిర్ణయానికి ఆలంబన. సినీమాకి యిదేం గొడవ లేదు. అదింకా బలమైన, నిర్దుష్టమైన, నిలదీసే దృశ్యం. ‘‘ఇప్పుడే తాలూకా ఆఫీసు నుంచి వస్తున్నాను. గుమాస్తా వెయ్యిరూపాయలు లంచం అడిగాడు,’’ అని నాటకం లో కోనేటిరావు చెప్తాడు. సినీమాలో తాలూకా ఆఫీసులో వంకర నవ్వుతో వెయ్యిరూపాయలు అడిగే గుమాస్తా మీ కళ్ల ముందు న్నాడు. Play is suggestion. Cinema is emphasis. The immediacy of a visual negates the need for audience to surmise.

కథ, నాటకం, సినీమా ఒక తల్లి పిల్లలు. ఒకే కడుపున పుట్టినవారు. అయితే నాటకం, సినీమా కవలలు. ఒకేసారి కలిసి పుట్టినవారు identical twins. అతి చిన్న తేడాలున్నాయి. ఒకటి కలంచెప్పే దృశ్యం. మరొకటి కళ్లకి చూపే దృశ్యం. మొదటి ప్రక్రియకి ఆలంబన సన్నివేశం. రెండో ప్రక్రియకి -షాట్‌. నాటకం -సూచన. సినీమా -నిర్దేశన.

దీనికి మళ్లీ సాంకేతికపరమైన పరిమితులున్నాయి. నాటకం – చీకటి హాలులో 20`40 అడుగుల వేదిక మీద జరిగే ప్రదర్శన అనుకుందాం. స్టేజి మీద ఆరుగురు నటులున్నారు. ఇద్దరు ఘర్షణ పడుతున్నారు. ఇద్దరు ఎగదోస్తున్నారు. ఇద్దరు సమాధానపరుస్తున్నారు. ప్రేక్షకులకు ఆరు విభిన్నమయిన choices ఉన్నాయి. ఘర్షణ పడే యిద్దరు నటులు, రెచ్చగొట్టే యిద్దరు, ఊరడిరచే మరో యిద్దరు. అతని దృష్టి ప్రయోక్త నిర్దేశం మేరకు, నటుల సామర్థ్యం మేరకి, ప్రేక్షకుడి సంస్కారం మేరకి, ఆ సమస్య పట్ల అతని ఆసక్తి మేరకి ఆ సన్నివేశం అతని దృష్టిలో నిలుస్తుంది. ప్రయోక్త ఆ దృష్టిని ఆశిస్తున్నాడు. ప్రేక్షకుడు ఇన్ని పరిమితులకు లోబడి – ఆ మేరకి ప్రయోక్తతో ఏకీభవించడమో, విభేదించడమో చేస్తున్నాడు. దేశంలో అవినీతిని ఇద్దరు దుయ్య బడుతున్నారు. సామాన్య ప్రేక్షకుడు వాళ్లతో తాదాత్మ్యం చెందుతూ ఆవేశపడతాడు. ముందు కూర్చున్న ముఖ్యఅతిథి అనే రాజకీయ నాయకుడు – తేలుకుట్టిన దొంగలాగ వంకర చూపులు చూస్తాడు. వాళ్లని విడదీసే యిద్దరూ యితనికి ఆపద్బాంధవులు. The appeal in a theater – in spite of the choices created by the director of the play – is essentially subjective.

ఇక్కడ ఆగి సినీమాకి వస్తే` సినీ దర్శకుడు కెమెరా వెనక నిలబడేటప్పటికే ఆsubjective choice చేసేసుకున్నాడు. ఆరుగురి తో ఉన్న దృశ్యాన్ని ఏ సందర్భంలో ఎలా చూపాలో అతని చేతిలో పని. ప్రేక్షకుడి ప్రమేయం లేదు. ఏ విషయం ఎంత కావాలో, ఎక్కడ కావాలో, ఏ మోతాదులో కావాలో` ఒక lose shot, midshot, zoom యిలా రకరకాల సాధనాలతో తన అదుపులో ఉంచుకోగలడు. ప్రముఖ ఫ్రెంచి దర్శకుడు గొదార్ద్‌ ఓ మాట అన్నాడు. A cinema narrates the truth 24 frames per second అని. సినీమాలో 24 ఫ్రేములు కదిలితే తెరమీద బొమ్మ కదులుతుంది. సినీమాలో ఒక క్లోజ్‌షాట్‌ – సమాచారం. రెండోసారి అదే క్లోజ్‌షాట్‌ – నొక్కి చెప్పడం. మూడోసారి – సమర్థన. నాలుగోసారి- ప్రచారం. అయిదోసారి – ఉద్యమం. ఆరో సారి – పునరుక్తి, విసుగుదల, మరిచిపోవద్దు. అది కూడా ఒక మూడ్‌! అదిన్నీ దర్శకుడు చెప్పాలనుకున్న విషయమే కావచ్చు.

కాగితం మీద కథ – రచయిత చెప్పే విషయం. స్టేజి మీద కథ` నాటక ప్రయోక్త చెప్పదలచిన కథ interpretation. సినీమాలో కథ దర్శకుడు నిర్దుష్టంగా చెప్పదలచిన కథ విశ్వ రూపం. తెరమీద కథ limitless. It is the last word. ఏ అకిరా కురోసోవా, ఏ సత్యజిత్‌ రే చేతుల్లోనో ఓ గొప్ప తైలవర్ణ చిత్రం అవుతుంది. ఏ మెహబూబ్‌ సే, ఆర్సన్‌ వెల్స్‌ చేతుల్లోనో గొప్ప కావ్యమవుతుంది. ఏ బాలచందర్‌, ఏ విశ్వనాథ్‌ చేతుల్లోనో అనుభూతి అవుతుంది. ఏ గోవింద నహలానీ, ఏ టి. కృష్ణ చేతు ల్లోనో గురి పెట్టిన తుపాకీ అవుతుంది. ఏ సంజయ్‌లీలా బన్సాలీ, ఏ రాఘవేంద్రరావు చేతుల్లోనో మత్తుమందు అవుతుంది. వెరసి` కథకు ఇవన్నీ రకరకాల interpretations. రకరకాల dimensions.