ఆధునిక తెలుగు సాహిత్య శతజయంతి

పదకొండో శతాబ్దంలో తెలుగులో ఆదికావ్యం వచ్చింది. ఇప్పుడు ఇరవై ఒకటో శతాబ్దం వచ్చింది. ఈ వెయ్యేళ్లలో తెలుగు సాహిత్యం ‘ఇంతింతై వటుడిరతై’ అన్నట్లు విస్మయోద్దీపకంగా విస్తరించింది. ‘ఆకాశపుదారులంట హడావుడిగ వెళిపోయే తెలుగు సరస్వతి రథాన్ని కాలం భూమార్గం పట్టించింది. వెయ్యేళ్ల కింద, ఆ తరువాత చాలాకాలం వరకు దేవతలు, రాక్షసులు తప్ప మన సాహిత్యంలో వేరే వాళ్లెవరూ కన్పించేవారు కాదు. ఇప్పుడు మానవాళి సమస్యలు, కష్టాలు, కన్నీళ్లు, ఆశలు, ఆశయాలు, అవరోధాలు, అన్యాయాలు సాహిత్యంలో ప్రధాన విషయాలైనాయి. వీటిని చిత్రించటమే సాహిత్యానికి ప్రధాన ప్రయోజనం, లక్ష్యం కావాలని సాహిత్యాభిమానులు భావిస్తు న్నారు, ఆశిస్తున్నారు.

విద్యుత్తును కనుక్కోక ముందు ప్రపంచంలో మానవ జీవితానికీ, ఆ తరువాత కాలంలో మానవ నాగరికత వికాసానికీ ఎంత అంతరం ఉందో, సాహిత్యంలోనూ పూర్వకాలానికీ ఆధునిక కాలానికీ ఆ విస్తృతి కనపడుతుంది. ఇరవయ్యో శతాబ్దం వచ్చేవరకూ ఉజ్జాయింపుగా తెలుగులో ఒక వెయ్యి పుస్తకాలు వచ్చాయనుకుంటే 20వ శతాబ్దంలో కనీసాతి కనీస పరిగణనం దృష్ట్యా పదివేలు అయినా వెలువడి వుంటాయి. పత్రికలలో రచనలు (కథలు, వ్యాసాలు, కవితలు మొ॥) కూడా లెక్కలోకి తీసుకుంటే ఈ సంఖ్య లక్షావధిని కూడా మించవచ్చు.

19వ శతాబ్దంలో తెలుగునాట ముగ్గురు మహనీయులు, ముందుగా చెప్పుకోవలసినవారు జన్మించారు. వీళ్లెవరంటే వీరేశలింగం, గురజాడ, గిడుగు అని ఎవరినడిగినా చెపుతారు. అడిగిన వాడూ, అడిగించుకున్నవాడూ తెలుగువాడు మాత్రం కావాలి. 20వ శతాబ్ది మొదటి దశకం గడచేనాటికే వీళ్లు తెలుగువారిని చైతన్యపరచారు. ఉత్తేజపరచారు. వీళ్లాశించిన సమాజ, సాహిత్య, భాషా విషయక నవీనాశయాలు ఇంచుమించు అప్పటికే ఫలోన్ముఖమైనాయి. వీళ్లు గడచిపోయిన కాలాన్ని సంస్కరించి ఉండకపోతే సమాజపరంగా అనుశాసించి ఉండక పోయినట్లైతే ఇప్పుడు తెలుగు వాళ్లు ఇట్లా ఉండేవాళ్లు కారు. ఇంకా వెనుకబడిపోయే ఉండేవాళ్లు.

సాహిత్య విషయకమైన తెలుగువారి సృజనశక్తి భావ భాషా అభివ్యక్తిపరంగా వీళ్లు తమ ప్రబోధంతో మూడు పూలు ఆరు కాయలుగా వికసింపజేశారు. ఫలింపజేశారు. ఇంగ్లీషు చదువులు, ఆ భాషా, సాహిత్య పరిచయం తెలుగులో సాహిత్య ప్రక్రియా వైవిధ్యానికి ఎంతో దోహదం చేశాయి. ఆధునిక కాలంలో బయలుదేరిన తెలుగు పత్రికలు తెలుగు ఆధునిక దృష్టి అలవరచుకోవడానికి చాలా సహాయం చేశాయి. పూర్వకావ్య ప్రచురణం, గ్రంథ పరిష్కరణం, నిఘంటు నిర్మాణం, సాహిత్య సంస్థలు స్థాపించటం, కవుల చరిత్రలపై దృష్టి, గ్రంథవిమర్శలు తెలుగుభాషా సాహిత్యాలను నవీకరిం చాయి.

ఇదంతా పందొమ్మిదో శతాబ్ది చివర దశకానికీ, ఇరవయ్యో శతాబ్ది ప్రథమ దశకానికీ అనుసంధానమవుతూ తెలుగు లో నవ్యసాహిత్యావిర్భావానికి బలమైన ప్రాతిపదిక చేకూర్చిన సాహిత్య, సమాజ చైతన్య నేపథ్యం. ఒక విషయం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. పందొమ్మిదో శతాబ్ది చివరి దశకంలో, అటు తర్వాత ఇంకో ఇరవై సంవత్సరాలకు తెలుగు సాహిత్యాన్ని అత్యంత ప్రభావితం చేసిన, భావ, వస్తు, ప్రక్రియా పరమైన ఉద్యమితను నిర్వహించిన కవి, పండిత, విమర్శక, సృజన ప్రతిభా శాలురైనవారు పుట్టటం. ఈ పది సంవత్సరాల వ్యవధిలో కనీసం ఒక ముప్ఫై, నలభైమంది గొప్ప రచయితలు పుట్టారు.

కాబట్టి ఈ దశాబ్దిని ఆధునిక తెలుగు సాహిత్యచరిత్రలో స్వర్ణ దశాబ్దిగా భావించాలి. ఈ దశాబ్దిలో వచ్చిన రచనల వల్ల కాదు, పుట్టిన రచయితల వల్ల ఇది స్వర్ణ దశాబ్ది. రాయప్రోలు, విశ్వనాథ, జాషువ, కృష్ణశాస్త్రి, నాయని, బాపిరాజు, శ్రీపాద, దీక్షితులు, చలం, వేటూరి, పింగళి, కాటూరిలాంటి వారు ఈ దశాబ్దంలో పుట్టారు. ఆధునిక తెలుగు సాహిత్యచరిత్రలో ఇంతమంది మహా ప్రతిభావంతులు ఒకే దశాబ్దంలో పుట్టటం గడచిన రెండు దశాబ్దులలో జరిగినట్లు కనపడదు. అంతకు ముందు కాలం విషయం మనకు తెలిసే అవకాశం లేదు. ఇక ముందు కాలం సంగతి ఎవరు చెప్పగలరు?

ఇప్పుడు ఆధునిక తెలుగు సాహిత్యానికి శతజయంతి సందర్భం అని అనుకోవటం ఎందు కంటే రాయప్రోలు సుబ్బారావు రచనలు తృణకంకణం, కష్టకమల, స్నేహలతా దేవి లేఖ వంటి ఖండకావ్యాలు ఇంచు మించు నూరేళ్ల కిందట ఈ సంవత్స రాలలోనే వచ్చాయి. తెలుగు కవిత్వానికి ఈ రచనలు నూతన మార్గాలలో ప్రవ ర్తింపచేశాయి. స్త్రీ పుంసంబంధమైన ఆకర్షణ, పరస్పరాభిలాష, స్వాత్మార్పణ భావన, మమత్వం, వాంఛలను తాత్త్వి కత వైపు మళ్లించాడు రాయప్రోలు. అంటే వలపు, మోహం కాయికం కాకుం డానే ఒకరిపట్ల ఒకరు నిలపవచ్చు, భావించ వచ్చు, మమత్వీకరించు కోవచ్చు అని ఆయన సాహిత్యతాత్త్విక దర్శనం. దీనినాయన ‘అమలిన శృంగార’ మన్నాడు. ఇందువల్ల శృంగారం మలినమని ఆయన భావిస్తున్నాడనుకోకూడదు.

ఫలించే అవకాశం లేనప్పుడు స్త్రీ పురుషుల మధ్య ప్రేమ, ప్రణయం, అనురాగం, వలపుకాయిక స్పర్శ లేకుండా ఉదాత్తీక రించుకొంటే అది అమలిన శృంగారని ఆయన భావం. ఇది నూతనమైన కవితా తాత్త్వికత. బహుశా తెలుగు ప్రబంధాలలో అప్పటివరకూ శృంగారం కాయిక శృంగారంగానే ఉంటూ వచ్చింది. అదిన్నీ అతివేలంగా. ఇందుకు ప్రతిస్పర్థిగా మహిళకు ఒక గౌరవనీయమైన, పూజనీయమైన, ఆరాధనీయమైన సామా జిక స్థాయిని చిత్రించడం రాయప్రోలువారి అభిలాష అను కోవాలి. నాజూకు, మృదువు, ఆత్మీయమూ, ఉదాత్తమూ అయిన తాత్త్వికతను అమలిన శృంగారంగా రాయప్రోలువారు ఉద్దేశించి ఉండవచ్చు. ఆ తరువాత రెండు దశాబ్దాలు బాగా ప్రాచుర్యం పొందిన భావకవిత్వం పై రాయప్రోలు ప్రభావం కనబడుతుంది.

ప్రేమ, ప్రణయం, విరహం, కరుణ, విప్రలంభం, అను రాగం, మనోజ్ఞం మొదలైన భావకవిత్వ పరిభాష అంతా రాయ ప్రోలు వారి నుంచే భావకవులు స్ఫూర్తి పొంది భావకవిత్వంలోకి వచ్చిందనుకోవాలి. అందుకే శ్రీశ్రీ కూడా ‘రాయప్రోలు మైలు రాయి, అబ్బూరి చలివేందర’ అన్నాడు. రాయప్రోలువారు ఆధునిక కవిత్వానికి ‘రమ్యాలోకము, రూపనవనీతమూ’ అనే లక్ష్యలక్షణ అలంకారశాస్త్ర రచనలూ చేశారు. ఆధునిక కవిత్వం ఉద్దేశించే నవ్యత ఇది అన్నాడాయన ఈ రెండు గ్రంథాల ద్వారా. వస్తువునే కాకుండా ఛందస్సు కూడా సంప్రదాయం త్యజించ కుండా నవీకరించాడు. ఆటవెలదులు, తేటగీతులు, వంటి చిన్న ఛందాలనే తన కవితారచనకు ప్రధానం చేసుకున్నాడు. గేయాలు రచించాడు. ముక్తచ్ఛందం కూడా స్వీకరించాడు. అందువల్ల భావకతలో, పద ప్రయోగంలో చిక్కణత సాధిం చాడు. అందువల్ల రాయప్రోలుది సంప్రదాయ నవ్యత అని చెప్పాలి. ఇదంతా 1912, 13 నాటికి భావకవిత్వం నేపథ్యం అయింది.

ఇక గురజాడ అప్పారావు సరిగా అదే కాలానికి తెలుగు సాహిత్యంలో నవ్య సంప్రదాయానికి ఆద్యుడైనాడు. అందుకే గురజాడ వాల్మీకి అన్నాడు ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి ఆయనను స్మరిస్తూ. ఇంతేకాక ఆధునికత ఎలుగు సాహిత్య ఉషోరేఖలు విరియింపజేసిన వాడు అప్పారావే. ఆధునిక తెలుగుకథ, నాటకం, వ్యాసం, విమర్శ, సంవాద రచన, గేయం, సాహిత్యంలో సామాజిక ప్రతిఫలనం, వ్యవహారిక భాషా ప్రయో జనం, చరిత్ర రచనా ప్రమాణాలూ ఆధునిక తెలుగు సాహిత్యరచనలో గురజాడ అప్పారావుతోనే ప్రారంభమై నాయి. కన్యాశుల్కం సృజనాత్మక ప్రతిభాపూర్ణమైన గొప్పరచన. దాని గొప్పతనం ఏమంటే అంతకుపూర్వం నూరేళ్లలోగాని, ఆ తరువాత నూరేళ్లలో గాని ఇటువంటి ఇంకో నాటకం తెలుగు లో రాలేదు.

అందువల్లనే తెలుగు సాహిత్యా నికి ఆయన నవ్య సంప్రదాయ ప్రవర్త కుడునటం. తెలుగులో ఆధునిక వస్తు రూప శిల్ప సంవిధాన ఆవిర్భావ కథ ఆయనతోనే పుట్టింది. ఆ కథ పేరు దిద్దుబాటు. అంటే ఆయన ఆధునిక తెలుగుకథకు వరవడి దిద్దాడన్నమాట. ఈ కథ 1910 ప్రాంతాల లోనే గురజాడ అప్పారావు ఆంధ్రభారతిలో వెలువరించినా కన్యక, లవణరాజు కల, దేశభక్తి వంటి గేయరచనలు గురజాడ ఆ తరువాత రెండుమూడేళ్లలో వరుసగా ఆ పత్రికలో ప్రచురిం చారు. ఈ పత్రిక అప్పట్లో బందరు (మచిలీపట్నం) నుంచి వచ్చేది. చాలా ముందుచూపు గల పత్రిక ఇది. మొట్టమొదటి దళితగీతం ఈ పత్రికలోనే వెలువడిరది. (మాలవాళ్ల పాట.) గాంధీజీని గూర్చిన మొట్టమొదట వచ్చిన గీతం ఈ పత్రికలోనే వచ్చింది. ‘కరుణాసాంద్ర మోహనచంద్ర గంధి’ అని ఈ గీతం పేరు. దీనిని రాయప్రోలు సుబ్బారావు రచించారు.

1913లో రవీంద్రనాథ టాగూర్‌కు నోబెల్‌ ప్రైజు వచ్చింది. ఆయనకు విశ్వసాహిత్యంలో స్థానం లభించింది. తెలుగువారు ఆయన వల్ల ప్రభావితులైనారు. ఆయన ‘కాబూలీవాలా’ కథ వెంటనే త్రిలింగ పత్రికలో అనువాదం పొందింది. తెలుగులో అదే రవీంద్రుడి మొదటి అనువాదం పొందిన రచన కావచ్చు. ఇది అనుసరించినవారు అక్కిరాజు ఉమాకాంత విద్యాశేఖరులు. ఆ తరువాత ఎందరో తెలుగువారు శాంతినికేతనం పట్ల ఆకర్షితు లైనారు. రాయప్రోలుతోనే ఈ ఆకర్షణ ప్రారంభమైందనాలి.

గురజాడ అప్పారావు ఇంకో సంవత్సరానికి చనిపోతాడనగా ఆంధ్ర సాహిత్యపరిషత్తు వారి వార్షిక సభలో ఆయన, గిడుగు రామమూర్తితో పాల్గొన్నాడు. ఆ సభ కాకినాడలో 1914లో జరిగింది. ఆయన చివరిసారి సాహిత్య సమావేశంలో పాల్గొనటం బహుశా అదే అయి ఉంటుంది. ఈ సాహిత్య సమావేశంలో గిడుగు రామమూర్తి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపరుస్తూ తెలుగుభాష, సాహిత్య భవిష్యద్దర్శనాన్ని ఆ మహానుభావుడు ఎంత బలంగా, ఆత్మవిశ్వాసంతో, అప్పటికే ఆరోగ్యం సరిగా లేక పోయినా, పూడుకపోయిన గొంతుకతో ఎంత తార్కికంగా, ఎంత ప్రబోధాత్మకంగా గురజాడ ప్రతిపాదించాడో తల్లావఝల వారు గురజాడ అప్పారావు అనే వ్యాసంలో చెప్పారు. తల్లావఝలవారు బహుశా యువకుడిగా ఈ సమావేశంలో పాల్గొ న్నట్లు చెప్పారు. (జ్వాల -నవ్యసాహిత్య పత్రిక. సం॥ ముద్దుకృష్ణ, 1927.)

1912లో ఆంధ్రసాహిత్య పరిషత్తు ఆవిర్భవించింది. వ్యవహారిక భాషను, సాహిత్యంతో ప్రజాస్వామికమైన విలువలను సాహిత్య పరిషత్తు అంగీకరించకపోయినా, ఆమోదించకపోయినా ఈ సంస్థ తెలుగు సాహిత్యానికి ఆధునిక కాలాన చేసిన సేవ మరువరానిది. అర్ధశతాబ్దం పాటు సాహిత్య పరిషత్తు పత్రికను ప్రచురించింది ఈ సంస్థ. ‘ప్రాదెనుగు కమ్మ’ అని వెయ్యేళ్ల కిందటి తెలుగు ఎలా ఉంటుందో గిడుగు చూపిన రచన సాహిత్య పరిషత్తు సేకరించింది. కాబట్టి ఈ గొప్ప సంస్థ శత జయంతి స్మరణం కూడా ఇప్పుడు జరగాలి. తెలుగు నిఘంటువును మాత్రం ప్రారంభించింది. ఈ నిఘంటువు పూర్తి కావటానికి అర్ధశతాబ్దం పట్టింది. ఈ నిఘంటువు పై ప్రచండమైన విమర్శ ప్రకటించారు గిడుగువారు. ఆంధ్ర సాహిత్య పరిషత్తు తెలుగు భాషా సాహిత్యాల ఆధునిక ఆవశ్యకతలను గుర్తించింది. అందుకైనా ఈ సంస్థను స్మరించుకోవాలి.

1914లో వావిళ్ల సంస్థ ‘త్రిలింగ’ పత్రిక ప్రారంభించింది. ఈ పత్రిక కూడా ఇంచుమించు అర్ధశతాబ్దం వెలువడిరది. ఈ పత్రిక విశేషం ఏమంటే ఆధునిక ప్రక్రియ అయిన కథను ప్రోత్సహించడం, ఆదరించటం. అనువాద కథలను కూడా ఈ పత్రిక ప్రచురించేది. ప్రారంభ సంపాదకులు ఉమాకాంత విద్యాశేఖరులు ఈ పత్రికకు. ఉమాకాంతంగారు కలకత్తాలో కొన్నాళ్లు చదువుకున్నారు కాబట్టి సాహిత్యంలో, సమాజంలో సంస్కరణ భావాలు అభిషించారు. గురజాడ అప్పారావుగారి కన్నా ఉమాకాంతం ఇరవై ఏళ్లు చిన్నవారు. గురజాడతో సాహిత్య చర్చలు చేశాడాయన. వావిళ్లవారి ద్వారా ఉమాకాంతం పత్రిక ప్రారంభింపజేసే నాటికి గురజాడ ఆరోగ్యం బాగా చెడిపోవటంతో, ఆ తరువాత ఏడాదికే గురజాడ కాలధర్మం చెందటంతో గురజాడ రచనలు త్రిలింగలో చోటు చేసుకోలేదు. ఉమాకాంతం డైరీలు రాసినట్లు తెలుస్తున్నది కాని అవి కాలగర్భంలో కలిసి పోయినాయి.

1911లో ఉమాకాంత పండితులు పలనాటి వీరచరిత్రను సంచార గాయకుల నుంచి సేకరించి పరిష్కృత ముద్రణ తెచ్చారు. ఇది శ్రీనాథుడి రచనే అని ఆయన తేల్చి చెప్పారు. కట్టమంచి రామలింగారెడ్డిగారికి ఉమాకాంతం గారంటే చాలా గౌరవం. ఉమాకాంతం ఆ తరువాత స్వంతంగా ప్రకటించిన తెలుగు దేశపు వాఙ్మయపత్రికలో కట్టమంచి వారిని విమర్శించినా కట్టమంచి వారికి వీరిపట్ల ప్రామాణిక భావం సడలలేదు. ఉమాకాంతంగారు పలనాటి వీరచరిత్రను ఎంతో ప్రయాసపడి ఊరూరు తిరిగి పుస్తక రూపంలో తెచ్చారంటే ప్రజాసాహిత్యం పట్ల పండితులకు కూడా శ్రద్ధాసక్తులు మొదలయినాయి. ఇది ఆధునిక దృక్పథం.

1913లోనే కట్టమంచివారి కవిత్వతత్త్వ విచారం వచ్చింది. ఆధునిక తెలుగువిమర్శకు మార్గదర్శనం ఈ విమర్శతోనే ఆరంభమైంది. సంప్రదాయ విమర్శ అంటే అలంకారశాస్త్రానికి ఆదరణ తగ్గింది.

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి తన తొలినాళ్ల కథలు ప్రచురించింది ఈ కాలంలోనే. అప్పటికి ఆంధ్రపత్రిక ఉగాది సంచికలు వస్తున్నాయి. ప్రపంచ సాహిత్యచరిత్ర స్థాయిలో చూసినా శ్రీపాద వారు అగ్రశ్రేణి కథారచయిత. ఆయన వ్యవహారిక భాషకు ప్రామాణికతను, తుష్టినీ, పుష్టినీ చేకూర్చాడు.

సమకాలీన తెలుగు సాహిత్యానికి సూర్యచంద్రుల వంటి వారు పుట్టపర్తి నారాయణాచార్యులు, తిరుమల రామ చంద్రానూ. రామచంద్ర 1913లో జన్మించగా, నారాయణా చార్యుల వారు 1914లో జన్మించారు. పుట్టపర్తివారి వంటి బహు భాషా ప్రజ్ఞాశాలి, భావుకుడు, పండితుడు, కవి, విమర్శకుడు, పరిశోధకుడు సమకాలీన భారతీయ సాహిత్యచరిత్రలోనే కనపడడు.

సంగీతం, సాహిత్యం సరితూచిన త్రాసు అని అజ్జాడ వారిని శ్రీశ్రీ అభివర్ణించాడు. నారాయణదాసు పుట్టిన 50 సంవత్సరాలకు నారాయణాచార్యులు జన్మించారు. శ్రీశ్రీ ప్రశంస పుట్టపర్తికీ అనువర్తిస్తుంది. తిరుమల రామచంద్ర స్వీయ చరిత్ర ‘హంపీ నుంచి హరప్పాదాక’ చదివితే రామచంద్ర సాహితీమూర్తిమత్వం ఎటువంటిదో తెలుస్తుంది.

వీళ్లిద్దరి శతజయంతులిప్పుడు తెలుగు సాహిత్యాభిమానులు జరుపుకోవాలి. 1913, 14ల నుంచి 2013, 2014 ల దాకా ఈ నూరేళ్ల తెలుగు సాహిత్య చరిత్రను సమ్యగవగాహకం చేసికొన్నప్పుడు, సమ్యగవలోకనం చేసినప్పుడు కనీసం నూరు గురైనా ఆధునిక తెలుగు సాహిత్యప్రక్రియలలో అత్యంత ప్రతిభావంతులైన సృజనశీలురు కనపడతారు.

గడచిన నూరేండ్లలో రెండు ప్రపంచయుద్ధాలు సంభవించాయి. సాంఘికార్థికరాజకీయ మతనైతిక భావ విప్లవాలు ప్రపంచ సాహిత్యాన్నే కాక భారతీయ సామాజిక, సాహిత్యక వ్యవస్థలను ప్రభావితం చేశాయి. వెనక్కు తిరిగి చూసినప్పుడు తరతరాలు శతాబ్దులు గుర్తు పెట్టుకోవలసిన మహత్తర చారిత్రక సంఘటన భారతదేశ స్వాతంత్య్రసంగ్రామ విజయం.

విషాదస్మృతి భారతదేశ విభజనం.

ఇది విజయనామ సంవత్సర శుభాగమనం.

గత వంద ఏళ్ల తెలుగు సాహిత్యచరిత్రకు ఈ రచన ఒక రేఖాకృతి.

ఆధునిక తెలుగు భాషాసాహిత్యాలకు ఇప్పుడు శత జయంతి అక్షరాకృతి.