Expand to right
Expand to left

బాల్కనీలో బచ్చలిమొక్క

బాల్కనీలోబచ్చలిమొక్కభలేబాగాపెరుగుతోంది.
మేమెవరమూ నాటకుండానే తనకై తానే పుట్టుకొచ్చిందీ బచ్చలి-
ఈ బచ్చలికీ మాకూఏదో ఋణానుబంధం వున్నట్లే వుంది!
చిన్నప్పుడు మా వాకిట్లో నేనొక బచ్చలిమొక్కను నాటినందుకు కాబోలు…
అంతరిక్షంలోకి తొంగి చూస్తున్నైరవై అయిదో అంతస్తులోని
బాల్కనీలోకి వచ్చిపడింది బచ్చలి విత్తనం-ఎంతచిత్రం-
ఈ బచ్చలికి నా మీదెంత ప్రేమో!
బాల్కనీలో నిల్చున్నపుడల్లా పచ్చని నగవులు చిందిస్తుంది.
చెంబెడు నీళ్ళైనా పోయందే తాను మాత్రం
గంపెడాకుల తీగలతో గగనానికి ఎగబ్రాకుతోంది.
బాల్కనీలో బట్టలారవేసే తీగలపై కెగబాకి
బరువుగా ఆలపించిన దరువులా సాగుతుంది.
ముత్యాల్లాంటి పూలు పూసి పగడాల్లాంటి పళ్ళు కాసి
పండగనాటి తోరణమై బాల్కనీ నిండుగా పందిరి వేసింది.
తానుగా ఒక్కగానొక్క మొక్కగా మొలిచి తీగలై పెరిగి
తన నిస్వార్థమైన అలౌకికానుబంధంతో ఆనందింపజేస్తోంది.
నా మానవజాతి ఈ హరితారణ్య శోభిత ధరణికి చేసిన
ద్రోహాన్ని తలుచుకొని సిగ్గుపడేలా చేస్తోంది.
మహావృక్షాల్ని పెంచకపోయినా మొక్కలోనె తుంచకూడదనీ
పెద్దచెట్టైనా చిన్నమొక్కైనా అది సకలజీవులకు ఆధారమేనని
జ్ఞానోదయమైంది నాకీ బచ్చలిపందిరి కింద.
తరతరాలుగా తన పచ్చదనాన్ని ఆహారంగా ధారబోసిన
ఈ బచ్చలి సంతతి చల్లగా వర్ధిల్లుగాక!

    
   

(3 అభిప్రాయాలు) మీ అభిప్రాయం తెలియచేయండి »

 1. ఆర్.దమయంతి. అభిప్రాయం:

  July 11, 2013 10:36 am

  ‘చెంబెడు నీళ్ళైనా పోయందే.. తాను మాత్రం
  గంపెడాకుల తీగలతో గగనానికి ఎగబ్రాకుతోంది.
  బాల్కనీలో బట్టలారవేసే తీగలపై కెగబాకి
  బరువుగా ఆలపించిన దరువులా సాగుతుంది.
  ముత్యాల్లాంటి పూలు పూసి పగడాల్లాంటి పళ్ళు కాసి
  పండగనాటి తోరణమై బాల్కనీ నిండుగా పందిరి వేసింది.’ –

  నా చిన్నప్పటి మాట. గోడ పగుళ్ల లోంచి మొలుచుకొచ్చి, ఇంతై, అంతై, విస్తరాకులంత ఆకుపచ్చని పత్రాలతో కొండంత పందిరై దాని నీడన కూర్చుని చదువుకునే నాకు శాంతి నికేతనమైంది ఈ బచ్చలి తీవే! ఇంత గొప్ప జ్ఞాపకాన్ని గుర్తు చేసినందుకు మీకు నా హార్దికాభివందనాలు.
  -ఆర్.దమయంతి.

 2. రత్నశిఖామణి అభిప్రాయం:

  July 14, 2013 5:08 am

  అనురాగ మనస్కులయిన అందరిలోనూ మొక్కలపట్ల ఆప్యాయత ఉంటుందనే నిజం మీ స్పందన వలన అవగతమవుతున్నది.
  “విస్తరాకులంత ఆకుపచ్చని పత్రాలతో కొండంత పందిరై దాని నీడన కూర్చుని చదువుకునే నాకు శాంతి నికేతనమైంది ఈ బచ్చలి తీవే!” అని మీరు చెప్పిన తీరు నా ఈ కవితకు మకుటమయింది.
  దమయంతిగారూ, మీకు ధన్యవాదములు.
  స్థలాభావంవల్ల తానా 2013 సంపాదకులు ఈ కవితని కుదించారు.

  రత్నశిఖామణి

  దీని పూర్తి పాఠం ఈ క్రిందివిధంగా వుంది:
  బాల్కనీలో బచ్చలిమొక్క

  బాల్కనీలో బచ్చలిమొక్క భలే బాగా పెరుగుతోంది.
  మేమెవరమూ నాటకుండానే తనకై తానే పుట్టుకొచ్చిందీ బచ్చలి —
  ఈ బచ్చలికీ మాకూ ఏదో ఋణానుబంధం వున్నట్లే వుంది!
  నా చిన్నప్పుడు మా వాకిట్లో నేనొక బచ్చలి మొక్కను నాటినందుకు కాబోలు—
  అంతరిక్షంలోకి తొంగిచూస్తున్న ఇరవైఅయిదో అంతస్తులోని
  బాల్కనీలోకి వచ్చి పడింది బచ్చలి విత్తనం– ఎంత చిత్రం–
  ఎంతో పత్రహరితంగా ఎదుగుతూన్న ఈ బచ్చలికి నామీదెంత ప్రేమో!
  బాల్కనీలో నిల్చున్నపుడల్లా పచ్చని నిగనిగల నగవులు చిందిస్తుంది.
  చెంబెడు నీళ్ళైనా పోయందే తానుమాత్రం
  గంపెడాకుల తీగలతో గగనానికి ఎగబ్రాకుతోంది.
  బాల్కనీలో బట్టలారవేసే తీగలపైకెగబాకి
  బరువుగా ఆలపించిన దరువులా సాగుతుంది.
  ముత్యాల్లాంటి పూలు పూసి మరెంతో మురిపించి పగడాల్లాంటి పళ్ళు కాసి
  పండగనాటి తోరణమై పచ్చటి తీగలతో బాల్కనీ నిండుగా పందిరి వేసింది.
  ఆకాశపుటంతస్తులలో అందంగా పెరిగి మా కింతటి పచ్చదనాన్నిచ్చిన
  ఈ ముత్యాల పగడాల తోరణాల ఒంటరి పందిరి బచ్చలికి
  ఎందుకింత అనురాగం! ఇంతటి కృతజ్ఞత?
  అనంతమనిపించే సతతహరితారణ్యలనే హరించేసిన
  ఈ స్వార్థపూరిత మానవుడు సంకల్పించనిదే, ప్రయత్నించనిదే
  తానుగా ఒక్కగానొక్క మొక్కగా మొలిచి తీగలై పెరిగి
  తన నిస్వార్థమైన అలౌకికానుబంధంతో నన్ను ఆనందింపజేస్తోంది.
  నా మానవజాతి ఈ హరితారణ్యశోభిత ధరణికి చేసిన
  ద్రోహాన్ని తలుచుకొని సిగ్గుపడేలా చేస్తోంది.
  హరితవిప్లవానికి ప్రతీకగా ఉద్భవించింది ఇంతటి ఎత్తైన భవనంలో–
  తరతరాలుగా తన పచ్చదనాన్ని ఆహారంగా ధారబోసి మన రక్తకణాలైన
  ఈ బచ్చలి సంతతి చల్లగా వర్ధిల్లు గాక!
  ఒంటినిండా మెరిసే ఆభరణాలైన ఆ పగడాల విత్తనాలలో
  దాగున్నాయి మరెన్నో పచ్చని “బచ్చలి బయళ్ళు”
  మహావృక్షాల్ని పెంచకపోయినా మొక్కలోనె తుంచకూడదనీ
  పెద్దచెట్టైనా చిన్నమొక్కైనా అది సకలజీవులకు ఆధారమేనని
  జ్ఞానోదయమైంది నాకీ బచ్చలి పందిరికింద.
  దాన్నివండుకోడానికి మాకు మనసొప్పట్లేదు—
  ఈ బచ్చలి తీగెలపై పండిన గింజల్ని ఈ ఆకాశపు బాల్కనీలలో
  విస్తరింపజేస్తే ఎంత బాగుంటుందో కదా!
  ప్రతి ఇంటా ఇంతటి పచ్చదనం వెల్లివిరిస్తే,
  ఒక్కొక్కరూ కనీసం ఒక్క మొక్కైనా తుంచక కాపాడి పెంచితే
  ఈ భూమాత ఎంత సంతసిస్తుందో కదా!
  * * *

 3. Raghunath అభిప్రాయం:

  August 15, 2013 5:53 am

  బచ్చలి తీగ మన అందరి జీవితాలలొ మమేకమైన కల్పవృక్షం. బచ్చలి పళ్ళతొ చేసిన సిరా, పక్క పిల్ల వాడికి పూసిన రంగు ఒక్కసారి గుర్తుకు వచ్చాయి.

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.