నటించగల ప్రాణి

ఒక్క నిమిషం ఒకే ఒక్క నిమిషం
మనుషులంతా నిజాయితీగా ఉండిపోతే
ఉండిపోతే కాలచక్రం నిలిచిపోదూ

నిజాయితీగా ఉండిపోతే
భూగోళం బురదలో పడ్డ గోళీలా చతికిలబడుతుంది

నిజాయితీగా ఉండిపోతే
ఈ వ్యాపారాలాగిపోతాయి ఈ లావాదేవీలాగిపోతాయి
ఈ వ్యూహాలాగిపోతాయి ఈ యుద్ధాలాగిపోతాయి
ఈ చదువులాగిపోతాయి ఈ ఉద్యోగాలాగిపోతాయి
ఈ మమతలాగిపోతాయి ఈ అనుబంధాలాగిపోతాయి
ఈ సంసారాలాగిపోతాయి ఈ కాపరాలాగిపోతాయి

కానీ మానవజన్మ మహోత్తమ జన్మట
ఎందుకంటే
మనిషికి తప్ప మరే ప్రాణికీ నటించటం రాదు

అంచేత మరుక్షణంలో గుక్కతిప్పుకుని
నిజాయితీని నటించుతూ
అందుకేగా ఎన్నడూ కాలచక్రం నిలిచిపోనిది