దారి

మనసు
ఇన్నాళ్ళూ
నాకో మనసుందనే సంగతే తెలీని మనసుమనసివ్వని మనసు
నిష్పేచీగా నిష్పూచీగా
నిశ్చింత మనసు

మనసుచ్చుకోని మనసు
నిష్పందనగా నిశ్చలనంగా
నిస్త్రంత్రి మనసు

వజ్రపుముక్కలా గాజుపెంకులా
పాలరాతిబొమ్మలా
నిరీంద్రియ మనసు

మనసు
గింజ లోంచి పసిమొలక తొంగిచూసినట్లు
మనసలికిడి

ఈ వెలుతురు నిన్నటి వెలుతురు కాదు
ఇంతకు ముందెన్నడూ చూడని ఏదో వింత కాంతి
ఈ గాలి నిన్నటి గాలి కాదు
ఇంతకు ముందెన్నడూ తాకని ఏదో వింత స్పర్శ

అందుకే
మనసులో తపన తనువులో తపన నాలోనూ తపన
మనసులో సెగ తనువులో సెగ నాలోనూ సెగ
మనసులో వేదన తనువులో వేదన నాలోనూ వేదన
మనసులో అశాంతి తనువులో అశాంతి నాలోను అశాంతి

ఈ బాధ తియ్యగా ఈ తీపి బాధగా
ఈ తీపి చేదుగా ఈ చేదు తీపిగా
ఈ బాధ హాయిగా ఈ హాయి బాధగా

మనసైన మనసులో మనిషినై
మనసులో మనసైన మనిషినై
మనసుదారి మనిషిదారి కాదంటే
మరి నాదారి గోదారేనేమో