గాడిద అంతరాత్మ

అదేపనిగా

తదేక ధ్యానంలో

బూడిదరంగు

గాడిద పిల్ల!

చిందులు వేసే దీనికి

ఎందుకు ఇన్ని ఆలోచనలు?

ఏ భారమూ లేని ఈ వయసులో

గాభరా పడిపోయింది తల్లి.

పాలుతాగవచ్చిన పసిదాన్ని

నిలిపి నీతులు చెప్పింది

“అలోచన పనికి రాదు మన జాతికి

కాలో చేయో విరిగే వరకు చేయాలి చాకిరీ

చేలోపడి మేస్తున్నది చెడిపోయింది

నీలాగే అది నిత్యమూ ధ్యానించేది

జ్ఞానోదయమైనది

ఓనామాలు తెలియకున్నా ఓండ్ర పెడుతుంది”

కడుపు నింపుకొని

“కడు విచిత్రం బ్రతుకు”

పొడవుగా నిట్టూర్చింది!

పడమట పొద్దువాలింది.

రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్‌ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్‌, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.  ...