దీపాన్ని చూస్తున్నా

నీలంగా బయలుదేరి..పసుపుగా ఉబ్బి..నల్లగా కొనదేలి

కదులుతున్న దీపాన్నిచూస్తున్నా

ఏదో గొణగి సణగి బరబరా టప్‌ మని ఆరిపోయిన దీపాన్ని చూస్తున్నా

ఉఫ్‌ మని ఊదినా ఆరిపోక పెద్దపులి పసుపుతో మొహంమీదికొచ్చే

దీపాన్ని చూస్తున్నా..

సన్నటి దీపాన్ని

వత్తిలో ఇరుక్కున్న..ఎర్రటిరవ్వల్లో..దూరిపోతున్న..దీపాన్నిచూస్తున్నా..

గాలికి ఊగిపోతూ..నీడల్ని వెదుక్కుంటున్న దీపాన్ని చూస్తున్నా..

భయాన్ని దాచుకొంటూ..ఆందోళనగా..తలతిప్పుతూ వెలుగుతున్న

దీపాన్ని చూస్తున్నా..

ఒకే దీపాన్ని

ఆశలా మిణుకుమిణుకుమంటూ..ఆరిపోతున్న రాత్రిని

వెలిగించచూస్తున్న దీపాన్ని

నిలకడగా..నిశ్చలంగా..నూనెతాగేస్తూ బ్రేవుమని తేన్చుతున్న దీపాన్ని

చేతులులేని దీపాన్ని..సైగలుచేస్తున్న దీపాన్ని..

సముద్రాన్ని ఈదాలని సమాయత్తమవుతున్న దీపాన్ని..

దీపాన్ని

నేను దీపాన్ని చూస్తున్నా.

రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్‌ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్‌, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.  ...