నిదురపో చిన్నీ…

పనికిరాని మాటలతో ప్రపంచం మూగదైపోయింది

భరించలేని వెలుగులతో ప్రపంచం చీకటైపోయింది

ఊహించలేని వేగాలతో ప్రపంచం చిన్నదైపోయింది .

నిదురపో చిన్నీ..నిదురపో

వలసకొంగల్లా చుట్టూవాలిన

మనుషులను చూసి మనసు కష్టపెట్టుకోక

నిదురపో చిన్నీ..నిదురపో

సగం కాలి ఎండిపోయిన చెట్లు

కలలో కనిపిస్తే చిగురించమని చెప్పు చిన్నీ

గొంతు సవరించుకొంటోన్న కోయిల

కలలోకొస్తే గుర్తు పట్టానని చెప్పు చిన్నీ

శిశిరం శిశువై శిరసెత్తి బేలగా చూస్తే

రసవసంత వాహినై ప్రవహించమని చెప్పు చిన్నీ

వింతవింత మేళాల సంతాపం ఎదురైతే

వేడుక వెలుగుల సంతోషంగా మారిపొమ్మని చెప్పు చిన్నీ..

నిదురపో చిన్నీ..నిదురపో..

రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్‌ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్‌, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.  ...