కాలశిల్పం

ప్రతిబింబం కదలదు

నీ వంకే చూస్తుంటుంది

అద్దాన్ని బద్దలు కొట్టినా..

అతుక్కున్న ఏదో ముక్కలో

తొంగి చూస్తూనే ఉంటుంది.

శిల్పంగా మారిన ప్రతిబింబం

కదలక పడి ఉంటుంది.

చూడకు సూటిగా కళ్ళల్లోకి

ప్రాణం పోసుకు..నడిచివస్తుంది.

నడుస్తూనో..తడుస్తూనో

ఊపిరి విడుస్తూనో

నవ్వుతూనో..ఏడుస్తూనో

పలుకరిస్తూనో..

శిల్పాలుగా మారిన

ప్రతిబింబాలు

చిత్రంగా పేరుకుపోతుంటాయి.

పెకలించకు ఆసక్తిగా..

చర్మాన్ని తొడుక్కుని

కంఠం తగిలించుకొని..

నర్తించడం మొదలెడతాయి.

శిల్పాల నీడలో శయనించకు

శిల్పాలుగా మారని ప్రతిబింబాలు

నీ చుట్టూచేరి చూస్తుంటే

ఆ చూపుల వేడిలో..చల్లదనంలో

పడి..

కళ్ళూ..చూపూ

పోగొట్టుకొని..

నీవే ఒక శిథిలశిల్పమై..

నిశ్చలంగా

మౌనసమాధిలో

ఒరిగిపోతావు.

రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్‌ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్‌, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.  ...