పదార్థం

పదాన్ని పట్టితెచ్చి..

పెడరెక్కలు విరిచికట్టి

నల్లటి ముసుగు తొడిగి

ఉరి తీసెయ్‌.

మరణిస్తూ మరణిస్తూ

గొంతు పెగల్చుకొని..

తన అర్థం చెప్పి

జారుకొంటుంది.

శవపేటిక

అవసరం లేదు!

చచ్చిన పదాన్ని

పదిమందీ తిరగని చోట

పదిలంగా పాతిపెట్టు..

పచ్చగడ్డి మొలుచుకు వచ్చి

మరో కొత్త అర్థం చెప్పి

ఊగిపోతుంది.

రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్‌ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్‌, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.  ...