పాప మనసు

ఈ పాపకి మన ప్రపంచం

అంతగా నచ్చదు.

ఉదయం లేచిన దగ్గర్నించి దాని మరమ్మత్తుకోసం

ఉబలాట పడుతూ ఉంటుంది.

ఇదే అందం అనుకొని, మనం

శ్రమపడి అమర్చిన గదిని

తన కల్పనా శక్తితో

తేలిగ్గా పునర్నిర్మిస్తుంది.

ప్రతి వస్తువుకి స్థలనిర్దేశం చేస్తూ

మనం మూసివేసిన వాటి స్వేచ్ఛని,

తన చిన్నారి చేతులతో

తెరిచి పరుస్తుంది.

అమ్మ తననొక

బొమ్మలా ముస్తాబు చేస్తే,

తనుమాత్రం తన బొమ్మని

తనకు నచ్చినట్టు రూపాంతరం చెందిస్తుంది.

కనిపించిన ప్రతి కాగితాన్ని

చకచక వేళ్ళతోనే చదివేస్తుంది.

తనంతటి వార్త ఉండగా ఇదెందుకన్నట్టు

ఇవాళ్టి పేపర్ని క్షణాల్లో పాతబరుస్తుంది.

రోజంతా తుళ్ళుతూ, గెంతుతూ,

ఎగిరెగిరిపడే ఈ పాపని

నిదర బరువుతో అదుపుచేసినప్పుడు,

కట్టుబడని కాగితపుటంచుల్లాంటి

దాని మనసుచేసే రెపరెపల్ని

నేను తప్పక వింటాను.