దూరాలు

ఊరికి నువ్వొక చివర

నేనొక చివర ఉంటున్నా

అది మన మధ్య దూరమేమీ కాదు.

చేతుల్లో చేతులు వేసుకొని

చిరునవ్వులతో షికార్లు చేసినప్పుడు,

గంటల తరబడి కబుర్లతో

కాలాన్ని అవలీలగా జయించినప్పుడు,

కొరుకుడుపడని టెక్స్‌టుబుక్కుల

పార్ములాల రైలు పట్టాల మీద

చెట్టాపట్టాలు వేసుకొని

బ్యాలన్సింగు ప్రాక్టీస్‌ చేసినప్పుడు

ఎప్పుడైనా మనమధ్య

ఇంత దూరం ప్రవేశిస్తుందని అనుకొన్నామా ?

అలాగని మనమెప్పుడూ వాదులాడుకున్నదీ లేదు.

బరిలోకి దిగి, బలాబలాలు తేల్చుకోలేదు.

కాలం మనల్ని సహజంగా విడదీసింది.

రెండు చెట్టుకొమ్మల్ని,

రెండు కాలి బాటల్ని

వేరుచేసినట్టుగా వేరుచేసింది.

ఇప్పుడు మనం కలుసుకొంటే మాటే కరువౌతుంది.

నాకు నీలోను, నీకు నాలోను

ఒక అపరిచిత స్వరం వినబడుతుంది.

ఎంత నేర్పుగా వడుకుదామనుకున్నా,

సంభాషణ ముక్కలు ముక్కలుగా తెగిపోతుంది.

అయినా నేను బాధపడటం లేదు.

ఈ పువ్వు ఇప్పుడు వాడిపోయినా,

ఒకప్పటి దీని పరిమళపు చరిత్ర

అసత్యంగా మారిపోదు.

ఒకప్పటి దీని సౌష్టవపు జ్ఞాపకం

మనసులోంచి చెరిగిపోదు.