Expand to right
Expand to left

కవిత్వ విద్యుచ్చక్తి

(శ్రీ విన్నకోట రవిశంకర్ “కుండీలో మర్రిచెట్టుకి పరిచయం”)

రవిశంకర్ని నేను పదేళ్ళబట్టి ఎరుగుదును. అప్పట్లో అతను మా కాలేజీ విద్యార్థి. అప్పుడే ప్రారంభమైంది అతని అన్వేషణ. మనిషైన ప్రతివాడిలోనూ కొద్దోగొప్పో ఈ తపన ఉంటుందనుకొంటాను. తనెవరు? తన అస్తిత్వం ఏమిటి? తన తాదాత్మ్యం ఏమిటి? ఒకడు ఎవరూ సాధించలేనిది – అనగా పర్వతాలెక్కటమో, సముద్రాన్ని ఈదటమో, కొత్త భూ ఖండాన్ని కనుక్కోవడమో, ఏదో చేసి తన్ను తాను కనుక్కుని మురిసిపోతాడు. మరొకడు పేకాటలోనో, తాగుడులోనో మునకవేసి ఆ మసక లోతుల్లో తనకోసం తడుముకుంటాడు. ఇంకొకడు రాజ్యాన్నో, అధికారాన్నో వశం చేసుకుని తన్నుతాను జయించాననుకుంటాడు. కవులూ, కళాకారులైతే తమ అంతరంగాల్లోకి సొరంగాలు తవ్వుకుంటూ పోతారు. లోనికి తవ్వగా తవ్వగా తను తనకి తగలకపోతాడా?

ఈ పదేళ్ళనించీ రవిశంకర్‌ని, అతని ఆత్మావిష్కరణోద్యమాన్నీ గమనిస్తూనే ఉన్నాను. తన పద్యాలకోసం ఎంత లోతుగా తవ్వాడో? ఎందుకంటే, పద్యమంటే తనే. కవీ, కవిత్వం వేరు కాదు. కవితలో తప్పించి కవికి వేరే అస్తిత్వం లేదు. పద్యం రచించి దాన్ని అద్దంలా మెరుగుపెట్టాకే అందులో తన మొహం చూసుకుని గుర్తిస్తాడు కవి.

ప్రకృతిలో కూడా ఆత్మావిష్కారాన్ని దర్శిస్తాడు రవిశంకర్

ఏడాది పొడుగునా వేచి వేచి ఒక చెట్టు
ఒళ్ళంతా పువ్వులతో
తనను తాను తిరిగిపొందే ఈ వేళ
(హోళీ)

సామాన్య మానవుడు కూడా అరుదైన ఆనందపు వేళల్లో ఆత్మసాక్షాత్కారం పొందుతాడని ఇతని నమ్మకం.

పువ్వులా,
పక్షిలా,
రంగుల్నాశ్రయించి,
రంగుల మంటల్లో ఆనందభస్మమై రూపుదాల్చి,
బహుశ మనిషి కూడా ఈ రోజు కాస్సేపు
తనను తాను తిరిగి చేరుకొంటాడు.
(హోళీ)

ఆనందభస్మాలే పూసుకోనక్కర్లేదు. ఫ్లూ జ్వరం కూడా, ఇతని సాక్ష్యం ప్రకారం, కవిత్వం లాగే మనల్ని ఏకాంతంలో బంధించి, మనల్ని మనకు రుచిచూపిస్తుంది.

మానుంచి మేమే తప్పించుకుతిరిగే మాకు
ఆ రెండు రోజుల ఏకాంతంలో –
ఊహల్లో, ఆలోచనల్లో,
మా రూపాన్ని మళ్ళీ గుర్తుకు తెచ్చి,
మమ్మల్ని మాకు
రుచి చూపిస్తుంది. (ఫ్లూ)

జీవితపుటల్ని చివరిదాకా తిరగవేసే ఆసక్తి, నిజాయితీ, ధైర్యమూ రవిశంకర్‌కున్నాయి. ఒకటి రెండు పుటలతో చాలించి, అదేవిషయాన్ని అదే పదజాలంతో పునః పునః పునః పునర్నినదించే నినాదకవి కాడితడు. ఎంత అనుభవ వైవిధ్యముందో, అంత ప్రగాఢతా ఉంది ఇతని కవిత్వానికి.

స్త్రీ పాత్ర అనే కవిత ఒక వింత సత్యాన్ని అభివ్యక్తం చేస్తుంది. ఇది మనకందరికీ అనుభవవేద్యమైనా, ఎవరూ గుర్తించని గూఢ యథార్థం.

అక్కడున్న అందరి మనసుల్లోని
దుఃఖాన్నీ
ఆవిష్కరించే బాధ్యతని
ఒక స్త్రీ నయనం వహిస్తుంది.

స్త్రీ సమక్షంలేని పరిసరాలే వేరుగా ఉంటాయి. శుష్కంగా, జీబుగా, చీకాకుగా. ఆడది తనున్న చోట తన చుట్టూ ఆర్ద్రత ప్రవేశపెడుతుంది. మగవాళ్ళ మనస్సుకి ఏంటినా వంటిది స్త్రీ. ఈమెలేని చోట పురుషప్రవర్తనే వేరుగా ఉంటుంది. అందుకే, కొన్ని కఠిన, శుష్క జీవితాల గురించి తను రాసిన కథలకి హెమింగ్వే Men Without Women అని పేరు పెట్టాడు. ఆ పరిస్థితిని తలుచుకుంటేనే ఒళ్ళు జలదరిస్తుంది.

ఇటువంటి అనుభవ అగాధాల్ని మామూలు కవులు ముట్టలేరు. సాగర్ శిల్పం అనే కవిత చూడండి. శిల్పసుందరితో అంటాడు

వేదన ప్రక్క నువ్వు; వైరాగ్యం ప్రక్క నువ్వు;
వెలిగే జ్ఞానం ప్రక్క నువ్వు
…………………
జీవితంలో వైరుధ్యాలన్నిటికి
నువ్వే సరైన భాష్యంగా అనిపిస్తావు.

నువ్వు మా జీవితపు విలువల పునాదుల్ని
తుదకంటా కదిలించే ప్రశ్నవి.

కళకి ఇంత పర్యాప్తమైన నిర్వచనం ఎక్కడా నాకు తారసపడలేదు. జీవితపు విలువలతోనే కదా కళకి ప్రమేయం. ఈ సత్యాన్ని ప్రవచించటం కాదు ఈ కవిత చేసిన పని, ఇది మనకు అనుభూతమయేటట్లు చేసింది. అనగా, ఒక యథార్థాన్ని ఆలోచనారూపంలో కాక, అనుభవరూపంలో మనకు ప్రసాదించింది. ఇదే కవిత్వసారం.

మానవత్వపు సారాంశాలైన జీవితానుభవాల్తో స్పందించే కవితలు ఈ పుస్తకం నిండా ఉన్నాయి. పైనుదహరించినవి కాక, కుండీలో మర్రిచెట్టు, రామప్ప సరస్సు, జ్ఞాపకం, నిద్రానుభవం, చలనచిత్రం, పాప మనసు వంటి విషాదంతో, ఆనందంతో, ఉత్సాహంతో, అనురాగంతో, పురాజ్ఞాపకాలతో మెరిసే, మండే, మిరుమిట్లుగొలిపే జీవితశకలాలెన్నో ఈ కవి మనకు సమర్పించాడు.

కవిత్వగడియారపు లోలకం ఆ చివరినించి, ఈ చివరికి ఊగినట్లుందీ మధ్య. భావకవులు వాస్తవాల్ని విస్మరించి, అంతరంగికమైన అనుభూతుల్ని, భావాల్నీ వ్యక్తీకరించటమే పనిగా పెట్టుకున్నారు. ఒకలాంటి పొగమంచు ఆవరించినట్లుంటుంది వారి కవిత్వం. యథార్థ దృశ్యాలు కనిపించవు. ఇప్పుడు లోలకం ఇటు మళ్ళాక, కవిత్వంలో అనుభూతి లోపించి, కవిత్వమంటే పదాలూ, ఆలోచనలూ తప్ప మరేం కాదు అనే అపోహ వ్యాపించినట్లుంది. లోలకాన్ని మళ్ళించినవాడు శ్రీ శ్రీ ఐతే, దాన్ని ఈ కొసకి తీసుకొచ్చినవాళ్ళు బైరాగి, ఆరుద్ర, అజంతా, మోహనప్రసాద్, శివారెడ్లు. కవిత్వమంటే మాటలుతప్ప మరేంకాదన్న అభిప్రాయం ఈనాటి యువకవుల్లో పాతుకున్నట్లుంది. అనుభవమూ, అనుభూతీ, రెండూ సంయోజిస్తేనే కాని కవిత్వపు విద్యుత్ విస్ఫులింగం పుట్టదనే గ్రహింపు చాలా మంది కవులకు ఉన్నట్లు తోచదు. భావకవిత్వం పూర్తిగా ఆత్మాశ్రయమైతే, ప్రస్తుతకవిత్వం పూర్తిగా వస్త్వాశ్రయమయంఅనవచ్చు. ఐతే, ఈ వస్తువు కూడా వాస్తవమైన జీవితానుభవం కాదు. దానికి నకిలీ ప్రతిగా నిలబడే వట్టి మాటలూ, ఆలోచనలూ, సిద్ధాంతాలూ, నినాదాలూనూ.

రవిశంకర్ కవిత్వ నావ మాటల ప్రవాహంలో కొట్టుకుపోదు. దానికి గమ్యముంది.
జీవితానుభవమూ, హృదయానుభూతీ – ఈ రెండు ధృవాల్నీ కలిపి, కవిత్వ విద్యుచ్చక్తిని సృష్టించాడు కవీ, విద్యుత్ ఇంజినీరూ ఐన రవిశంకర్ ఇటువంటి కవులు అరుదుగా ఉంటారు. ఇదింకా ఇతని మొదటి పుస్తకం.

22-11-1992

    
   
Print Friendly

Comments are closed.