గోదావరి శర్మ

అకస్మాత్తుగా గోదావరి శర్మ చనిపోయాడని విన్నప్పుడు ఒక్కమారు మొహం తిరిగి, ‘ఛీ! ఎంత absurd!జీవితానికి అర్థం లేదు సుమా’, అనిపించింది. జీవితాన్ని కవిత్వించి, కవిత్వాన్ని జీవించిన గోదావరి శర్మ, పసిపిల్లవాడి ఆసక్తితో జీవితపు రంగుల గాజుపెంకుల్ని ఏరుకున్న గోదావరి శర్మ, పారిపోతున్న జీవితాన్ని తరిమి, తరిమి పట్టుకున్న గోదావరి శర్మ, జీవితాన్ని పిండి గొప్ప ఆనందాన్నీ అర్థాన్నీ వడపోసిన గోదావరిశర్మ ఇలా హఠాత్తుగా అన్నీ వదిలేసుకుని రాజీనామా చేసి వెళ్ళిపోయాడా ! జీవితానికి అర్థం లేదని ఒప్పేసుకున్నాడా! అని దిగ్భ్రాంతిలో పడ్డాను. గోదావరి శర్మ పద్యాలు మళ్ళీ ఒకసారి తిరగేసి చూశాను. గోదావరి శర్మ నిర్మించిన ప్రపంచం ఎక్కడా చెక్కు చెదరలేదు. గోదావరి శర్మని మోసగించింది జీవితం కాదు, మృత్యువు. ఐతే, మృత్యువు ఎవర్నేనా మోసగించగలదు కానీ, స్రష్టల్ని కాదని వాళ్ళు సృష్టించిన ప్రపంచాలు మృత్యువుకి అనంతంగా ఎదురు తిరుగుతాయి. మృత్యువు వాటిని తాకలేదు.

తన అపారమైన జీవితోత్సాహంతో, తన దైనందిన ఆనందాలతో, తన ప్రేమలతో, అప్యాయతలతో, స్నేహాలతో, ఆశలతో, కోరికలతో, సంతృప్తులతో, నిరాశలతో, దిగుళ్ళతో, మానవ పరిస్థితి పట్ల జాలితో, దయతో, తను సృష్టించుకున్న అద్భుతమైన ప్రపంచాన్ని, అర్థసమృద్ధమైన ప్రపంచాన్ని మనకోసం విడిచి వెళ్ళాడు గోదావరిశర్మ. దీన్ని ఏ మృత్యువూ రద్దు చెయ్యలేదు.

గోదావరి శర్మకు కవిత్వమూ జీవితమూ వేరు కాదు. ఇది పందొమ్మిదో శతాబ్దపు రొమాంటిక్ కవులు తెచ్చిన సమగ్ర విప్లవ ఫలితం. జీవితాన్నీ, ఆలోచననీ రెండింటినీ కలిపి వత్తి చుట్టి, చేతన (sensibility) అనే మంట వెలిగించారు.
ఇది ప్రసరించిన ఉజ్జ్వలమైన కాంతే రొమాంటిక్ కవిత్వం. గోదావరిశర్మ తన జీవితాన్నీ, భావననీ, అతి సున్నితమూ, కాంతిమంతమూ ఐన చేతనతో వెలిగించుకున్నాడు. దీని వల్లనే అతని అనుభూతి శక్తి అంత సుకుమారంగా పరిణమించింది. ఇట్టి సుకుమార చేతనని జీవితంలో సాధించుకోకపోతే కవిత్వంలోకి దిగదు. జీవితానికీ కవిత్వానికీ అభేదం పాటించినప్పుడే ఇది సాధ్యం.

అందుకే, ఇటువంటి వాళ్ళని చూస్తే ఈ కాలపు జనానికి ఆశ్చర్యం. ఇది మంచితనమా, అమాయకత్వమా? నిజాయితీయా వెర్రా? హాయిగా డబ్బు కూడేసుకుంటూ, విప్లవనినాదాలు చెయ్యటంలా? వాళ్ళకు మల్లే ఎందుకు బతకడు? ఈ సౌకుమార్యమూ, జ్ఞానన్వేషణా, ఏవో కనిపించని విలువల్లో నమ్మకమూ, ఏమిటీ పిచ్చి ! అని తోటి కవులు అనుకున్నారంటే ఆశ్చర్యం లేదు.

రాజకీయ డంబాలూ, సిద్ధాంత భేషజాలూ గోదావరి శర్మ ఎరగడు. ప్రపంచాన్ని ఉద్ధరిస్తానని ప్రజ్ఞలు చెప్పుకోలేదు. తన అనుభవపు పరిధిలోనే తన కవితా సామాగ్రి వెతుక్కున్నాడు. తన అనుభూతే తనకు ప్రమాణం. దీని వల్లే అతని కవిత్వానికా గాఢత్వం. అకవిత్వం ఆ పొలిమేరలకు రాదు. తన జీవితాన్ని తాకిన వివిధమైన అనుభవాల గురించి, ముఖ్యంగా తన మిత్రుల గురించీ, తన ప్రియురాలైన భార్య గురించీ చక్కటి కవిత్వం రాశాడు. తనకు సామాజిక స్పృహ కన్నా సంసారిక స్పృహ ముఖ్యమని ఆ మధ్య ఒక చోట చమత్కరించాడు.

గోదావరిశర్మ నైతికుడు(moralist). నిజమైన కవిత్వం నీతిని ప్రబోధిస్తుంది. ప్రపంచంలోని కుహనా విలువల్ని – అంటే భౌతిక, వ్యాపార, స్వార్థ విలువల్ని – ఖండించి, సిసలైన మానవ విలువల్ని ప్రతిష్ఠిస్తుంది. గోదావరి శర్మ కవిత్వంలో మౌలికమైన మానవ విలువలే తలెత్తి తొంగి చూస్తాయి.

మనం చేసే ప్రతి పనిలోనూ క్రమం(order) అనేది ఒక వాంచనీయమైన విలువ. అశ్రద్ధగా, గందరగోళంగా, అన్వయ రహితంగా, పద్యాలు రాయటమంత మహాపాతకం మరోటి లేదు. ఇప్పటి యువకవుల్లో ఇంచుమించు అందరూ ఈ నైతిక దోషాన్ని ఆచరిస్తున్నవారే. గోదావరి శర్మ ఎంత నిష్ఠాపరుడంటే, ఈ దోషం అతని కవిత్వంలో ఎక్కడా చేరనివ్వడు. కవితల్ని ఎంతో క్రమబద్ధంగా నిర్మిస్తాడు. మాటల్ని ఎంతో జాగ్రత్తగా ఏరుకుంటాడు. ఏ మాట పక్కని ఏ మాట పొదగాలో అతనికి తెలుసు. కవిత్వానికి లయ ప్రాణమని అతనికి తెలుసు. లయని ఊదకపోతే కవిత్వం చచ్చి వచనమై పోతుందని అతను గ్రహించాడు. అక్షరమైత్రి లేని తెలుగు తెలుగు కాదని కూడా అతనికి తెలుసు.

గోదావరి శర్మ సాహిత్యజీవితం అవిశ్రాంతం. పధ్నాలుగేళ్ళ బట్టి పద్యాలూ, కథలూ, నవలలూ, నాటకాలూ, వ్యాసాలూ రచిస్తూనే వున్నాడు. అచ్చయిన పుస్తకాలు గోదావరి గలగలలు (1980), “On the banks of nagavali” అనే ఇంగ్లీషు పద్యాల సంపుటీ. ఇతను చనిపోయే నాటికి ‘అంతర్వాహినీ అనే పద్య సంకలనం అచ్చవుతోంది. ఇంకో సంకలనానికి సరిపడ పద్యాలున్నాయి. మొత్తం అన్నీ కలిపి ఒక కవితా సంకలనంగా తీసుకురావటానికి అతని మిత్రులు పూనుకున్నారు. అతని కథలూ, నవలలూ, వ్యాసాలూ కలిపి మరో సంపుటిగా వెలువరిస్తారు.

గోదావరిశర్మ ఆంగ్ల సాహిత్యం క్షుణ్ణంగా చదువుకున్నాడు.”Indo-Anglian Poetry” అనే విషయం మీద ph.d. తీసుకున్నాడు. ఇటీవల విశ్లేషణాత్మకమైన చక్కటి వ్యాసాలు రచించాడు. ఇంత నిశిత దృష్టి కల విమర్శకులు చాలా అరుదు.

ఎప్పుడూ చిరునవ్వు నవ్వుతూ, మిత్రుల్ని ఆప్యాయంగా పలకరించేవాడు. అతడు నిజంగా అజాతశత్రువు. అంత సౌమ్యుణ్ణి నేను చూడలేదు. ఎక్కడకు వెళ్ళినా భార్యాభర్తలిద్దరూ కలిసే వెళ్ళేవారు. వాళ్ళని చూస్తే ముచ్చట వేసేది.

గోదావరిశర్మ వర్ధమానుడు. పరిపూర్ణంగా వికసించకముందే రాలిపోయాడు. సంపూర్ణ ఆయుష్మంతుడైతే ఏమేమి సాధించేవాడు మనం అస్పష్టంగా ఊహించుకోగలం.

29-4-1990