అనుభూతి కవిత్వం

ఐరిష్ కవి యేట్స్ (W.B.Yeats) చనిపోయినపుడు ఇంగ్లీషు కవి ఆడెన్ (W.H.Auden) ఒక అద్భుతమైన సంతాప పద్యం రాశాడు. ఇంగ్లీషు భాషలోని గొప్ప కవితల్లో అదొకటని నేననుకుంటాను. అందులో ఒకచోట కవి అనబడేవాణ్ణి సంబోధిస్తూ, అతని కర్తవ్యాన్ని నిర్వచిస్తాడు.

Follow poet, follow right
To the bottom of the night
With your unconstraining voice
Still persuade us to rejoice;

With the faming of the verse
Make a vineyard of the curse,
Sing of human unsuccess
In a rapture of distress;

In the desert of the heart
Let the healing fountain start
In the prison of his days
Teach the freeman how to praise

దీన్ని ఈ విధంగా అనువదించవచ్చు :

అనుసరించు కవీ, అనుసరించు,
కాళరాత్రి లోతుల్లోకి అనుసరించు,
నిగళాలు తెంచిన నీ గళంతో
జీవితోత్సవం మాకు బోధించు

కవిత్వ వ్యవసాయ మహత్త్వంతో
ఈ శప్తక్షేత్రాల్ని పండించు
విషాదోల్లాస సంరంభంతో
మానవ అపజయాల్ని ఆలపించు.

గుండె యెడారి ఇసకల్లో
స్వస్థతా జలధారల్ని ఉబికించు,
దైనిక కారాగారంలో స్వేచ్ఛాజీవికి
జీవనస్తోత్రం నేర్పించు

జీవితోత్సవాన్ని జరిపే కవిత్వమూ, విషాదమూ, ఆనందమూ కలబోసి మానవ అపజయాల్ని పాడే కవిత్వమూ ఆంధ్రదేశంలో 1950,60 దశకాల్లో ప్రవహించటం మానేసింది. శుష్క నినాద ప్రాయమైన రాజకీయ అకవిత్వం దేశమంతటా అల్లుకుంది. మా చిట్టిపొట్టి ఆనందాల్నీ, ప్రేమల్నీ, దిగుళ్ళనీ, స్నేహాల్నీ, ఆశల్నీ, నిరాశల్నీ, సందేహాల్నీ – ఒక్కమాటలో చెప్పాలంటే దైనందిన అనుభవాల్ని – ప్రతిఫలించే కవిత్వం కోసం తహతహలాడిపోయాం. జీవితమంటే రాజకీయ నినాదాలూ, పార్టీల మధ్య సంఘర్షణలూ కాదు. క్షణక్షణం మనల్ని ప్రత్యక్షంగా తాకే అనుభవాలూ, వాటి స్పందనలూ, జీవితాన్ని జీవనపాత్రంగా మార్చే అనంతమైన అనుభూతులూ, ఇవి కాక కవిత్వానికేవీ అర్హం? అని మా తరం యువకులకు అనిపించింది. తమ ఆత్మికమైన అనుభూతుల్ని, వస్తువుగా స్వీకరించి కొంతమంది యువకులు కొత్త తరహా కవిత్వం రాయటానికి ప్రయత్నించారు. అంటే, వీళ్ళంతా కూడబలుక్కుని, కొన్ని నిర్ణయాలు తీసుకొని, రచన ప్రారంభించారని కాదు. ఎవరికి వారే వారి వారి తోవల్లో నడిచారు. అందువల్ల దీన్ని ‘ఉద్యమం’ అనటానికి వీల్లేదు. ఇది సామూహిక కార్యక్రమం కాదు. కేవలం వైయక్తిక ప్రయత్నం.

అనుభూతి కవిత్వంలో ఈ అనుభూతి ఏమిటి? అనుభూతి అనే పదాన్ని చాలా అర్థాల్లో వాడుతున్నారు. “అనుభవం” అని ఒక అర్థం. ‘Feeling’ అని మరో అర్థం. కాని, అనుభూతి అంటే అవి రెండూ కావు. ఇవి రెండూ కలిసే బిందువు. భౌతిక ప్రపంచమూ, మనిషి అంతరంగ ప్రపంచమూ, వీటి రెంటి కలయిక. విషయీ, (subject), విషయాల (object) సమ్మేళనం. అనుభవం సమిష్టి కావచ్చు. అనుభూతి ఎప్పుడూ వైయక్తికమే. అనుభవ వస్తువు ఒకటైనా, ఎవరి అనుభూతి వారిది. అది ఎప్పుడూ కొత్తగా ఉంటుంది. ఒకరి అనుభూతిలా మరొకరి అనుభూతి ఉండదు. ఈ నవనవోన్మేషమైన అనుభూతిని ఆవిష్కరించటమే కవి కర్తవ్యం.

ఐతే, ఈ విషయీ, విషయాల సన్నికర్ష ఎటువంటిది? ఇందులో చాలా దశలున్నాయి. ఉదాహరణకి, మామిడిపండును మూడు రకాలుగా అనుభూతించవచ్చును. దాని రంగునీ, రూపాన్ని చూసి ఆనందించటం ఒకటి. మామిడి పండును కోసుకుని తిని ఆనందించటం రెండోది. మామిడి పండు అస్తిత్వంలో తన అస్తిత్వం మేళవించటం మూడోది. అంటే, తన అనుభవమూ, మామిడి పండు అనుభవమూ ఐక్యం చెయ్యటం. ఈ మూడో రకం అనుభూతిలో అంతా ఆనందమే. అంతా శాంతియే. మనస్సుకీ ప్రపంచానికీ భేదం లేదు. ఈ మూడో రకం అనుభూతియే కవిత్వానుభూతి.

ఉదాహరణకి ఈ పద్యం తీసుకోండి. దీని పేరు “కోసిన మామిడి పండు” :

అలల కనురెప్పల కింద
అలజడి లేని స్వప్నంలా
నిశ్చలంగా వేలాడుతుంది చేప.

ఆకుల జలపాతం కింద
ఆకుపచ్చని నీడల్లో
నిశ్చింతగా ఈత్తుంది మామిడికాయ.

ఎండాకాలం గాలం విసిరి
ఎండలాంటి ఎర్రటి ఎండుగడ్డిలో
పండబెడుతుంది కాయని.

ఎండాకాలం పుటుక్కున తెంచి
అంతరాళాల్ని ఆరబెట్టి
చెర విడిపిస్తుంది మామిడిపండును.

మందహాసంలాగో, మాన్సూను లాగో
అంతరాళాల్ని కోసి ఏ కత్తి
చెర విడిపిస్తుందో నన్ను.

చక్కగా కోసి, పింగాణీ ప్లేటులో అమర్చిన మామిడిపండు కన్నా అందమైన దృశ్యం మరొకటి లేదనిపిస్తుంది నాకు. అది జీవిత సార్ధక్యానికీ, అంతశ్శాంతికీ పరాకాష్ఠ.

ఆత్మ వస్తు తాదాత్మ్యం ద్వారా మామిడిపండు అస్తిత్వాన్ని ఆవిష్కరించింది ఈ అనుభూతి కవిత.

అనుభూతి కవితలో ఆలోచనకీ, తర్కానికీ, విశ్లేషణకీ స్థానం లేదు. మన పంచేంద్రియాల్ని తాకే పద చిత్రాలద్వారా మన అనుభూతిని మేలుకొలుపుతాడు కవి. తను ఉద్దేశించిన సంవేదనల్ని (feelings) మనలో రేపే పదచిత్రాల్ని (images) ఎన్నుకుంటాడన్నమాట. అనుభూతికి అవరోధమయే ఆలోచనా సామాగ్రిని దరికి జేరనివ్వడు. దైనందిన జీవిత లంపటంలో, అనుదిన సంఘర్షణల్లో, స్వార్థ పాక్షిక గమ్యాల అన్వేషణలో నిమగ్నుడైన మనిషి తన అస్తిత్వాన్నీ, దాని అనుభూతినీ విస్మరిస్తున్నాడు. అనుభూతి ద్వారా మనిషికి స్వస్వరూప జ్ఞానం కలుగుతుంది. ఆ అనుభూతి స్వరూపం ఆనందం. ఇంతకన్నా పరమార్థం వేరే ఉందనుకోను.

వేగుంట మోహనప్రసాదు కవిత ‘నిరీహా తీసుకొండి. పాలిపోయిన గోడా, ప్రాకలేని బల్లీ, పొగనిండిన పడగ్గదీ, గాలికి తేలివచ్చిన నూర్జహాన్ పాటా, గోడకి తగిలించిన చొక్కా వంటి పద చిత్రాల సాయంతో మనలో నిరీహా, నిస్పృహా, దిగులూ కలగలిపిన మనఃస్థితిని రేపుతాడు

అట్లా అని
పెద్ద బాధా ఉండదు
వెల్లవేసిన గోడలేమో తెల్లబోతూ ఉంటాయి విద్యుత్కాంతికి
మహా అయితే ఏ బల్లో ప్రాకుతూంటూంది, గోడమీద.
దాని నీడ ఒక్కటే ఛాయామాత్రంగ మెదుల్తుంది.
విచారంగ…

ఎక్కడో దూరాన్నించి లాక్కొస్తుంది
ఏ సినిమా పాటనో రికామీ గాలి.
తీరా ఆ ఆఖరి చరణాల్ని వదిలేసి వెళ్ళిపోతుంది రోషంగ,
జుట్టు పైకెగదువ్వుకుని,
ఇక నేనా చరణాన్ని మననం చేసుకుంటూంటాను నా దిగులుతో కలిపి
తెల్లవారెను కోడిగూసెను కోడిగూసెను తెల్లవారెనని
నూర్జహాన్నీ నన్నూ వడబోసుకుంటూ
హరే రామ హరే రామ రామ రామ హరే హరే లాగు
గోడకు తగిలించిన గళ్ళ టెరిలిన్ చొక్కా మెల్లగా చేతులు కదుల్చుతుంది.
ఉదయం దానికి పూసిన నైట్‌క్వీన్‌ని వాసన చూసుకుంటుంది.
రాత్రిలో ఒక్కతే.
నూనెలా మెరుస్తున్న నల్లని గచ్చుమీద చీమ ఒకటి కాశీయాత్రకి ప్రాకుతుంది.
ఇది దిగులు చిత్తప్రవృత్తి సీన్,
సెంట్ రాసిన, చొక్కాకి దిగులు,
బల్లికి ప్రాకలేని కాళ్ళల్లో గాలి నిండిన ఎగొని.
బరువైన చివరి నూర్జహాన్ చరణానికి మెలంకొలి.
పాలిపోయిన గదిగోడలకు ప్రతీక్ష
పొగనిండిన అగరొత్తుల పడగ్గదికి పొగలో మెలికల అన్వేషణ
బలాదూరు గాలికి నైరాశ్య జనితో క్రోషం,
చీమకి పలాయనాధ్యాత్మికావేశం
కరుచుకుపోయిన బల్లిలా గోడకు
నిచ్చెన ఉంటుంది కని తీరా ఎక్కేవాడెవడు?

వస్తువూ లేక, స్వీయాత్మా లేకనే
నేననటం
పోనిస్తూ
పెద్ద బాధా లేదని.

అనుభూతి కవిత్వానికి ఆద్యులలో ఇంద్రగంటి శ్రీకాంతశర్మ ఒకరు. ఈయన కవిత్వంలో భావకవిత్వ ప్రభావమూ, సంస్కృతసంప్రదాయచ్ఛాయ కూడా కనిపిస్తాయి.

అనుభూతి వాదానికీ, అస్తిత్వ వాదానికీ(existentialism) కొన్ని పోలికలున్నాయి. రెండూ మానవ అనుభవాన్ని సమస్త్యం (whole) గా తీసుకుంటాయి తప్ప, పాక్షికమైన ఆత్మాశ్రయ, వస్త్వాశ్రయ (subject, object) విభేదాన్ని గుర్తించవు.

అలాగే, జపానీయ జెన్ బౌద్ధం తాలూకు హైకూ పద్ధతికీ, అనుభూతి కవిత్వ పద్ధతికీ కొంతసామ్యం కనిపిస్తుంది. రెండు పద్ధతులూ వస్తువుకీ, వస్తువుని ధ్యానించే మనస్సుకీ మధ్య ఐక్యాన్ని లక్షిస్తాయి. దీని ఫలితమైన కవిత్వానుభూతి పదచిత్రాల (images) ద్వారానే అభివ్యక్తమౌతుందనీ రెండూ నమ్ముతాయి.

ఐతే, అనుభూతి కవిత్వమంతా పదచిత్ర కవిత్వం (imagist poetry) కాదు. వేగుంట మోహనప్రసాద్ కొన్ని కవితల్లో పదచిత్రాల ప్రమేయం లేకుండా, ఆత్మ నివేదన (confession) పద్ధతిలో, అనగా మనస్సులోనిది ప్రత్యక్షంగా వెళ్ళబోసుకోవటం ద్వారా, ఆ అనుభూతి ఫలితాన్ని సాధించాడు. ఇది అమెరికాలో 1950 ప్రాంతాల naked poetry, confessional poetry లాంటిది.

ఇది కాక, అనుభూతి కవులు పూర్తిగా అనుభూతి కవిత్వమే రచించారని చెప్పటానికి వీల్లేదు. వీళ్ళు రాసిన వాతిల్లో కొన్ని మాత్రమే అనుభూతి కవితలుగా పరిగణించవచ్చు.

1950లలో స్వర్గీయ బాలగంగాధర తిలక్ అనుభూతి కవితలవంటివి కొన్ని రచించాడు. 1960లలో మోహన ప్రసాద్, శ్రీకాంతశర్మ, ఇస్మాయిల్ కవితలు ప్రచురితమయాయి. తరవాతి దశకంలో మంచి అనుభూతి కవిత్వం రాసినవారు సత్యశ్రీమన్నారాయణ, పతంజలి శాస్త్రి.

ఎనభయ్యో దశకంలో చక్కటి అనుభూతి కవిత్వం చెప్పినవారు గోదావరిశర్మా, రవూఫ్, గాలి నాసరరెడ్డి, విన్నకోట రవిశంకర్, ఆకెళ్ళ రవిప్రకాశ్ మొదలైనవారు.

1970 లగాయతు ఆంధ్రదేశంలో కవిత్వ వాతావరణం రసిక జనమనోభిరామంగా మారటం మొదలెట్టింది. కరుకైన విప్లవ నినాదాలు కవిత్వంగా చలామణి చేసేవారు కూడా తమ పద్యాల్ని హృదయరంజకంగా దిద్దటానికి జాగ్రత్తపడటం ప్రారంభించారు. 1980 మొదలై తెలుగు కవిత్వంలో వచ్చిన మార్పుకి అనుభూతి కవిత కారణమనటానికి సందేహం లేదు.

28-8-95