యాంటీనాచ్ కాని సౌజన్యారావు పంతులు

(మిత్రులు శ్రీ సి. ధర్మా రావు గారు రిటైరన సందర్భంలో, మార్చి 1992)

1973 లో అనుకుంటాను , నగ్నముని, రంగా రెడ్డి కలిసి తీసుకు వచ్చి ధర్మా రావుని నాకు బహూకరించారు. అది బహుమానమనే విషయం వెంటనే తెలీలేదనుకోండి. ఒక సంఘటన విలువ అది జరిగిన చాలా కాలానికి గాని మనకు గ్రహింపుకు రాదు. అప్పుడెప్పుడో ఎంతో ఆనందంగా గడిచింది కదా అనుకుంటాం. చాలా రోజుల తర్వాత.

ఆ రోజుల్లో ధర్మా రావు గారు “ప్రజాబంధు”లో వ్యాసాలు విమర్శలు రాస్తున్నాడు. ఈయన గురించి కుతూహలం కలగడానికి అదొక కారణం.కొంతకాలానికి రంగారెడ్డిగారు రంగారెడ్డి గారు ధర్మా రావు తన నలభయ్యో జన్మదినం నాడు అచ్చువేసి స్నేహితులకు పంచిపెట్టిన కరపత్రమొకటి పంపించాడు.తన గత జీవితాన్ని విశ్లేషిస్తూ, తన ఆదర్శాలు గుర్తు చేసుకుంటూ, తను ఇంతవరకు సాధించిన ఫలితాల్ని బేరీజు వేసుకుంటూ రాసుకున్న ఆత్మపరిక్ష. ఇది చదివాక ఈ మనిషిపై నాకు ఆసక్తి పెరిగింది.

తరువాత 1975 లో నగ్నమునిని వెంటేసుకుని ఈయన కాకినాడ వచ్చాడు. ఎమర్జెన్సీలో నగ్నముని ఉద్యోగం తీసివేసారు.నగ్న ముని కోసం చాలా బాధపడిపోతున్నాడీయన. మనమేమైనా చేయాలి. చూస్తూ ఊరుకుంటామా? అన్నాడు. ఈయన జాలిగుండే, పరహితైభిలాషా, కార్యశీలమూ మరింత ఆకర్షించాయి నన్ను. అంతర్ముఖుడని నేనింత కాలమూ అనుకున్న మనిషిలో ఈ బహిర్వర్తన నన్ను ఆశ్చర్య పరిచింది.

ఈ రెండు వైఖరులూ — అంతర్ముఖతా, బహిర్ముఖతా , పై చూపూ, లోచూపూ — విచిత్రంగా ఈయనలో సమవసించి ఒక దాన్నొకటి శుద్ధి చేసుకుని ఈయన మనస్సుకు ఒక సమతౌల్యావస్థని ప్రసాదించాయి. ఈ గుణమే పలురకాల స్నేహితుల్ని సూదంటురాయిలా తన వద్దకు లాక్కుంది.

కొందరు తల్లితండ్రులకు వారి పిల్లల భవిష్యత్తు ముందే ఎలా తెలిసిపోతుందో , అతికేటట్లు పేరు పెడతారు. ధర్మా రావు పేరు అటువంటిదే. నామకరణం చెయ్యడంలో కొందరికా ప్రజ్ఞ ఉంటుంది. అగ్నిహోత్రుడని పేరు పెట్టాకా ఇక మండిపడక ఏన్ చేస్తాడు? మధురవాణి అన్నాక మధురంగా మాట్లాడక తప్పదు. సౌజన్యారావు పంతులు సరేసరి. పెట్టినపేర్లు భరాయించలేనివాళ్ళు తిరగబడి నానా భీభత్సం చేస్తారు. గాంధీ అని పేరు పెట్టిన వాడు నెహ్రూ అనే వాణ్ణి పొడుస్తాడు. నెహ్రూ గాడు గాంధీగాణ్ణి చంపుతాడు.

ధర్మా రావు గారు జీవితపు అభివ్యక్తులన్నింటి ఎడా సరి సమానమైన అభిరుచి పెంచుకున్నాడు. ధర్మ కాటాలా సమతుల్యంగా నిలిచాడు. ఏ ఒక్కవేపుకీ మొగ్గిపోలేదు. జీవితం బహుముఖమైనది. అన్నీ అనుభావ్యాలే. సాహిత్యం, సంగీతం నాటకం, రాజకీయాలు, సాంఘికోద్దరణ, మిత్రులతో స్నేహం, చతుర సంభాషణ – జీవితం అందించే ఏ చషకమూ తిరస్కరణీయం కాదు, అన్నీ అనుభోగ్యాలే. ధర్మారావు గారు జీవితాన్ని ఒక కళగా పరిపూర్ణంగా జీవించడం నేఏర్చుకున్నారు.

ఈ తరం మేధావులందరిలాగే ఈయనా కొంతకాలం క్షుద్ర దేవతోపాసన చేసాడు. కమ్యూనిజం కుప్పకూలిపోక మునుపే దానికి చెద పట్టిందని గ్రహింపు కలిగి బయటి కొచ్చేసాడు. అట్లాగని అమెరికాను ఎత్తేయనూ లేదు.ఇటీవల ఒక అమెరికన్ పత్రికలో ఆలోచనాత్మకమైన చక్కటి వ్యాసం రాసాడు. వాళ్ళ జాతిపిత జెఫర్‌సన్ మాటలు గుర్తు చేస్తూ. ఏ ఆశయాలను లక్ష్యించి అమెరికన్ రాజ్యాంగ నిర్మాతలు మానవ హక్కుల్ని ఉద్ఘాటించారో ఆ ఆదర్శాలను అమెరికా మరిచిపో తగదు. ముఖ్యంగా ఈ సమయంలో, అనగా ఏకైక మహాసామ్రాజ్య శక్తిగా ప్రపంచ రంగంలో అమెరికా నిలబడగలిగిన ఈ అవకాశంలో దాని భుజమ్మీద మరింత గురుతర బాధ్యత పడిందని గుర్తు చేస్తూ రాశాడు.కమ్యూనిజం పతనంలో మనం నేర్చుకోవలసిన పాఠాలు ఉటంకిస్తూ , మార్పులూ , విప్లవాలూ , పైనించి రుద్దేవి కావనీ, వ్యక్తుల్లోనూ , గ్రామ వ్యవస్థల్లోనూ వేళ్ళు తన్ని పైకి విస్తరించాలనే గాంధీగారి దర్శనంలోని సత్యాన్ని మనకి మళ్ళీ జ్ఞాపకం చేసారు. జిజ్ఞాసువులు అందరూ చదవదగ్గ వ్యాసమిది.

తోటి మానవులంటే ఈయనకి అపారమైన కరుణ. ఈయనవల్ల సహాయం పొందని మిత్రులు కానీ పరిచయస్తులు కానీ లేరు. ఏదీ అడక్కపోతే సన్మానమో, షష్టిపూర్తో చేస్తానంటాడు. ఈయన కృపారసలు వరద నుంచి తప్పించుకోవడం కష్టం. శతాధిక సన్మానాలూ, షష్టిపూర్తులూ , స్మారక సభలూ ఏర్పాటు చేసి ఉంటారు.ఇందులోకొన్ని అపస్మారక సభలుగా మారాయనుకోండి.అయినా పరవాలేదు.

ఇలాగని ధర్మారావుగారిని పరిపూర్ణ పురుషుడుగా చిత్రిస్తున్నాననుకోకండి. పరిపూర్ణ పురుషుల్ని భరించలేం. గాంధీ గారు పరిపూర్ణుడు కాదు కనకే ఆయనంటే మనకంత ఇష్టం. టాగోర్ గురించి ఎవరో scandals చెబితే నాకెంతో ఆనందం కలిగింది. టాగోర్ మనలాగే మనిషనే నమ్మకం అప్పుడు కలిగింది.అంతకు మునుపు టాగోరంటే భయమేసేది.

అప్పారావుగారి “కన్యాశుల్కం”లో అందరూ సామాన్య మానవులే. పూర్తిగా మంచి వాళ్ళూ, పూర్తిగా చెడ్డవాళ్ళూ లేరు. ఒక్క సౌజన్యా రావు పంతులు తప్పించి. పేరుకు తగ్గట్టు సౌజన్యా రావు మంచివాడు. మరీ మంచివాడు. ఇతను మనిషేనా? అనిపించేటంత మంచివాడు.ఇటువంటి మంచివాళ్ళని భరించడం చాలా కష్టం. మధురవాణి ముద్దును తిరస్కరించిన వాడు మనిషేనా అనిపిస్తుంది నాకు. ధర్మా రావు గారు మరీ మంచివాడు కానందుకు సంతోషిస్తున్నాను. సుగుణాలూ, బలహీనతలూ కలబోస్తేనే మనిషి. అందుకనే ఈయన్ని యాంటీ నాచ్ కాని సౌజన్యారావు పంతులన్నాను.

చివర్లో ముచ్చట.

“కాశీకా విశ్వేశు కలిసె వీరారెడ్డి” అన్నాడు శ్రీనాథుడు. మన కాశీ విశ్వేశ్వరరావుగారిని కలవని వారుండరు. వీరారెడ్డి కూడా కలిసే ఉంటాడు. ఈయన ఈ సావనీర్ సంకల్పానికి పూనుకోవడం ఎంతో సముచితంగా ఉంది. ఎందుకంటే మన విప్లవ కవి రమణా రెడ్డి మాటల్లో చెప్పాలంటే “వీళ్ళిద్దరూ ఒక తానులో గుడ్డలే” చీని చీనాంబరాలు!