నా మొదటి పద్యం

నా మొట్టమొదటి పద్యం నాకు గుర్తు లేదు. 1942లో రాసి ఉంటాను. నవజ్యోతి అనే లిఖిత పత్రిక నడిపేవాళ్ళం మిత్రులం కొంతమందిమి కలిసి. అందులో నా మొదటి పద్యం, కథ, నాటకం పడ్డాయి.

నాకు గుర్తున్న మొదటి పద్యం ఇది. 1945లో రాసాను. డ్రీం మర్చెంట్ అనే ఇంగ్లీషు నాటకం అనువదిస్తున్నాను దాన్లోకి పాటొకటి కావల్సి వచ్చింది. అందుకోసం రాసినట్టు గుర్తు. ప్రేరణ తెలుస్తునే ఉంది. కలలుకనే యవ్వనం రొమాంటిక్ మూడూ, కృష్ణశాస్త్రిగారి కవిత్వమూ మూడూ సమపాళ్ళలో కలవగా ఘటించిన రసాయనిక క్రీయ ఇది.

అప్పుడు కృష్ణశాస్త్రి గారు నా భావనా ప్రపంచం మీద అధికారం చెలాయిస్తూ ఉండేవారు. కృష్ణపక్షంలో ఏడ్చి మండిన కృష్ణశాస్త్రి కాదు. చల్లారిన కృష్ణశాస్త్రి. చలిబారిన చంద్రకాంత శిలలకు నగిషీలు చెక్కుతూ కూచున్న కృష్ణశాస్త్రి.

ఈ విషయం తెలుసుకున్నాకా కృష్ణశాస్త్రిని విడిచిపెట్టి నన్ను మండించే నా సొంత అగ్ని కోసం అన్వేషించుకుంటూ పోయాను. తరువాత పదిహేనేళ్ళకు నా అన్వేషణ ఫలించింది. 1960 లో ప్రారంభించిన “చెట్టు నా ఆదర్శం” పద్యాలవే.

విరులు విరసిన విరుల సరము తురిమిన వేణీ
భరము భరమై యొరిగి వలపు వెలుగులు మలయ
ఒరిసికొని కుచ్చెళులు ఫెళ ఫెళలు రవళింప
తెరమొగిలు చీరతో వెల మొగము సవరించి

ఓ తమో గాయనీ!
కార్తికిక రాగిణీ!

ఏ స్వప్న తీరాల నీ ప్రియాన్వేషణము

శర్వరీ చలిత చేలాంచలము మెరసినది
జాళువా అలలపై సుప్త పత్రాళి పై

తర్వాత గుర్తులేదు.

19-9-85