మిత్రునికి వీడ్కోలు

(మిత్రులు భమిడిపాటి జగన్నాధ రావు గారు కాకినాడ నుంచి బదిలీ అయినప్పుడు 1976 లో)

జగన్నాధ రావు గారికి బదిలీ అయి వెళుతున్నారంటే , నిజంగా నాకు దిగులుగా ఉంది.ఆయన లేని లోటును భర్తీ చేయగలవారు మరెవ్వరూ లేరు మనూళ్ళో.

జగన్నాధ రావు గారి చదువు పుస్తక పఠనంతో ఆగిపోలేదు. మంచి అభిరుచులు సృజించుకున్నారాయన. ఆయనకీ నాకూ సామాన్యమైన అభిమాన విషయాలు చాలా ఉన్నాయి. పద్మరాజు గారి కథలు మొదలైనవి. ఇదోరకమైన బంధుత్వం మాకు.

ఆయనలో నన్ను బాగా ఆకర్షించింది ఆయన చేతనా సౌకుమార్యం(fine sensibility).సున్నితమైన అనుభూతులకు తీవ్రంగా కదిలిపోతారాయన. కృష్ణ శాస్త్రి గారన్నట్లు

నా వలెనె యాతడున్మత్త భావశాలి
ఆగికోలేడు రేగునూహల నొకింత !
ఎట్టి నిశినే నదరిపోవు నెగసిపడును
ఎన్ని చుక్కలపాటు లెన్నెన్ని మెరపులు !

ఇంత చిరుగీతి యెద వేగిరించునేని
పాడుకొనును తాండవనృత్య మాడు కొనును.

శాస్త్రి గారు భగవంతుడి గురించి చెప్పిన మాటలివి. భావశాలిత భగవదంశే మరి !

జగన్నాధ రావు గారూ , మేము కలిసి ఎన్నో సౌహార్ధ్ర సుందరమైన సాయంకాలాలు సాహిత్య చర్చల్లో గడిపాం. వారి విస్తృత పఠనమూ, విచక్షణా, అభిరుచీ చాలా సందర్భాల్లో మాకు గీటురాయై తోడ్పడ్డాయి. ఆయన ప్రోత్సాహం లేకపోతే నాకు తెలిసిన కొన్ని సభలూ, సమావేశాలూ జరిగేవి కావు. జగన్నాధ రావు గారి వంటి మిత్రులు లేకపోతే ఈ కవిత్వాలూ కాకరకాయలూ అనవసరమనిపించును నా మట్టుకు నాకు.

జగన్నాథ రావు గార్నీ, మనల్నీ కలిపి ముడేస్తూ ఇన్ని తంతువులున్నాయి. మరి వీటన్నిట్నీ ఎలా తెంపుకు వెడతారీయన?

28-5-1976