కరుణ ముఖ్యం

“ఏలూరు కమ్ముల అప్పన్నగారి కళ్ళల్లో దయ” — మ్యూజింగ్స్

I

‌చిన్నప్పటినుంచీ అంతే. గుండె చెరువు. జాలీ కరుణతో నిండిపోయేది. కష్టాలు పడేవాళ్ళంటే. ముఖ్యంగా ఆడవాళ్ళంటే. వీళ్ళనెందుకు మగవాళ్ళింతలా అణగదొక్కుతారు? “మా తల్లి వరుసగా పిల్లల్ని కని, అర్బకురాలై పక్కమీద పడుకుని ఉండేది. ఒకటి రెండు సార్లు చావుకి సిద్ధమైంది. ఐనా వదిలేవాడు కాదు దయగల భర్త. అర్ధరాత్రులు నా పసితమ్ములు, చెల్లెళ్ళు ఏడ్చేవారు…. పాడి పాడి. పాపం! ఇంకా పిల్ల ఏడుస్తూ ఉంటే, “ఏం చెయ్యనురా? ఇంకా పడుకోవు” అని దయగా అంటే ఆ కంఠం విని సైలెంటుగా ఏడ్చేవాణ్ణి”

అంత చిన్నప్పుడే ప్రతిజ్ఞలు తీసుకున్నాడట :

ఎప్పటికీ పెళ్ళి చేసుకోకూడదు
పెద్దవాళ్ళు బలవంతాన చేసినా పిల్లల్ని కనకూడదు
పిల్లల్ని కన్నా వాళ్ళని ఏడిపించకూడదు
వాళ్ళు ఏడ్చినా , ఏమైనా సరే , వాళ్ళని కొట్టకూడదు

పెళ్ళి మీద ద్వేషం చివరికంటా వదల్లేదు. ఆయన మొదటి నవలలో కథానాయక శశిరేఖ చచ్చిపోతుంది కానీ పెళ్ళి చేసుకోదు. వివాహం వ్యక్తి స్వేచ్ఛకి ఎంత అనర్ధమో ఆమె వాదిస్తుంది.

చలం గారిలో చిన్నతనంలో వికసించిన మరో లక్షణమేమిటంటే ఒకళ్ళు చెప్పింది కాక, తన వైయక్తిక అనుభవమే ప్రమాణంగా తీసుకోవడం.

“పాలు సులభంగా జీర్ణమయ్యే ఆహారం” అని మా టీచరు చెప్తున్నాడు. నాకు జీర్ణం కావు అన్నాను”

అందరూ నవ్వేరట! ఇది మొదటిదై ఉంటుంది. తరవాత ఆయన మూర్ఖత్వానికి ఎంతమంది ఎన్నిసార్లు నవ్వారో!

అన్యాయం సహించలేకపోయేవాడు.నిలిచి ఎదురు ప్రశ్నలు వేసేవాడు. “అందరు పిల్లలకి చెప్పినట్టే మాకు మా అమ్మ రామాయణ కథలు చెప్పేది. సీత ఏడ్చి ఏడ్చి భూమాతలో ప్రవేశించిందంటే ఆ అన్యాయానికి ఎంతో గుంజుకునేవాణ్ణి. ఆ శ్రీరాముణ్ణి తలచుకుంటే ఈ నాటికీ కోపం చల్లారలేదు.. అదేం Justice అని ఎదురు తిరిగేది నా హృదయం.ఈనాటికీ ఎదురు తిరుగుతోంది. ఆ పరబ్రహ్మంలో నీళ్ళలో నీళ్ళలాగ, నూనెలో నూనెలాగ కలిసిపోతాం అని బొర్రబ్రాహ్మడు comfortableగా భోజనం చేసి self – righteousగా వేదాంతం మాట్లాడితే, ఓ కర్ర తీసుకుని , బుర్ర మీద కొట్టాలనిపిస్తుంది. అందుకనే వేదాంతమంటే అంత అసహ్యం.

ప్రకృతి సౌందర్యంలో తన్మయం చెందడమనేది చలానికి చిన్నపట్నించీ ఉంది. “ఇంకా చిన్నతనంలో తోట్ల వల్లూరులో ఉండేవాళ్ళం… కృష్ణా నది.దాని ఒడ్డున తోటలు.ఇసక లంకలు.ఆ లంకల్లో అడవులు. మా ఇంటిముందే కోట దాని వెనక అందమైన తోట. ఆ కోట ఎన్ని అంతస్తులో ! పై అంతస్తులన్నీ మూసి ఉండేవి. జనంలేని ఆ గదుల్లో కూచుని ఎన్ని కలలు కనేవాణ్ణో ! ”

చాలా చిన్నతనంలో పొటమరించిన మరొక లక్షణం ఆడపిల్లలంటే ఆకర్షణ. ” మాది చాలా పెద్ద ఇల్లు. పెద్ద డాబా. పెద్ద తోట.కనక ఊరి ఆడపిల్లలందరూ మా చెల్లెళ్ళతో ఆడుకోటానికి వచ్చేవారు. నా విరామ కాలమంతా వాళ్ళ స్నేహాలతోనే గడిచింది. నాకు మగ స్నేహితులు లేరు.ఎదుగుతున్న ఆడపిల్లలతో ఆటలతో సరసాలతో నాటకాలతోనే గడిచింది ఆ కాలం. చిన్నప్పటినుండి దూరంగా ఉండే నా బాలమిత్రురాళ్ళ కోసం ఏడ్చేవాణ్ణి.డాబా మీద ఒంటరిగా పడుకుని తేలిపోయే మేఘాలని చూస్తో , ఉత్తరంగా పోతున్నారు కదా! నా వేదన విరహాన్ని మా రమణికి వినిపించరా? అని బిగ్గరగా ఏడ్చేవాణ్ణి.కలుసుకున్నప్పుడు ఇంకా లేత వయసు కావడంవల్ల ఆ అందాన్ని నా చేతిలో పెట్టుకుని ఏం చేసుకోవాలో తెలియక పెనుగులాడేవాణ్ణి.”

వీటన్నిటికి తోడు చలం గారిలో మొదట్నించీ ఉన్న అశాంతి, అలజడి, తిరుగుబాటు, సత్యాన్వేషణా ఆయన్ని బ్రహ్మ సమాజంలోకి లాక్కు వెళ్ళాయి.చదువు కోసం కాకినాడ వెళ్ళి, బ్రహ్మర్షి వెంకటరత్నం నాయుడు గారి ప్రభావంతో బ్రహ్మ సమాజంలో చేరాడు.

ఇంతలో చలం జీవితం మరొక మలుపు తిరిగింది. ఈ మారు బ్రహ్మ సమాజపు సత్యాల్నే ప్రశ్నించడం ప్రారంభించాడు. దీనికి కారణం రత్నమ్మతో స్నేహం. దీని గురించి ఆయన అంటారు. ” నా romance అనేది నా రక్తంలో కలిసి నాలోనే పుట్టింది.ఎంత ప్రయత్నించీ శ్రుంగార వాంఛని ఈనాటివరకు జయించలేకపోయాను.అదే లేకపోతే నేనెందుకు బ్రతికి?”

ఇది పాపమా? అంత ఆనందకరమైనది పాపమా? ఎందుకు పాపం? భార్యతో లేని పాపం ఇంకో స్త్రీతో పాపమెట్లా అయింది? … ఇట్లా గట్టి సందేహాలు రేగాయి.క్రమంగా నా మనసు బ్రహ్మ నిబంధనల నించి ఎదురు తిరిగింది.”

II

ఈ విపరీత మానసిక చిహ్నాలున్నాయే, మన పూర్వులెవరూ ఎరగనివి – స్వేచ్ఛాప్రియత్వం, సత్యాన్వేషణా, తిరుగుబాటూ, ప్రశ్నించే ధోరణీ, ఇతరులు చెప్పినదానికంటే తన అనుభవానికే ప్రాధాన్యమివ్వడమూ, అతి వేలమైన కరుణా, బుద్ధి మార్గాన్ని కాక హృదయ మార్గాన్నే అనుసరించడం, మంచితనంలో నమ్మకం, స్త్రీ పురుష సమానత్వంలో విశ్వాసం, స్త్రీ పురుషుల మధ్య ప్రేమని ఉన్నతమైన అనుభవంగా భావించడం, సౌందర్య పిపాస, ప్రకృతిని ఆనందించడం, వీటన్నిటికి తోడు ఒక విధమైన విషాదం, సంఘాన్నించి తిరస్కృతులమనే ఒక దిగులు, ఆత్మ నిర్వేదమూ, ఇంద్రియానుభవాలకు ప్రాముఖ్యమూ, చేతనా సౌకుమార్యమూ (fine sensibility) వీటిని రొమాంటిక్ లక్షణాలంటారు. చలంగారిలో ఎలా పొటమరించాయి? కాలం కలిసి వచ్చింది కనక. ఫ్యూడల్ సమాజం శిధిలమైపోయి , మధ్య తరగతి ప్రాబల్యం పెరిగి, సంఘంలో అసమానత్వాన్ని ప్రశ్నించే 18వ శతాబ్దపు ఫ్రాన్స్ లో ఈ రొమాంటిక్ ఉద్యమం తలెత్తింది. అటువంటి పరిస్థితులు మన దేశంలో 19వ శతాబ్దం రెండవ భాగంలో పొడసూపాయి.

ఒకలా చూస్తే 18వ శతాబ్దపు యూరప్ లో ఒక కొత్త మానవుడు పుట్టుకొచ్చాడనిపిస్తుంది. అతి సున్నితమైన చేతన ఇతని ప్రధాన లక్షణం. అంతవరకూ బుద్ధికీ (reason), తర్కానికీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వచ్చాడు మనిషి. తన విశ్వాసానికి , ప్రవర్తనకీ హేతువునే ప్రాతిపదికగా చేసుకున్నాడు. అకస్మాత్తుగా 18వ శతాబ్దంలో మానవుని మానసిక వాతావరణం తారుమారైనట్లుంది. హృదయం అగ్రరంగానికి తోసుకు వచ్చింది.హేతువు కన్నా అనుభూతి లేదా చేతన ప్రాముఖ్యం తాల్చింది. The heart has its reasons, which the reason doesn’t know అన్నాడు రూసో. సంఘం కాదుముఖ్యం వ్యక్తి ముఖ్యం అన్నారు. వ్యక్తి వాదంతో వ్యక్తి స్వేచ్ఛ అగ్రస్థానం వహించింది. చేతనా సౌకుమార్యానికి ప్రాధాన్యత ఇచ్చేటప్పటికి ఆలోచనలకన్నా అనుభూతులు ముఖ్యమయ్యాయి. హృదయం ప్రధాన ప్రవృత్తి కరుణ.అందుకని మంచితనం మానవుని ముఖ్య లక్షణంగా గుర్తించారు.”మనిషి సహజంగా మంచివాడు నాగరికత వల్ల చెడిపోయాడు” అంటాడు రూసో. ఈ వ్యక్తి స్వేచ్ఛా, వ్యక్తి సహజాతమైన మంచితనమూ అనే రెండు భావాలు తర్వాత ప్రపంచాన్నే మార్చివేసాయి. మానవ సంబంధాల్లో, స్త్రీ పురుష సంబంధాల్లో మార్పులూ, సాంఘిక రాజకీయ వ్యవస్థల్లో పరిణామం తీసుకువచ్చిన ప్రజాస్వామ్య సిద్ధాంతమూ, సామాజిజ సంస్క్రరణలూ, ప్రపంచ రాజకీయ వ్యవస్థల్ని మూలమట్టంగా కుదిపిన ఫ్రెంచి విప్లవమూ వీటి ఫలితాలే.

ఈ రొమాంటికి ఉద్యమం 19వ శతాబ్దం మధ్యలో బెంగాల్ లోనూ, శతాబ్దాంతాన ఆంధ్ర దేశంలోనూ అడుగు పెట్టింది. ఇంగ్లాండ్ లో లాగే సంఘ సంస్క్రరణోద్యమమూ , ఇదీ కవలలు. వీరేశలింగం, గురజాడ ఈ రెంటికీ ఆద్యులు.

చలం గారి ఆలోచనలకూ, ఆచరణలకూ మూలస్థానం ఆయన హృదయమే.తనకి సహజ స్వభావమైన మంచితనం నుంచి పుట్టుకొచ్చినవే. స్త్రీ పురుష సమానత్వమూ , మానవ సౌభ్రాతృత్వమూ, సంఘంకన్నా వ్యక్తి ముఖ్యమనే నమ్మికా జీవిత లక్ష్యం ఆనందమనే విశ్వాసమూ హేతు తర్కం వల్ల స్థాపించగలిగేవి కావు. స్త్రీ పురుషులు సమానమని మనం పది హేతువులు చెబితే , అవతలివాడు వాళ్ళు సమానులు కారని వంద హేతువులు చూపించగలడు. ఇటువంటి సత్యాలు బుద్ధి వల్ల నిరూపించబడేవి కాదు. ఇవి హృదయంవల్ల అంటే స్వభావ సిద్ధమైన మంచితనంవల్ల తెలుసుకున్న సత్యాలు. సున్నితమైన హృదయ స్పందనకు మాత్రమే ఇవి గ్రాహ్యమౌతాయి.

కనుక చలాన్ని హేతువాది అనుకుంటే మీరు పొరబడ్డారన్నమాట. వాదం వల్లా తర్కం వల్లా మిమ్మల్ని తనకేసి తిప్పుకోడు చలం. అన్నిటికన్నా సూటిగా హృదయాన్ని తాకేది కళ. దీన్ని ఉపయోగించి మిమ్మల్ని తన విచిత్రమైన అభిప్రాయల పరిధిలోకి ఆకర్షిస్తాడు చలం.కథల్లో ఆ పాత్రలలో మీరు జీవిస్తారు, నవ్వుతారు,ఏడుస్తారు, ప్రేమిస్తారు, ద్వేషిస్తారు, దిగులు పడతారు, కోరికల్లో దహించుకుపోతారు. శీతాకాలపు ఎండనీ, వేసవి రాత్రుల గాలి మెత్తదనాన్ని అనుభవిస్తారు.ఇదీ జీవితమంటే. ఇదీ అసలు సంగతి. ఇదీ మనిషికి కావలసింది.మిగతావన్నీ వట్టి భ్రమలు. ఇదీ సత్యం. చలం చెప్పిందే సత్యం.వేదాలూ,ఋషులూ, ధర్మ శాస్త్రాలూ, మన పెద్దలూ ఇంతకాలం మనల్ని మోసం చేసారనిపిస్తుంది. బుద్ధికి సంబంధించిన వాదాలన్నీ చెరిగిపోయి , చలం మనచేత అనుభవింపజేసిన హ్ర్దయ సత్యమొకటే మిగులుతుంది. ఇదీ చలం సాహిత్య కళ మనమీద పనిచేసే పద్ధతి.

జెన్ బౌద్ధంలో ధ్యానంవల్ల అంతర్ జ్ఞాన సత్యాలు తెలుసుకోగలమంటారు.ఇవి తర్కానికి ఎదురు తిరుగుతాయి. తారికమైన బుద్ధి తాలూకు చట్రాన్ని బద్దలు కొడితేనే కాని ఈ అంతర్జ్ఞానం బయటపడదు. బుద్ధి చట్రమంటే మనకు అలవాటైన హేతుబద్ధ ఆలోచనా పద్ధతి. చలంలో కుడా మన బుద్ధి చట్రాన్ని పగలగొట్టే ప్రయత్నం అడుగడుక్కీ కనిపిస్తుంది. ఈయన ఆలోచనలెప్పుడూ మనం తర్కించే పద్ధతికి వ్యతిరేకంగా ఉండి , మనల్ని కుదుపుతాయి.

ఈ ధోరణి చలానికి చిన్నపటినుంచీ ఉంది. “భీముడు వాయుదేవుడిలో కలిసాడని అదేదో న్యాయంలాగు చెప్పేది మా పిచ్చి అమ్మ.

“కలిసి?”

“అంతే”

“అంతేనా?”

“అదేం Justice అని ఎదురుతిరిగేది నా హృదయం. ఈ నాటికీ ఎదురు తిరుగుతోంది.”

మధ్యపానం చాలా పాడుపని, బలవంతంగా మద్య నిషేధం పెట్టడం అందరికీ క్షేమకరం అని “బుద్ధి” మంతులంతా ఏకగ్రీవంగా అంటారు కదా. చలం అట్లా కాదు. ఈ “బుద్ధి” చట్రాన్ని పగలగొడతాడు.మధ్యపాన నిషేధం దయావంతులే పూనుకున్నట్లైతే , మద్యపానం మీద కసే మనిషికి లేకపోతే , తాగేవాళ్ళ మీద నిజమైన జాలే ఉంటే , తప్పకుండా ఆ చట్టం ఇంకోవిధంగా అమలులోకి వచ్చేది… ప్రజలకి మధ్యపానం చెడ్డదని ఒక సూత్రం ఆధారం చేసుకుని, అనేక వేల జనాన్ని ఇంత కృరంగా అకస్మాత్తుగా బాధ పెట్టడం జరగదు. ప్రజల ఆరోగ్యానికీ, నీతికీ, ధనాభివృద్ధికీ ఈ విధంగా బలవంతపు సన్స్కారాలు ప్రారంభిస్తే , ఈ లోక సన్స్కారం జీవిత సారం పీల్చేసేదాకా ఆగదు. ధర్మపరులైన మనుషులూ, ధర్మబద్ధాలైన దేశాలంత భరింపరానివి ఉండవనుకుంటాను” గుర్తుంచుకోండి, చలం మధుప్రియుడు కాడు!

చలం హేతువాది కాడు కనకనే సిద్ధాంత రూపంగా ఏదీ ప్రతిపాదించలేదు. తన అనుభవానికి వచ్చిన సత్యాలని ఉన్నవి ఉన్నట్టుగా చెప్పాడు. అంతేకాని , సిద్ధాంతాలు పేర్చి తాత్విక వ్యవస్థలేవీ నిర్మించలేదు. ఇతరుల మీద తన అభిప్రాయాలనీ , సిద్ధాంతాలనీ రుద్దడంలో ఉన్న ప్రమాదం ఆయనకి తెలుసు. ఎవరికి వారు తమని తాము సంస్క్రరించుకోవాలని ఆయన నమ్మకం. తన అంతరాత్మ సూచనకొద్దీ నడుచుకున్నకొద్దీ మనిషికి శాంతి లభిస్తుంది అంటాడు.

కనక, చలాన్ని సంఘ సంస్క్రర్త గా భావించి , ఆయన్నించి సంస్క్రరణ కార్యక్రమాన్ని ఆశించడం మన పొరపాటు. రజనీ కాంతారావు గారితో ఇంటర్వ్యూలో అంటాడు : “నా పుస్తకాల్లో తిట్టింది బయట ఉన్న మనుష్యులను కాదు. నన్ను. నాలో ఏ ఏ మచ్చలున్నాయో వాటిని నేను గట్టిగా తిట్టుకుకోవడంలో నా పుస్తకాలు బయలుదేరాయి… మిమ్మల్ని కాదు. నన్ను నేను తిట్టుకున్నది.”

చలం వ్యక్తి స్వేచ్ఛావాది.ఎవరికి వారు తమ అంతరాత్మ సూచన ప్రకారం సంస్కరించుకోవాలని ఆయన అభిప్రాయం.

III

ఇంగ్లీషు రొమాంటిక్ కవులు వర్డ్స్ వర్త్ , కీట్స్ , షెల్లీ, బ్లేక్ , కూల్ రిజ్లలో కనిపించే ఒక ప్రత్యేక లక్షణం చలంలో కుడా మనకి కనిపిస్తుంది.కృష్ణ శాస్త్రిలో తప్పించి మన భావకవుల్లో ఎవరిలోనూ ఈ అన్శ లేదు. యూరోపియన్ రొమాంటికి కవుల్లో కుడా ఒకరిద్దరిలో తప్పించి ఈ లక్షణం అగుపడదు.

రొమాంటిక్ కవులు ఇంద్రియానుభవానికి ఎక్కువ ప్రాముఖ్యమిచ్చారని చెప్పా కదా. వీళ్ళు అతి సున్నితమైన చేతనా సౌకుమార్యాన్ని సాధించారు. ఇదే వీళ్ళని ప్రకృతి ప్రియులుగానూ, సౌందర్యోపాసకులుగానూ మార్చింది. అంతటితో ఆగక కీట్స్ షెల్లీ వంటి రొమాంటిక్ కవులు ఇంద్రియానుభూతి ద్వారా అతీంద్రియ అనుభవాల్నీ, శక్తుల్నీ సాధించగలమనుకున్నారు. సుందర వస్తువుల సమక్షంలో అంతరనుభూతి ద్వారా ఆదర్శ రూపాల్ని దర్శించగలమంటాడు షెల్లీ.

చలంగారికి కూడా ఇటువంటి నమ్మకమేదో మొదట్నుంచీ ఉన్నట్టుంది. కాకినాడలో రత్నమ్మతో పరిచయమైన కాలంలో తన మనఃస్థితి గురించి చెబుతూ ఇలా అంటాడు: “లోప రహితమైన ఈ భూమి Limitationని మించి సంచరించే ఓ స్త్రీ నాలో మెలుగుతూ ఉండేది. ఆమె నా స్వప్న సహచారిణి.ఆమె ఈ భూమి మీద అలభ్యమని తెలుసు. అందుకనే నేను ప్రయత్నించి ఉన్నతుణ్ణై ఆమెను అందుకోవాలని చూసేవాణ్ణి. నేను వాంఛించే వెలుగు వైశాల్యం అన్నీ ఆమెలో నాకు లభ్యమౌతాయని ఆశ పడేవాణ్ణి”. స్త్రీ సౌందర్యాన్ని ఉపాసించడం ద్వారా ఆధ్యాత్మిక అనుభూతి పొందవచ్చునని చలం నమ్మకం. అటువంటి అద్వైత సిద్ధిని కలగజేసే స్త్రీ కోసం చిన్నతనం నుంచీ అన్వేషిస్తునే ఉన్నాడు. ఇంద్రియానుభవానికీ ఆధ్యాత్మిక అనుభవానికీ భేదం ఉండకూడదంటాడు.ఒక స్త్రీ గురించి దీక్షితులకు రాస్తూ.. ” ఇప్పుడీమె కళ్ళల్లోకి చూస్తుంటే రెండు సార్లు ఆ కళ్ళల్లో భగవాన్ని చూసాను… ఈ శరీరానుభవం ఆధ్యాత్మిక అనుభవంగానన్నా మారాలి లేక భగవాన్ సంబంధం మన శరీరానుభవమంత భౌతికంగా అంత తీవ్రమన్నా కావాలి” అంటాడు.

స్వేచ్ఛకి , ప్రేమకీ , జీవితానందానికీ ప్రతీకగా చితిరించిన అరుణ కథాంతాన మాయమైపోతుంది. చలం ఇలా ముగిస్తాడు. “జీవితంలో ఈ దేహానికీ, నా శృంగార భావాలకీ ఎట్లా స్వర్గ ద్వారాలు తెరిచిందో అట్లానే నా ఆత్మకి , నా ఆధ్యాత్మిక సందేహాలకీ ఎప్పుడో ఏ ఆశ్రమం నుంచో కైలాస ద్వారాలు తెరుస్తుందని నా నమ్మకం.”

1942లో చలం జీవితంలోకి లీల గారు ప్రవేశించింది. చలం దీక్షితులు రాశాడు.. ” ఆమె కళ్ళల్లో నాకు భగవాన్ కనపడతారు…. నా అంతరాంతరమైన అవసరాన్ని గుర్తించి తన అపారమైన దయతో నా చివరి తృష్ణను తీర్చ కనికరించి ఆమె సుందర రూపాన్ని ధరించి నా చేతుల్లోకి వచ్చింది భగవానే.నా అనుభవం ఆధ్యాత్మికం కాకపోతే ఇంక ఏదీ కాదు. ”

మరో లేఖలో :” ఈనాటికి నాకేమనిపిస్తుందంటే భగవానే ఈ అద్భుత సన్నివేశాన్ని ఏర్పాటు చేసారని. అది నేను ఏ సత్యాన్వేషణ , సౌందర్యారాధన ద్వారా సాధన చేస్తున్నానో ఆ మార్గాన నా యాత్రని సులభం చేసేందుకు ఏర్పాటు చేసారనిపిస్తుంది. మా ఇద్దరినీ ఈ అనుభవం చివరి ఔన్నత్యానికి తీసుకుపోవాలి. పోదా, మాలో ధ్వనించే ఈ ఆనంద సత్యానికి ఆధ్యాత్మిక ఔన్నత్యం చాలా భిన్నమై ఉండాలి”

ఐతే లీలగారి ద్వారా చలం ఆశించిన కైలాస ద్వారాలు తెరవబడలేదు.చలాన్ని పూర్తిగా ఆక్రమించుకోడానికి ప్రయత్నించిందామె. చలాన్ని చలం కాకుండా చెయ్యాలని చూసింది. అంతం లో చలం అంటాడు :” లీలగారితో నాకు ఆదర్శ స్త్రీ పిచ్చి ఒదిలిపోయింది. ముందు తాను ఆదర్శ పురుషుడైతే తప్ప ఆదర్శ స్త్రీ ఎక్కడనుంచి వస్తుంది?”

IV

మనిషి ఎందుకు జీవిత్స్తున్నాడు? జీవించడంలో ఆనందం ఉంది కనక జీవిస్తున్నాడు. కాకపోతే మనుష్య జాతి ఎప్పుడో నశించిపోను. జీవితానందానికి మూల ధాతువులేమిటి ? ప్రేమా, సౌందర్యమూ అంటాడు చలం. ఐతే ఈ మూడింటికీ మూలాధారం వ్యక్తి స్వేచ్ఛ. స్వేచ్ఛలేనిది ప్రేమ, సౌందర్యమూ, ఆనందమూ మనలేవు.

శశిరేఖకు రామా రావుపై ప్రేమ. ఐతే అతణ్ణి వివాహం చేసుకోనంటుంది. వివాహ బంధం వల్ల స్వేచ్ఛ నశిస్తుంది. స్వేచ్ఛ లేనిదే ప్రేమా సౌందర్యం బ్రతకలేవు.కనక ప్రియుడినైనా వదులుకుంటాను కానీ స్వేచ్ఛను వదులుకోనంటుంది. “శశిరేఖ నీతి సుందరమగు ఆత్మనుండి స్రవించిన ఆనంద ప్రవాహం. రామారావునకది అర్ధం కాదు. అందువల్లనే వివాహముపై అతనికా పట్టుదల.”

చలంలో ఆత్మ స్వేచ్ఛ, ప్రేమ (లేదా , శృంగార వాంఛ ) , సౌందర్యారాధన మూడూ ముడిపడి ఉన్నాయి. ఆత్మకథలో అంటాడు :” Romance అనేది నా రక్తంలో కలిసి నాతోనే పుట్టింది. ఎంత ప్రయత్నించి శృంగార వాంఛని ఈనాటివరకూ జయించలేకపోయాను. అదే లేకపోతే నేను ఎందుకు బ్రతికి?”

ఒక ఉత్తరంలో ” స్త్రీ ప్రేమ తప్ప జీవితానికి నాకు వేరే అర్ధం లేదు. ఎప్పుడూ లేదు.ప్రేమ చాలునని నేను తృప్తి పడ్డనాడు ఈలోపల ఆధ్యాత్మిక ప్రేమను నేను పొందగలిగితే తప్ప జీవితం నాలో అంతమౌతుంది. నేను ప్రేమించని సమయాల్లో బ్రతికిలేనన్నమాట.”

మ్యూజింగ్స్ లో అంటాడు. స్త్రీ మోహంకన్నా ఉత్తమమైంది వాఛనీయమైంది ఈ లోకంలో ఏముంది? ఆత సామ్రాజ్యం అనేదే ఉంటే అది లేకపోతే స్త్రీ సామ్రాజ్యం. ఈ రెండే. ఇంకేవీ లేవు. వీటి ముందు తక్కినవి దుమ్ము.

ఎందుకు బ్రతుకుతున్నావు? అని ప్రశ్నిస్తే

ప్రేమించేందుకు. ప్రేమను వెతుక్కునేందుకు అని చెప్పగలగాలి.

ఏం చేస్తున్నావు అంటే “రోజూ సంభోగిస్తున్నాను. ప్రేమిస్తున్నాను. అని చెప్పగలిగిన ధీరుడు కావాలి. ఈ ప్రపంచాన్ని ఉద్ధరించడానికి అంతకన్నా ముఖ్యమైనదేముంది?.”

ప్రేమించే స్త్రీని కావలించుకోవడంకన్నా ముఖ్యమైన ఉద్దేశాన్ని కల్గిన మనుషులు దురదృష్టవంతులు , వ్యర్ధులు, పాషాండులు, మృతజీవనులు. ఆధ్యాత్మిక విద్యా? లోకంలోని స్త్రీని ప్రేమించలేని మనుష్యుడు ఆత్మరమతో ఏం రమించగలడు?

ఇంత సుకుమార చేతన ఉన్నవాడు సౌందర్యాగ్నినుంచి ఎలా తప్పించుకోగలడు? చలానికి ప్రేమా సౌందర్యము వేరు వేరు కాదు. స్త్రీ సౌందర్యమూ, ప్రకృతి సౌందర్యమూ కూడా వేరు వేరు కాదు.

మ్యూజింగ్స్లో అంటాడు. అవును నా వంటివాడు సౌందర్యాలను కల్పించుకోలేకుండా ఉండలేడు. మనసులోని ఆ గుణం నిర్మూలమైతేనే గానీ. కానీ నిర్మూలం అవడం అవసరమా? అదే మనసులోని జీవ శక్తి. దాన్ని చంపితే మనసుని చంపినట్టే.

“ఇంకోటి తోస్తుంది. ఔను ఇంతమందిలో ఇన్ని వస్తువుల్లో నిరంతరమూ శృంగారాన్ని చూస్తామా? ఇందరు స్త్రీలను అమితంగా ప్రేమిస్తామా? ఇదంతా ఈ ప్రేమ అంతా ఇతర స్త్రీలలో ప్రదేశాలలో నా ముందున్న ఈ పద్మాలలో దూరంగా ఉన్న పటంలోని బుద్ధుడి ముఖంలో నేను చూసిన ఈ సౌందర్యానికంతా సూత్రం ఒకటేనేమో.

నేనన్న సౌందర్యాగ్నికి అర్ధం ఇది :” ముఖ్యంగా సౌందర్యంలో ఈ అశాంతిని కలిగించే శక్తి విశేషంగా ఉంది. ఆలోచించగా ఏమనిపిస్తుందంటే ఈ సౌందర్యాన్ని ఆకర్షకంగా చేసే సూత్రం ఉందే అది దాంట్లో సౌందర్యం నుంచి మనసునీ, సౌందర్యాన్ని మించి ఆ వస్తువుకి ఆ సౌందర్యాన్ని కల్పించే శక్తి దగ్గరకి ఈ బాధ ద్వారా సృష్టిని మళ్ళించే ప్రయత్నం ఉందేమో!

ఇంకా :” సృష్టి సౌందర్యానికీ స్త్రీ సౌందర్యానికీ భేదాలు చెప్తారు కొందరు మిత్రులు. స్త్రీ సౌందర్యంలో వాంఛ ఉంటుందిట. సృష్టి సౌందర్యంలో వాంఛ ఉండదుట. కాలం గడించిన కొద్దీ నాకు భేదం కనిపించడంలేదు. ఈ సౌందర్యం అంతా ఒక్కటే.ప్రతీ చోటా కన్ను కల్పించుకుంటున్న ఇంద్రజాలం. చాలా సుకుమారమైన వాంఛనీయమైన ఇంద్రజాలం. ఇంద్రజాలమని తెలిసినా కూడా మాయ చెదిరిపోని ఆనందం వీడని ఇంద్రజాలం. సౌందర్యమూ, ఆనందమూ మాయ కావు. అందవికారము అసహ్యము మాయ.

V

చలంగారి గుణాల్లో నా మీద గాఢంగా ముద్ర వేసింది ఆయన నిజాయితీ. గాంధీ తర్వాత అంత నిజాయితీ పరుణ్ణి ఈయన్నే చూసాను. ఏది ప్రవచిస్తాడో అదే ఆచరిస్తాడు.

గాంధీ గారికీ ఈయనకూ ఇంకా పోలికలున్నాయి. ఇద్దరూ సత్యాన్వేషకులు. వీళ్ళు అనుష్ఠించిన సత్యాలు ఒకటి కాకపోయినా వాటి మూల తత్వంలో సామ్యం ఉంది. ఇవి హృదయగత సత్యాలు. హేతుబద్ధమైనవి కాదు. మనిషికి అంతర్గతమైన కరుణలోంచి పుట్టినవి. బుద్ధిమంతులకి సందేహాస్పదాలు. చలమే ఒక చోట అంటాడు: “గాంధీగారు జీవితమంతా సత్యాన్వేషణలో గడిపాడు.కానీ ఆయన కనుక్కున్న , అనుష్ఠించిన సత్యాలు అనేకం చాలామంది బుద్ధిమంతులకి ప్రశ్నార్హాలు. చాలా మందికి అబద్దాలు”

వీరిద్దరి మధ్యా మరొక ముఖ్యమైన పోలిక ఉంది. ఇద్దరూ అంతరాత్మ చెప్పినట్టు వినమంటారు. చలం “మనిషి స్వభావంలోకి ఉత్తమమైనది అతని అంతరాత్మ. దానిని నీచపర్చుకుంటున్నందుకే మానవుడు ఇంత పతితుడైనాడు. శాంతి ఆనందాలకి దూరమైనాడు.

“నేనీనాడు నిశ్చయంగా తెలుసుకున్నదేమిటంటే మనిషి పరిణామంలో అనేక stages లో ఉన్నాడు. అతనికి ఏ స్టేజికా స్టేజిని బట్టి నీతి ధర్మాలు సూచిస్తుంది అతని అంతరాత్మ. ప్రతి మనిషి శాంతినీ సుఖాన్నీ కోరతాడు. తన అంతరాత్మ సూచన ప్రకారం నడుచుకున్నకొద్దీ అతనికి శాంతి.”

“ఏది సత్యం? ఏది అసత్యం?” అన్న శ్రీశ్రీ ప్రశ్నకు సమాధానం చెబుతూ చలం అంటాడు. శ్రీ శ్రీ తెలిసిందా? ఏది సత్యం? నీ అంతరాత్మ చెబుతున్నదే సత్యం.

VI

ఐతే చివరికి చలం ఏమంటాడు? జీవించడంలో గొప్ప ఆనందం ఉంది దీన్ని జనం ఎందుకు పాడు చేసుకుంటారు ? అంటాడు జీవించడం సుఖం అనే పథం నుంచి తప్పి , జీవించడం అర్పణ అనే భావం ఆత్మహత్యా హేతువు. అర్పణలోంచి కుడా సుఖం కావాలి.

జీవితానందాన్ని బేరీజు వేస్తూ చలం మ్యూజింగ్స్లో అన్న మాటలు ఎన్నిసార్లు చదివినా నాకు కొత్తగా ఎంతో ఉత్సాహాన్నీ ఆహ్లాదాన్నీ ఇస్తాయి. వీటిని వజీర్ రెహమాన్ పద్ధతిలో వచన కవిత్వ పదాలుగా కోట్ చేస్తాను :

ఇన్ని తీరని ఇబ్బందుల్నీ
ఇవి ఎందుకు ఉండాలని పోట్లాడతానుగానీ
జీవితమనేది చాలా గొప్ప సంగతి
చివరికి తూనికలకు వస్తే
సుఖం దుఃఖంకన్నా ఎన్నో రెట్లు
పక్క సినిమాలో ఎన్ని అరుపులు అరిపించినా
ఎప్పుడో ఒకప్పుడు నాయుడు గారి ఫిడేలో
సుబ్బులక్ష్మి “ఇంగు మిరలయదాయో” అనే రికార్డూ
పెడుతునే ఉంటారు పాపం
నిన్న రాత్రి తిన్న చేపల పులుసు
దాన్ని తినేందుకే ఈ జన్మ ఎత్తితేనేమనిపించింది
ఎప్పుడూ కనుమరుగు కాని ఆకాశం
ఎక్కడ చూచినా గడ్డి నుంచి
ములగ చెట్టు వరకు విరగపూసే పువ్వులూ
ఒకప్పుడు ఉక్క పెట్టినా
ప్రియురాలి హస్తాలమల్లే తాకి ముద్దు చేసే గాలి
ఉచితమై ముంచే ఎండ
అప్పుడప్పుడు ఏ పుంతల్లోనో కనిపించే
అందమైన వక్షపు తీరు
పక్షుల రెక్కల ఊపు
పురుగుల మీద నత్త గుల్లల వర్ణాలు
లీలగారి కళ్ళనుంచి దయగల చూపు.
ఏ దూరాన్నుంచో హృదయంతో పలకరించే ఓ ఉత్తరం
కారణం లేకుండా నన్ను చూసి
సంతోషించే పాపాయి చిరునవ్వు
ఎంత అందం జీవితం!”

ఏప్రెల్ 1995.